రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

16, జులై 2019, మంగళవారం

849 : స్క్రీన్ ప్లే సంగతులు


      ఒక  సినిమాలో ముగింపు ట్విస్టు  తీసుకుని ఇంకో సినిమాలో  ఇంటర్వెల్ ట్విస్టుగా వాడుకుంటే  ఏమవుతుంది? ఇంటర్వెల్ కే కథ అయిపోతుంది. చాలా కామన్ సెన్సు. హాలీవుడ్ ‘సిక్స్త్ సెన్స్’ లోని  ముగింపు ట్విస్టుని సందీప్ కిషన్ ‘నిను వీడని నీడను నేనే’ లో ఇంటర్వెల్లో మలుపుగా వాడుకుంటే  ఇంతే  జరిగింది. ఆ తర్వాత  నడపడానికి కథ లేక సెకండాఫ్ సతాయించింది. ‘సిక్త్ సెన్స్’ లో సజీవంగా కన్పిస్తున్న బ్ర్రూస్ విల్లీస్ పాత్ర  నిజానికి సజీవంగా లేదనీ, అది మరణించిన బ్రూస్ విల్లీస్ పాత్ర ఆత్మ అనీ ముగింపులో ట్విస్టు వస్తుంది. ఈ క్లాసిక్ ట్విస్టు తో ఇలాటి సినిమాలు హాలీవుడ్ లో ఆ తర్వాత ఇరవైకి పైగా వచ్చాయి. వీటిలో ‘ది అదర్స్’ ని మనీషా కోయిరాలాతో హిందీలో ‘అంజానే’ గా ఫ్రీ మేక్ కూడా చేశారు. ఒక బంగాళాలో ఆనందంగా జీవిస్తున్న మనీషా కోయిరాలా పాత్రా, ఆమె పిల్లలూ నిజానికి ఆత్మలని తెలియడం ముగింపు. ఇవేవీ  ‘సిక్స్త్ సెన్స్’  ఇంపాక్ట్ ని కల్గించలేకపోయాయి. 
          లాటి ముగింపు ట్విస్టుకి మొదటి సినిమా వరకే ఇంపాక్ట్ వుంటుంది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఎలా మార్చి తీసినా పెదవి విరుస్తారు ప్రేక్షకులు. ఈ ట్విస్టు ఇంటర్వెల్లో ఇస్తే, ‘నిను వీడని నీడను నేనే’ (నివీనీనే) గా సెకండాఫ్ లో ప్రేక్షకులకి శూన్యం మిగులుతుంది. హాలీవుడ్ లో ఇదే పాయింటు తో అన్ని సినిమాలు తీసిన వాళ్లకి, ఈ ట్విస్టు ఇంటర్వెల్లో పెట్టి తీయాలని ఒక్కరికైనా ఆలోచన వచ్చి వుండక పోతుందా? వచ్చే వుంటుంది.  అలా తీస్తే ఏమవుతుందో కూడా తెలిసే వుంటుంది. అందుకని పదేపదే ఆ ముగింపు ట్విస్టుని ముగింపులోనే పెట్టి తీస్తూ పోయారు.  కానీ మనం తేడా కదా? తేడా గల పనులే చేస్తాం కోట్లు గుమ్మరించి.  

          ‘సిక్స్త్ సెన్స్’ లో ఒక బాలుడికీ, సైకియాట్రిస్టుకీ  మధ్య కథ వుంటుంది. ఇది అమెరికాలో బాలల్ని కూడా విపరీతంగా ఆకర్షించి కలెక్షన్లు పెంచుకుంది. అప్పట్లో ఈ సినిమా చూడని అమెరికన్ బాలలు దాదాపూ లేరని అంటారు. ఒక బాలుడు చూసిన ముగింపునే ఆ తర్వాత పదిహేనేళ్ళూ వెయ్యి సార్లు  చూస్తూ పోయాడంటే, ‘సిక్స్త్ సెన్స్’ ఇంపాక్ట్ ఎటువంటిదో  వూహించవచ్చు. ఇందులో బాలనటుడిగా హెలీ జోల్  అస్మెట్ నటించాడు. సైకియాట్రిస్టుగా సూపర్ స్టార్ బ్రూస్ విల్లీస్ నటించాడు.

 ‘సిక్స్త్ సెన్స్’ సంగతి 
       కథా ప్రారంభంలో ఒక కోపిష్టి పేషంట్ బ్రూస్ విల్లీస్ ని షూట్ చేస్తాడు.  సంవత్సరం తర్వాత  బ్రూస్ విల్లీస్ తో భార్య ఎడమొహం పెడమొహంగా  వుంటుంది. ఒక బాలుడు వచ్చి తనకి ఆత్మలు కన్పిస్తున్నాయనీ, దీంతో అందరూ తనని దూరం పెట్టారనీ అంటాడు. ఈ బాలుడ్ని ట్రీట్ చేయడానికి పూనుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య ఆత్మల గురించిన కథ చివరికేమవుతుందంటే, అసలు బ్రూస్ విల్లీస్ పాత్రే ఒక ఆత్మ అని తేలుతుంది. తను మొదట్లో కోపిష్టి  పేషంట్ షూట్ చేసినప్పుడే చనిపోయాడు. కానీ భార్యతో రిలేషన్ షిప్ సమస్యలు తీర్చుకోవడానికి అతడి ఆత్మ పరలోకానికి వెళ్ళకుండా ఇక్కడే వుండిపోయింది. ఇక ఇప్పుడు ఆత్మ అని రివీలయ్యాక,  భార్య కరిగి దగ్గరవుతుంది. ఆత్మ నిష్క్రమిస్తుంది. 

          మొదట్లో కోపిష్టి పేషంట్ షూట్ చేసిన తర్వాత ఏడాదికి ఓపెన్ చేస్తే బ్రూస్ విల్లీస్ కోలుకుని బతికే వున్నాడని భావిస్తాం. నిజానికి షూట్ చేసినప్పుడే  చనిపోయాడన్న విషయం దాచి పెట్టి కథ నడిపారు. రెండోది, చివర్లో తను ఆత్మ అని చెప్పడానికి శరీరంలో బుల్లెట్ రంధ్రాన్ని చూపిస్తాడు. మూడు, ఆత్మగా ఇక్కడే ఎందుకుండి పోయాడనేదానికి భార్యతో సఖ్యత సాధించడం కోసమని కథ తెలుపుతుంది. ఇలా ఒక పరిపూర్ణమైన కథ చూడడానికి మనకి దొరికింది. సందీప్ కిషన్ ఏమిచ్చాడు? తమిళ దర్శకుడితో పరాభవించిన కథ ఇచ్చాడు. 

           
రిషి (సందీప్ కిషన్), దియా (అన్యా సింగ్) లు భార్యాభర్తలు. ఒక రాత్రి కారులో పోతూండగా శృంగార చేష్టలు అదుపు తప్పి, కారుకూడా అదుపు తప్పడంతో ఘోరప్రమాదం జరుగుతుంది. అందులోంచి బయటపడి అటుగా వెళ్తే అనుకోకుండా స్మశానంలో ప్రవేశిస్తారు. అక్కడో శవం కాలుతూంటుంది. ఎలాగో అక్కడ్నుంచి ఇంటికొచ్చేస్తే అద్దంలో వేరే ముఖాలు కనబడతాయి. రిషి అద్దంలో చూసుకుంటే అర్జున్ (వెన్నెల కిషోర్) మొహం, దియా అద్దంలో చూసుకుంటే మాధవి మొహం కన్పిస్తాయి. వాట్సాప్, ఫేస్ బుక్ లలో కూడా వాళ్ళ ఫోటోలు మారిపోతాయి. దీంతో కంగారుపడ్డ రిషి పారాసైకాలజిస్టుని కలుస్తాడు. ఈ మిస్టరీని ఛేదించడానికి ఎసిపి (పోసాని) తోడవుతాడు. అప్పుడు తెలుస్తుంది, రిషి దియాలలో వున్నది అర్జున్, మాధవిలు కాదనీ, అర్జున్ మాధవిల్లోనే రిషీ - దియాలున్నారని. అంటే అసలు అర్జున్ (సందీప్ కిషన్), మాధవి (అన్యా సింగ్) లే చనిపోయి, రిషి (వెన్నెల కిషోర్) అతడి భార్య దియాల్లో ఆత్మలుగా వుంటూ ఇబ్బంది పెడుతున్నారని తేలుస్తాడు ఎసిపి. ఇదీ ఇంటర్వెల్ ట్విస్టు. 

          ఇప్పుడేం  చేయాలి? అద్దాల్లో వేరే మొహాలు కన్పించడంతో ప్లాట్ పాయింట్ వన్, ఈ మొహాల మిస్టరీ ఛేదించడంతో ఇంటర్వెల్ ఏర్పడ్డాయి. ఇక్కడ్నించీ ఏం చెయ్యాలి? పారాసైకాలజిస్టు ఆ ఆత్మల్ని పారద్రోలాలి. సమస్యకి ఇదే కదా లాజికల్ ముగింపు. ఈ ముగింపుతో సెకండాఫ్ కి ఇదే కొనసాగింపు కావాలి. ఈ కొనసాగింపు నిలబడుతుందా, ఇంటర్వెల్లో అంత మేజట్ ట్విస్టు ఇచ్చాక? సెకండాఫ్ కొనసాగింపు ఈ మేజర్ ట్విస్టుకి పై స్థాయిలో వుండాలి. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ‘సిక్స్త్ సెన్స్’ లో ఇది అల్టిమేట్ ముగింపుగా లాక్ అయిపోయి వుంది. ముగింపు దగ్గరే ఈ మేజర్ ట్విస్టు పని చేస్తుంది తప్ప, దీని లాక్ తీసి ఇంకెక్కడో వాడుకుంటామంటే కుదరదు.

సైకలాజికల్ మీనింగ్ 
       ఆత్మల కథలు మనిషి కేం నేర్పుతాయి? ఆత్మ అనేది ఒక సైకలాజికల్ టూల్. జీవితంలో అందరితో సామరస్య పూర్వకంగా జీవించు, సంతృప్తి కరంగా మరణించు - అని ఈ టూల్ ద్వారా పరోక్షంగా సైకలాజికల్ మేసేజ్ ఇవ్వడం. ఎక్కడైనా పొరపొచ్చాలుంటే వెనక్కి వెళ్లి వాటిని సరిదిద్దుకోమంటాయి ఆత్మల  కథలు. ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోకుండా తీరని కోరికలతో ఇక్కడే తచ్చాడడంలో పరమార్థమిదే. జీవించి వున్నప్పుడే గతంలోకి వెళ్లి సరిదిద్దుకోమనడమే.  

          ఆత్మలతో కాక గతంలోకి వెళ్లి సరిదిద్దుకునే కథలు ఇంకో రూపంలో కూడా వుంటాయి - టైం మెషీన్ ఫాంటసీలతో. ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ లో టీనేజి హీరో టైం మెషీన్ లో కాలంలో వెనక్కి ప్రయాణించి, అక్కడ టీనేజీలో వున్న తన తల్లిదండ్రుల్ని కలుసుకుని, రిలేషన్ షిప్ సమస్యల్ని మరమ్మత్తు చేసి వస్తాడు.  వస్తే ఇప్పుడు తల్లిదండ్రులు కీచులాడుకోకుండా హయిగా వుంటారు. 

          ‘ఓ బేబీ’ లో ఫోటో స్టూడియో కూడా అలాటి టైం మెషినే. అక్కడ ఫోటో దిగిన ముసలావిడ యవ్వనవతిగా మారడం కాలంలో వెనక్కి వెళ్లి తన యవ్వనపు రోజుల్ని దర్శించడమే. అప్పట్లో తీరని కోరికలే ముసలితనంలో ఆమె దుందుడుకు ప్రవర్తనకి మానసిక కారణాలయ్యాయి. ఆ కోరికలు తీర్చుకుని తిరిగి వర్తమానంలోకి వచ్చి, మారిన మనిషిగా అందరితో కలిసిపోతుంది. ఆత్మల కథలనైనా, టైం మెషీన్ కథల్నైనా, లేదా పూరాణాలనైనా  అవి సైకలాజికల్ మీనింగ్ తో - సైకలాజికల్ జర్నీగా వుంటాయని తెలుసుకున్నప్పుడే వీటి ప్రయోజనాల్ని మనం పొందగలం.

          అయితే ‘ఓ బేబీ’ కొరియన్ ఒరిజినల్ లోని ఈ సైకలాజికల్ మీనింగ్ ని తెలుగు మేకర్లు అర్ధం జేసుకోక పోవడం వల్ల -  ఫోటో స్టూడియో అనేది కాలంలో వెనక్కి తీసికెళ్ళే టైం మెషీన్ కి సింబాలిజమని తెలుసుకోకపోవడం వల్ల - ఫోటో దిగడానికి వెళ్ళినామె చేతిలో వినాయకుడి బొమ్మ పెట్టి, దేవుడి మహిమవల్ల ఆమె ఫోటో దిగి యంగ్ గా మారిపోయిందని హాస్యా స్పదమైన భాష్యం చెప్పారు! మానసికంగా నీలోకి నువ్వు ప్రయాణించమనే సైకలాజికల్ మీనింగ్ వున్న కథని, దేవుడి లీల వల్ల యంగ్ గా మారిపోయినట్టు తమాషా కథగా విలువ తగ్గించేశారు. ఇది చాలనట్టు, మళ్ళీ ముగింపులో వినాయకుడి బొమ్మ వల్ల రాజేంద్ర ప్రసాద్ పాత్ర యంగ్ నాగ చైతన్యగా మారిపోయిందని చూపించి, మొత్తం కొరియన్ కాన్సెప్ట్ నే అపహాస్యం చేశారు. ప్రసిద్ధ బ్యానర్లు చేయాల్సిన పని కాదిది. ఇంకా 14 ప్రపంచ భాషల్లో రీమేక్ అయిందిది. ఎవరూ ఇలా చేయలేదు.
అరాచకం 
         ఇలాటిదే ఇప్పుడు  ‘సిక్స్త్ సెన్స్’ తో ‘నివీనీనే’ అనే అరాచకానికి పాల్పడ్డారు. ‘సిక్స్త్ సెన్స్’ లో చనిపోయాక ఆత్మ పరలోకానికెళ్ళి పోకుండా ఇక్కడే ఎందుకుండి  పోయిందనడానికి కారణం కథే చెప్తోంది - భార్యతో సఖ్యత సాధించడం కోసమని. ఈ ప్రయత్నమంతా సీన్లలో కనిపిస్తుంది. అయితే బ్ర్రూస్ విల్లీస్ పాత్ర బతికే వున్నాడని భ్రమింపజేస్తూ కథ నడుస్తుంది. ‘నివీనీనే’ లో చనిపోయిన అర్జున్ - మాధవిల ఆత్మలు రిషీ దియాల్లోకి ఎందుకు చేరాయో కారణం తెలీదు. ఎలా చేరాయో కూడా వాటికీ తెలీదు. పరలోకానికి వెళ్ళకుండా ఏం కోర్కె తీర్చడానికున్నాయో తెలీదు. 
          ఇదీ ఇంటర్వెల్ ట్విస్టు దగ్గర పరిస్థితి. ప్రారంభంలో అద్దంలో ఎవరో కన్పించడం, ఇంటర్వెల్లో అద్దంలో కన్పిస్తున్న వ్యక్తే నిజమని తెలియడం ఈ రెండూ అద్భుతమన్పించి వుంటాయి. దీని తర్వాత వాట్ నెక్స్ట్ అర్ధం గాలేదు. రిషి   శరీరంలో దూరిన అర్జున్ ఆత్మని సైకాలజిస్టు పారద్రోలక పోయినా, ఆ పని అర్జునే చేసుకుంటాడు రిషి శరీరం లోంచి బయట పడాలని. ఇక అద్దంలో రిషితో మాట్లాడి బయటపడే కామెడీ ప్రయత్నాలు ప్రారంభించే సరికి జానర్ మర్యాద మంట గలిసి పోయింది. ఏం చేయాలో అర్ధంగాక ఏదేదో చేయడంతో సెకండాఫ్ అతుకుల కథతో సెకండాఫ్ సిండ్రోం అనే సమస్య బారిన పడింది. ఒకసారి సెకండాఫ్ సిండ్రోంలో పడిందా ఇక ఆ సినిమాని ఎవరూ రక్షించలేరు. సెకండాఫ్ లో కథకి  ఆపరేటివ్ కంటిన్యూటీ వుందా అని తెలుసుకోవడానికి సినిమా అంతా తీసి చూసుకోనవసరం లేదు. ఐడియా అనుకున్నప్పుడే దాని స్ట్రక్చర్ లోనే తెలిసిపోతుంది. ఐడియాని సినాప్సిస్ గా రాసుకున్నప్పుడే తెలిసిపోతుంది. ఐడియా సెట్ చేసుకోకుండా, సినాప్సిస్ రాసుకోకుండా స్క్రీన్ ప్లేలు రాసుకుంటే ఇలాగే వుంటుంది.  భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దొంగోడు, సైజ్ జీరో, జ్యోతిలక్ష్మి, నర్తనశాల, 24 కిస్సేస్, పడిపడి లేచే మనసు... ఇలా సెకండాఫ్ సిండ్రోంలో పడి గల్లంతయిన సినిమా లెన్నో.

          అర్జున్ రిషితో అనుకున్నది సాధించలేక, ఇంకో కథ ఎత్తుకుంటాడు. అసలు తను ఎలా చనిపోయాడో తెలుసుకునే కథ. యాక్సిడెంట్ ఎలా జరిగింది, రూటు డైవర్షన్ ఇచ్చిన వాడెవడు, వాడు ఫలానా వాడు, వాడితో, వాడి సహచరులతో తాను బస్తీలో కొట్లాడి, మాధవిని విడిపించుకున్నాడు. అయితే ఆ గ్రూపే పగబట్టి ప్లానింగ్ గా చంపబొయారన్న మాట, కానీ తను మాధవితో సరసాలడుతూ డ్రైవింగ్ చేయడంతో కంట్రోలు తప్పి ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తామిద్దరూ చనిపోయారు....

          బస్తీలో కొట్లాట సీను ఫస్టాఫ్ ప్రారంభంలోనే చూపిస్తారు. ‘సిక్స్త్ సెన్స్’ లో బ్రూస్ విల్లీస్ ని షూట్ చేసే  సీనుని ఇలా మార్చారన్న మాట.. మార్చి దీనికో పెద్ద కథని జోడించి సెకండాఫ్ లో నడిపారు. ఇది నిలబడలేదు. ఎందుకంటే, ఎలా చనిపోయారో ఆత్మకి తెలియకుండా ఎలా వుంటుంది? ఈ లాజిక్ కి దొరకకూడదన్నట్టు, పారా సైకాలజిస్టు వింత వాదన చేస్తాడు. అర్జున్ ఆత్మ రిషిలోకి దూరడం వల్ల అర్జున్ ఆత్మ జ్ఞాపకశక్తి కోల్పోయిందట. ఆత్మ అతీతమైనదా?మనిషి అతీతుడా? ఆత్మకి జ్ఞాపక శక్తి పోతుందా? ఇంతవరకూ మనం చూసిన సినిమాల్లో  ఒకడ్ని ఆత్మ ఆవహించిందంటే, వాడు వాడి కంట్రోల్లో వుండడు, ఆత్మ వాడి మెదడులో తిష్ట వేసి వాడి జ్ఞాపకాలనే చెరిపి పారేస్తుంది...

          ఈ కథ సైకలాజికల్ మీనింగ్ గ్రహించకుండా దాన్నే ముక్కలు చేస్తూపోయారు. ‘సిక్స్త్ సెన్స్’  సైకలాజికల్ మీనింగ్ ఏమర్ధమైందో. ఇలా రకరకాల మార్గాలు ప్రయత్నించి, ఇక లాభం లేదని మదర్ సెంటి మెంటుతో ఏడ్పుల కథగా మార్చేశారు. జానర్ మర్యాద ఒకసారి కాదు, పదేపదే శకలాలైంది. 

          ఈ మొత్తం గజిబిజిలో ప్లాట్ పాయింట్ టూ ఎక్కడుందంటే చెప్పడం ఎవరి తరం గాదు. ‘సిక్స్త్ సెన్స్’ ముగింపు ట్విస్టునే కాదు, ఇంకేసినిమా ఎలాటి ముగిపునీ తెచ్చి ఇంటర్వెల్లో పెడితే ఇంతే. ‘శివ’ లో నాగార్జున రఘువరన్ ని చంపడం ముగింపు. దీన్ని ఇంటర్వెల్లో పెడితే పెడితే ఎలావుంటుంది? ఆ సినిమాకి శ్రద్ధాంజలి ఘటించడమే.
సికిందర్