రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

1449 : రివ్యూ!

 ఈ స్థాయి బిగ్ బడ్జెట్ పానిండియా మూవీకి కొరవడింది కంటెంటే. దర్శకుడు కొరటాల శివ రైటింగ్ విభాగం ప్రొడక్షన్ విలువలతో పోటీ పడి వుండాల్సింది

రచన- దర్శకత్వం : కొరటాల శివ
తారాగణం : ఎన్టీఆర్, జాహ్నవీ కపూర్, సైఫలీ ఖాన్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం : ఆర్ రత్నం,ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు ; నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్
విడుదల ; సెప్టెంబర్ 27, 2024
***

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో దేవర పార్ట్ 1 ఈ రోజు అయిదు భాషల్లో పానిండియా మూవీగా రిలీజైంది. ఇందులో ఒక ప్రత్యేకాకర్షణ శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ హీరోయిన్ గా నటించడం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫలీ ఖాన్ విలన్ గా నటించడం. ఇలా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మెగా  మూవీ ఎలా వుందో చూద్దాం...

కథేమిటి?
1996 లో ఈ కథ సింగప్ప (ప్రకాష్ రాజ్) తనని కలిసిన పోలీసు అధికారులకి చెప్తాడు. 1980లలో ఇది ఆంధ్రప్రదేశ్- తమిళనాడు సరిహద్దుల్లో రత్నగిరి పర్వతాల్లో  ఎర్రసముద్రం కొండ మీద నాల్గు గ్రామాల కథ. ఇక్కడి ప్రజలు బ్రిటీష్ కాలంలో నౌకలు సంపద తరలించుకుపోకుండా చూస్తూ గొప్ప యోధులుగా పేరు తెచ్చుకుంటారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత తగిన గుర్తింపుకి నోచుకోక నౌకల్ని దోచుకునే పైరేట్స్ గా మారిపోతారు.
        
ఇక్కడ దేవర (ఎన్టీఆర్) ఒక గ్రామానికి అధిపతి అయితే, మరొక గ్రామానికి అధిపతి  భైర (సైఫలీ ఖాన్).  వీళ్ళిద్దరూ అక్రమ ఆయుధాల స్మగ్లర్ మురుగ (మురళీ కృష్ణ) కి  సాయపడుతూ వుంటారు. ఇతను విదేశాలనుంచి నౌకల ద్వారా స్మగ్లింగ్ చేస్తున్న ఆయుధాలని అపహరించి అందజేస్తూంటారు. అయితే ఈ ఆయుధాలని ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకున్న దేవర, ఈ వృత్తి మానేసి చేపలు పట్టి జీవనం సాగిద్దామంటాడు. దీనికి భైర ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ శత్రువులవుతారు.
        
ఈ శత్రుత్వం ఎక్కడికి దారి తీసింది? దేవరని అడ్డు తొలగించుకోవడానికి భైర ఏం చేశాడు? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన భైర లక్ష్యం ఏమిటి? ఇందులో దేవర కొడుగు వార ఎన్టీఆర్ పాత్ర ఏమిటి? ఇతడ్ని ప్రేమిస్తున్న తంగ జాహ్నవీ కపూర్ కోరిక నెరవేరిందా? ఇవీ ప్రశ్నలు. వీటితో మిగతా కథ.

ఎలా తెరకెక్కింది కథ?

సముద్రం బ్యాక్ డ్రాప్ లో పీరియెడ్ కథ ఇది. దీనికి భయం అనే కాన్సెప్ట్ చుట్టూ కథ. బ్రిటీష్ కాలంలో వీరులైన గ్రామస్తులు తర్వాత చోరులుగా మారిన యాక్షన్ కథ. అయితే పరివర్తన చెందే విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినప్పుడు చెలరేగే సంఘర్షణ ఒక హై కాన్సెప్ట్ మూవీ స్థాయిలో వుండకపోవడం కొట్టొచ్చే లోపం. పానిండియా లెవెల్లో హై కాన్సెప్ట్ మూవీ తీశారు గానీ, దానికి జోడించిన భయం అనే కాన్సెప్ట్ కి సరైన కథ చేయడం మీద దృష్టి పెట్టలేదు. దీంతో ఇది బ్రహ్మాండమైన యాక్షన్ దృశ్యాలతో విజువల్  హంగామాగా మారింది.  ఆయుధాల కోసం సముద్రం ఎక్కితే చంపేస్తానని ప్రత్యర్ధికి భయం పుట్టించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన దేవర- ప్రత్యర్ధికి కాకపోయినా అజ్ఞాతంలో కనీసం ప్రేక్షకులకి కనిపిస్తూ హడలెత్తించాల్సింది. ఇది జరగకపోవడంతో పాత్ర చిత్రణలు, భావోద్వేగాలూ పూర్తిగా కొరవడ్డాయి. భావోద్వేగాలు లేకపోవడంతో సినిమాలో గుర్తుండిపోయే క్లాసిక్ సీన్ అనేది ఒక్కటీ లేకుండా పోయింది.
        
ఇక సెకండాఫ్ లో వచ్చే ఎన్టీఆర్ కొడుకు వర పాత్ర ఏ లక్ష్యం లేకుండా పాసివ్ గా వుండడంతో, పైగా ప్రత్యర్ధి భైర చేతిలో పావుగా మారడంతో సెకండాఫ్ కథ పూర్తిగా బలహీనపడింది. దేవరకీ, భైరకీ  మధ్య కాన్ఫ్లిక్ట్ ప్రత్యక్షంగా లేకపోవడం, వర పాసివ్ గా వుండడం ఈ రెండూ భయం అనే కాన్సెప్ట్ ని క్యాన్సిల్ చేస్తే, ఇక ఇతర ఆకర్షణలు- యాక్షన్, సాంగ్స్, రోమాన్స్ వంటివి మాత్రమే ఈ సినిమా చూసేందుకు మిగిలాయి.
        
ఫస్టాఫ్ ఎర్ర సముద్రం చరిత్ర, నాలుగు గ్రామాల్లో ప్రజల జీవనం, దేవర- వర పాత్రల స్నేహం, నౌకల మీద వీరిద్దరి దోపిడీ దృశ్యాలు, ఆయుధ పూజకి సంబంధించిన పోరాటాలు, ఆ తర్వాత వృత్తి విషయంలో దేవర- బైరల మధ్య విభేదాలు, శతృత్వం, రక్తపాతం, దీంతో దేవర అజ్ఞాత వాసంలోకి వెళ్ళడం వరుసగా వస్తాయి.
        
సెకండాఫ్ లో తండ్రికి విరుద్ధంగా పిరికి పాత్రలో ఎన్టీఆర్ వరగా, ఎంట్రీ ఇవ్వడం. ఇతడిలో మగాడ్ని చూడాలని వేగిపోయే రసిక పాత్రలో జాహ్నవీ కపూర్ తో ఓ మూడు నాలుగు సన్నివేశాలు, ఓ పాట, దేవరని అజ్ఞాతంలోంచి రప్పించి చంపాలనే భైర ఎత్తుగడలు సాగుతూ క్లైమాక్స్ కి చేరుతుంది కథ. అయితే ముగింపు దేవర, భైర రెండు పాత్రలకీ బ్యాలెన్స్ వుంచి, భాహుబలి టైపులో రెండో భాగం కోసం ఎదురు చూడమన్నారు.

నటనలేమిటిసాంకేతికాలేమిటి?
రెండు పాత్రల్లో ఎన్టీఆర్ డైనమిక్ గా కనిపిస్తాడు. దేవర పాత్రలో సీరియస్ గా, వర పాత్రలో ఫన్నీగా వుంటాడు. అయితే గుండెని పట్టి పిండేసే నటన లేకపోవడానికి పాత్రల్లో ఎమోషన్లు పలకక పోవడం కారణం. మిగతా యాక్షన్, రోమాన్స్, సాంగ్స్ వంటి హంగుల్లో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తాడు.
        
శ్రీదేవి కుమార్తె జాహ్నవీ కపూర్ తెలుగులో ఎంట్రీ సెకండాఫ్ లో మాత్రమే మూడు నాల్గు సీన్లతో అడల్ట్ రోమాన్స్ తో తేలిపోయేలా వుంది. బాలీవుడ్ నటుడు సైఫలీ ఖాన్ పాత్ర, నటన అంతంత మాత్రం. ప్రత్యర్ధి ఎన్టీఆర్ అజ్ఞాతంలో వుంటే తను చేయడానికేముంది? హీరో విలన్లు ఎదురెదురుగా కొట్టుకోవాలి. ఈ సినిమా నార్మల్ కమర్షియల్ ఫార్ములాలకి భిన్నంగా వుంది. ఇది వర్కౌట్ కాలేదు.
        
ఇక ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో వంటి పెద్ద టాలెంట్స్ వున్నారుగానీ ఎవరికీ తగిన స్పేస్ లేదు. వీళ్ళు గాక ఇంకా చాలా మంది నటీ నటులున్నారు.
        
సినిమాలో ఎమోషన్స్ లేకపోయినా, సన్నివేశాలు మీరు చూసి తీరాల్సిందే అన్నట్టు అనిరుథ్ రవిచంద్రన్ బీజీఎంతో బాణీలు సృష్టించి అదరగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే పాటల దగ్గర వర్కౌట్ కాలేదు. ఆర్ రత్నం కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాబు సిరిల్ కల దర్శకత్వం హై క్వాలిటీతో వున్నాయి. యాక్షన్ దృశ్యాలు, నృత్యాలు మంచి ప్రొడక్షన్ విలువలతో వున్నాయి.
        
ఈ స్థాయి బిగ్ బడ్జెట్ పానిండియా మూవీకి కొరవడింది కంటెంటే. దర్శకుడు కొరటాల శివ రైటింగ్ విభాగం ప్రొడక్షన్ విలువలతో పోటీ పడి వుండాల్సింది.

--సికిందర్