రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

6, జులై 2017, గురువారం





      సాంద్రత డార్క్ మూవీస్ కి భద్రత. పాత్రలు గుర్తుండాలంటే,  సీన్లు వెంటాడాలంటే సాంద్రతే శరణ్యం.  సర్వసాధారణంగా చర్చల్లో సీను ఎలా తీయాలనే దానిమీద మనసు మళ్ళుతూంటుంది. ఒక సీను చర్చిండం మొదలెట్టగానే డైరక్టర్ షాట్లు ఆలోచించే స్తూంటాడు. అప్పుడే షాట్ల మీదికి దృష్టి మళ్లించాలా, సీనులో విషయం మీద కూర్చోవాలా స్పష్టత వుండదు జనరల్ గా. సీన్లలో విషయాన్ని సమూలంగా నిర్ధారించే పని మొట్ట మొదట చేయకుండా,  షాట్ల మీదికెళ్ళి పోవడం ఎంత తప్పో డార్క్ మూవీస్ చూస్తే  తెలుస్తుంది. డార్క్ మూవీస్ లో తీత కంటే రాతే కన్పిస్తుంది. రాత అంటే డైలాగుల మోత కాదు. సీన్ ని ఎలా రాస్తే ఎన్ని విషయాలు చెప్పకుండా చెప్పవచ్చనే కసరత్తు!  

  
        ఏ విషయాలు చెప్పకుండా ఎలా చెప్పాలో తెలిస్తే సాంద్రత దిగుతుంది సీన్లలో. ‘బ్లడ్ సింపుల్’  ప్రతీ సీనూ ఎన్ని విషయాలు ఎలాగెలా చెప్పకుండా చెబుతున్నాయో పరిశీలిస్తూ వస్తున్నాం. డార్క్ మూవీస్ కథాచర్చల్లో షాట్ల మీదికి మనసు పోతే విషయం మీద పట్టు వుండదు. డార్క్ మూవీస్ డైలాగ్ వెర్షన్ రాస్తే కనీసం రెండు నెలల సమయం తీసుకోవాలని ఇదివరకు చెప్పుకున్నాం. మొత్తం డైలాగులతో చెప్పకుండా విషయాన్ని విజువల్ గా చెప్పే కసరత్తు  కోసమే ఇంత సమయం. ఈ కసరత్తు చేస్తున్నప్పుడు షాట్ల మీదికి ధ్యాసే పోదు. ఉదాహరణకి ఆమె మోగుతున్న ఫోనెత్త డానికి వెళ్తోందనుకుంటే, దీని బ్యాక్ డ్రాప్ ఏమిటో ఆలోచిస్తాం. అంతేగానీ షాట్లు ఆలోచించం. ఒక సీనులో నేపధ్యం, చర్యలు, భావోద్వేగాలు, సైకాలజీ, బడీ లాంగ్వేజ్, మాటలు ఇవన్నీ తెలిస్తే, చెప్పకుండా ఏది చెప్పవచ్చో బ్లూ ప్రింట్  వస్తుంది. అప్పుడే దాన్నిబట్టి షాట్ల ప్రసక్తి వస్తుంది. దీన్ని బాగా అర్ధం జేసుకోవాలంటే ఇప్పుడు ఈ నాల్గు సీన్లు చూస్తే  చాలు- తీత కంటే రాతకి ఎంత కష్టపడ్డారో కూడా  తెలుస్తుంది.

10. బార్ లో మార్టీ దీర్ఘాలోచనలో వుండడం
     బార్ లో మార్టీ ఇంకా  టిల్ట్ బ్యాక్ అయి కూర్చుని పైకే చూస్తూంటాడు. బార్ అంతా నిశ్శబ్దంగా వుంటుంది, లయబద్ధంగా తిరుగుతున్న ఫ్యాను శబ్దం తప్ప- అని స్క్రిప్టులో రాశారు.
         
         దీన్ని మూడు షాట్లుగా తీశారు. మొదటి షాట్ డచ్ యాంగిల్ పెట్టారు. ఇది డార్క్ మూవీ ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. అసహనం, మతిమాలిన తనం, సమన్వయ లోపం తెలియజే
యడానికి డచ్ యాంగిల్స్ లో షాట్స్ తీస్తారని చెప్పుకున్నాం. ఇదంతా మార్టీ భార్యతో అను
భవిస్తున్న స్థితే. ఈ డచ్ యాంగిల్ ని మొదటి సరిగా ఇక్కడే వాడారు.  అతను పైకి చూస్తూ కూర్చున్న చెయిర్ వెనుక నుంచి,  అతడి  మీదుగా పైన ఫ్యానుకి టిల్ట్  అప్ చేసి, డచ్ యాంగిల్ తో ఈ మానసిక స్థితిని చూపించారు. దీని తర్వాత ప్రొఫైల్ తీసుకుని, అతను పైకి చూస్తున్న షాట్ వేశారు. ఫైనల్ గా ఫ్యాను క్లోజ్ షాట్ తీశారు. ఈ ఫ్యాను క్లోజ్ షాట్ ని  ట్రాన్సిషన్ కోసం బ్రిడ్జింగ్ టూల్ గా కూడా వాడారు. 


11. మధ్యరాత్రి తన దగ్గరికి వచ్చిన ఎబ్బీని  చూసి రే మెత్త బడడం
      ఫ్యాను క్లోజ్ షాట్ వేసి, నెమ్మదిగా టిల్ట్ డౌన్ చేస్తూ,  సోఫా మీద పడుకున్న ఎబ్బీ మీదికి టిల్ట్ డౌన్ చేస్తాం. ఆమె పైకే చూస్తూం
టుంది. గది చీకటిగా వుంటుంది. నిశ్శబ్దంగా వుంటుంది, దూరం నుంచి వస్తున్న కీచురాళ్ళ ధ్వని తప్ప. ఆమె తల తిప్పి ఆఫ్ స్క్రీన్ లో చూస్తుంది-  – అనిరాశారు. 

          ఇలాగే తీశారు. తర్వాత రాసిందానికి కొంచెం మార్పులతో, ఎడిటింగ్ తో ఇలా కొనసాగుతుంది సీను :  ఆమె సోఫాలో పడుకుని ఫ్యాను కేసి చూస్తూ ఆఫ్ స్క్రీన్ కి తల తిప్పుతుంది. అటు నడవా, ఆ నడవా చివర్న  బెడ్ రూం డోర్  కింద నుంచి సన్నని వెలుగు రేఖని ఏర్పరుస్తూ లోపలి లైటు. దాన్ని కనుమరుగు చేస్తూ డోర్ మూసుకోవడం. చీకటి.

          లేచి కూర్చుంటుంది. బెడ్రూంలో అతను నిద్ర పోతూంటాడు. ఇప్పుడు ఇంటర్ కట్ లో, బ్రిడ్జింగ్ టూల్ లేకుండా డైరెక్ట్ కట్ షాట్ వేస్తే,  అటు బార్ లో మార్టీ అలాగే కునికి పాట్లు పడుతూ కన్పిస్తాడు. కట్ చేసి తిరిగి ఇక్కడి కొస్తే, ఎబ్బీ లేచి నిలబడుతుంది. నడవాలో నడుచుకుంటూ పోతూంటుంది. వెనీషియన్ బ్లయిండ్స్ తో గల విండో లోంచి అవతలి వెలుగు ఇటు గోడ మీద కటకటాల నీడల్ని ఏర్పరుస్తూంటుంది. ఈ నేపధ్యంలో నడుచుకుంటూ వెళ్లి, బెడ్ రూమ్ డోర్ తీసి చూస్తుంది.  నిద్ర పోతూంటాడు. దగ్గరికి వెళ్లి చూస్తూంటుంది. ఫ్రేములోకి అతడి  చెయ్యి వస్తుంది. ఆమెని అందుకుంటాడు. ఇటు పక్క విండోకి మళ్ళీ వెనీషియన్ బ్లయిండ్స్ లోంచి వెన్నెల పడుతూంటుంది.

          ఇలా ముగిసిన ఈ సీనులో కొన్ని సందేహాలు వస్తాయి. అతణ్ణి కాదనుకున్న ఆమె అంతలో ఎందుకు కోరుకుంది? ఏమాలో చించుకుని లేచి వెళ్లి అతడితో పడుకుంది? ఏమీ సంఘర్షణ పడుతున్నట్టు కన్పించలేదే? నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లాడలేదే? ఏడ్వలేదే ఆడియెన్స్ కి ‘ఫీలింగు’ కలగడం కోసం? ఆడియెన్స్ కి ‘ఫీలింగు’ కలగక పోతే ఇదేం సీను! ఇదేం సినిమా!

          ఆమె ఎప్పుడో సరెండరైపోయింది! ఇతనితో తెంచుకుని ఎక్కడికీ పోలేనని గ్రహించింది. సొంత ఇంటి గడప దాటాక సరెండరై వుండకపోతే ఎన్నిగడపలు ఎక్కి దిగాల్సి వస్తుందో. కాబట్టి వెనుక 9 వ సీనులోనే సరెండరై పోయింది. ఈ మాటామాటా అనుకుని విడిపోయిన సీనులో- అతను పడకలు వేరు చేసి మాట్లాడుతున్నప్పుడు, చేయిదాటి పోతోందని తగ్గింది.
సోఫాలో కూర్చుండి పోతూ, టిల్ట్ అప్ షాట్ లో అతణ్ణి చూస్తూ- బెడ్ నుంచి నిన్ను దూరం చెయ్యనులే – అనేసింది.

          ఆమె సోఫాలో కూర్చుందని తర్వాత రివీల్ చేశారు దర్శకులు. కానీ ముందు ఈ షాట్ లో ఆమె సడెన్ గా కింద కూర్చుండిపోయి తలపైకెత్తి నీ బాంచెన్ అన్నట్టుగా అతడితో మాట్లాడు
తున్నట్టు టిల్ట్ అప్ పెట్టారు. ఇలా కూర్చుండిపోయి చూస్తూ - బెడ్ నుంచి నిన్ను దూరం చెయ్యనులే -  అంటున్నప్పుడు,  ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె మనస్తత్వాన్ని పట్టించి చాలా దైన్యాన్ని ఫీలయ్యాం మనం అక్కడే!.

          ఇలా ఆమె ముందే రాజీపడింది కాబట్టి ఇప్పుడామెకి సంఘర్షణ లేదు, బాధలేదు, ఏడ్పు లేదు. అనురాగమే వుంది. అటు చూసి, ఇటు చూసి ఆలోచిస్తూంటే, అతను డోర్ కూడా వేసేసి ‘సన్నటి ఆశాకిరణం’ (డోర్ కింద నుంచి పడుతున్న వెలుగు రేఖ) ని కూడా మలిపెయ్యడంతో లేచి వెళ్ళిపోయింది. నిజానికి అది తన ఆశాకిరణమే. ఇక లాభంలేదని మలిపేసుకున్నాడు.

          ఆమె వెనీషియన్ బ్లయిండ్స్ ఏర్పరుస్తున్న కటకటాల్లాంటి నీడల మధ్య నడవాలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు  ఆమె పూర్తిగా అతడికి బందీ అని చెప్పారు దర్శకులు. లోపల ఆమెని చూసి ఫ్రేముల్లోకి అతడి చేయి మాత్రమే క్లోజప్ లో వచ్చి ఆమెని అందుకోవడం ఎందుకంటే, ఇదే లాంగ్ షాట్ లో తీస్తే రసభంగ మవుతుంది. చెయ్యిని మాత్రమే క్లోజప్ లో చూపించినప్పుడు, ఆ అందుకునే చెయ్యి చాలా అర్ధాలు చెప్తున్నట్టు వుంటుంది. ఇకామేని వదిలి పెట్టడు అనే అర్ధం దామినేటింగ్ గా. అలా ఆమెని అందుకున్నాక, వెనీషియన్ బ్లయిండ్స్ లోంచి  వెన్నెల పడడ మంటే  సుఖాం య్యిందనే!

          వెనుక  సీన్లో విడిపోవడం, ఈ సీన్లో కలవడం చాలా కవితాత్మకంగా వుంది.
          ఎంత ఆలోచిస్తే, ఎన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, ఒక్కో సీను సమగ్రంగా బలంగా అర్ధవంతంగా వస్తుంది!

          ఇకపోతే, వెనక విడిపోయిన సీను నేపధ్యంలో ఈ సీను మొదలెట్టినప్పుడు ఆ విషాదానికి తగ్గట్టుగా నేపధ్య సంగీతం (బిజిఎం) ఏదీ? ఇంకా ఈ సీన్లో శోక రసం అవసరమా వెనక 7 వ సీన్లో విడిపోయే ఘట్టంలోనే విషాదమంతా చూసేశాం. ఇప్పుడింకా విషాదం దేనికి? ఆ విషాదం లోంచి ఇప్పుడు ఈ సీన్లో ఊరట కావాలి, సాంత్వన సౌఖ్యాలూ కావాలి,  పాత్రలకైనా మనకైనా! అందుకే సన్నని పియానో శబ్దం మాత్రమే సున్నితంగా మీటుతూ. విషాదం తర్వాత ఓదార్పే వుంటుంది గానీ ఇంకా విషాదం వుండదు. మ్యూజికల్ గా కూడా ఇలాటివి దృష్టిలో పెట్టుకోకపోతే సీన్లు చెడిపోతాయి.
***
12. ఉదయం మార్టీ వచ్చి ఎబ్బీ  మీద దాడికి విఫలయత్నం చేయడం
    11 వ సీనుని అలా వెన్నెల పడుతున్న  వెనీషియన్ విండో షాట్ మీద ముగించాక,  అదే విండో మీద అదే షాట్ ని  డిజాల్వ్ చేస్తూ తెల్లవారడాన్ని చూపిస్తారు. వెనక మోటెల్లో ఇదే వీళ్ళిద్దరి సమాగమ దృశ్యానికి నైట్  అండ్ డేలని విండో మీద ఇలాగే డిజాల్వ్ చేశారు. సీన్ల ట్రాన్సిషన్స్ కి  రాత్రింబవళ్ళని టూల్స్ గా వాడుకున్నారిక్కడ. ఇలా డిజాల్వ్ చేయడం వల్ల మనం కూడా తెల్లవారి వెలుగులు చూసి ఫ్రెష్ నెస్ ఫీలవుతాం. 


          ఇదే ఫ్రేములో బెడ్ మీద ఆమె లేచి కూర్చుంటూ ఫ్రేము లోకొస్తుంది. తర్వాత కెమెరా ఆమెని లివింగ్ రూం దాకా ట్రాక్ చేయడం మొదలెడుతుంది.  లివింగ్ రూంలో క్లోజ్ షాట్ లో ఆమె చెయ్యి హేండ్ బ్యాగులోంచి కాంపాక్ట్ తీస్తుంది. ఆ అద్దంలో మొహం చూసుకుంటుంది. అప్రయత్నంగా తలతిప్పి చూస్తుంది. గదిలో ఆమూల మసకమసకగా వున్న చోట పెంపుడు కుక్క  రివీలవుతుంది. ‘ఓపల్?’  అంటుంది అర్ధంగాక. అది నోరుతెరుస్తుంది. వెనకనుంచి ఒక్కసారిగా ఆమె నోటి మీద చెయ్యి పడి ఆమె నోరు మూసేస్తుంది.




    మార్టీ ఎటాక్ చేశాడు. పెనుగు లాడుతోంది. నోరు నొక్కేస్తూంటాడు అరవకుండా. పట్టు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ హేండ్ బ్యాగు అందుకో బోతుంది. అది కిందపడి  అందులోంచి రివాల్వర్ బయటికొస్తుంది. అతి కష్టంగా వంగి దాన్ని  అందుకోబోతూంటే లాగి - ఇక్కడ కాదు బయట నేచర్ లో చేసుకుందాం- అని  లాక్కు పోతూంటాడు బయటికి. ఇంటి బయటికి రాగానే వేలు కొరికేస్తుంది. బాధతో అరిచి వదిలి పెట్టేస్తాడు. రెండు కాళ్ళ మధ్య లాగి తన్నుతుంది. కాళ్ళ మధ్య పట్టుకుని మెలికలు తిరిగిపోతూ వాంతి చేసుకుంటాడు. రొప్పుతూ  చూస్తూంటుంది.  ప్యాంటు తొడుక్కుంటూ అర్ధనగ్నంగా వున్న రే బయటికొస్తాడు. అతన్నే చూస్తాడు మార్టీ. రే చేతిలో ఎబ్బీ రివాల్వర్ వుంటుంది. మార్టీ వెళ్లి పోతూ రే నే చూస్తూంటాడు. కారెక్కేస్తాడు. కుక్క వచ్చి కార్లోకి గెంతుతుంది. కారు స్టార్ట్ చేసుకుని వెళ్లి పోతూంటాడు. ఇటు రే ని హగ్ చేసుకుంటుంది ఎబ్బీ. ఇద్దరూ అలా నిలబడి వుండగా, అటు వెళ్ళిపోయిన మార్టీ కొంత దూరంలో కారు వెనక్కి తిప్పి, వాళ్ళ ముందు నుంచి మళ్ళీ ఇటు వెళ్లి పోతూంటాడు...

     ఇది యాక్షన్ సీనే. కానీ డెప్త్ తో వుండడం వల్ల సహజంగా పకడ్బందీగా వుంది. ఎబ్బీ బెడ్ రూమ్ లోంచి లివింగ్ రూం లోకి వెళ్తున్నప్పుడే కెమెరా ఆమెని ట్రాక్ చేయడం- ఆమె వెనకాలే  ఎవరో వున్నారనే  సస్పెన్స్ ని క్రియేట్ చేసింది.  ఆమె లివంగ్ రూం లో నిలబడి బ్యాగులోంచి కాంపాక్ట్ తీస్తున్నప్పుడు ఎలా వుందంటే, ఆమె వెనకే ఎవరో నిలబడినట్టే  అట్మాస్ ఫియర్ క్రియేట్ అయింది. కాంపాక్ట్ తీసి అద్దంలో మొహం చూసుకుంటున్నప్పుడు ఆమె డాగ్ ని గమనించాక – వాతావరణం తేలికయింది. ట్రాక్ షాట్ లో ఎవరో వెంబడించి వస్తున్నారన్న సస్పెన్స్ ఇప్పుడు డాగ్ ని చూశాక మనకి తీరిపోయింది. రిలాక్స్ అయ్యాం.

       ఇక్కడ స్క్రిప్టులో హైలైట్ చేసిన మిర్రర్ ఎఫెక్ట్ సినిమాలో ఎడిట్ అయినట్టుంది... ఆమె డాగ్ వైపు చూస్తున్నప్పుడు, ఆమె చేతిలో వున్న కాంపాక్ట్ మిర్రర్ లో ఆమె ప్రతిబింబం కన్పిస్తుందని...

        ఆమె డాగ్ వైపు చూసి ‘ఓపల్?’ అనగానే అది నోరు తెరుస్తుంది, హటాత్తుగా ఆమె నోరు మూసేస్తూ ఎటాక్ చేస్తాడు మార్టీ. ఇలా డాగ్ ని చూపించి మనల్ని నమ్మించారు. నమ్మించి రిలీఫ్ నిచ్చారు. ఇచ్చినట్టే ఇచ్చి సడెన్ గా మార్టీని రివీల్ చేస్తూ  అసలు షాక్ ఇచ్చారు. ఆ ట్రాకింగ్ షాట్ మార్టీ గురించేనని  అసలు సంగతి ఇప్పుడు చెప్పారు. ఈ సంక్షిప్త ఘట్టమే ఎత్తు పల్లాలతో వుంది. నిజ జీవితాల్లో ఇలాగే జరుగుతుంది. ఇతర కమర్షియల్ సినిమాల్లో సినిమాటిక్ చిత్రీకరణల వల్ల  ఈ సహజ భయోత్పాతం ఉత్పన్నం కాదు. ఇక ఎబ్బీ ‘ఓపల్’ అనగానే డాగ్ నోరు తెరవడం, ఈ షాట్ ని కట్ చేసి, ఇటు షాట్ ఓపెన్ చేస్తే మార్టీ ఆమె నోర్మూస్తూ ఎటాక్ చేయడం కూడా  ఒకే సీనులో చేసిన  ఓ అద్భుత ట్రాన్సిషన్. కుక్క నోరు తెరవడంతో షాట్ కట్ అయి, ఆమె నోరు మూతబడ్డంతో షాట్ ఓపెనవడం! 

           ఇప్పుడు మార్టీ ఎబ్బీ మీద ఎందుకు ఎటాక్ చేశాడు? ఇది గాయపర్చే ఉద్దేశంతోలా లేదు. రివాల్వర్ కిందపడి అందుబాటులోనే వున్న  దాంతో ఆమె ని కాల్చి చంపెయ్యవచ్చు. చంపదల్చుకోలేదు. రేప్  చేసి కసి తీర్చుకునే ఉద్దేశంతో వచ్చాడు. అందుకే-  ‘ఇక్కడ కాదు బయట నేచర్ లో చేసుకుందాం’ – అని  బయటికి లాక్కొచ్చాడు. మళ్ళీ ఆమె ఎవరితోనూ  పడుకోకుండా బహిరంగ మానభంగ శిక్ష వేసి పోదామని వచ్చాడు. అంతా తలకిందులైంది. తనకే రెండు జరిగాయి : మొదటిది,  వేటగాడి గురి తప్పిందని చూపుడు వేలు కొరికింది; రెండవది, నీ ప్లాను పారదని రెండు కాళ్ళ మధ్యా తన్నింది. 

          ఇక కారెక్కి వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోకుండా,  మళ్ళీ తిప్పుకుని వాళ్ళ ముందు నుంచి ఇటెందు కెళ్ళాడు?  అంటే,  దీంతో వదల్లేదని  ఆ బాడీ లాంగ్వేజ్ అన్నమాట. మళ్ళీ ఏదో చేస్తాడనే అర్ధం. సినిమాటిక్ గా తీస్తే ఇంత సాంద్రత వుండదు సీన్లో.

***
13. ఎబ్బీ - రేలని  చంపెయ్యమని మార్టీ విస్సర్ ని కోరడం

    వూరి బయట పచ్చని ప్రకృతిలో ఔట్ డోర్ లో ఓపెనవుతుంది. లేటరల్ ట్రాకింగ్ షాట్ లో నడుస్తూంటాడు మార్టీ. అతడి చూపుడు వేలు క్లోజప్ లో వుంటుంది. దానికి బ్యాండేజి వేసి నిటారుగా వుంటుంది. తన వేటగాడి గురి ఆడదాని విషయంలో పనికిరాక  దెబ్బతిని తన ఆపద్భాందవుడి దగ్గరి కొస్తున్నాడు. ఇక్కడంతా బీర్లు తాగుతూ టీనేజర్స్ ఎంజాయ్ చేస్తూంటారు. మార్టీ వాలకం చూసి నవ్వేస్తూంటారు. అటువైపు  కారు కానుకుని నిలబడి వుంటాడు డిటెక్టివ్ విస్సర్. మొదట్లో కన్పించిన అదే ఎల్లో సూట్ లో అలాగే వుంటాడు. టీనేజీ  అమ్మాయికి జోకులేసి నవ్విస్తూంటాడు. వస్తున్న మార్టీ ని చూసి- సారీ స్వీట్ హార్ట్, నా ‘డేట్’ వచ్చాడు... అంటాడు. ఆమె పక్కకెళ్ళి పోతుంది. మార్టీ విస్సర్ దగ్గరి కొస్తూంటే, ‘నా దగ్గర సిగరెట్లో మారిజువానా వుందనుకుంది... పార్టీ బర్డ్ అనుకుంది నన్ను- అని కవర్ చేసుకుంటాడు విస్సర్ అమ్మాయితో వున్న సందర్భాన్ని.   

     అలా కారుకి జారగిలబడే సరదాగా వెనక సీటు ఆఫర్ చేస్తాడు మార్టీకి. ఇక్కడ బాడీ లాంగ్వేజ్ అర్ధమై పోతోంది మనకి. వెనక సీటు ఆఫర్ చేస్తున్నాడంటే, తనని అప్పుడలా తిట్టి పంపిన మార్టీ, మళ్ళీ ఇలా తన దగ్గరికే వచ్చాడంటే బికారీ వెధవ అనే. ఇప్పుడే మాత్రం గౌరవం ఇవ్వ దల్చుకోలేదు. మార్టీ మీటర్ పడిపోయింది విస్సర్ దగ్గర.

          మార్టీ బింకంగా అటెళ్ళి పోయి,  అటు డోర్ తీసుకుని ముందు సీట్లో కూర్చుంటాడు.
          స్క్రిప్టులో రాసిన ఈ చర్యల్ని  హైలైట్ చేశాం.  ఇప్పుడు విస్సర్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. 

     ఇప్పుడు మళ్ళీ వివరం రాశారు (హైలైట్)- ఒక చిన్న టాప్ లెస్ డాల్ రియర్ వ్యూ మిర్రర్ కి వేలాడు తుంటుంది. విస్సర్ దాన్ని తడతాడు. అది ముందుకీ వెనక్కీ వూగుతూంటుంది. దాని వక్షోజాలకి రెండు లైట్లు వుంటాయి. అవి వెలుగుతూ ఆరుతూ వుంటాయని.
          ఇద్దరూ ఆ లైట్లే చూస్తూంటారు. మార్టీ కి వొళ్ళు మండి  ఆ లైట్లు ఆఫ్ చేస్తాడు. ఆఫ్ చేస్తున్నప్పుడు క్లోజప్ లో గాయపడిన చూపుడు వేలినే రిజిస్టర్ చేస్తారు. అది చూసి విస్సర్ - ఏ తప్పులో వేలెట్టి  వచ్చావ్ ? – అంటాడు.



           మార్టీకి బ్యాక్ సీటు ఆఫర్ చేయడం, ఎబ్బీ గుర్తొచ్చేలా కవ్విస్తూ డాల్ చూపించడం, ఇప్పుడు ఏ తప్పులో వేలెట్టి  వచ్చావ్? - అనడం ఇవన్నీ మార్టీకి తలవొంపులుగా వున్నాయి. విస్సర్ నవ్వి,  రెండు చేతులు విరగ్గొట్టుకున్న తన ఫ్రెండ్ బూతు కథ చెప్పుకొస్తాడు. చెప్పి గట్టిగా నవ్వుతూంటాడు. మార్టీకి వొళ్ళు మండిపోతూంటుంది. ఆ నవ్వు తెరల మధ్య సీరియస్ గా మార్టీ,  నీకో జాబ్ వుంది – అంటాడు. విస్సర్ నవ్వాపుకుంటూ అదోలా చూసి -  రొక్కం రైటుగా వుండి, వర్క్ లీగల్ గా వుంటే తప్పక చేస్తానంటాడు. అంత లీగల్ కాదంటాడు మార్టీ. విస్సర్ ఇక సీరియస్ మూడ్ లోకొచ్చేసి, సిగరెట్ వెల్గించుకుని అలోచించి – ఓకే,  రొక్కం రైటుగా వుంటే చేస్తానంటాడు.

       జేబులోంచి లైటర్ తీసి సిగరెట్ వెల్గించుకుని, లైటర్ ని డాష్ బోర్డు మీద పెడతాడని కోయెన్ బ్రదర్స్ ఇక్కడ నిగూఢార్ధం రాశారు ( హైలైట్ చూడండి). అతడి సైకలాజికల్ ట్రాక్ ని కొనసాగి

స్తున్నారు. మళ్ళీ ఇంకోసారి ఇంకెక్కడో పెట్టేసి మర్చిపోయి పీకల మీదికి తెచ్చు కుంటాడన్న మాట.  వెనక వీళ్ళిద్దరి నాల్గో సీనులో సిగరెట్ కేస్ ని చూపించారు. దాన్ని మర్చిపోయి వెళ్లి పోతూ మళ్ళీ తీసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ సిగరెట్ కేస్ కాక, లైటర్ నే ప్లే చేస్తున్నారు ప్లాట్ డివైస్ గా...

          ఇక విషయాని కొస్తాడు మార్టీ. రెండు మర్డర్లనేసరికి డల్ అయిపోతాడు విస్సర్. పదివేల డాలర్లు ఆఫర్ చేస్తాడు మార్టీ. డైలమా లోపడ్డ విస్సర్ ఇంత ఎమౌంట్  ఆఫర్ చూసి సరే నని ఒప్పుకుంటాడు. ఏదో ఆలోచిస్తూ వుండిపోయి, నువ్వెక్కడికో టూర్ కి ఎందుకెళ్ళ కూడదు?-  అంటాడు. ఆ ఎమౌంట్ కి నువ్వు ఎక్కౌంట్ చూపించా కదా- టూర్ కెళ్ళి కవర్ చెయ్- అంటాడు విస్సర్. మార్టీకి ఎటూ తోచక,  కారు దిగి పక్క కెళ్తాడు. . కాసేపటికి వచ్చి తెరచి వున్న డోర్ లోంచి చూస్తూ, సరే నంటాడు. డెడ్ బాడీస్ ని మాయం చేయాలని చెప్పి, బార్ వెనకాల ఫర్నేస్ వుందని గుర్తు చేసి వెళ్ళిపోతాడు. 

          తీవ్రాలోచనలోపడ్డ విస్సర్ క్లోజప్ మీద సీను ముగుస్తుంది.
          ఇదీ  ప్లాట్ పాయింట్ - 1 సీను.

-సికిందర్