రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 7, 2020

975 : రివ్యూ


రచన - దర్శకత్వం : షంజు జేబా
తారాగణం : జాకబ్ గ్రెగరీ
, అనుపమా పరమేశ్వరన్, నజ్రియా నజీమ్, షైన్ టామ్ చాకో, కృష్ణ శంకర్ తదితరులు
సంగీతం : శ్రీహరి నాయర్
, ఛాయాగ్రహణం : సజద్ కకూ
బ్యానర్ : వేఫేరర్ ఫిలిమ్స్
నిర్మాత :  దుల్కర్ సల్మాన్
విడుదల :  నెట్ ఫ్లిక్స్

        లయాళ సినిమా సబ్జెక్టుల విషయంలో ఎంత ముందుంటుందో, అంత వెనుకబడి కూడా వుంటుంది. కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ తో ఎంత ముందుంటుందో, సూఫీయు మ్ సుజాతాయుమ్ తో అంత వెనుకబడి వుంటుంది. సీయూ సూన్ తో ఎంత దూకుడు గా వుంటుందో, కప్పేలా తో అంత కూలబడి వుంటుంది. తాజాగా ఇప్పుడు మనియారయిలే అశోకన్ (అశోకను శోభనపు గది) వెనకడుగులు లెక్కేసుకుంటూ లెక్కేసుకుంటూ వెళ్ళి సరాసరి సూర్యాస్తమయం దిశగా అంతర్ధానమై పోయింది. లెక్కేసుకుని మరీ రెండు తూర్పున ఉదయించే సినిమాలుగా, మరో రెండు పడమట కుంగే సినిమాలుగా సమ భావంతో తీర్చిదిద్దుతున్నారు మలయాళ టాలెంట్ కొత్త దర్శకులు.

       
కొత్త దర్శకుడు షంజు జేబా అవిరళ కృషి మనియారయిలే అశోకన్’. దీనికి నిర్మాత దుల్కర్ సల్మాన్. హీరో జాకబ్ గ్రెగరీ. ఈ ఎన్నారై సహాయ నటుడు ఈ సినిమాతో హీరో అయ్యాడు. తెలుగులో కూడా బాగా తెలిసిన అనుపమా పరమేశ్వరన్ ఇందులో ఒక హీరోయిన్. ఈమె మొదట్లో వచ్చి వెళ్లిపోయాక, ఇంకో హీరోయిన్ గా నజ్రియా నజీమ్ చిట్ట చివర్లో వచ్చి సెటిలవుతుంది. వీళ్ళిద్దరి రాకపోకల మధ్యంతా ఏం జరిగిందన్నది అసలు విషయం. ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై, 0.25 రేటింగ్ తో ట్రెండింగ్ అవుతోందంటే ఇంత ప్రమాద మెలా జరిగిందో చూద్దాం....

కథ
     అశోకన్ (గ్రెగరీ) పొట్టి వాడు. అందుచేత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ. వూళ్ళో అందరికీ పెళ్ళిళ్ళవుతూంటే, ముప్ఫై దాటుతున్నా పొట్టి తనం వల్ల తన పెళ్ళి ఒక కలగా మారింది. ఈ కలల్లో ఎందరెందరో పెళ్ళి కూతుళ్ళు, ఎన్నెన్నో శోభనపు గదులు. తేరుకుంటే ఎడారి జీవితం. పొట్టి తనమే కాదు, రంగు తక్కువనీ, చిరుద్యోగమనీ కూడా సంబంధాలు రావడం లేదు. ఇతడి కిద్దరు స్నేహితులు రతీష్ (కృష్ణ శంకర్), షైజూ (షైన్ టామ్ చాకో) - వీడికి పెళ్ళెలా చేయాలా అని ఆలోచిస్తూంటారు. 


        తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. ఒక ప్రయత్నం ఫలించి పెళ్ళి చూపు లేర్పాటవుతాయి. తన కంటే పొడుగ్గా వున్న ఆ అమ్మాయి శ్యామ (అనుపమా పరమేశ్వరన్) ని చూసి నచ్చిందంటాడు. ఆమెకి నచ్చకపోయినా కోపిష్టి తండ్రి ముందు ఆమెకి సాగదు. పంతులు జాతకాలు చూస్తాడు. అశోకన్ జాతకం దారుణంగా వుంటుంది. పెళ్లి చేసుకుంటే తనో
, తనని కట్టుకున్నదో చావడం ఖాయం. ఇంత దారుణమైన జాతకంతో సంబంధం తప్పినందుకు శ్యామ సంతోషిస్తుంది. అశోకన్ కి అశోక వనమే.  

        తర్వాత పంతుల్ని కలిసి మార్గం చెప్పమంటాడు. ముందు అరటి చెట్టుని పెళ్లి చేసుకో
, తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకోమంటాడు పంతులు. మొదటి పెళ్ళికే గండం గానీ రెండో పెళ్ళికి కాదంటాడు. అశోక్ వెళ్ళి తమ పొలంలోనే వున్న అరటి చెట్టుకి రహస్యంగా తాళి కట్టేస్తాడు. ఈ విషయం తెలీక ఏదో కారణం చేత వాళ్ళమ్మ అరటి చెట్టుని ఫటేల్ మని నరికేస్తుంది. ఇది చూసి తీవ్ర మానసిక క్షోభకి గురవుతాడు అశోకన్. 

        ఇప్పుడేం చేశాడు
? పెళ్ళికి మళ్ళీ కొత్త బాట ఎలా వేసుకున్నాడు? పొడగరి శ్యామనే చేసుకున్నాడా? పొట్టి తనంతో ఇబ్బంది తొలగిపోయిందా?...ఇవీ మిగతా కథలో తేలాల్సిన విషయాలు.  

నటనలు - సాంకేతికాలు
   అశోకన్ పాత్రని గ్రెగరీ ఫాంటసికల్ గా, మృదుమధురంగా నటించాడు. పెళ్లి, శోభనం, కాపురం వంటి కలల్లో తేలిపోతూ కళ్ళల్లో కైపు, మొహంలో మైమరపు, చేతల్లో అమాయ కత్వం అద్భుతంగా అభినయించాడు. తన సున్నిత అభినయానికి నేపథ్యంలో భావుకత తో కూడిన పాటలు, లాలిత్యంతో కూడిన సంగీతం జత కలిసి ఒక అలౌకిక ప్రపంచాన్ని సృష్టించాయి. దాదాపు గ్రెగరీ ఏకపాత్రాభినయం చేసినంత పని చేశాడు. పెళ్లి కాకపోతే ముప్ఫయ్యేళ్ళ వాడు తనలోకి తాను బాలుడిగా ఒదిగి పోతాడన్నట్టుగా మానసిక స్థితిని పోషించాడు. నా కోసం దూర తీరాల్నుంచీ వచ్చావు, నా హృదయాన్ని ప్రేమతో నింపావు  వంటి గీతాలాపనలతో మైకాన్నిసృష్టిస్తాడు. ఇలా నటనా పరంగా తను పూర్తి న్యాయమే చేశాడు, పాత్రే అన్యాయంగా వుంది. పాత్ర గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 


        ఇక ఇద్దరు హీరోయిన్లు ఆయారామ్ గయారామ్ టైపు. అనుపమా పరమేశ్వరన్ మొదట్లో కాసేపు
, నజ్రియా నజీమ్ చివర్లో కాసేపు కాల్షీటు చేసుకుని వెళ్లి పోతారు. మధ్యలో ఇంకో కాల్షీటు తీసుకుని నేవీ డ్రెస్సులో దుల్కర్ సల్మాన్ వచ్చి, గ్రెగరీని నాల్గు దులిపి వెళ్ళిపోతాడు. హీరోయిన్లు అతిధి పాత్ర లేసిన సినిమా ఇదే కావచ్చు దేశంలో. 

        గ్రెగరీ స్నేహితులుగా కృష్ణ శంకర్
, షైన్ టామ్ చాకో కూడా మృదువుగా నటిస్తారు. అందరిదీ మృదువైన నటనలే. సినిమా ఎక్కడా లౌడ్ గా వుండదు. సంభాషణలు లయబద్ధంగా వుంటాయి. దృశ్యాల్లో మోటు తనముండదు. తక్కువ పరికరాలతో సంగీతం కూడా మృదువుగా వుంటుంది. గ్రామం, చుట్టూ కొండలూ, ఘాట్ రోడ్ల లొకేషన్స్ పెయింటింగ్స్ లా వుంటాయి. మేకింగ్ పరంగా కొత్త అనుభూతి నిచ్చే ఆడియో- విజువల్ క్రియేషన్ ఇది. కొత్త దర్శకుడు షంజు జేబా తానూహించిన కథాప్రపంచం కంటే ఎక్కువే ఆవిష్కరించి వుంటాడు. తెలుగులో మేకింగ్ పరంగా చిన్న సినిమాలకి ఇలాటి ఆవిష్కరణలు ఎందుకు జరగవో ఎప్పుడూ వెంటాడే ప్రశ్నే. 

కథా కథనాలు
    ఇది రోమాంటిక్ డ్రామా జానర్ లో వున్న కథ. హీరో కాకుండా ఇతర పాత్రలు బలవంతం చేసి పెళ్లి జరిపించారు కాబట్టి ఇది రోమాంటిక్ డ్రామానే. సినిమా కథంటేనే హీరో కుండే గోల్. ఇక్కడ హీరోకి పొట్టి తనమనే సమస్య వుంది గానీ దాంతో ఏం చేయాలనే గోల్ లేదు. పొట్టి తనం శాపం కాదు, సమస్య కాదు. తన సైజు అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. పొట్టితనం ఎప్పుడు సమస్య కావచ్చంటే, మై మేరీ పత్నీ ఔర్ వో అనే సూపర్ హిట్ లో పొట్టి లెక్చరర్ రాజ్ పల్ యాదవ్, పొడుగు రీతూపర్ణా సేన్ ని పెళ్లి చేసుకుని, అందరూ నవ్వుతున్నారని గింజికు చావడంలో వుండొచ్చు. 


        ఏ కథయినా ఒకే పాయింటు లేదా సమస్యతో వుంటుంది. అశోకన్ పాత్రకి పొట్టి తనం అనే పాయింటుని ఎస్టాబ్లిష్ చేశాక
, మళ్ళీ రంగు తక్కువ, చిరుద్యోగం అనే లోపాలు కూడా కలపడంతో పొట్టి తనమనే పాయింటు తేలిపోయింది. ఇంతే కాదు, జాతకమనే ఇంకో పాయింటు కూడా పొట్టితనం పాయింటుతో క్లాష్ అయి ఇదేం కథో అర్ధం గాకుండా చేసింది. ఈ కథ పొట్టితనం గురించా, జాతకం గురించా? 

        ఈ జాతకం పాయింటు కూడా గందరగోళంగా వుంది. అశోకన్ పెళ్లి చేసుకుంటే మరణ గండం వుందన్నపుడు దానికి విరుగుడు చెట్టుని పెళ్లి చేసుకోవడంగా చెప్పారు. అశోకన్ అరటి చెట్టుని పెళ్లి చేసుకున్నాక జాతక దోషం తొలగిపోయినట్టే. ఆ చెట్టుని తల్లి నరికి పారేస్తే జాతకం ప్రకారం మరణం గొడవ కూడా వదిలిపోయి క్లీన్ చిట్ వచ్చేసినట్టే. వెంటనే శ్యామని కాకపోతే ఇంకో తన సైజు అమ్మాయిని పెళ్లి చేసుకుని శోభనం జరుపుకో వచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఎక్కడో సినిమాల్లోనే కాదు
, నిజ జీవితంలో సినిమా నటి విషయమే వుంది. ఐశ్వర్యా రాయ్ కి కుజ దోషం వల్ల విడాకులో, మరణమో పొంచి వుందని, దోష నివారణకి రెండు చెట్లతో పెళ్లి జరిపించి, ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ తో జరిపించారు. 

       కానీ అశోకన్ ఏం చేస్తాడంటే, అరటి చెట్టుకి తాళి కట్టాకా, అరటి చెట్టునే భార్యగా తల్చుకుంటూ వూహాల్లో కాపురం చేస్తూంటాడు. తల్లి చెట్టు కొట్టేస్తే దోష నాశనమైందని సంతోషించక పిచ్చివాడయి పోతాడు. తండ్రి పెరట్లో రెండు మొక్కలు నాటితే, మళ్ళీ పిల్లలు పుట్టారని ఇంకో ప్రహసనం మొదలెడతాడు. వాటికి శివగామి, శివగంగ అని పేర్లు పెట్టుకుని, వాటి మీద వర్షం కూడా పడకుండా కాపాడుకుంటాడు. ఆ పిల్లలే లోకంగా జీవిస్తాడు. పెళ్లి చేసుకుంటే భార్య ఈ పిల్లల్ని చూడదని భీష్మించుకుంటాడు...ఇలా న్యూసెన్స్ చేస్తాడు. 

        ఇక స్నేహితులే  మెడలు వంచి తాము చూసిన సంబంధం ఇందూ (నజ్రియా నజీమ్) తో పెళ్లి జరిపించి అవతల పడేస్తారు. ఇందూని అడిగినప్పుడు పొట్టితనాన్ని ప్రశ్నించదు. పొట్టితనం ప్రశ్నకాకపోతే ఈ కథంతా ఎందుకు
? ఇప్పుడు పొడుగు అమ్మాయి ఇందూని చేసుకున్న తనని చూసి నల్గురూ నవ్వితే తట్టుకోగలడా? సహజంగా ఏ సైజుకా సైజు ఈడూ జోడూ చూసి పెద్దలు పెళ్ళిళ్ళు చేస్తారు. అశోకన్ పేరెంట్స్ కి ఈ కామన్ సెన్సు కూడా లేకుండా ఏళ్ల తరబడి సంబంధాలు చూడ్డం.   

        ఈ జాతక దోషం గతంలో సంబంధాలు చూసినప్పుడు లేదా
? ఇప్పుడే దేవుడు అర్జెంటుగా లేచి అప్డేట్ చేశాడా? సెంటిమెంట్లకి లాజిక్ కూడా అవసరం. ఇలా కథలోనే ఇన్నిదోషాలున్నాయి. దీంతో కథనంలో విషయం లేకుండా పోయింది. మొదటి అరగంట కథలో అనుపమా పరమేశ్వరన్ ఒకటి  రెండు సీన్లు పూర్తి చేసుకుని వెళ్లిపోయాక, చివర్లో నజ్రియా నజీమ్ వచ్చి రెండు సీన్లలో కన్పించే వరకూ, మధ్యలో దాదాపు గంటన్నర పాటు చెట్లతో అశోకన్ అర్ధం పర్ధం లేని కథే.

సికిందర్