సినిమాలో మంచి డైలాగులు ఎలా రాయాలి?
మంచి సినిమా డైలాగులు అంటే కేవలం తెలివైన మాటలు కాదు. అవి పాత్ర స్వభావాన్ని
చూపాలి, కథని ముందుకు నడపాలి, నటులకి భావోద్వేగాల్ని వ్యక్తపర్చే అవకాశమివ్వాలి.
1. ప్రతి పాత్రకూ ప్రత్యేకమైన మాటతీరు వుండాలి
పాత్ర పేరు తీసివేసినా, ఎవరు మాట్లాడుతున్నారో ప్రేక్షకులు
గుర్తించగలగాలి.
ఉదాహరణ:
డిటెక్టివ్: ‘మనుషులు అబద్ధం చెబుతారు. కానీ సాక్ష్యాలు కాదు’
యువకుడు: ‘అలా కాదు. సాక్ష్యాల్ని కూడా సృష్టించవచ్చు’
2. ప్రతి పాత్రకూ ఒక లక్ష్యం వుండాలి.
ప్రతి సన్నివేశంలో పాత్ర ఏదో ఒకటి సాధించడానికి ప్రయత్నించాలి.
బలహీన డైలాగ్: ‘ఎలా వున్నావు?’
‘బాగున్నాను’
మెరుగైన డైలాగ్ :
‘వాళ్ళకి చెప్పేశావా?”
'చెప్పానని ఎందుకు అనుకుంటున్నావు?’
‘ఎందుకంటే నువ్వు రహస్యాన్ని దాచలేవు’
3. మాటల్లో అంతర్లీన భావం (Subtext) వుండాలి
మనుషులు ఎప్పుడూ
మనసులో వున్న దాన్ని నేరుగా చెప్పరు.
ఉదాహరణ:
‘భోజనం చల్లారిపోయింది’
‘నిన్ను నా కోసం ఎదురుచూడమని నేను చెప్పలేదు’
ఇక్కడ అసలు విషయం భోజనం కాదు; వాళ్ళ సంబంధంలో వున్న సమస్య.
4. డైలాగ్ చిన్నగా, ప్రభావవంతంగా వుండాలి
బలహీనమైనది:
‘వర్షం పడకముందే బయలుదేరితే బాగుంటుందని అనుకుంటున్నాను’
మెరుగైనది:
ఇప్పుడే బయలుదేరుదాం... లేకపోతే ఈత కొట్టాల్సి వస్తుంది!
5. సంఘర్షణ (కాన్ఫ్లిక్ట్) వుండాలి
స్నేహితుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వుండొచ్చు.
ఉదాహరణ:
‘పోలీసులకి ఫోన్ చేద్దాం’
‘శవం గురించి ఏమంటాం?”
‘మరి ఏం చేద్దాం?’
‘పాతిపెడదాం’
6. పాత్ర స్వభావం మాటల్లో కనిపించాలి
ఆత్మవిశ్వాసం వున్న వ్యక్తి:
‘పక్కకు జరుగు’
ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి :
‘క్షమించండి... కొంచెం పక్కకు జరగగలరా?’
7. ప్రేక్షకులకి తెలిసిన విషయాన్ని మళ్ళీ చెప్పకూడదు
బలహీనమైనది:
‘మనం ముప్పై ఏళ్ళుగా అన్నదమ్ములం’
మెరుగైనది:
'చిన్నప్పటి నుంచీ నా బొమ్మలన్నీ నువ్వే దొబ్బే సే వాడివి’
8. మౌనం కూడా ఒక డైలాగే
ఉదాహరణ:
ఆమె ‘నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా?’
అతను నిశ్శబ్దంగా తల తిప్పుకున్నాడు.
ఆమెకి అర్ధమైంది.
9. డైలాగుల్ని గట్టిగా చదవాలి
రాసినప్పుడు బాగానే అనిపించిన డైలాగులు, మాట్లాడితే
సహజంగా వినిపించకపోవచ్చు. కాబట్టి వాటిని గట్టిగా చదివి పరీక్షించాలి.
10. ప్రతి సన్నివేశానికీ ఒక ఉద్దేశం వుండాలి
రాయడానికి ముందు ఈ ప్రశ్నలు వేసుకోవాలి:
ఈ పాత్రకి ఏం కావాలి? ప్రారంభంలో ఎవరి చేతిలో కమాండ్ వుంది? చివరికి
ఎవరి చేతిలో వుంటుంది? ఈ సంభాషణ వల్ల ఏం మారింది? ఏమీ మారకపోతే, ఆ సన్నివేశం
అవసరం లేకపోవచ్చు.
ఉదాహరణ :
బలహీనమైనది:
‘నువ్వు నిన్న నాకు అబద్ధం చెప్పావు. ఇక నేను నిన్ను నమ్మలేను’
‘ఎప్పట్నుంచీ?’
‘ఏమిటి?’
‘నువ్వు అబద్ధాలు చెప్పడం’
‘చాలా కాలంగా’
'బైటి కెళ్ళు’
ఈ డైలాగు చిన్నదిగా, భావోద్వేగంతో నిండి వుంది. ప్రేక్షకులు కూడా మిగతా విషయాల్ని వూహించుకునే అవకాశం వుంటుంది.
పాత్రలు రెండూ బయటికీ చూస్తే ఒక చిన్న
విషయంపై వాదిస్తున్నట్టు కనిపించాలి, కానీ వాటి అసలు
గొడవ పూర్తిగా వేరే విషయంపై వుండాలి. దీని
వల్ల డైలాగుల్లో అంతర్లీన భావం (Subtext) సహజంగా వస్తుంది.
(మరికొన్ని మరోసారి)
-సికిందర్
