రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, December 10, 2019

897 :


        (ఆదివారపు ‘మూవీ నోట్స్’ మంగళవారపు దర్శనం) 
        రియాన్ జాన్సన్ 2005 లో తన తొలి మూవీగా ‘బ్రిక్’ అనే ప్రప్రథమ టీనేజి నోయర్ మూవీ తీసి వార్తలకెక్కాడు. 1930 లలో డెషెల్ హెమెట్, జేమ్స్ ఎం కెయిన్ లు రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలతో స్ఫూర్తి పొంది, ‘ఫిలిం నోయర్’ అనే జానర్ సినిమాలు అభివృద్ధి చెందాయి. స్టార్లు, సూపర్ స్టార్లు వీటిలో నటించే వాళ్ళు. '60 లలో కలర్ సినిమాలతో ఈ జానర్ పేరు ‘నియో నోయర్’ గా మార్చారు. వీటిలో కూడా స్టార్లు, సూపర్ స్టార్లు నటించారు. 2005 లో రియాన్ జాన్సన్ వచ్చేసి, ఇదే ఒకప్పటి హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలా సాహిత్యాన్ని టీనేజి పాత్రలకి అన్వయించి, ‘బ్రిక్’ అనే మర్డర్ కథ తీసి- ‘టీనేజీ నోయర్’ అనే కొత్త జానర్ కి అంకురార్పణ చేశాడు (‘బ్రిక్’ విశ్లేషణ ఈ బ్లాగులోనే గతంలో చేస్తూ పాఠకాదరణ లేక మధ్యలో ఆపేశాం). ఆ తర్వాత లూపర్స్, స్టార్ వార్స్ - ది లాస్ట్ జేడీ తీసింతర్వాత, ఇప్పుడు తాజాగా ‘నైవ్స్ ఔట్’ తో వచ్చాడు.

         డిటెక్టివ్ పాత్రలో జేమ్స్ బాండ్ నటుడు డేనియల్ క్రేగ్ సహా అనేకమంది స్టార్స్ తో వైభవోపేతంగా తీశాడు. దీనికి స్ఫూర్తి ఆ నాటి అగథా క్రిస్టీ రాసిన మర్డర్ మిస్టరీలే. అగథా క్రిస్టీ శైలిలోనే తీశాడు. ఇదిప్పుడు హైదరాబాద్ లో హౌస్ ఫుల్స్ తో ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీని కళాత్మకత ప్రశంస లందుకుంటోంది. ఈ మర్డర్ మిస్టరీని హాస్య భరితంగా తీయడం ఒక మార్కెట్ యాస్పెక్ట్ అనాలి. 2017 లో అగథా క్రిస్టీ నవల ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’ ఆధారంగా ఇదే టైటిల్ తో, తారాతోరణంగా మర్డర్ మిస్టరీ వచ్చిన విషయం తెలిసిందే. క్రిస్టీ మిస్టరీ కథలు ఇంగ్లాండ్ గ్రామీణ వాతావరణంలో వుంటాయి. మిస్టరీల విషయంలో ఆమె ఎన్నో మూస ఫార్ములా కథనాల్ని, ముగింపుల్నీ బ్రేక్ చేసి ఆశ్చర్య పర్చింది. అందుకే ఈమె క్వీన్ ఆఫ్ క్రైం.

        తెలుగులో సస్పెన్స్ థ్రిల్లర్స్ పేరిట తుపాకీ బదులు లపాకీ సినిమాలొస్తున్నాయి. అధ్యయనం, పరిశీలన, ఒక అభిరుచీ అంటూ లేక కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి. తెలుగు సినిమాల నాణ్యత దేశంలోనే అట్టడుగు స్థాయికి ఇటీవలి కాలంలో చేరిపోయింది. అంటే మనమేదో ఉద్ధరిస్తామని కాదు. కాలం కలిసివస్తే టేనేజీ నోయర్స్ నీ, క్రిస్టీ నవలల్నీ తెలుగులో ప్రయత్నించి చూద్దాం. ఇప్పటికీ విశేషంగా ఇండియాలో అమ్ముడుబోతున్న జేమ్స్ హేడ్లీ ఛేజ్ నవలల్ని కూడా.

       ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరు ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ గా మారి రేపు 12 న విడుదలవుతోంది. ఇందులో ‘స్టార్ ఎట్రాక్షన్’ ధనుంజయ్ ప్రభునే అనే మరాఠీ. కొంత కాలం ఆటో నడిపి, ఆ తర్వాత హోటల్ నడుపుతూ వుండిన ఇతను, ఫేస్ బుక్ లో రాంగోపాల్ వర్మ దృష్టినాకర్షించి సినిమాకి అపాయింట్ అయిపోయిన సంగతి తెలిసిందే. పోలికలు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలవడమే ఈ అపాయింట్ మెంట్ కి కారణం. దర్శకత్వ శాఖలో పనిచేసిన మన పాత మరాఠీ మిత్రుడు ఘనశ్యాం సదాశివ్ ఈయనకి తెలుగు డైలాగులు తర్ఫీదు నిచ్చాడు. ప్రభునే అచ్చం చంద్రబాబు నాయుడులానే హావభావ ప్రదర్శన చేశాడు. ఈయనకి ముంబాయిలో ఆటో డ్రైవర్ల సంఘం సన్మానం చేసింది కూడా. ఈ కథకి ఒక సెంట్రల్ పాయింటు వుంది. ఇది వైరల్ అయ్యే స్థాయిలో మంచి మార్కెట్ యాస్పెక్ట్ తో వుంది. చూద్దాం ఎలా వుందో విడుదలయ్యాక.

    భాగ్యనగర వీధుల్లో, మిస్ మ్యాచ్, మథనం, వజ్రాల వేట, కలియుగ, మేరా దోస్త్, అశ్వ మేధం...ఇవన్నీ గత శుక్రవారం వేడి వేడిగా ఫ్లాపయిన ఛోటా మోటా సినిమాలు. వీటి మధ్య ‘ఆ రెక్స్ 100’ ఫేం కార్తికేయ నటించిన ‘90 ఎంఎల్’ కూడా విడుదలై ఫ్లాపయ్యింది. ఒకప్పుడు ఎ సెంటర్స్ లో విడుదలై తర్వాత బిసి సెంటర్లకి వచ్చేవి సినిమాలు. ఇప్పుడు ఛోటా మోటా సినిమాల్ని బిసి సెంటర్లలో విడుదల చేసి వూరుకుంటే ఉత్తమమేమో ఆలోచించాలి. వీలయితే సి సెంటర్లకే పరిమితం చేస్తే ఇంకా మంచిది. విడుదల, పబ్లిసిటీ ఖర్చులు తగ్గుతాయి. ఆదా అయ్యే పబ్లిసిటీ ఖర్చుని కింది సెంటర్లకే బాగా టార్గెట్ చేసి అక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తిని జనరేట్ చేయవచ్చు. ఒకవేళ అదృష్టం బావుండి అక్కడ సక్సెస్ అయితే పై సెంటర్లలో విడుదల చేసుకోవచ్చు. ఎ సెంటర్స్ లో చోటా మోటా సినిమాల విడుదల ఒక దండగ వ్యవహారం. పట్టుమని పదిమంది కూడా ప్రేక్షకులు రావడం లేదు. ఇదివరకు పార్కింగ్ వాళ్ళు, కేంటీన్ల వాళ్ళు తెగతిట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఖాళీగా కూర్చుని కేంటీన్ల వాళ్ళు తిట్టుకుంటున్నారు. 

      ఇక ’90 ఎం ఎల్’ కార్తికేయ పరిస్థితి క్వార్టర్ కి చేరింది. గత ‘గుణ 369’  తోనే సబ్జెక్టు ఎంపికలో పూర్ అని తేలింది. తను కొత్తగా వచ్చి పురాతన సినిమాలు ఎందుకు చేయాల్సి వస్తోందో ఆలోచించుకోవాలి. దారుణంగా 1.5 రెంటింగ్ తో రివ్యూలొచ్చాయంటే ‘90 ఎం ఎల్’ ఎంత నకిలీ మద్యమో ముందే తెలిసిపోవాలి. ఫిట్నెస్ కి ట్రైనర్స్ ని పెట్టుకున్నట్టు, మార్కెట్ లో వున్న ట్రెండ్స్ ప్రకారం తమకే సబ్జెక్టు నప్పుతుందో, నప్పదో చెప్పే కెరీర్ ఫిట్నెస్ ట్రైనర్స్ ని హీరోలు పెట్టుకుంటే మంచిదేమో. సబ్జెక్టు ఎంపిక సబ్జెక్టివ్ గా గాక, ఆబ్జెక్టివ్ గా జరిగినప్పుడు కొంతవరకు సత్ఫలితాలుంటాయి.





     మధ్య హిందీలో వస్తున్న చరిత్ర సినిమాల వైఖరి వైకుంఠపాళిగా మారింది. అవి పామునోట్లో పడుతున్నాయి. చరిత్రని ఒక పక్షానికి పట్టం గట్టి చూపించే ఒక రొటీన్ వల్ల చరిత్ర సినిమాలు క్వాలిటీ నశించి - ఫక్తు ఎజెండాగా మారిపోయాయి. ప్రేక్షకుల ఆదరణకి దూరమైపోతున్నాయి. ఈవారం ఆశుతోష్ గోవరీ కర్ తీసిన  ‘పానిపట్’ ఇందుకు మరో ఉదాహరణ. 100 కోట్లతో తీసిన ఇంత ప్రతిష్టాత్మక చారిత్రకం, కేవలం 1.5 -2.5 రేటింగ్స్ తో బాక్సాఫీసు దగ్గర కుప్పకూలింది. మీడియాల్లో ఇండియా - పాకిస్తాన్, హిందూ - ముస్లిం వార్తలే వార్తలుగా జనాల్ని ఎక్కువ మత్తెక్కిస్తున్నాయని, చరిత్ర సినిమాలతో కూడా ఇలా మత్తెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సంజయ్ లీలా భన్సాలీ మహాశయుడు కూడా ‘పద్మావత్’ తో ఇదే ప్రయత్నం చేశాడు. తెలుగులో ‘జార్జి రెడ్డి’ తో కూడా ఇదే ప్రయత్నం జరిగింది. సినిమా అనే మీడియాకి పక్షపాతం వుండదు. పక్షపాతం అంటేనే నిజాల్ని దాచడం. నిజాలు ఎలా వుంటాయంటే, చరిత్రలో మతాలకోసం యుద్ధాలు జరగలేదు, అధికారాల కోసమే యుద్ధాలు జరిగాయి. హల్దీ ఘాట్ లో అక్బర్ కీ, రాణా ప్రతాప్ కీ పోరాటం జరిగినప్పుడు అక్బర్ వెళ్ళలేదు. ఆయన ముఖ్యుడు రాజా మాన్ సింగ్ వెళ్ళాడు. రాజా మాన్ సింగ్ కింద అక్బర్ సేనాపతి ముస్లిం. అటు వైపు పోరాటానికి వచ్చిన రాణా ప్రతాప్ సేనాపతి హకీమ్ ఖాన్ సూద్. ఇది మతం కోసం హిందూ ముస్లిం పోరాటమనుకోవాలా? లేక అధికారం కోసం ఇద్దరు రాజుల పోరాటమనుకోవాలా?

        ఛత్రపతి శివాజీ - అఫ్జల్ ఖాన్లు భేటీ అవాలనుకున్నప్పుడు ఇద్దరూ ఆయుధాలు వుంచుకోకూడదని నియమం పెట్టుకున్నారు. కానీ శివాజీ ముస్లిం అధికారి రుస్తుం జమాల్ అలా వెళ్ళవద్దని శివాజీని హెచ్చరించాడు. శివాజీ దర్బారులో ఎందరో ముస్లిం అధికారు లుండే వాళ్ళు. వాళ్ళల్లో ముఖ్యుడు మౌలానా హైదరాలీ. శివాజీ ముఖ్య అంగ రక్షకుడూ, ఆయన కింద అంగరక్షకులూ చాలా మంది ముస్లిములే. శివాజీ,  అఫ్జల్ ఖాన్లు కలుసుకున్నప్పుడు రుస్తుం జమాల్ హెచ్చరించినట్టే అఫ్జల్ ఖాన్ దాడి చేశాడు. అప్పుడు శివాజీ అతణ్ణి పొడిచేశాడు. అప్పుడు వెంటనే హిందువు అయిన అఫ్జల్ అధికారి శివాజీని చంపేందుకు ప్రయత్నించాడు. ఇది మతం కోసం హిందూ ముస్లిం పోరాటమను కోవాలా? లేక అధికారం కోసం ఇద్దరు రాజుల పోరాటమనుకోవాలా?  
       తన శత్రువైన అఫ్జల్ ఖాన్ సమాధిని శివాజీయే కట్టించాడు. రాయగడ్ లో శివాజీ మందిరం కట్టించి, పక్కనే మసీదు కూడా కట్టించాడు. సైన్యం దాడులకి వెళ్ళినప్పుడు బైబిల్, ఖురాన్ ల వంటి అన్యమత గ్రంథాలు దొరికితే అపవిత్రం చేయకుండా సంబంధిత బాధ్యులకి అప్పగించమని ఆదేశించే వాడు. సైన్యం సూరత్ దాడికి వెళ్ళినప్పుడు అక్కడి ఫాదర్ అంబ్రూస్ పింటో ఆశ్రమం జోలికి పోవద్దని ఆదేశించాడు. సూఫీ గురువు హజరత్ బాబాని అభిమానించి బహుమానాలు పంపేవాడు. అక్బర్ తన కోటలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిపేవాడు.   ఓ పన్ ఘట్ పే నంద్ లాల్...భక్తి గీతాలతో పరవశించేవాడు.
         త దురుపయోగం జరిగినప్పుడు చరిత్ర బాధితురాలై పోతుంది. ఈ దురుపయోగానికి సినిమాలు పాల్పడ్డమే విషాదం. కులమత సమరస్యాల ప్రకటనతో నిష్పాక్షపాతంగా వుండాల్సిన సినిమా అనే మీడియా ప్రేక్షకుల్ని ఓటర్లు గా చూడ్డం దారుణమైన విషయం. ఇందుకే కలెక్షన్లు కూడా ఆ ఓటర్ల మేరకే దారుణంగా వస్తున్నాయి.

సికిందర్