రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, July 4, 2026

1425 : స్క్రీన్ ప్లే సంగతులు

 

  ‘అబ్సెషన్’ గత ఆర్టికల్ (రివ్యూ) లో కథ తెలుసుకున్నాం. గంటా 45 నిమిషాల సేపు సాగే ఈ కథ స్క్రీన్ ప్లేగా ఎలాగెలా విస్తరించిందో ఇప్పుడు సంక్షిప్తంగా తెలుసుకుందాం. నిర్మాణ పరంగా చూస్తే, ఇది క్లాసిక్ ‘ది మంకీస్ పా’ తరహా కథని ఆధునిక మానసిక భయానక రూపంలో మళ్ళీ చెప్పిన సినిమా కథగా భావించ వచ్చు. ఇప్పుడు ఇదే నిర్మాణాన్ని మరింత స్క్రీన్ ప్లే విశ్లేషణ శైలిలో పరిశీలిస్తే, ఈ కథ ఒక సాధారణ ప్రేమ కథ కాదు. ఇది ‘ప్రేమని కోరుకోవడం దాన్ని బలవంతంగా పొందడం దాని దుష్పరిణామాలు అనుభవించడమూ’  అనే నాటకీయ నిర్మాణాన్ని అనుసరించే మానసిక భయానక (సైకలాజికల్ హార్రర్) కథగా తెలుస్తుంది. డైలాగులు సహా ఈ స్క్రీన్ ప్లేని  genius.com నుంచి డౌన్ లోడ్ చేసుకుని స్టడీ చేయవచ్చు.

స్క్రీన్ ప్లేని దర్శకుడు కర్రీ బార్కర్ కాఫీ షాప్ లో పని చేస్తూ రాశాడు. జంప్ స్కేర్స్‌పై ఆధారపడకుండా, పాత్రలకే ప్రాధాన్యమినిస్తూ, కలవరపరిచే శైలిని అనుసరించడం వల్ల అందరి దృష్టినీ ఆకర్షించిందీ కథ.  అయితే స్క్రిప్ట్‌ని తిరిగ రాసి, హీరోని మరింత వీరోచిత పాత్రగా మార్చమని నిర్మాతలు ఇచ్చిన 2 మిలియన్ డాలర్ల ఆఫర్‌ని (దాదాపు  19 కోట్ల రూపాయలు) కూడా అతను తిరస్కరించాడు. ఆ పాత్ర రొటీన్ ఫార్ములా పాత్రగా, వీరోచితంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే కథనం బోరుగా వుంటుందని నమ్మిన బార్కర్, హీరోని లోపాలతోనే వుంచాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మన దగ్గర కూడా నెలల తరబడీ స్క్రిప్టులు పట్టుకుని ప్రయత్నాలు చేస్తున్న ఫస్ట్ టైం డైరెక్టర్లు ఒకటే చెప్తూంటారు- నిర్మాతలు కథని మార్చమంటున్నారని. చూసి చూసి - ఇలా ఇంకెంత కాలం స్ట్రగుల్ చేస్తూంటారు, వాళ్ళకి ఎలా కావాలంటే అలా మార్చేసి ముందు డైరెక్టర్లు ఐపోండి, తర్వాత చూసుకోవచ్చు -అనాల్సి వస్తోంది. ఒక చోట ఒకరు కాదు ఇద్దరు కాదు, వరసగా ఆరుగురు వింటూ పోవడం  మొదలెట్టారు. ఒకొక్కరు ఆ కథని ఒక్కోలా మార్చేస్తూంటే, ఎలా ఎంతమంది మార్చినా అలా అన్నిటికీ తలూపి ముందు పని కానిచ్చుకోమని చెప్పాల్సి వచ్చింది. అందరూ 19 కోట్లు రిజెక్టు చేసే కర్రీ బార్కర్ లు కాలేరుగా?

    బార్కర్ స్క్రిప్ట్ తొలి డ్రాఫ్ట్ లో హీరో ఉద్దేశాలు మరింత స్పష్టంగా, దురుద్దేశపూరితంగా వుండేవి. అయితే అందులో నైతికకి సంబంధించి, ప్రేమలో సమ్మతికి సంబంధించీ ఆలోచనల్ని మరింత సున్నితంగా మార్చడానికి స్క్రీన్‌ప్లేలో మార్పులు చేశాడు.  చివరికి ఇది ప్రేక్షకులకి మానసికంగా మరింత సంక్లిష్ట వీక్షణాను అనుభవాన్ని మిగిల్చినట్టయ్యింది.

‘అబ్సెషన్’ (2026) – స్క్రీన్‌ప్లే నిర్మాణం
1. జానర్ : మానసిక భయానకం (సైకలాజికల్ హార్రర్) / అతీంద్రియ భయానకం (సూపర్ నేచురల్ హార్రర్) / డార్క్ రోమాన్స్.

2. కాన్సెప్ట్ :
బలవంతంగా పొందే ప్రేమ నిజమైన ప్రేమ కాదని
, సమ్మతి లేకుండా పుట్టిన కోరిక చివరికి భయానకంగా మారుతుందనీ చెప్పే కథ.

3. స్ట్రక్చర్ - బిగినింగ్ : హీరో బేర్‌ ఒక వొంటరిగా జీవించే
, భావోద్వేగ పరంగా బలహీన యువకుడుగా పరిచయమవుతాడు. అతను ఒక మ్యూజిక్ స్టోర్ లో పని చేస్తూంటాడు. అక్కడే చిన్ననాటి ఫ్రెండ్ నిక్కీ పనిచేస్తూంటుంది. ఆమెని  రహస్యంగా ప్రేమిస్తుంటాడు. అతడికో లోపం వుంటుంది. అదే మిటంటే, తను ప్రేమిస్తున్నా నని ఆమెకి చెప్పే ధైర్యం లేక, ఆ ప్రేమని ఇతర మార్గాల్లో గుప్పిట పట్టాలనుకుంటాడు. అతడి పిరికి మనస్తత్వం ఈ పాత్రల పరిచయ దశలో ఎస్టాబ్లిష్ అవుతుంది.

3/a -కాన్ఫ్లిక్ట్ కి దారి తీసే పరిస్థితుల కల్పన :
నిక్కీని బహుమతితో ఆకట్టుకుందామని స్టోర్ కి వెళ్తే, అక్కడ  బేర్ ని ‘వన్ విష్ విల్లో’ అనే వస్తువు ఆకర్షిస్తుంది. దాంతో ఏదైనా కోరిక కోరి విరగగొడితే ఆ కోరిక నెరవేరుతుందని తెలిసి, దాన్నికొనుక్కుంటాడు.

3/b - డ్రమెటిక్ క్వశ్చన్ ఏర్పాటు :
ఇప్పుడు బేర్ ఈ విల్లోని ప్రయోగించి నిక్కీ ప్రేమని పొందగలడా? పొందితే ఏమవుతుంది?

3/c -కాన్ఫ్లిక్ట్ కి లీడ్ :
బేర్ అంతర్మథనానికి లోనవుతాడు: తాను ధైర్యం తెచ్చుకుని తన ప్రేమని వ్యక్తపర్చాలా, లేక విల్లోని ప్రయోగించాలా? ఈ సందిగ్ధం అతడ్ని మరింత ఒంటరితనం లోకి, నిరాశలోకీ దిగ లాగుతుంది.

4. ప్లాట్ పాయింట్-1, కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు :
ఇక బేర్ ఆ విల్లో నుపయోగించి ఇలా కోరుకుంటాడు: ‘ప్రపంచంలో ఎవరికన్నా ఎక్కువగా నిక్కీ నన్ను ప్రేమించాలి’ అని. కోరుకుని విల్లోని విరిచేస్తాడు. కోరిక నిజమైపోతుంది. నిక్కీ వెంటనే వచ్చేసి అతడింట్లో మకాం పెట్టేస్తుంది.

5. మిడిల్- 1, సంఘర్షణ ప్రారంభం :
నిక్కీ ఒక్కసారిగా బేర్‌పై అపార ప్రేమని చూపడం ప్రారంభిస్తుంది. బేర్ తన కలలన్నీ నిజమైనట్టు సంతోషిస్తాడు. ప్రేమాభిమానాలు, శారీరక సంబంధం, భావోద్వేగ ఐక్యత ఎస్టాబ్లిష్ ఐపోతాయి. బేర్ కి లాగే ప్రేక్షకులు కూడా ఇక బేర్ విజయం సాధించినట్టే భావిస్తారు. ఈ క్షణం వరకూ బేర్ కోరుకున్నది దక్కింది.
        
అప్పుడు ఇవే అతడికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలెడతాయి. ఈ అసౌకర్యాన్ని క్రమంగా పెంచడం ప్రారంభిస్తాడు దర్శకుడు. నిక్కీ బేర్‌ని  ఒంటరిగా వుండనివ్వదు. ఆమె అతిగా అతడ్ని సొంతం చేసుకోవాలని విజృంభిస్తుంది. ఆమె వ్యక్తిత్వంలో మార్పులు కనిపిస్తాయి. ప్రవర్తన ఉన్మాదంగా, హింసాత్మకంగా మారిపోతుంది. ఇవన్నీ కథని రోమాంటిక్ ఫాంటసీ నుంచి సర్వైవల్ హార్రర్ వైపు మళ్ళిస్తాయి.

6. పించ్ పాయింట్ -1 : ఇంటర్వెల్ కి ప్రేరేపించే ఈ మలుపులో, బేర్ ఫ్రెండ్ ఐయాన్ బేర్ వ్యవహారం చూసి, చిన్నప్పట్నుంచీ నిక్కీ బేర్ ని సోదరుడిగా భావించేదని వెల్లడించేసరికి, బేర్ అయోమయంలో పడిపోతాడు. ఇంటర్వెల్ కి దారితీసి ఈ మలుపు బేర్ ది ఫాల్స్ విక్టరీ అని తేల్చేస్తుంది.

7. మిడ్‌పాయింట్ (ఇంటర్వెల్) : 'వన్ విష్ విల్లో' కస్టమర్ సపోర్ట్‌కి  ఫోన్ చేసి, విల్లోతో తను కోరిన కోరిక మార్చుకుంటానంటాడు  బేర్. అలా కుదరదని, అతను చనిపోయినప్పుడు మాత్రమే ఆ కోరిక ఎక్స్ పైర్ అవుతుందనీ సమాధానం వచ్చేశ్రైకి షాక్ తింటాడు. ఇప్పుడు నిక్కీని విల్లో ప్రభావం నుంచి ఎలా బయటపడెయ్యాలి? తన కోరిక కారణంగా నిజమైన నిక్కీని కోల్పోయానని  తీవ్ర అపరాధభావానికి లోనవుతాడు.

    8. మిడిల్ -2, సంఘర్షణ తీవ్రత పెరగడం : ఇప్పుడు  రెండో భాగంలో కథ పూర్తిగా హారర్ మోడ్‌లోకి వెళుతుంది. ప్రతికూల శక్తులు దగ్గరవుతాయి. ఇక్కడ ప్రతినాయకత్వం రెండు రూపాల్లో కనిపిస్తుంది: బేర్‌పై మోజు పెంచుకున్న నిక్కీ, బేర్ తీసుకున్న స్వార్థపూరిత నిర్ణయం.

        సమస్యలు మరింత తీవ్రమవుతాయి: నిక్కీ బేర్‌ని వెంటాడుతూంటుంది. బేర్ స్నేహితులు కూడా ప్రమాదంలో పడతారు. హార్రర్ సంఘటనలు తీవ్రతరమవుతాయి. బేర్ నిక్కీని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. నిక్కీ మరింత అగ్రహిస్తుంది. స్నేహితులు ప్రమాదంలో పడడం, హింస పెరగడం, బేర్ అపరాధ భావం తీవ్రం కావడం వంటి అంశాలు కథనంలో నాటకీయ ఉద్వేగాన్ని పెంచుతాయి. టెర్రర్ మానసిక స్థాయిని దాటి, శారీరక హింసగా మారుతుంది.

9. పించ్ పాయింట్ -2 : ప్లాట్ పాయింట్ -2 కి దారితీసే ఈ మలుపులో, ఒక పార్టీలో సారా బేర్ ని ప్రేమిస్తున్నట్టు వెల్లడి కావడంతో నిక్కీ ఎలర్ట్ అవుతుంది.

10. ప్లాట్ పాయింట్ -2 : మిడిల్ -2 ని ముగింపుకి తెచ్చే ఈ మలుపులో- నిక్కీ సారాని చంపేస్తుంది. బేర్ బెంబేలెత్తి పోతాడు. ఈ రాక్షసిని సృష్టించింది తనే, తన కోరిక అసలైన నిక్కీని నాశనం చేసింది... అనుకుంటూ బేర్ తనలోని అపరాధ భావంతో పోరాడతాడు. ఇప్పుడతను ప్రేమని బలవంతంగా సృష్టించలేమనీ, తన కోరిక స్వార్థపూరితమైందనీ తెలుసుకుంటాడు. ఇక విల్లో పెట్టిన ఈ శాపాన్ని ముగించే ఏకైక మార్గాన్ని కనుగొంటాడు.

11. ఎండ్ - పరిష్కారం : క్లయిమాక్స్ కి దారి తీసే, సమస్యకి పరిష్కారమార్గాన్ని కనుగొనే ఈ మలుపులో- బేర్ తన తప్పుని  సరిదిద్దడానికి పూనుకుంటాడు. ఈ క్లయిమాక్స్‌లో జరిగే సంఘర్షణ కేవలం బేర్- నిక్కీల మధ్య సంఘర్షణ కాదు. ప్రేమకీ పొసెషన్ కీ; స్వేచ్ఛకీ, నియంత్రణకీ; సహజ భావోద్వేగాలకీ, కృత్రిమ కోరికకూ మధ్య జరిగే తాత్విక సంఘర్షణగా లోతుగా చూడాల్సి వుంటుంది.

    ఈ పోరాటంలో ఇక బేర్ తనకి అత్యంత ప్రియమైన దానిని త్యాగం చేయాల్సి వస్తుంది. భావోద్వేగాలు, భయోత్పాతం ఒకే సమయంలో పరాకాష్టకి  చేరుకుంటాయి. తన కోరిక వల్ల ఏర్పడిన పరిణామాల్ని తిరిగి సరిచేయడానికి బేర్ చేసే ప్రయత్నం తో, ఈ కథ చివరికి ఒక విషాద హెచ్చరిక కథగా ముగుస్తుంది.

స్క్రీన్‌ప్లే బీట్ మ్యాప్ : బిగినింగ్ : హీరో బేర్ వ్యక్తిత్వంలో లోపాన్ని స్థాపించడం, కాన్ఫ్లిక్ట్ కి దారి తీసే పరిస్థితుల కల్పన- కథలోకి మాయా వస్తువు విల్లో ప్రవేశం; ప్లాట్ పాయింట్ -1, కాన్ఫ్లిక్ట్ ఏర్పాటు : విల్లోతో నిక్కీని వశపర్చుకునే బేర్ కోరిక నెరవేరడం; మిడిల్ -1, నిక్కీతో సంఘర్షణ ప్రారంభం- ఫాంటసికల్ ప్రేమ హార్రర్ ; పించ్ పాయింట్ -1, నిక్కీ తనని సోదరుడుగా భావించేదని బేర్ కి తెలియడం; మిడ్ పాయింట్ : బేర్  ల్లోతో కోరికని రివర్స్ చేసే ప్రయత్నం విఫలమై, అతి పెద్ద సంక్షోభంలో పడడం; మిడిల్ 2 : నిక్కీతో సంఘర్షణ తీవ్ర రూపం దాల్చడం, ఆమె దుష్ట శక్తిగా మారడం;  పించ్ పాయింట్ -2, బేర్ ని సారా ప్రేమిస్తున్నట్టు నిక్కీకి తెలియడం; ప్లాట్ పాయింట్ 2- సారాని నిక్కీ చంపేయడం, బేర్  విల్లో పెట్టిన శాపాన్ని నిర్వీర్యం చేసే మార్గం తెలుసుకోవడం; ఎండ్ : తను సృష్టించిన దుష్ట శక్తి నుంచి నిక్కీకి విముక్తి కల్గిస్తూ బేర్ పెద్ద నిర్ణయం తీసుకోవడం.

ఇలా కథనం సాంతం కార్యకారణ సంబంధంతో, ఇలాటి కథల్లో అంచెలంచెలుగా సాగే, పెరిగే సైకలాజికల్ జర్నీని సమగ్రంగా చిత్రించిన త్రీ యాక్ట్స్  స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఇది.

-సికిందర్