రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, నవంబర్ 2020, సోమవారం

1001 : సందేహాలు -సమాధానాలు

 

Q : ఈ మధ్య చాలా సినిమాలలో ఓ పది నిమిషాలు వర్తమాన కధ చూపించి, వెంటనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయి, అసలు కధ చూపించి, క్లయిమాక్సులో మళ్లీ వర్తమానం లోకి వస్తున్నారు. అప్పటికి మొదటి పది నిమిషాల పరిచయం ఎవరికీ గుర్తు ఉండదు. నా ఉద్దేశంలో ఈ ప్రక్రియ వలన ప్రేక్షకుల సమయం అంటే మొదటి పది నిమిషాలు వృధా కావడం తప్ప ప్రయోజనం ఏమీ లేదు. మీ అభిప్రాయం తెలుపండి.
బోనగిరి

A : ఫ్లాష్ బ్యాకులు ఆర్భాటాల కోసమే వుంటున్నాయి తప్ప గుణాత్మకంగా కథ చెప్పడానికి వుండడం లేదు. రాంగోపాల్ వర్మ ఫ్లాష్ బ్యాకులు లేకుండానే సినిమాలు తీస్తారు. కథలో దమ్మున్నా లేకపోయినా దాని ఖర్మకి వదిలేస్తారు. ఆయనకి లేని ఆరాటం ఇతరుల కెందుకు. ఫ్లాష్ బ్యాకులతో తీసి 90% సూపర్ హిట్లు ఇవ్వడం లేదుగా. ఒక సరళ రేఖలో కొనసాగుతున్న కథకి ఎక్కడైనా మలుపు తిప్పే సమాచారముంటే, ఆ ముక్కని అక్కడ సర్ప్రైజ్ ఎలిమెంటుతో కూడిన ఫ్లాష్ బ్యాకుగా వాడుకున్నప్పుడు, కథకి క్రియాత్మకంగా వాడుకున్నట్టవుతుంది. కథని ఉన్నతీకరించి నట్టవుతుంది. ఈ మధ్య ఒక సరళ రేఖగా వున్న కథకి ప్లాట్ పాయింట్ టూ లో, ఓ ఫ్లాష్ బ్యాక్ ముక్క పట్టుకొచ్చి వేస్తే, పాత్ర ఎదుర్కొంటున్న సమస్యకి అదే పరిష్కార మార్గమై పోయింది! పైగా ప్లాట్ పాయింట్ టూ మలుపుగా కూడా పనికొచ్చింది. సర్ప్రైజ్ గా కూడా వుంది. నిజానికీ ఫ్లాష్ బ్యాకు దర్శకుడి విజన్ లో రొటీన్ గా వుంది. కథ ముగింపు ఆయనకి తెలీదు, ఏం చేయాలో మనకీ తెలీదు. మొదట సినాప్సిస్ లో కూడా ముగింపు పెండింగులోనే వున్న దయనీయ పరిస్థితి. అడ్డుపడుతున్న ఫ్లాష్ బ్యాకుని పక్కన పెట్టి, కథ చేసుకుంటూ పోతూంటే, ప్లాట్ పాయింట్ టూలో ఆ ఫ్లాష్ బ్యాక్ రివ్వున వచ్చి పడిపోయింది. దాంతో కథకి ముగింపు కూడా వచ్చేసింది. ఆ ఫ్లాష్ బ్యాకుని చిన్న ముక్కగా కుదించి వాడేం. సర్ప్రైజింగ్ గా వుండాలంటే ఒక మెరుపులా చిన్న ముక్కగానే వుండాలి  తప్ప చాట భారతం కాదు. ఇలా ఈ ఫ్లాష్ బ్యాక్ హీరో హీరోయిన్ల కనువిప్పుకి కూడా ఉపయోగపడింది. ఇంకా చాలా తాత్పర్యాలు వచ్చాయి. కథకి నిండుదనం వచ్చింది. ఇన్ని ప్రయోజనాలు సాధించింది ఫ్లాష్ బ్యాక్. దీంతో ఫ్లాష్ బ్యాకు అనేది కథకి క్రియాత్మకంగా ఉపయోగపడాలని మన బుద్ధికీ చాచి కొట్టినట్టు ఒక కనువిప్పు లాంటిది అవ్వాల్సింది అయ్యింది.

 Q :  మీ బ్లాగ్ చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను. నాదొక ప్రశ్న.మీరు సినిమా స్క్రిప్ట్ కోసం కచ్చితంగా స్ట్రక్చర్ ఫాలో అవమంటారు కానీ నేను రాసుకున్న కొన్ని కథలకు అది కుదరడం లేదు. నా క్రియేటివిటీ మిగతా రూల్స్ ను డామినేట్ చేస్తుంది. అయితే మీరు ఒకసారి చెప్పినట్టు ఒకవేళ స్ట్రక్చర్ ఫాలో అవలేకపోతే స్క్రిప్ట్ లో ప్రతి పది నిమిషాలకు ఒకసారి బ్యాంగ్ ఇస్తూ పోవడం లాంటివి చేసుకోమన్నారు. దానికి ఉదాహరణగా భలే భలే మగాడివోయ్ సినిమా చెప్పారు. మరి అలా క్రియేటివ్ గా కథలు రాసుకోవాలి అనుకునేవాళ్లు ఈ పది నిమిషాలలో బ్యాంగ్ పద్దతి ఫాలో అవడం మంచిదేనా? అలా పది నిమిషాలలో బ్యాంగ్ అంటే కథను ఎలా రాసుకోవాలి వివరించగలరు.
ప్రణవ్, అసిస్టెంట్

A :    ఈ బ్లాగుని ఫాలో అవుతూ సొంతబడి (క్రియేటివ్ స్కూల్) ప్రశ్న అడిగితే ఎలా. మీ సొంతబడి క్రియేటివిటీకి ఇలా చెయ్యాలీ అని చెప్పడానికి పాఠాలేముంటాయి. మీ ఇష్టం వచ్చినట్టు మిడిల్ మాటాష్ చేసుకోవచ్చు, ఎండ్ సస్పెన్స్ చేసుకోవచ్చు, సెకండాఫ్ సిండ్రోమ్ చేసుకోవచ్చు, పాసివ్ పాత్రలు చేసుకోవచ్చు, కథ గాకుండా గాథలూ చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. ఆకాశమే మీ హద్దు. రెండో సినిమా అవకాశం ప్రశ్నార్ధకం చేసుకుంటూ 90% అట్టర్ ఫ్లాపుల క్లబ్బులో చేరిపోనూ వచ్చు.   

        స్ట్రక్చర్ స్కూల్లో కథ చేసుకోవడానికి బేస్ గా మనుషుల మానసిక లోకపు నిర్మాణ మంటూ ఒకటుంది. ఏమిటి మనుషుల మానసిక లోకపు నిర్మాణం? కాస్త అప్పర్ మైండ్, ఇంకాస్త ఇన్నర్ మైండ్, ఓ దిక్కుమాలిన ఇగో. అప్పర్ మైండ్ అంటే కాన్షస్ మైండ్. ఇన్నర్ మైండ్ అంటే సబ్ కాన్షస్ మైండ్. సబ్ కాన్షస్ మైండ్ అంటే అంతరాత్మ. ఇగో అనేది అప్పర్ మైండ్ లో ఎంజాయ్ చేయడాని కిష్టపడుతూ, అప్పర్ మైండ్ కీ, అంతరాత్మకీ మధ్యన వుంటూ, పెత్తనాలు చేస్తూంటుంది. దాని మెడబట్టి అంతరాత్మలోకి తోసేస్తే, కుయ్యోమొర్రో  మంటూ అక్కడుండే నగ్నసత్యాల్ని, శాశ్వత సత్యాల్ని, సవాలక్ష సవాళ్ళనీ ఎదుర్కొని, క్లాసులు పీకించుకుని, పునీతమై ఒడ్డునపడి, దిక్కుమాలిన వేషాలేసే ఇగోగా వుంటున్న తను, మెచ్యూర్డ్ ఇగోగా మోక్షం పొందుతుంది. ప్రపంచ పురాణాలు తీసుకున్నా, ఇంకే కథలు తీసుకున్నా వాటి అంతరార్ధమిదే. మనుషుల మానసిక లోకంలో నిత్యం జరిగే కురుక్షేత్రమిదే. ఈ మానసిక లోకమే స్ట్రక్చర్ రూపంలో వెండితెర మీద కన్పిస్తుంది. అప్పర్ మైండ్ అంటే ఫస్ట్ యాక్ట్ లేదా బిగినింగ్, అంతరాత్మ అంటే సెకండ్ యాక్ట్ లేదా మిడిల్, మోక్షం పొందడమంటే థర్డ్ యాక్ట్ లేదా ఎండ్. ఇక ఇగో వచ్చేసి ప్రధాన పాత్ర. ఈ స్ట్రక్చర్ లో వుండే కథని చూస్తున్నప్పుడు, తమ మానసిక లోకాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు ప్రేక్షకులు. ఇదీ సినిమా చేసే పని. 

        ఇలా బేసిక్స్ గురించే మీకు తెలియక పోతే, పదే పదే బేసిక్స్ గురించే చెప్తూ వుంటే, మీరూ ముందు కెళ్లరు, ఈ బ్లాగూ ముందు కెళ్లదు. మీ క్రియేటివిటీకి బేస్ లేదు. మీరు మీ మానసిక లోకాన్ని వదిలించుకుని బయటికి ఎక్కడి కెళ్తారు. ఈ విశ్వమే దేవుడి మైండ్. త్రీయాక్ట్ స్ట్రక్చర్ మైండ్. ఎక్కడి కెళ్తారు? మళ్ళీ ఆ సుభాషితాన్ని ఇక్కడ పడేద్దామా. ఈ పక్కన చూడండి-  

     మీ కథలు స్ట్రక్చర్లో కుదరడం లేదంటే అక్కడి దాకా ఎందుకు పోతారు. మొదట ఐడియా అనుకున్నప్పుడే దానికి స్ట్రక్చర్ వుందో లేదో చూసుకోవాలి. మీ క్రియేటివిటీ స్ట్రక్చర్ ని డామినేట్ చేస్తోందంటే ఆ కథని వదిలెయ్యాలి. భలేభలే మగాడివోయ్ వుంది కదాని అనుకుంటే, అందులో స్ట్రక్చర్ లేదని ఎవరన్నారు. యాక్ట్స్ ఆలస్యమయ్యాయి, అంతే. ఫస్టాఫ్ గంటా పదిహేను నిమిషాలూ కథే ప్రారంభం కాని పరిస్థితిని మరిపించేలా పది నిమిషాలకో బ్యాంగ్ పడింది. ఇది తెలిసి చేసి వుండరు. ఒక సినిమా కంపెనీలో సిడ్ ఫీల్డ్ పని చేస్తున్నప్పుడు, ఆ నిర్మాత-  మీరేం చేస్తారో నాకు తెలీదు, నా సినిమాల్లో పది నిమిషాలకో బ్యాంగ్ మాత్రం పడాలంతే - అన్నాడు. ఇదెక్కడి పైత్యంరా అనుకున్నాడు సిడ్ ఫీల్డ్. అలా ఎడ్డీ మర్ఫీ తో స్టార్ యాక్షన్ సినిమాలు తీశారు. అంటే సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్ ని వదిలేశాడనా? భలేభలే మగాడివోయ్ ఫస్టాఫ్ లో ఈ బ్యాంగులు కన్పించి, సిడ్ ఫీల్డ్ పేర్కొన్నది గుర్తొచ్చి, రివ్యూలో ప్రస్తావించాం.

        భలేభలే మగాడివోయ్ లో స్ట్రక్చర్ వుంది. యాక్ట్స్ ఆలస్యమయ్యాయి. సెకండాఫ్ లో సెకండ్ యాక్ట్ ప్రారంభమవుతుంది. కేవలం కథలేని సుదీర్ఘమైన ఫస్టాఫ్ ని బ్యాంగులు నిలబెట్టాయి.

        నిన్నటి రివ్యూ  ది ప్రిన్సెస్ స్విచ్డ్ ఎగైన్ లో గంటన్నర సినిమాకి ప్లాట్ పాయింట్ వన్ చివరి అరగంటలో వస్తుంది. అంటే మిడిల్ మాటాషా? కాదు. ఇదే కదా స్ట్రక్చర్ తో క్రియేటివిటీ. స్ట్రక్చర్ లేకూండా క్రియేటివిటీ ఏమిటి, నాలుగు గోడల ఇల్లే లేకుండా నగిషీ చెక్కినట్టు. 21 వ నిమిషంలో హీరోయిన్ మూడో పాత్రగా లేడీ ఫియోనా రావడంతో కథ మలుపు తిరిగే సన్నాహం మొదలవుతుంది. 32 వ నిమిషంలో ఆమె హీరోయిన్ రెండో పాత్ర మార్గరెట్ ని కిడ్నాప్ చేయాలని పథకం వేయడంతో ప్లాట్ పాయింట్ వన్ వచ్చేస్తుంది. అయితే దీని ఆపరేటింగ్ పార్టు డిలే అవుతుంది. ఈ డిలే వల్ల ఎప్పుడు కిడ్నాప్ చేస్తుందాని ఉత్కంఠ ఏర్పడుతుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ ఇంకో పార్శ్వంలో మార్గరెట్ తో బాటు హీరోయిన్ మొదటి పాత్ర స్టేసీ కలిసి స్థానాలు మార్చుకోవాలన్న వాళ్ళ ప్లానింగ్ వేరే  వుంటుంది. ఈ కథని నడవనిచ్చి, చివరి అరగంటలో డిలే చేసిన ప్లాట్ పాయింట్ వన్ ఆపరేటింగ్ పార్టుని మొదలెట్టేశారు. అంటే ప్లాట్ పాయింట్ వన్ ని పరోక్షంగా చూపించి, దాని ప్రత్యక్ష రూపాన్ని తర్వాత చూపించడ మన్నమాట. దీని వల్ల ఫస్టాఫ్ లో కథ ప్రారంభం కాలేదన్న అసంతృప్తి కలగలేదు.

        ఇలా కథని బట్టి స్ట్రక్చర్ తో క్ర్రియేటివిటీకి పాల్పడొచ్చు. స్ట్రక్చరే లేకుండా క్రియేటివిటీ ఎలా చేసుకోవాలో చెప్పమంటే, ముందు మానసిక లోకమనే సృష్టి సెటప్ ని రంపం తీసుకుని పరపర కోసి పడెయ్యాలి. ఇది మన వల్ల అయ్యేలా కన్పించడం లేదు. కాబట్టి సొంతబడి క్రియేటివ్ స్కూల్లో జిత్తులమారి అప్పర్ మైండ్ లో, ఇగో చెప్పినట్టూ చేసుకుంటూ పోవడమే. ఎప్పుడో పా...త పాండురంగ మహాత్మ్యం నుంచీ, విప్రనారాయణ నుంచీ, అన్నీ సినిమాలూ త్రీయాక్ట్ స్ట్రక్చర్లోనే వుంటూ వచ్చాయి. ఈ శతాబ్దంలో స్ట్రక్చర్ విద్వేషకులు ఎక్కడ్నించి వచ్చారో మరి. 

Q :  మీరు మార్కెట్ యాస్పెక్ట్ అని చెపుతుంటారు కదా, అసలు డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్న యువ దర్శకుల దగ్గర అటు మార్కెట్ యాస్పెక్ట్, ఇటు క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ కవర్ అయ్యేలా ఎలాంటి స్క్రిప్ట్ లు పట్టుకుని వాళ్ళు దర్శకత్వం కోసం ప్రయత్నాలు చేయాలి అంటారు అన్నది వివరించండి.
కిరణ్, అసోసియేట్

A : దీని మీద బ్లాగులో సందర్భం వచ్చినప్పుడల్లా చాలా సార్లు చెప్పుకున్నాం. బ్లాగు సెర్చి బాక్సులో మార్కెట్ యాస్పెక్ట్ అని, క్రియేటివ్ యాస్పెక్ట్ అని విడివిడిగా తెలుగులో టైపు చేయండి. పేజీలు డిస్ ప్లే అవుతాయి. మార్కెట్ యాస్పెక్ట్ అంటే, ఇప్పుడు ప్రేక్షకులున్న ప్రపంచం. ప్రపంచంలో వాళ్ళ అభిరుచులేమిటో అది పట్టుకుని కథ చేయడం. కథే కాదు, సీన్లలో కూడా మార్కెట్ యాస్పెక్ట్ కనిపించాలి. సీన్లే కాదు, డైలాగుల్లో కూడా మార్కెట్ యాస్పెక్ట్ కనిపించాలి. ఇప్పుడు రోమాంటిక్స్, లేదా ఏకనమిక్స్ తో కూడిన కథలే మార్కెట్ యాస్పెక్ట్. లేదా రెండూ కలిసినవి. మూస ఫార్ములా కల్పిత ఉబుసుపోక కథలు కాకుండా, ప్రేక్షకులు తాముంటున్న ప్రపంచ పరిస్థితులతో, జీవితాలతో ఐడెంటిఫై చేసుకోగల రియలిస్టిక్ కథలు, పరిష్కారాలు. మార్కెట్ యాస్పెక్ట్ ని నిర్ణయించుకున్నాక, దానికి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ తో రాసుకోవాలి, తీసుకోవాలి. అది నిర్మాతకి డబ్బులు కన్పించేట్టు ఆకర్షించాలి. జనరల్ నాలెడ్జి కోసం ఈ లింకు క్లిక్ చేయండి. 

సికిందర్