రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, ఆగస్టు 2023, ఆదివారం

1358 : రివ్యూ!


రచన - దర్శకత్వం : క్లాక్స్
తారాగణం : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్,  రాజ్ కుమార్ కసిరెడ్డి, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్,  సన్నీ కూరపాటి
సమర్పణ : సి. యువరాజు, నిర్మాత : రవీంద్ర బెనర్జీ
విడుదల : ఆగస్టు 25, 2023
***

రెక్స్ 100  హీరో కార్తికేయ ఆరు వరస ఫ్లాపుల తర్వాత 2022 లో తమిళంలో అజిత్ తో వాలిమై లో విలన్ గా నటించి పేరు తెచ్చుకుని, తిరిగి తెలుగులో బెదురులంక 2012 లో నటించాడు. తెలుగులో అతడికో హిట్ అవసరమున్నా లేకున్నా చేతినిండా అవకాశాలతో బిజీగా వున్నాడు. ఈసారి క్లాక్స్ అనే కొత్త దర్శకుడితో ప్రయత్నించాడు. క్లాక్స్ అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లో కొచ్చి పనిచేస్తూ ఈ సినిమా తీశాడు. ట్రైలర్స్ లో సోషల్ సెటైర్ లాగా అనిపిస్తున్న ఈ మూవీ దేని గురించనేది ఆసక్తి రేపింది. గ్రామీణ వాతావరణంలో కామెడీగా తీసిన ఈ మూవీ అసలు దేని గురించి? ఇది తెలుసుకుందాం... 

కథ

2012 లో గోదావరి జిల్లాలో బెదురులంక అనే వూరు. ఆ వూళ్ళో 2012 డిసెంబర్ లో యుగాంతం సంభవిస్తుందని వస్తున్న వార్తలు భయాందోళనల్ని సృష్టిస్తాయి. దీన్ని సొమ్ము చేసుకోవాలని వూరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ), బావమరిది భూషణం (అజయ్ ఘోష్), ఓ దొంగబాబా బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ డానియేల్ (రాం ప్రసాద్) ఓ పథక మేస్తారు. దాని ప్రకారం వూళ్ళో జనాలందరూ తమ దగ్గరున్న బంగారమిచ్చేయాలనీ, ఆ బంగారాన్ని కరిగించి సువర్ణ మహా శివలింగాన్ని తయారు చేయించి, గోదావరికి ఆర్పిస్తే యుగాంతం ముప్పు తప్పుతుందనీ నమ్మిస్తారు. అలాగే చర్చి ఫాదర్ క్రైస్తవులందరూ బంగారమిచ్చేస్తే  దాంతో మహా శిలువ తయారు చేయించి గోదావరికి అంకితమిస్తాననీ నమ్మిస్తాడు. భయంతో వున్న జనాలు బంగారమంతా ఇచ్చేస్తారు.
       
ఇలావుండగా
, నగరంలో  గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం మానేసి వచ్చి వూళ్ళో వుంటున్న శివ (కార్తికేయ) ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహాశెట్టి) ని ప్రేమిస్తూంటాడు. అయితే వూళ్ళో అందరూ బంగారమిచ్చినా అతను ఉంగర మివ్వడానికి ఒప్పుకోడు. ఇవి మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తాడు. దీంతో ప్రెసిండెంట్ అతడ్ని వూర్నుంచి బహిష్కరిస్తాడు.
       
ఇప్పుడు వూళ్ళోంచి వెళ్ళిపోయిన శివ ఏంచేశాడు
? వూళ్ళో జరుగుతున్న మోసాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? కూతురు చిత్రకి వేరే పెళ్ళి చేస్తున్న ప్రెసిడెంట్ ని ఎలా ఎదుర్కొని చిత్రని చేపట్టాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మయాన్ క్యాలెండర్ ఆధారంగా 2012 లో యుగాంతం సంభవిస్తుందనీ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా కల్లోల పర్చిన సంగతి తెలిసిందే. దీన్నిఆధారంగా చేసుకుని 2009 లో 2012 అనే హాలీవుడ్ డిజాస్టర్ మూవీ కూడా సంచలనం సృష్టించింది. ఇది తెలుగులో ‘2012 యుగాంతం పేరుతో డబ్బింగ్ కూడా అయింది. ఇది చూశాక ఇందులోని దృశ్యాలకి కొన్ని రోజులు వైరాగ్యంతో గడిపాం.
       
ఇప్పుడు ఇదే యుగాంతం కథ తీసుకుని
బెదురులంక 2012 తీశాడు కొత్త దర్శకుడు. తను ‘’
2012’ హాలీవుడ్ సినిమా, అకిరా కురోసావా తీసిన సెవెన్ సమురాయ్‌ లో భయం, రేపటి గురించి ఆందోళనా లేకపోతే ప్రజల ప్రవర్తన ఎలా వుంటుందో చెప్పే ఒక డైలాగుతో బాటు, ఐన్ ర్యాండ్ ది ఫౌంటెన్ హెడ్ నవల అందించిన స్ఫూర్తితో ఈ సినిమా తీశానని చెప్పాడు. సినిమా లొకేషన్ ఎదురులంక అయితే, కథలో అక్కడి ప్రజలు యుగాంతం భయంతో జీవిస్తున్నారు కాబట్టి బెదురులంకగా మార్చానని చెప్పాడు.

కథకి తీసుకున్న విషయం బాగానే వుంది గానీ
, తెరకెక్కించడం అంతంత మాత్రంగా వుంది. ఏదైనా ఒక అపాయాన్ని అడ్డు పెట్టుకుని మతాల పేరుతో చేసే మోసాల కథలతో సినిమాలు వచ్చాయి. 1984 లో కోడి రామకృష్ణ తీసిన అదిగో అల్లదిగో ఇలాటి మూఢనమ్మకాల మీద తీసిన బలమైన కథ. ఆస్తికుడైన తండ్రికి నాస్తికుడైన కొడుకుగా చంద్రమోహన్ పాత్రతో ఈ కథ నడుస్తుంది. కానీ ప్రస్తుత కథలో హీరో కార్తికేయతో కాక చుట్టూ వున్న పాత్రలతో కథ నడుస్తుంది. దీంతో ఫస్టాఫ్ లో అంతంత మాత్రం కనిపించే కార్తికేయ సెకండాఫ్ లోనే కథలో కొస్తాడు. అయితే విలన్ల మోసాలు బయటపెట్టాల్సిన కథ కాస్తా క్లయిమాక్స్ లో వేరే మలుపు తీసుకుని, వేరే పాత్రతో ఒక మెసేజితో ముగిసి పోతుంది.

సెకెండాఫ్ లో సత్య
, వెన్నెల కిషోయర్ లు ప్రవేశించి నడిపే కామెడీ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా వుంటుంది.  

నటనలు- సాంకేతికాలు

దర్శకుడు కార్తికేయని సరిగా ఉపయోగించుకోలేక పోయాడు. కొత్త కాన్సెప్ట్ కాబట్టి కాస్త ఆసక్తికరంగా వుంది గానీ, వేరే సినిమా అయితే ఇలాటి పాత్రతో కార్తికేయకి ఫ్లాప్ అయ్యేది. ఉన్న సన్నివేశాలు నటించడంలో మనసు పెట్టనట్టు కనిపిస్తాడు. తను హీరోనా, అతిధి పాత్రా అన్నట్టు  వుంటాడు.

హీరోయిన్ నేహా శెట్టికి హీరోని ప్రేమించడంవరకే పని. ప్రారంభ సన్నివేశాల్లో తను ప్రెసిడెంట్ కూతురు బోసి మెడతో ఎందుకుంటుందో అర్ధం గాదు. ప్రెసిడెంట్ ఒక గొలుసు కొనివ్వలేదా? ఇక వూరంతా బంగారం ఇచ్చేస్తే తను చెవి రింగులతో అలాగే వుంటుంది. ఉంగరం దానం చేసేయమని హీరోని డిమాండ్ చేస్తూందే తప్ప, తను చెవి రింగులతో వున్నానని తెలుసుకోదు. ఇలాటి లోపాలున్నాయి దర్శకత్వంలో.   

గోపరాజు రమణ
, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాం ప్రసాద్ లాంటి హేమాహేమీలు కుట్ర స్వాములుగా నటించడం ఈ సినిమాకి ప్లస్ ఆయింది. పాత సినిమాల్లో రావుగోపాల రావు- అల్లు రామలింగయ్య- నూతన్ ప్రసాద్ లు వేసిన దుష్ట త్రయం పాత్రల్లాగే వుంటారు. సినిమాకి వాడిన గోదావరి జిల్లా భాష కలిసి వచ్చింది.

ఇక మణిశర్మ సంగీతంలో రెండు పాటలు ఫర్వాలేదు. గోదావరి నది మీద
, ఇతర గ్రామీణ పరిసరాల్లో కెమెరా వర్క్ ఆకర్షణీయంగా వుంది. కాసేపు నవ్వుకోవడానికైతే ఫర్వాలేదు ఈ సినిమా.

—సికిందర్