రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, సెప్టెంబర్ 2024, శనివారం

1448 : రివ్యూ!

ఈ కథ హత్యల  గురించి కథ కాక, ఈ  రెండు పాత్రల జీవితాల గురించి కథ అయి వుంటే పూర్తి స్థాయి క్రైమ్ కామెడీగా అలరించేది.
రచన- దర్శకత్వం : రీతేష్ రాణా
తారాగణం : శ్రీ సింహా కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, సునీల్, ఫరియా అబ్దుల్లా, రోహిణి తదితరులు
ఛాయాగ్రహణం : సురేష్ సారంగం,  ఎఢిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం : కాల భైరవ బ్యానర్: కాల భైరవ, నిర్మాతలు : చిరంజీవి (మైత్రీ చెర్రీ), హేమలత
మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్
***

        స్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నేటి తెలుగు సినిమా ట్రెండ్ గా సాగుతోంది. ఈ ట్రెండ్ లో వారం వారం ఇవి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో నిలబడేవి అతి కొన్నే. ఇలా తీస్తున్నవే క్రైమ్ కామెడీలు లేదా సస్పెన్స్ థ్రిల్లర్లు అని పొరబడి కనుమరుగయ్యేవి ఎన్నో. డబ్బు చుట్టూ లేదా హత్య చుట్టూ సాగే ఈ సినిమాలు చాలా వరకూ రొటీన్ గానే వుంటాయి. వీటికి కొత్త సబ్ జానర్లు కనిపెట్టలేక అవే లేజీగా తీస్తూ పోతున్నారు. ప్రస్తుతం ఇంగ్లీషు సాహిత్యంలో కొత్త సబ్ జానర్ యాంటీ డిటెక్టివ్ కథలు. ఎవిరీ ఒన్ ఇన్ మై ఫ్యామిలీ కిల్డ్ సమ్ ఒన్’, గ్యాంగ్ ఆఫ్ లవర్స్ వంటి నవలలు ఈ సబ్ జానర్ లో పాపులర్ అయ్యాయి. యాంటీ డిటెక్టివ్ సబ్ జానర్ లో డిటెక్టివ్ కథల సాంప్రదాయాల్ని తారుమారు చేసి చూపిస్తారు. ఒక విధంగా ఇవి  ఫన్ పుట్టించేవిగా కూడా వుంటాయి.

    2019లో తెలుగులో మత్తు వదలరా అనే క్రైమ్ కామెడీ వచ్చి  హిట్టయ్యింది. ఇది హత్య చుట్టూ సాగే తెలుగు మార్కు పక్కా క్రైమ్ కామెడీ జానరే. అలాగే దీనికి సీక్వెల్ గా ప్రస్తుతం విడుదలైన మత్తు వదలరా 2 కూడా క్రైమ్ కామెడీ అంటూ పొరబడి తీశారు. ఇది తేడా కొట్టింది. తేడా కొడితే సినిమా రిస్కులో పడుతుంది. జానర్ మర్యాదలకి కట్టుబడక ఫ్లాపయిన తెలుగు సినిమాలెన్నో వున్నాయి. అలాటి రిస్కులో పడింది మత్తు వదలరా 2 కూడా. ఆ తేడా ఏమిటో తెలుసుకుందాం...

కథేమిటి?
     మత్తు వదలరా లోని డెలివరీ బాయ్స్  బాబూ మోహన్  (శ్రీ సింహా), యేసు దాసు  (సత్య) ఇప్పుడు డబ్బు సంపాదన లేని ఆ జాబ్స్ వదిలేసి హై ఎమెర్జెన్సీ టీం (హీ టీం) లో స్పెషల్ ఏజెంట్స్  గా చేరతారు. ఇక్కడ కిడ్నాప్ కేసులు విజయవంతంగా సాల్వ్ చేస్తూ, పనిలో పనిగా చేతి వాటం చూపిస్తూ వుంటారు. అంటే కిడ్నాప్ లో ఇన్వాల్వ్ అయిన డబ్బులో కొంత కొట్టేస్తూ వుంటారు. డబ్బు కాదు బందీ ప్రాణాలు ముఖ్యమనే హీ టీం చీఫ్ (రోహిణి) మాటలు అవకాశంగా తీసుకుని చెలరేగుతారు. ఈ టీంలో సీనియర్ ఏజెంట్ గా నిధి (ఫరియా అబ్దుల్లా), ఆపరేషన్స్ హెడ్ గా మైకేల్ (సునీల్) వుంటారు.

అయితే ఇక్కడ కూడా చిల్లర మొత్తాలతో తృప్తి పడక పెద్ద మొత్తం లో డబ్బు కొట్టేసి సెటిలై పోవాలని ఆలోచిస్తారు బాబు, యేసులు. దీనికి తగ్గట్టుగానే ఒక రిచ్ లేడీ (ఝాన్సీ) నుంచి కిడ్నాప్ కేసు వస్తుంది. ఈమె కూతురు రియా కిడ్నాప్ కి గురయ్యింది. రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారు కిడ్నాపర్స్. హీ టీం కి తెలియకుండా ఈ కేసు చేపట్టి ఆ రెండు కోట్లూ కొట్టేయలని ప్లాను వేస్తారు. అయితే కిడ్నాపయిన రియా శవ రూపంలో మీద పడడంతో  హత్య కేసులో ఇరుక్కుపోతారు.
        
ఎవరీ హత్య కేసులో ఇరికించారు? ఈ హత్యే కాదు, మరో హత్య కూడా ఎవరు చేశారు? వీటితో సినీ స్టార్ రవితేజ (వెన్నెల కిషోర్), తజస్వి తోట (అజయ్) అనే మరో వ్యక్తికేం సంబంధం? అసలు అదృశ్య హస్తం ఎవరిది? ఇదెలా నిరూపించి ఈ హత్య కేసుల్ని బాబు, యేసులు సాల్వ్ చేసి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నారు? ఈ ప్రశ్నలకి సమాధానమే ఇక్కడ్నుంచీ సాగే మిగతా కథ.

ఎలా తెరకెక్కింది కథ

    ఇది పక్కా క్రైమ్ కామెడీ అనీ, ఇందులో కథ, లాజిక్ చూడొద్దనీ దర్శకుడి విన్నపం. దీనికెలాటి అభ్యంతరమూ వుండనవసరం లేదు. ఒక వీడియో టేప్ కోసం జరిగే అనగనగా ఒక రోజు క్రైమ్ కామెడీ లో కథ స్వల్పమే. ఈ స్వల్ప కథకి చేసిన కామెడీ కథనమే దాన్ని నిలబెట్టింది. అలాగే మత్తువదలరా 2 ఫస్టాఫ్ క్రైమ్ కామెడీ కథకి పూర్తి న్యాయమే  చేసింది. శ్రీ సింహా, సత్యల క్యారక్టరైజేషన్ తో ప్రతీ సన్నివేశం నవ్వించడం కోసమే చేసే యాక్షన్ అడ్వెంచర్స్ ఎంటర్ టైన్ చేస్తాయి. మొదటి అరగంట ఇద్దరూ హీ టీం లో కేసులు చేపట్టి డబ్బులు కొట్టేసే ట్రాకు రిపిటీషన్ గా అనిపిస్తున్నా- అరగంటలోనే కథలోకి వచ్చేసి రియా కిడ్నాప్ కేసుతో కథనాన్ని నిలబెట్టుకున్నారు. ఈ హత్యకేసులో తామే ఇరుక్కున్నలాంటి ఇంటర్వెల్ సీను పరమ రొటీనే. దీంతో సెకండాఫ్ కథ ఏమై వుంటుందో ఇక్కడే తెలిసిపోతుంది. ఈ హత్య కేసులోంచి బయటపడడమే సెకండాఫ్ కథ.
        
ఈ సెకాండాఫ్ కథతోనే వచ్చింది సమస్య. అకస్మాత్తుగా కథనం ఫస్టాఫ్ లోని కామెడీని వదిలేసి రకరకాల ఇన్వెస్టిగేషన్స్ తో, నేరంతో సంబంధమున్న బయటపడే రకరకాల పాత్రలు చెప్పే వాటి ఫ్లాష్ బ్యాకులతో సీరియస్ అయిపోతుంది. ఈ సీరియస్ నెస్ తో, హత్యల తాలూకు వివిధ వెర్షన్లతో, డీటెయిలింగ్స్ తో మెదడుకి  అతి భారమై పోతుంది కథ.  క్రైమ్ కామెడీ జనర్ మర్యాద పూర్తిగా తప్పి- సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోకి మారిపోవడమే  కొట్టిన తేడా. దీన్నే సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు.
        
ఇన్ని మలుపు తిరిగి చివరికి అసలు కిల్లర్ తెలిసేటప్పటికి షాక్ వేల్యూ కూడా మిస్సయ్యింది. సెకండాఫ్ ఇన్ని ఇన్వెస్టిగేషన్లు కాదు, కిల్లర్ తాలూకు ఒకే ఒక్క ఆధారం పట్టుకుని దాంతో ప్రాణాల మీదికి తెచ్చుకునే శ్రీ సింహా, సత్యాల కామెడీ పాత్రలతో నవ్వులు ఏడ్పులు చూపిస్తూ – దీనికంటే డెలివరీ బాయ్స్ జీవితమే బెటర్ అనుకునే స్థాయికి చేరుకునే ఫన్ సృష్టించి వుంటే సమస్య వుండేది కాదు. ఈ కథ హత్యల కథ గురించి కాక, ఈ పాత్రల జీవితాల గురించి కథ అయి వుంటే పూర్తి స్థాయి క్రైమ్ కామెడీగా అలరించేది.

నటనలేమిటి? సాంకేతికాలేమిటి?

    నిస్సందేహంగా ఇది కమెడియన్ సత్య మూవీ. అతను లేకపోతే ఈ మూవీ లేదు. సెకండాఫ్ అనే కీకారణ్యంలో అక్కడక్కడా అతను చేసే కామెడీయే వూరట. అతడి టైమింగ్, ఒన్ లైనర్లు, ట్రెండీ డైలాగులు; అతడి బాడీ లాంగ్వేజి, ఎక్స్ ప్రెషన్స్ ఈ పాత్రతో అతడి కమెడియన్ కెరీర్ ని ఎక్కడికో తీసికెళ్లిపోయాయి. సత్య కోసం ఈ సినిమా చూడాలి.
        
అలాగే హీరో శ్రీ సింహా పాత్రకి తగ్గ నటనతో మరోసారి నిలబడ్డాడు. పాత్రలో స్పీడు, కొన్ని యాక్షన్ సీన్లు కలిసి వచ్చాయి. ఈ కథలో ఎమోషన్లకి స్థానం లేదు కాబట్టి పాత్ర కాస్త ఫ్లాట్ గానూ కనబడుతుంది. ఈ కథ ఈ రెండు పాత్రల గురించి కథ అయివుంటే ఈ లోపం తీరిపోయేది.
        
ఫరియా అబ్దుల్లాది పూర్తిగా యాక్షన్ పాత్ర. రోమాన్సుకి, యూత్ అప్పీల్ కీ పెద్దగా స్థానం లేదు. అలాగే హీ టీం చీఫ్ గా రోహిణీ పెద్దగా రాణించలేదు. ఇంకో హెడ్ గా సునీల్ ది ఎక్కువ మాట్లాడని పూర్తిగా సీరియస్ పాత్ర. నెగెటివ్ పాత్రలో అజయ్ ఫర్వాలేదు. అయితే సినీస్టార్ గా వెన్నెల కిషోర్ మాత్రం సత్యాతో బాటు సినిమాని కాస్త నిలబెట్టేందుకు పనికొచ్చాడు. ఇది అతడికి వినూత్న పాత్ర, వినూత్న కామెడీ కూడా.
        
సాంకేతికాల విషయానికొస్తే దర్శకుడు రీతేష్ రాణా పాక్షికంగా ఫస్టాఫ్ తో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలో కథ చూడొద్దని చెప్తూనే, సెకండాఫ్ లో మెదడుకి బోలెడు పరీక్ష పెట్టె ఇన్వెస్టిగేవిటివ్ జానర్ కథలోకి వెళ్లిపోయాడు. పదేపదే మారిపోయే  ఆ క్లూలు, సాక్ష్యాలు కూడేసి విషయం తెలుసుకోవాలంటే ఇంటలిజెంట్ ప్రేక్షకులై వుండాలి. ఇది ఇలాటి ఇంటలిజెంట్ కథనాన్ని డిమాండ్ చేసే కథ కాదు. కథతో అవసరం లేని టాలెంట్ తో నష్టమే జరుగుతుంది.
        
పోతే ఇంకో ఇద్దరు హీరోలున్నారు. కెమెరా మాన్ సురేష్ సారంగం, సంగీత దర్శకుడు కాలభైరవ. ఇద్దరూ తేలిపోయే సన్నివేశాల్ని కూడా తమ ప్రభితతో నిలబెట్టారు. అలాగే దర్శకుడి ట్రెండీ టేకింగ్  కి తగ్గట్టు కార్తీకా శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా వుంది.
        
మొత్తానికి ఈ మూవీ సత్య మాస్ కామెడీ చేష్టల గురించి, మరికాస్త వెన్నెల కిషోర్ ట్రెండీ కామెడీ గురించీ చూస్తే సరిపోతుంది.

—సికిందర్