రచన - దర్శకత్వం: ప్రవీణ్ కండ్రేగుల
తారాగణం: సందీప్ వారణాసి, వికాస్ వశిష్ట, రాగ్ మయూర్, సింధు, సిరివెన్నెల తదితరులు
సంగీతం : ఎస్. శిరీష్, ప్రవీణ్ రెడ్డి, ఛాయాగ్రహణం : అపూర్వ సాలిగ్రాం, సాగర్
బ్యానర్ డి 2 ఆర్ ఇండీ
నిర్మాతలు: రాజ్ నిడుమోరు, కృష్ణ డికె
విడుదల: మే 14, 2021, నెట్ ఫ్లిక్స్
***
ఓ ఇండీ ఫిలిం గా ‘సినిమాబండి’ నెట్ ఫ్లిక్స్ లో
విడుదలైంది. ఇండీ ఫిలిమ్స్ తో కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తున్న డి 2 ఆర్ ఇండీ
సంస్థ అధినేతలు దీన్ని నిర్మించారు. సహజత్వానికి దగ్గరగా సినిమాని తీసికెళ్ళాలన్న
అభిరుచి ‘సినిమా బండి’ ఆద్యంతం
కన్పిస్తుంది. ఇటీవల ‘కంబాలపల్లి కథలు’
తో ఇదే చూశాం. ఓటీటీలో క్వాలిటీ సినిమాలకి ఢోకాలేదని ఇప్పుడు ‘సినిమా బండి’ తో నిరూపించే ప్రయత్నం. అయితే ‘సినిమా బండి’ కంటెంట్ కి సంబంధించినంత వరకూ దాదా
సాహెబ్ ఫాల్కే లాంటి ప్రయత్నం. కానీ ఈ కొత్త దర్శకుడి ఈ ప్రయత్నంలో కామన్ సెన్సుతో
కూడిన వాస్తవికత కూడా వుండాల్సింది. కామన్ సెన్స్ లేకుండా కమర్షియల్ సినిమా కూడా
రాణించదు. సెల్ ఫోన్లతో వూరూరా షార్ట్ ఫిలిమ్సే తీసేయడం అందరికీ తెలిసిన విషయమై
పోయాక, వీడియో కెమెరాని అదేదో దివినుంచి వూడిపడిన దివ్యవరంగా
ఆశ్చర్యపడి, దాంతో సినిమా తీయాలన్న అమాయకత్వాన్ని ప్రదర్శించడం ఈ కథలో కన్విన్సింగ్ వుందా ఆలోచించాల్సిన విషయం.
మేకింగ్ సంగతి తర్వాత, ముందు రైటింగ్ ఎంత ముఖ్యమో ఇప్పుడు కూడా మైథిలీ ఇండీ ఫిలిం ‘గమక్ ఘర్’,
నాగమీస్ ఇండీ ఫిలిం ‘నానా -ఏ
టేల్ ఆఫ్ అజ్’ నిరూపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధిస్తున్నాయి. ఇంటలిజెంట్ రైటింగే ఇండీ ఫిలిమ్స్
కి ప్రాణం. ‘సినిమా బండి’ లాంటిదే
కన్నడలో తీసిన పల్లెటూరి ఫన్నీ కథ ‘తిధి’, కొత్త దర్శకుడి ఇంటలిజెంట్
రైటింగ్ తో, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ స్క్రీన్ ప్లేతో, 20 వరకూ జాతీయ, అవార్డులతో పేరుకి పేరూ డబ్బుకి
డబ్బూ సంపాదించుకుంది. దేశంలో 30 కి పైగా ప్రాంతీయ భాషల్లో ఇండీ ఫిలిమ్స్ తీస్తూ
జాతీయ, అంతర్జాతీయ దృష్టిని నాకర్షిస్తున్నారు. ఒక్క
తెలుగులోనే తెలుగు మూస సినిమాల ప్రభావం నుంచి బయటికి రాలేక,
ఇండీ ఫిలిమ్స్ మార్కెట్ యాస్పెక్ట్ ని లోకల్ గానే తక్కువ చేసి చూస్తున్నారు. ‘సినిమా బండి’ కథలో దొరకాల్సింది ఎవరో మర్చిపోయిన ఓ
వీడియో కెమెరా కాకుండా, ఎవరో పారేసుకున్న ఆస్కార్ అవార్డు
ఫారిన్ లాంగ్వేజీ మూవీ స్థాయి స్క్రిప్టూ, ఆ స్క్రిప్టుతో అమాయక
జనం సినిమా తీసేయాలనుకునే వైరల్ ఐడియా అయివుండాల్సింది! వైరల్ ఐడియాల నిచ్చే
హయ్యర్ ఇంటలిజెన్స్ ఇలాటి ‘లో - బడ్జెట్’ ఇండీ ఫిలిమ్స్ వీక్షణాసక్తిని శిఖర
స్థాయికి పెంచుతాయని గుర్తుంచుకోవాలి. ఇందుకు తెలుగు ఇండీ మేకర్లు ఫారిన్ సినిమాలు
మానేసి, ముందు వివిధ ప్రాంతీయ సినిమాలు చూసి వాస్తవ జీవితాల్ని
పరిశీలించాల్సిన అవసరం చాలా వుంది.
***
***
ఈ కథలో ఇంకా ఆటోలో కెమెరా మర్చిపోయిన సిటీ
గర్ల్ సింధు గా సింధూ శ్రీనివాస మూర్తి వుంటుంది. కథకి ఈమే ముగింపు నిస్తుంది. ఈమె
క్యారక్టర్ ఎలా వున్నా, నటన బావుంది. ఆటో డ్రైవర్ వీరబాబు భార్య గంగోత్రిగా
సిరివెన్నెల యలమందల నటించింది. వీరబాబు ఆటో నడపకుండా సినిమా తీయడాన్ని తీవ్రంగా
వ్యతిరేకించే ఈమె, తర్వాత అర్ధం జేసుకుని సహకరిస్తుంది.
వీరబాబు సినిమా మధ్యలో ఆగిపోయాక, ఈమెతో ఒక దృశ్యం మౌన భాష్యం
చెబుతుంది. ఇంట్లో వీర బాబు చూస్తూండగా అతడి షర్టు వేసుకుని,
తలకి తువ్వాల చుట్టుకుని, ఆమె బయటికెళ్ళే మాటలు లేని మూకీ దృశ్యం ఆమె కూలి పనికి
వెళ్లడానికి సిధ్ధ పడిందని చెప్పకనే చెప్తుంది. ఈ దృశ్యం సినిమా మొత్తం మీద
గుర్తుండి పోయే టాప్ సింబాలిక్ దృశ్యం. కానీ ఉండాల్సిన కాన్సెప్ట్ ప్రకారం చూస్తే అర్ధరహితం.
మొదటి హీరోయిన్ లేచిపోయాక రెండో హీరోయిన్
గా కూరగాయలమ్మే మంగ (వై జి ఉమ) వుంటుంది. ఈమెది కూడా బలమైన స్త్రీ పాత్రే. షూటింగ్
గ్యాప్ లో అక్కడే బుట్ట పెట్టుకుని కూరగాయ లమ్ముతుంది. సొంత జీవితంతో రాజీ పడే
ప్రసక్తే లేదు. ఇలాగే లేచిపోయిన మొదటి హీరోయిన్ గా త్రిషారా కి ప్రియుడితో
లేచిపోయి సొంత జీవితం చూసుకోవడమే ముఖ్యం. ఇలా ఈ పల్లెటూరి స్త్రీ పాత్రలు ఒక
వ్యక్తిత్వంతో కన్పిస్తాయి.
కథ రాసిన ముసలి తాతగా ముని
వెంకటప్పకి మాటలుండవు. షూటింగు ఎలా
జరుగుతోందో గమనిస్తూ వుంటాడు. ఈ తాత క్యారక్టర్ తీరు కన్నడ ‘తిధి’ లో తాత క్యారక్టర్ లా వుంటుంది. కథ వేరు. తాత
రాసిన ప్రేమ కథ పేరు ‘తాత రాసిన టైటానిక్’ అని చివర్లో రివీల్ చేయడం బావుంది. దీన్నే సినిమా టైటిల్ గా పెట్టి
వుండాల్సింది.
ఆటో డ్రైవర్ గా, సినిమా దర్శకుడుగా వీరబాబుగా వికాస్ వశిష్టది పూర్తిగా అమాయకత్వంతో కూడిన
పాత్రే, నటనే. ఎంత బాగా పాత్రలో లీనమైపోయినా ఆ అమాయకత్వం
ఒప్పించేలా వుండదు. ఇలా సినిమా తీసి కోట్లు గడించాలన్న అన్ రియలిస్టిక్ గోల్ ని
వూళ్ళో అందరూ నమ్మడం ఇంకో ఇబ్బంది పెట్టే విషయం. ఆ కోట్ల డబ్బుతో(!) వూళ్ళో రోడ్డు, కరెంటు, నీటి సౌకర్యాలు కల్పించాలన్న కలలు మరీ
చోద్యంగా వుంటాయి.
అతడి నైతిక విలువలు కూడా
ప్రశ్నార్ధకమే. ఎక్కడో ఒకరిద్దరు ఆటో డ్రైవర్లు దుర్బుద్ధితో వుంటారేమో గానీ, సర్వసాధారణంగా తమ ఆటోలో ప్రయాణికులు మర్చిపోయిన వస్తువుల్ని వీలుంటే
వాళ్ళకి అందించే ప్రయత్నం చేయడమో, లేకపోతే పోలీసులకి
అప్పజెప్పడమో చేస్తారు. వీర బాబు ఇవేమీ చెయ్యక, దాన్ని
అమ్మేసి ఆటో మీద అప్పు తీర్చేయాలనుకుంటాడు. తర్వాత దాంతో సినిమా తీసి కోట్లు గడించాలనుకుంటాడు.
ఆ కెమెరాలో దాని ఓనర్ సింధు తాలూకు వీడియోల్లో ఆమె కన్పిస్తున్నా గుర్తు పట్టనట్టే
వుంటాడు. చివరికి ఆమె వెతుక్కుంటూ వచ్చాక సారీ కూడా చెప్పడు. ఇలా ఈ ప్రధాన పాత్ర చిత్రణ
విలువలు లేకుండా దుర్బుద్ధితో కన్పిస్తుంది.
హీరోగా రాగ్ మయూర్ ఫన్నీగా
నటించాడు. కెమెరామాన్ గా సందీప్ వారణాసి ఒక్క బండి కాడె మీద కూర్చుని క్రేన్ షాట్
తీయడం తప్ప, వేరే స్కిల్స్ కెమెరాతో ప్రదర్శించడు.
అసిస్టెంట్ గా బాలనటుడు రాంచరణ్ ఎంట్రీ ఫన్నీ.
శిరీష్, ప్రవీణ్ రెడ్డి ల సంగీతంలో వ్యంగ్యంగా చేసిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్
బావున్నాయి. అపూర్వ సాలిగ్రాం, సాగర్ ల ఛాయాగ్రహణం
సహజత్వంతో కూడుకుని వుంది. కమర్షియల్ సినిమాల్లో చూపించని అసలైన గ్రామీణులు, వాళ్ళ జీవితాలూ ఎలా వుంటాయో ‘కేరాఫ్
కంచర పాలెం’, ‘కంబాలపల్లి కథలు’, ఇప్పుడు ‘సినిమా బండి’ తెర
కెక్కించడం మంచి పరిణామమే.
***
ముందుగా చెప్పుకున్నట్టు ఈ కథ సెల్ ఫోన్లు
లేని కాలంలో నైతే వీడియో కెమెరాతో సినిమా తీసే ఆలోచనకి అద్భుతంగా వుండేది. సెల్
ఫోన్లు వచ్చాక ఎవరుపడితే వాళ్ళు షార్ట్ ఫిలిమ్సే తీసేస్తున్నాక, సినిమాకున్న గ్లామర్ పలచ బడ్డాక, ఈ కాలంలో
వీడియో కెమెరా అద్భుతమని సినిమా తీయాలనుకోవడంలో సమకాలీనత లేదు. ‘కంబాలపల్లి కథలు’ లో కంప్యూటర్ తో 2005 నాటి పీరియడ్ కథగా తీసినప్పుడు దానికి కాలీన స్పృహ
వుంది. అప్పుడప్పుడే గ్రామాల్లోకి కంప్యూటర్లు, ఇంటర్నెట్ లు
వస్తున్నాయి కాబట్టి ఆ క్రేజ్ పాత్రల్లో కనిపించడంలో సహజత్వముంది. ‘సినిమా బండి’ లో పాత్రలకి వీడియో కెమెరాతో ఈ కాలంలో
అంత వండర్ అనుకోవడం కాన్సెప్ట్ కి వైరల్ ఐడియా మాత్రం కాదు. ఒక పాసివ్ ఐడియా
మాత్రమే. వైరల్ ఐడియా కావాలంటే పైనే చెప్పుకున్నట్టు, ఈ అమాయక
పాత్రలకి ఎవరో పారేసుకున్న ఆస్కార్ లెవెల్ స్క్రిప్టు దొరకడమే!
కోతికి కొబ్బరి కాయ దొరకాలి గానీ జామకాయ కాదు.
వీడియో కెమెరాతో సినిమా తీసి కోట్లు
సంపాదించి వూరుని బాగుచేయాలన్న హీరో గోల్ లో కూడా బలం,
వాస్తవికత లేవు. ఇది ‘కంబాలపల్లి కథలు’
లో రెండు కోట్ల ఫేక్ లాటరీతో కథలాంటి టెంప్లెట్ ఫార్ములా. జానర్ మర్యాద కాదు.
స్క్రీన్ ప్లే మాత్రం త్రీయాక్ట్స్ ప్రమాణాలతో
వుంది. ఫస్టాఫ్ లో మొదటి పావుగంటలో దొరికిన కెమెరాతో సినిమా తీయాలనుకునే గోల్ తో ప్లాట్
పాయింట్ వన్ వస్తుంది. సెకండావ్ చివర్లో అదే కెమెరా ధ్వంసమయ్యే ప్లాట్ పాయింట్ టూ వస్తుంది.
పరస్పర విరుద్ధంగా ఇవి మంచి డైనమిక్స్ తో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ని నిలబెట్టాయి.
ఇలాటి డైనమిక్సే హీరోయిన్ లేచిపోయి షూటింగు ఆగిపోవడం, తర్వాత
షూటింగులో హీరో ఎక్కిన రైలు భువనేశ్వర్ దాకా వెళ్లిపోవడం మొదలైనవి. గోల్ కి అవరోధాలు
కల్పించే ప్రత్యర్ధి పాత్ర లేకపోవడం షూటింగులోనే ఆటంకాలేర్పడ్డం మిడిల్ యాక్షన్ - రియాక్షన్
బిజినెస్ ని పోషించాయి. కథ హాస్యప్రధానంగా వున్నా, ఆటంకాలేర్పడ్డప్పుడు
ఈ హాస్య ధోరణి వుండదు. డబ్బు సంపాదించడం గోల్ కాబట్టి శాడ్ మూడ్ లోకి జారుకోవడం. ఇదంతా
సరైన కాన్సెప్ట్ లేకపోవడం వల్లే.
ఒక సరదాగానో, వ్యామోహంగానో, ఫాషన్ తోనో సినిమా తీయడం వరకే గోల్ గా కాన్సెప్ట్ వుండి వుంటే ఈ కథతో అంత
ఇబ్బంది వుండేది కాదు. సినిమాతో కోట్లు గడించి బాగుపడాలన్న గోల్ వల్ల కథ కామన్సెన్సుని, వాస్తవికతనీ, అమాయక పాత్రల ఇన్నోసెన్స్ నీ కోల్పోయింది.
భారతీయ సినిమా పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ గా 2009 లో తీసిన, ఆస్కార్ ఎంట్రీ సంపాదించిన, మరాఠీ క్లాసిక్ ‘హరిశ్చంద్రాచీ ఫ్యాక్టరీ’ లో ఫాల్కే పాత్రకి ఆర్ధిక ఇబ్బందులున్నా
సినిమా తీసి డబ్బు సంపాదించాలన్న కోరిక మాత్రం అస్సలు వుండదు. కేవలం తెర మీద బ్రిటిష్
వాళ్ళు వేసిన ‘సినిమా’ చూసి, ఆ కదిలే బొమ్మలకి వండరై పోయి, అలాటిది తనూ తీయాలని కేవలం
వ్యామోహం పెంచుకుంటాడు.
ఇంటిల్లిపాదీ ఆ సినిమా తీయడంలో పాలు
పంచుకుంటారు. చాలా హాస్య పాత్రలు, హాస్యమైన సన్నివేశాలు. కష్టాలు
కూడా హాస్యమే. ఎక్కడా శాడ్ మూడ్ వుండదు. దేశంలో మొట్ట మొదటి సినిమా తీయడానికది ఏ సౌకర్యాలూ లేని కాలం, నటులు కూడా దొరకని కాలం. అలాటి కాలంలో సినిమా పట్ల కేవలం - కేవలం వ్యామోహంతో
- సర్వం అమ్ముకుని, 1913 లో ‘రాజా హరిశ్చంద్ర’ తీసి చరితార్ధుడయ్యాడు దాదా ఫాల్కే. వీరబాబులో ఈ వ్యామోహం లోపించి స్వార్ధం
చోటు చేసుకోవడంతో మేకర్స్ తలపోసిన కాన్సెప్ట్ విఫలమైంది.
―సికిందర్