హీరోయిన్ తో లైట్ రోమాన్స్, ఓ రెండు సాంగ్స్ లో డాన్స్ ఓకే, కానీ
పాత్ర విషయంలోనే ఆ పవర్ లేదు. సెకండాఫ్ లోనైతే ఏ పవరూ లేక ఎటెటు వెళ్ళిపోయాడో తెలీదు.
అసలు ఇంటర్వెల్ లోనే ముగిసిపోయిన కథని అలా ముగించి శుభం వేసేస్తే పోయేదానికి
అనవసరంగా సెకండాఫ్ ని పట్టుకుని లాక్కుంటూ
పోయాడు. ఈ లాగుడు పోటీ ఒలింపిక్స్ లో పనిచేస్తుంది గానీ, బాక్సాఫీసులో సాగదీసిన
రబ్బరు లా ఎదురు తన్నుతుంది! ఈ ఖరీదైన, పానిండియా లెవెల్ రబ్బరు బ్యాండ్ సినిమా,
అతడి కెరీర్ లో ఓ పెద్ద బ్యాడ్ లక్ గా నమోదవక తప్పదు!
సెకండాఫ్ లో మిగతా నటీనటులందరూ కథా కథనాలు సహకరించని బాదితులే. మోహన్
బాబు అయితే మరీ విలనీ చాలించుకుని కూర్చున్నారు. సరైన పాత్ర లేక మోహన్ బాబు అలా
కూర్చుంటే నాని మాత్రం అయన మీద పోరాటం ఎలా చేయగలడు. కనుక పాసివ్- రియాక్టివ్
క్యారక్టర్ గా మారిపోయి ఏకపాత్రాభినయం చేశాడు.
హీరోయిన్ కయాదు లోహర్ మంచి ఎక్స్ ప్రెషన్స్ వున్న నటి. మంచి స్క్రీన్
ప్రెజెన్స్ వుంది. అయితే ఈమెని కూడా పాత్ర చిత్రణ దెబ్బ కొట్టింది. తండ్రి చేసిన
అప్పుల్ని తీర్చడానికి బీ గ్రేడ్ అడల్ట్ మూవీస్ లో నటించిన తను, ఆ అప్పు తీర్చే
బాధ్యత పూర్తయ్యాక ప్రాణాలు తీసుకుని పైలోకాల్లో తండ్రిని చేరుకోవాలని
ప్రయత్నిస్తుంది. ఇలా చేస్తే ఆ తండ్రి అప్పు తీర్చడానికి ఆమె చేసిన పనికి గర్విస్తాడనుకుందా,
అమాయకురాలు కాకపోతే?
నాని తల్లి పాత్రలో మమతా కులకర్ణి ఎక్సెలెంట్ గా కుదిరింది. మంచి
పాత్ర, బలమైన నటన. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆమె పాత్రకే పరాకాష్ట. అయితే ఇక్కడా ఇంకో తేడా వుంది. చిన్నప్పుడు కొడుకు జడల్ ఆమెని
వేశ్యగా నమ్మి ద్వేషించడం. ఎవడో ఒక దుర్మార్గుడు ఆమెని వేశ్య అంటే, మా అమ్మని అలా
అంటావాని ఎదురుతిరిగి కొట్టక, వాడి మాటలు నమ్మేసి తల్లిని ద్వేషించడం సిల్లీగా
వుంది. దీని మీదే మదర్ సెంటి మెంటు ఆధారపడి వుంటుంది. అర్ధం లేని పాయింటుతో మదర్
సెంటిమెంటు. ఇది వర్కౌట్ కాలేదు. ఇక విక్రం శికంజాగా రాఘవ్ జుయల్ బాగానే నటించాడు ఫస్టాఫ్ వరకూ వుండే చిన్న విలన్ పాత్రలో.
ఇదంతా
అలా వుంచి అసలు కెసిఆర్ పాత్రలో నటించిన ప్రియదర్శి ఒక ఆకర్షణ ఈ సినిమాకి. అలాగే సవారీ
తెగ పాత్రలో సంపూర్ణేష్ బాబు కనిపిస్తాడు.
రామ్-లక్ష్మణ్, రియల్ సతీష్ ల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు
చాలా వైలెంట్ గా వున్నాయి. తలలు ఎగిరిపోవడం, రక్తాలు పారడం వంటి అతి బీభత్స భయానక
దృశ్యాలు అడుగడుగునా దర్శన మిస్తాయి.
ఇక అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో లేని కథని పైకి లేపేందుకు చేయాల్సిన
కృషినంతా చేశాడు. ఫలితం సున్నా.
చివరికి 40 వ నిమిషంలో జైలు నుంచి తిరిగి వచ్చిన జడల్, విక్రం శికంజాని
టార్గెట్ చేస్తూ పాత పగ తీర్చుకోవడానికి
పోరాటం ప్రారంభిస్తూ అతడితో చాలెంజి చేసినప్పుడు, ప్లాట్ పాయింట్ వన్
వచ్చిందనుకుంటే, ఇది కాస్తా జడల్ మదర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పి, జడల్ అపార్దాన్ని
తొలగించాక, ఆ తర్వాత విక్రం శికంజా బారినుంచి ఆమెని కాపాడాక, రెండు జరిగాయి :
ఏదైతే సోకాల్డ్ మదర్ సెంటిమెంట్ అనే ఎమోషనల్ హై వుందో అది ముగిసిపోవడం, విక్ర్రం
శికంజాని చంపడంతో కథ కూడా ముగిసిపోవడం!
దీనితర్వాత ఇంటర్వెల్లోనే జడల్, శికంజా మాలిక్ మీద దండెత్తినప్పుడు,
తమ తెగ గుర్తింపు కోసం పోరాటం ప్రారంభిస్తానని చాలెంజి చేస్తాడు. దీంతో రెండు
ప్రశ్నలు: ఇంకా చాలెంజి దేనికి, ఆ ఊపులో మాలిక్ ని కాల్చి చంపేసి కథ ముగించెయ్యక? రెండోది, తన కొడుకుని చంపిన జడల్ చాలెంజికి
మాలిక్ దిక్కులు చూడడం దేనికి, జడల్ మదర్ ని చంపేసి కొత్త సమస్య సృష్టించక?
ఈ కథ సెకండాఫ్ కి మిగిలి వుండాలంటే, ఇంటర్వెల్లో జడల్ మదర్ అతడి
అపార్ధాన్ని తొలగిస్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్పకూడదు. మదర్ మీద అతడి ద్వేషం కొనసాగాలి.
ఈ నేపధ్యంలో మాలిక్ తన కొడుకుని చంపిన జడల్ మదర్ ని చంపేస్తే, సెకండాఫ్ కథకి జడల్
ఎదుట బిగ్ ఎమోషనల్ చాలెంజి ఏర్పడేది. ఏమిటా బిగ్ ఎమోషనల్ చాలెంజి? తను వేశ్య అని
నమ్మి ద్వేషిస్తున్న మదర్ ని మాలిక్ చంపేసినందుకు సంతోషించాలా, ఏడ్వాలా? కనీసం ఈ
ఎమోషనల్ కంటిన్యూటీ అయినా కాపాడేది సెకండాఫ్ ణి.
ఇదీ సెకండాఫ్ కి కథయినప్పుడు, సెకండాఫ్ సేఫ్ అయ్యేది. కానీ
ఇంటర్వెల్లోనే కథ ముగిసిపోయేట్టు చేశాక, నడపడానికి కథ లేక ఏమేమో చేసుకుంటూ పోయాడు
దర్శకుడు. ఇందులో మోహన్ బాబు క్యారక్టర్ పూర్తిగా డమ్మీ. కథ లేక, భావోద్వేగాలు
లేక, మితిమీరిన రక్తపాతం, హింసాత్మక యాక్షన్ సీన్లు- కథకి కాక, చేతిలో పడ్డ బిగ్
బడ్జెట్ కి న్యాయం చేయాలన్నట్టు సాగింది ధోరణి. ఇంకెన్ని జడలు పెంచుకున్నా జడంగా
వున్న కథకి జరంత జోష్ కూడా వచ్చే మోఖా లేదు!
-సికిందర్
