Q : లెనిన్ స్క్రీన్ ప్లే రివ్యూ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాని ఎలా విశ్లేషిస్తే అసలు సమస్య తెలుస్తుందో అర్ధమయ్యేలా చెప్పండి. సినిమా మాత్రం హిట్టయ్యిందని టాక్. కానీ చూస్తే మాత్రం ఏదో అసంతృప్తి కలుగుతుంది. చాలామంది ఫస్ట్ హాఫ్ వీక్ అంటున్నారు. దయచేసి వివరించండి. నేను మీ బ్లాగ్ రెగ్యులర్ పాఠకుడిని.
-ఎం కె ఆర్, అసోసియేట్
A : సినిమా స్క్రిప్టులు కొన్ని అంచనాలు పెట్టుకుని రాస్తున్నారు. ఆ అంచనాలకి స్క్రీన్ ప్లే రచనకి సంబంధించిన సాంకేతిక పునాది వుండడం లేదు. ఇది నిరంతర అధ్యయనం వల్లే తెలుస్తుంది. కానీ అంత ఆసక్తి లేకపోవడం వల్ల, కొన్ని అంచనాలు పెట్టుకుని సొంత క్రియేటి విటీలకి పాల్పడడం వల్ల, ‘లెనిన్’ లాంటివి హిట్ అనిపించుకుంటాయి గానీ, వాటి కథా బలం సూచిస్తున్న పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకుని, ఏ స్థాయిలో హిట్టవ్వాలో ఆ స్థాయికి దూరంగా వుండిపోతున్నాయి. కీకారణ్యం లాంటి ‘లెనిన్’ కథా కథనాల్లోంచి మీరడిగిన అసలు స్క్రీన్ ప్లే సమస్యేమిటో వెతికి పట్టుకుని, పూర్తి వివరాలతో స్క్రీన్ ప్లే రివ్యూ రేపు!
Q : నమస్తే అండి, ప్రశ్నోత్తరాలు రావడం లేదు బ్లాగు లో ఎందుకని? మీ బ్లాగు ఫాలో అయ్యాక రాజమౌళి గారి సినిమాలు అర్దం అవుతున్నాయి. ఇంకేం సినిమాలు అవసరం లేదు అన్పించింది. ఎందుకంటే మెదడుకి భారం అవుతున్నాయి. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొన్నటి RRR వరకు ప్రతి సినిమాలో ఓపెన్ సస్పెన్స్, సీన్ టు సీన్ సిక్వెన్సెస్ రాజమౌళి గారి సినిమాల్లో ఉంటాయి. మొదటి గంటలోపే ప్లాట్ పాయింట్ రావడం కచ్చితంగా ఉంటుంది. ప్లాట్ పాయింట్ 2 కచ్చితంగా రివర్స్ ఉంటుంది . ఎక్కడ కూడా రస భంగం కలిగించే సీన్స్ ఉండవు. ప్రతి క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ ఇస్తారు. అన్నింటి కంటే ముఖ్యంగా పాసివ్ గా ఉండే హిరో క్యారెక్టర్ ఎక్కడా ఉండదు. కొంత మంది అడపాదడపా ఇలా రాసి తీస్తుంటే రాజమౌళి గారి సినిమాల్లో ఇవి మాత్రం కంటిన్యూ చేస్తారు. కథ బలహీనంగా ఉన్నా హిరో క్యారెక్టర్ మాత్రం ఎక్కడా కూడా వీక్ గా ఉండదు. అవకాశం ఉంటే నేను చెప్పిన విషయాలు కరెక్టో కాదో చెప్పగలరు.
-మణి కుమార్ శర్మ, నల్లగొండ
A : ఇప్పుడు మీరు ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా బాగా స్టడీ చేస్తూ వుండండి. తెలిసిందే నాలెడ్జి అని ఆగిపోకండి. నాలెడ్జిని ఆచరణలో పెట్టకపోతే వేస్ట్ అని కూడా గుర్తించండి. స్క్రిప్టులు రాయండి. నాలెడ్జి పరమార్ధం అదే. బ్లాగులో రెగ్యులర్ గా ప్రశ్నోత్తరాలు (సందేహాలు- సమాధానాలు) రాకపోవడానికి కారణం గతంలో ఒకసారి పేర్కొన్నాం. రెండేళ్ళ కోవిడ్ లాక్ డౌన్ తో సందేహాలు అడిగేవాళ్ళు చెల్లా చెదురై పోయారు. ఇక సమాధానాలు ఎక్కడ్నుంచి ఇస్తాం. ఇప్పుడు వాళ్ళందరూ సందేహాలు అడగక్కర్లేని విజ్ఞానవంతులై వుండొచ్చు. అయితే కొందరు ఫోన్లు చేస్తున్నారు, అంతవరకే. ఎవరు సందేహాలు అడిగినా అడగకపోయినా, ఈ బ్లాగు నాలెడ్జిని అందించే పని నిరంతరం చేస్తూనే వుంటుంది. ఎందుకంటే, వున్న దేశాలకి తోడై కొన్ని కొత్త దేశాల్లో కూడా రీడర్స్ పెరుగుతున్నారు. ఈ ప్రేరణ బ్లాగు కంటెంట్ ని మరింత అప్డేట్ చేస్తూ వుండేలా నిర్బంధి స్తోంది, తప్పించుకోలేం.
-సికిందర్


