రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 25, 2019

886 : స్క్రీన్ ప్లే సంగతులు -2


          సైరా మిడిల్  విభాగం బ్రిటిషర్లపై తిరుగుబాటు, నేరస్థుడుగా ముద్ర, పోరాటం, లొంగు బాటుగా వుంటే - ఎండ్ ఉరితీతతో వుంటుంది. కొన్ని ముగింపులకి ప్లాట్ పాయింట్ వన్ మాత్రమే కాకుండా కథనంలో ఎక్కడో ఇంకో  ప్రారంభముంటుంది. ఆ ప్రారంభాన్ని గుర్తించి కథ నడిపినప్పుడు ఆ కథ ఫోకస్డ్ గా వుంటుంది. ఈ ఫోకస్ కి అడ్డుపడే సన్నివేశాల కత్తిరింపు జరిగిపోతుంది. గత వ్యాసంలో గమనించినట్టు సైరా ప్లాట్ పాయింట్ వన్ వచ్చేసి జూనియర్ బ్రిటిష్ అధికారిని సైరా తరిమి కొట్టడంగా వున్నప్పుడు, ఇదే నేరుగా ముగింపుకి దారి తీయలేదు. దీని పర్యవసానంగా సైరా ఆ జూనియర్ బ్రిటిష్ అధికారి తలనరికే ఇంటర్వెల్ సీను కూడా నేరుగా ముగింపుకి దారితీయలేదు. మళ్ళీ ఈ ఇంటర్వెల్ సీను పర్యవసానంగా సైరా తలపై ప్రకటించే బహుమానం సీను మాత్రమే నేరుగా ముగింపుకి, అంటే ఉరితీతకి దారితీసింది. 

         
లా ‘సైరా’ ముగింపుకి  ‘సైరా తలపై బహుమానం ప్రకటన’ అనే సీను ప్రారంభంగా వుంది. ఈ ప్రారంభాన్ని గుర్తించి దీనిపై  ఫోకస్ చేసివుంటే, ఇక  సైరాని పట్టుకునే వేటగా ఇక్కడనుంచీ కథనముండి సాఫీగా, సూటిగా, బలంగా సెకండాఫ్ నడిచిపోయేది. ఈక్వలైజర్ - 2  లో సెకండాఫ్ ప్రారంభమైన పదినిమిషాలకే క్లయిమాక్స్ మొదలైపోతుంది. దీనికి ట్రిగ్గర్ డైలాగు- హీరో డెంజిల్ వాషింగ్టన్ హంతకుల్ని పిల్చి- ఇక మీరు చావుకి సిద్ధం కండని చెప్పడం. సైరాలో సైరా తలపై బహుమానం ప్రకటించడం లాగే ఇదీ వుంది. ఇలా క్లయిమాక్స్ కి ఎజెండా నిర్ణయమైపోయింది ఈక్వలైజర్ -2 లో లాగే సెకెండాఫ్ ప్రారంభమైన పది నిమిషాల్లో సైరాలో కూడా. మరి ఇంకెందుకాలస్యం వేట ప్రధానంగా సెకెండాఫ్ కథనం కొనసాగడానికి? 

         
ఈక్వలైజర్ -2 లో యాక్షన్ కథని మొక్కుబడిగా నడిపారు. సబ్ ప్లాట్స్ తో  ఒక స్టార్ గా డెంజిల్ వాషింగ్టన్ క్యారక్టర్ ని పరోపకారం చేసే మహోన్నత వ్యక్తిగా, బలమైన ఫీల్ తో నిలబెట్టే ప్రయత్నమే ఎక్కువ చేశారు. చివరికి చిట్టిపొట్టి యాక్షన్ కథ ముగిశాక, ఈ పరోపకార గుణం మీదే ఫోకస్ చేసి, డెంజిల్ వాషింగ్టన్ ని మరింత ఎలివేట్ చేస్తూ మర్చి పోలేని విధంగా, వెంటాడే ఫీల్ తో అత్యంత హృద్యంగా ముగించారు. 

          సైరా లో ఒక స్టార్ గా చిరంజీవి పాత్రకుండాల్సిన ఈ ఫీల్ బదులు ఏకోన్ముఖ ఎమోషన్ (రౌద్రం) - యాక్షనే ప్రధానమైపోయింది. రసపోషణలో తేడా కొట్టడం వల్ల రిపీట్ ఆడియెన్స్ కి నోచుకోలేకపోయింది. మిడిల్ అంతా ఫోకస్ లేని బరువైన సన్నివేశాల ద్రోహాల కథనాలు వచ్చేసి, అసలైన పాయింటు వేట కథ అడ్డుపడి పోయాయి. అడుగున తోసేశాయి. ముగింపుకి స్పష్టమైన ప్రారంభం మీద ఫోకస్ చెదిరి పోయింది. డ్రామా అనేది వేటకి గురయ్యే సైరాకీ, బ్రిటిషర్లకీ మధ్య కాక - బోలెడు పాలెగాళ్ళ, అన్నదమ్ముల పాత్రల గొడవ వైపు మళ్ళింది. ఇది మార్కెట్ యాస్పెక్ట్ కాలేదు. మార్కెట్ యాస్పెక్ట్ కి ఇలాటి పురాతన డ్రామాలు రుచించే అవకాశం లేదు. ఎంతసేపూ చిరంజీవిని చుట్టూ బోలెడు పాత్రల మధ్య ఇరికించి, క్రౌడ్ లో చూపించడం కూడా మార్కెట్ యాస్పెక్ట్ కాలేదు. కాస్సేపైనా విడిగా వదిలెయ్యాలి. విడిగా యాక్షన్ చేసుకోవడానికి వదిలెయ్యాలి. అప్పుడే ఆ సోలో యాక్షన్ తో హైలైట్ అయ్యేందుకు అవకాశముంటుంది.    

          ఈ సోలో యాక్షన్ మళ్ళీ అటు బ్రిటిష్ గుంపుతో కాకుండా, బహుమానం ప్రకటించిన సీనియర్  బ్రిటిష్ అధికారికీ, సైరా కీ వన్ టు వన్ గా, వాళ్ళిద్దరి మధ్యే ఎక్స్ క్లూజివ్  పోరాటంగా వున్నప్పుడు ఒక అడ్వెంచర్ కి వీలవుతుంది. ఫారెస్ట్ లో వేటాడే బ్రిటిష్ అధికారిని, గెరిల్లా దాడులతో ముప్పుతిప్పలు పెట్టే సైరా అడ్వెంచర్ గా ఒక థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ని ఒక ఎపిసోడ్ గా సృష్టించి వుండవచ్చు. ఇలా ముగింపుకి ప్రారంభాన్ని పట్టుకుని, ఆ ప్రారంభం మీద కథనం నడపకపోవడంతో, సెకండాఫ్ లో ఇరువైపులా అవే మూక దాడులు రిపీట్ చేసుకోవడమే సరిపోయింది.

          చారిత్రక వ్యక్తి జీవితంలోంచి వేరు చేసి చూస్తే, ఏ కీలక ఘట్టం మొత్తం జీవితాన్నీ ప్రభావితం చేసిందో ముందు గుర్తించాలంటారు నిపుణులు. మనకి తెలిసినంత వరకూ, సైరా తల మీద చివరికి అతడి ప్రాణాలు తీసే బహుమానం ప్రకటనే అతడి జీవితాన్ని ప్రభావితం చేసిన ఘట్టం కావాలి. అప్పుడు ఈ ఘట్టం చుట్టూ కథ నడపమంటారు నిపుణులు. చిరంజీవి ‘ఖైదీ’ లో చూసినా పరారీలో వున్న నిందితుడి చుట్టూ కథేగా? సైరాని  కూడా పరారీలో వున్న నిందితుడి కథగానే చూడాలి. అప్పుడు ఈ ఘట్టాన్ని పాయింటాఫ్ నో రిటర్న్ గా చూడాలంటారు నిపుణులు. పాయింటుతో ఇక అమీ తుమీ తేల్చుకోవాల్సిందే. అంటే ఈ పాయింటే ఇక కథవుతుందన్న మాట.

           
         చారిత్రక పాత్ర తలరాత నిర్ణయ మైపోయాక, పాత్రకి దాని తలరాత తెలిసిపోయాక, అదే టెన్షన్ ని పెంచే బలమైన స్క్రిప్టుని సృష్టిస్తుందంటారు నిపుణులు. అప్పుడది నేటి ప్రేక్షకులకి - అంటే మన పరిభాషలో మార్కెట్ యాస్పెక్ట్ కి - కనెక్ట్ అవుతుందంటారు నిపుణులు. సైరాలో జరిగిన పొరపాటు ఇది గమనించకపోవడమేనా?

          అదృష్టవశాత్తూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర మహాత్మా గాంధీ జీవితంలా గాథ కాలేదు. మహాత్మా గాంధీకి నాథూ రాం గాడ్సే తనని చంపుతాడని ముందు తెలియదు. కనుక సర్ రిచర్డ్ అటెన్ బరో ‘గాంధీ’ తీస్తే అది గాథ అయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి తన తలకి బహుమానం విషయం, తనకోసం గాలింపూ ముందే తెలుసు. కనుక ఈ పాయింటు (సమస్య) చుట్టూ అతడి చరిత్ర కథ అయింది. కానీ కథగా వున్న ఈ పాయింటు మరుగునపడి పోయి గాథలా తయారయింది సైరా. తెలుగులో చాలా సినిమా కథలు గాథలుగా మారిపోయి  తేలిపోవడాన్ని చూస్తూనే వున్నాం. 

          చరిత్రలో ఉయ్యాలవాడకి స్పష్టమైన బిగినింగ్ మిడిల్ ఎండ్ లున్నాయి. అదే మహాత్మా గాంధీకి లేవు. స్క్రీన్ ప్లే గురు సిడ్ ఫీల్డ్ ప్రకారం, రిచర్డ్ అటెన్ బరో తీసిన ‘గాంధీ’ స్క్రీన్ ప్లేకి ఇదో సమస్య అయింది.  గాంధీ జీవితాన్ని సినిమాగా తీయాలంటే జీవితం ఎన్నో శాఖలుగా విస్తరించి వుంది. అందుకని సినిమాగా నిలబెట్టేందుకు పనికొచ్చే ముఖ్యమైన మూడు ఘట్టాల్ని స్క్రీన్ ప్లే కి అధ్యాయాలుగా నిర్ణయించాడు. అవి దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా అనుభవాలు, ఇండియాలో సహాయ నిరాకరణోద్యమం, హిందూ ముస్లిం సమస్య. ఈ అధ్యాయాలకి ముగింపుగా హత్య. ఇవి స్క్రీన్ ప్లే పరిభాషలో బిగినింగ్ మిడిల్ ఎండ్ లనే మూడు విభాగాలు  కాకపోయినా, సినిమాకి మూడు విభాగాలుండాలని మూడు అధ్యాయాలు చేశాడు. మొత్తంగా చూస్తే ఇది కథ కాదు, గాథ. అధ్యాయాలతో వున్నది గాథే అవుతుంది.   

          ఇలా కాకుండా ఉయ్యాలవాడకి కథయ్యేందుకు అతడి తలకి ప్రటించిన బహుమానమనే అంశం సెంట్రల్ పాయింటుగా వుంది. ఇది కథా చక్రాలకి ఇరుసు కాలేదు. అలాంటప్పుడు సైరా తలకి బహుమానం ప్రకటన ప్రస్తావనే తేకుండా వుండాల్సింది. దాడులు ప్రతి దాడులతో నడుపుతున్నప్పుడు, ఆ దాడుల ఫలితంగా పట్టుబడ్డాక నేరుగా ఉరితీత కార్యక్రమం పెట్టేయాల్సింది. ప్రకటన అనే సెటప్ కి ఉరితీత పే ఆఫ్ అయినప్పుడు, ఆ సెటప్ కి తగ్గ కథనానికి వీల్లేక పోయాక,     ప్రకటన అనే సెటప్పే అవసరం లేదు. ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’లో రెబెల్ పాత్ర ఒమర్ ముఖ్తార్ కి ప్రకటన అనే సెటప్ వుండదు. పట్టుబడ్డాక నేరుగా ఉరి తీస్తారు. ప్రకటన అనే సెటప్ ఏర్పాటు చేస్తే, అది కోరే కథనం లేకపోతే, చివర ఉరితీత అనే 
ముగింపుని ముందే రివీల్ చేసినట్టయి సస్పెన్స్ పోతుంది. సెటప్ కి తగ్గ కథా పాలన చేసినప్పుడు, అదే ఉరి వరకూ సీన్ టు సీన్ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది

          మొత్తం సైరాని లోపించిన దాని ఫీల్ దృష్ట్యానే చూసి ఈ సంగతులు చెప్పుకుంటున్నాం. సినిమాని అంతర్జాతీయ స్థాయి చేయడమంటే అంతర్జాతీయ ఫైటర్స్ తో యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం కాదుకదా? సార్వకాలిక కథని సార్వజనీనం చేయడం కూడా అంతర్జాతీయం అవుతుంది. ఆలోచనాత్మకంగా వున్నప్పుడే అవుతుంది. సైరా కనీసం ముగింపయినా ఆలోచనాత్మకంగా లేకపోవడంతో, చిట్ట చివరికైనా ఓ బొట్టు ఫీల్ కి కూడా ఆస్కారం లేకుండా చేసింది. ఏదైనా ఆలోచింప జేస్తేనే ఫీల్ వుండేది. సైరా మొత్తం మీద ఆలోచింపజేసే ఒక్క సన్నివేశం లేదు. అంతా రుద్రరౌద్ర యాక్షన్ హడావిడియే. ముగింపు కూడా రెగ్యులర్ తెలుగు యాక్షన్ సినిమా ఫార్ములాయే. ఉరికంబం మీద ఉరిని తప్పించుకుని సైరా శత్రు సంహారం గావించడం. దీంతో పాత్ర పట్ల సానుభూతీ, ఫీల్ పూర్తిగా మాయమైపోయాయి. 

          
        పట్టుబడ్డాక కథనానికి ఒక ప్రాసెస్ వుంటుంది. ‘లయన్ ఆఫ్ ది డెజర్ట్’ 1929 నాటి కథ. ఇటలీ నియంత ముస్సోలినీ, జనరల్ గ్రజియానీకి ఒక ఆర్డరేస్తాడు : ఇటలీ ఆక్రమణలో వున్న లిబియాలో రెబెల్ గెరిల్లా నాయకుడు ఒమర్ ముఖ్తార్ నాయకత్వంలోని తిరుగుబాటుని అణిచెయ్యమని. ఆంథోనీ క్విన్ ఒమర్ ముఖ్తార్ పాత్ర పోషించాడు. జనరల్ గ్రజియానీగా అలివర్ రీడ్ నటించాడు. ఈ ఇద్దరి మధ్యే స్పష్టమైన డైనమిక్స్ తో కథ వుంటుంది. చివరికి 20 ఏళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ముఖ్తార్ దొరికిపోయాక, ఇటాలియన్ మిలిటరీ అధికారులు అతడ్ని - ‘ఇరవై ఏళ్లుగా మనతో పోరాటం చేసిన ప్రత్యర్ధి ఇతను. ఇతన్ని మనం డిగ్నిటీతో, రెస్పెక్ట్ తో ట్రీట్ చేయాలి’ అని ఆ మేరకు గౌరవంగా ప్రవర్తిస్తారు. ‘సర్’ అని సంబోధిస్తారు. జనరల్ గ్రజియానీ కార్యాలయంలో హాజరు పరుస్తారు. ఇద్దరే వుంటారు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఇద్దరి సంభాషణ అఫీషియల్ గా వుంటుంది. ‘రేయ్ నన్నేం చేస్తార్రా మీరూ? ఈ దేశం మీ అబ్బదా? నీయబ్బ, చంపుతానొరే!’ అని వూగిపోతూ మాస్ అరుపులు అరవడు ముఖ్తార్. ఈ సన్నివేశం పూర్తిగా పరిస్థితిపై ఫోకస్ పెడుతూ, ఆలోచనాత్మకంగా వుంటుంది. రైతులు పంటలు పండించుకోకుండా ధ్వంసం చేస్తున్నావని జనరల్  ఆరోపిస్తాడు. ‘మా దేశాన్నే ధ్వంసం చేస్తోంది మీరు, మీ దేశాన్ని మీరిలాగే ధ్వంసం చేసుకుంటారా?’  అని ఎదురు ప్రశ్న వేస్తాడు ముఖ్తార్. అసలు మేమెందుకు  పన్నులు  కట్టాలని అంటాడు. జనరల్  ఒక ప్రతిపాదన చేస్తాడు: ముఖ్తార్ తన బృందాన్ని కూడా లొంగిపోయేలా చేస్తే క్షమిస్తామంటాడు. లొంగి పోవడం వుండదనీ, గెలుపో చావో మాత్రమే వుంటాయనీ ముఖ్తార్ సమాధానమిస్తాడు. ‘నన్ను ఉరి తీసే తలారి కన్నా నేనెక్కువ కాలం జీవించే వుంటాను. ఎందుకంటే నా తర్వాత తరం తరం నా ప్రజలు మీతో పోరాటంలో వుంటారు, లొంగిపోవడం కాదు’ అని వివరిస్తాడు. ‘నిన్ను ఉరి తీస్తామని ఎందుకనుకుంటున్నావ్? నీకు పెన్షన్ కి ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను’ అంటాడు జనరల్. 

          ఇలా సాగుతుంది సంభాషణ. ఇక ఇతణ్ణి లొంగదీయలేమని, ‘నీకు దృష్టి తగ్గింది’ అంటూ కళ్ళ జోడు తీసిస్తాడు జనరల్  
గ్రజియానీ. అది పోరాటంలో దొరికిన ముఖ్తార్ కళ్ళజోడే. ఆ తర్వాత కోర్టు విచారణ జరుగుతుంది. తను చేసిన తిరుగుబాటుని ఒప్పుకుంటాడు ముఖ్తార్. అతణ్ణి రెబెల్ గా ప్రకటించి, బహిరంగ ఉరి శిక్ష విధిస్తుంది కోర్టు. బహిరంగ ప్రదేశంలో వందలాది ప్రజల సమక్షంలో ఉరికి సిద్ధం చేస్తారు. ప్రజలు రోదిస్తూంటారు. మిలిటరీ ట్యాంకర్ లతో, తుపాకులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. ముఖ్తార్ ని ఉరికంబం ఎక్కిస్తారు. అతను ప్రశాంత చిత్తంతో వుంటాడు. మిలిటరీ అధికారి ఉరిశిక్ష ఉత్తర్వులు చదివి వినిపిస్తాడు. పక్కనే జనరల్ గ్రజియానీ విచారంగా వుంటాడు. ముఖ్తార్ పక్కకు తిరిగి నిశ్శబ్దంగా ప్రార్ధన చేసుకుంటాడు. కళ్ళ జోడు తీసేస్తాడు. తలారి దాన్ని తీసుకుని కింద పెడతాడు. ఇది సమూహంలో ఒక బాలుడు గమనిస్తాడు. తలారి ముఖ్తార్ చేతులు వెనక్కి కట్టేసి ఉరిని బిగించాక, అధికారి గ్రీన్ సిగ్నలిస్తాడు. జనరల్ గ్రజియానీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. తలారి ముఖ్తార్ కాళ్ళకింది బల్లని తన్నేస్తాడు. ముఖ్తార్ ఉరికి వేలాడి ప్రాణాలు వదిలేస్తాడు. ప్రజల రోదనలు మిన్నంటుతాయి. బాలుడు ఆ కళ్ళజోడు తీసుకుంటాడు. దిసీజ్ యూనివర్సల్ అప్పీల్ వున్న ఫీల్!

-సికిందర్