రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, January 31, 2026

1407 : రివ్యూ!


‘గాంధీ టాక్స్
రచన- దర్శకత్వం : కిషోర్ పాండురంగ్ బెలేకర్తారాగణం : విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావ్ హైదరీ, జరీనా వాహాబ్, మహేష్ మంజ్రేకర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు
సంగీతం : ఏఆర్ రెహ్మాన్, ఛాయాగ్రహణం : కరణ్ రావత్, కూర్పు: ఆశీష్ మాత్రేబ్యానర్స్ : జీ స్టూడియోస్, క్యూరియస్, మూవీమిల్నిర్మాతలు : ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్, గురుపాల్ సచ్చార్, మీరా చోప్రా, కిషోర్ పాండురంగ్ బెలేకర్

విడుదల : జనవరి 30, 2026
***

      కమర్షియల్ సినిమాల శబ్ద ప్రకంపనల మధ్య ఓ నిశ్శబ్ద చలనచిత్రం  సైలెంట్ గా విడుదల కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పైగా ఈ నిశ్సబ్ద అంటే మూకీ చలన చిత్రంతో తమిళ స్టార్లు విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, బాలీవుడ్ పాపులర్ హీరోయిన్ అదితీ రావ్ హైదరీలు నటించడంతో ఆకర్షణకి ఆసక్తి తోడయ్యింది. పైగా ఈ మూవీ తీయడానికి మరాఠీ దర్శకుడు కిషోర్ పాండురంగ్ బెలేకర్ 23 ఏళ్ళ పాటూ మెరుగులు దిద్దుతూ గడపడం,  చివరికి 2023 లో నిర్మాణం పూర్తి చేసి గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించడం, ఇప్పుడు ట్రైలర్ లతో ప్రేక్షకుల్ని సంసిద్ధంజేసి, థియేట్రికల్ రిలీజ్ కి తీసుకురావడం, ఆ ప్రేక్షకులు ఎగబడి చూసెయ్యడం, అన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోతున్నాయి. ఒక ఆర్ట్ హౌస్ సినిమా ఆడాలంటే బిగ్ నేమ్సే శరణ్యమని, పై స్టార్లకి తోడూ సంగీతంతో ఏఆర్ రెహ్మానూ వచ్చి చేరడంతో సర్కిల్ పూర్తయ్యింది. ఇక మిగిలింది సరుకు ఎలా వుందనేది. అది ఈ కింద పరిశీలిద్దాం...
కథేమిటి?

    ఓ ముంబాయి నాలుగిళ్ళ చావిడిలో మహదేవ్ (విజయ్ సేతుపతి) కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న నిరుద్యోగి. ఉద్యోగ ప్రయత్నాల్లో అన్ని చోట్లా విఫలమవుతాడు. తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో అనారోగ్యంతో వున్న తల్లిని చూసుకుంటూ క్రమంగా పేదరికానికి అలవాటు పడిపోతాడు. కిరోసిన్ స్టవ్ మీద కొవ్వొత్తి వెలిగించి గిన్నెలో ఆహారాన్ని వేడి చేసే కళని ఔపోసన పడతాడు. జేబులో 10 రూపాయల నోటు పట్టుకుని టికెట్ లేకుండా బస్సులో ప్రయాణించే  నేర్పుని సాధిస్తాడు. పొరుగువాడు ఎటో చూస్తూ తింటూంటే అతడి ప్లేటు లోంచి స్నాక్స్ లాగేసి మింగెయ్యడం వెన్నతో పెట్టిన విద్యగా సొంతం చేసుకుంటాడు. పేదరికం ఎన్ని కళలు నేర్పుతుందో అన్నిట్లో ఫస్టు వస్తాడు- ఒక్క లంచం తీసుకునే కళ తప్ప.
       
తనకి ఉద్యోగం రావాలంటే 50 వేలు లంచం డబ్బులు కావాలి. ఆ డబ్బు లేనందు వల్లా, వ్యవస్థలో అవినీతి కారణంగా, సమాజం మీద ద్వేషం పెరిగినప్పటికీ, ఆదర్శప్రాయమైన నిరుపేద జీవితం గడపడం మాత్రం మానడు. ఇది కూడా ఒక లైఫ్ స్టయిలే.
       
పరమ 
రద్దీగా వుండే తన ఈ ముంబాయి ఇరుకు మకాంలో ఓ రోజు దోమల ఫాగింగ్ మెషిన్ నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ మేఘాల్లోంచి గాయత్రి (అదితి రావు హైదరి) అనే గందర్వ కన్యని చూస్తాడు. నిరుపేద జీవితానికి కూడా ఓ రోజుంటుంది. ఆదర్శంగా జీవించాలంతే. దాని డివిడెండ్స్ దాని కుంటాయి. ఇలా పేదరికం పండి పాకాన పడి గందర్వ కన్యలా గాయత్రీ నడిచి రావడంతో, రోమాంటిక్స్ తో జీవితం కలర్ఫుల్ గా కూడా మారిపోతుంది...ఇక ఎదురు బాల్కనీలోకి వస్తూ వుండే ఆమెతో సంజ్ఞల సైలెంట్ లవ్ కి శంఖు స్థాపన చేసేస్తాడు.
       
ఇలాటి మహదేవ్ కి ఓ బోస్మన్ (అరవింద్ స్వామి) ఎదురవుతాడు. ఇతను సూపర్ రిచ్. రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి అధిపతి. అయితే హంగూ ఆర్భాటాలతో విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాడు కాస్తా రోడ్డున పడతాడు. రాజకీయ నాయకుల మోసం, ఓ మీడియా సంస్థ  దుష్ప్రచారం అతడి వ్యాపార సామ్రాజ్యాన్నికూల్చేస్తాయి. ఇప్పుడు డబ్బు కావాలి. మహదేవ్ కి కూడా 50 వేలు కావాలి. గాయత్రికి కూడా డబ్బు అవసరం. ఆ డబ్బు సంపాదించడం కోసం ముగ్గురూ కలిసి  చేసిన ఆలోచనేమిటనేది. మధ్యలో ఓ దొంగోడు దూరి ఏం చేశాడనేది మిగతా హాస్య కథ.
ఎలావుంది కథ?

    డబ్బువల్ల మనుషుల జీవితాలెలా ప్రభావిత మవుతాయనేది, నైతిక విలువలు ఎలా పతన మవుతాయనేది చెప్పే కథ. సీరియస్ గా కాదు, కామెడీగా. మాటలతో కాదు, మూకీగా. ఎప్పుడో 1987 లో కమల్ హాసన్ తో సింగీతం శ్రీనివాసరావు తీసిన ‘పుష్పక విమానం’ తర్వాత మరో మూకీ రావడం ఇదే. కథలు రెండూ వేర్వేరు. కానీ రెండూ కామెడీలే. దీనికి ‘గాంధీ టాక్స్’ అని టైటిల్. గాంధీని కరెన్సీ నోట్ల మీద, పారిశుధ్య ప్రచార సామాగ్రి మీదా ముద్రించి మర్చిపోతున్నామనీ, ఆయన ఆదర్శాల పాలన పట్టడం లేదనీ, ఆ గాంధీ ఆత్మ ఏం మాట్లాడుతోందో వినాలనీ – పాత విషయాన్నే దృశ్యాల్లో చూపిస్తూ సాగే కథ.

ఈ రోజు గాంధీ హత్యకి గురైన రోజు. ఇవి గాంధీని ద్వేషిస్తున్న రోజులు కూడా. ఈ వర్ధంతి రోజు కూడా సోషల్ మీడియాలో అసభ్య భాషలో గాంధీని తిడుతూ పోస్టులు. ఇలాటి వాతావరణంలో గాంధీ ఆదర్శాలతో సినిమా తీస్తూ ఇంకో సాహసం చేశాడు దర్శకుడు. మొదటి సాహసం మూకీ తీయడం. ఈ మూకీలో నటించేందుకు విజయ్ సేతుపతి, అరవింద్  స్వామి, అదితీ రావ్ హైదరీ చేసింది కూడా సాహసమే. అయితే ‘లగేరహో మున్నాభాయ్’ లో గాంధీని కూడా పాత్రగా చూపిస్తూ చెప్పిన కథతో పోల్చితే ఇక్కడ అంత సృజనాత్మకత కనిపించదు. పైగా కథలో కొత్తదనమేమీ లేదు. డబ్బుకోసం దొంగ ఐడియాలేసే కథలతో సినిమాలు ఎప్పుడూ వస్తూనే వుంటాయి.
ఎవరెలా చేశారు?

       విజయ్ సేతుపతి కామిక్ సెన్స్ గల పేదవాడి పాత్రని ఎక్కువ శ్రమ పడకుండా తేలికగా నటించాడు. అతన్తో పోటీపడి అదితీ, అరవింద్ నటించారు. నటించడానికి ముఖభావాలే తప్ప మాటల తోడ్పాటు లేదు గనుక భావప్రకటనల్ని బాగా రిహార్సల్స్ చేసి నటించినట్టున్నారు. విజయ్ సేతుపతి తన సహజ ప్రతిభతో ఒక మూకీలో నటిస్తున్నానన్న ఫీలింగ్ లేకుండా నటించి సన్నివేశాలకి సహజత్వం తీసుకొచ్చాడు. పాత్ర జీవితం విషాదకరంగా వుంటూనే, ఆ క్షణాల్నుంచి బయటికి  వచ్చే కామెడీతో/డైనమిక్స్ తో కలిసి వుంటుంది. దీనికి అతడి టైమింగ్ కి, నటనకీ సంగీతం పెద్ద ఎత్తున సహాయపదినది. ఇక ఒక విచిత్రమైన, చిన్న దొంగ పాత్రతో సిద్ధార్థ్ జాదవ్ చేసే కామెడీ సినిమాకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇతర పాత్రల్లో జరీనా వాహాబ్, మహేష్ మంజ్రేకర్ ల మూకాభినయాలు కూడా ఎన్నదగ్గవే.

సాంకేతికాల సంగతి?

    అసలు పాత్రలు మాట్లాడాల్సిన అవసరం లేకుండా చూసుకోవడానికి దర్శకుడు  ఎక్కువ కష్టపడ్డాడు. కొన్నిసార్లు సంభాషణలు లేకుండా ఏదైనా చెప్పడానికి చాలా  ఇబ్బంది పడ్డాడు. దీంతో టెక్స్ట్ సందేశాల క్లోజప్ షాట్లతో, నటుల్ని సంజ్ఞా భాషలోకి దింపడాలతో రాజీపడక తప్పలేదు. అయితే తాను నమ్మిన మూకీ మేకింగ్ కి కట్టుబడి వుంటూ, దాన్ని చాలావరకూ సమర్థవంతంగా నిర్వహించ గలిగినందుకు ప్రశంసార్హుడే. 

థనాన్ని నడిపించే టూల్స్ లో ఒక భాగం ఏఆర్ రెహ్మాన్ సంగీతం. ఇది దాదాపు సినిమా పూర్తి వ్యవధిని ఆక్రమించేసింది. చాలా సీన్స్ లో మాటల్లేని మౌనాన్ని సబ్ టెక్స్టు గా వదిలెయ్యక స్వరాలతో అర్ధం చెప్పే అనవసర ప్రయత్నం చేశాడు. కథనం అంతటా చిన్న చిన్న పాటలు కూడా వచ్చి పోతూంటాయి. కరణ్ రావత్ కెమెరా వర్క్ కూడా కథ చెప్పడంలో, నటుల భావోద్వేగ స్థితిని చిత్రించడంతో పెద్ద పాత్ర పోషించింది. దీనికి లైటింగ్ తో చెప్పిన భాష, అర్ధాలు మెచ్చదగ్గవే. ఇక స్టార్ మూవీ కాబట్టి ప్రొడక్షన్ విలువలూ ఉన్నతంగా వున్నాయి.

చివరికేమిటి?
కథ రొటీనే అయినా, దీన్ని పాతబడిన గాంధీయిజాన్ని జోడించి  చెప్పినా, బాగా  బాక్సాఫీసు అప్పీలుండే హాస్య రసాన్ని జోడించి  చెప్పడంతో, అదీ మాటల్లేని మూకీ అనుభవాన్ని ఈ తరం ప్రేక్షకులకి అందిస్తూ సాహసించి ముందుకు రావడంతో, తప్పకుండా దీన్ని చూడాల్సిన సినిమాగా లిస్టులో వేసుకోవచ్చు. మరీ కళాఖండం కాకపోయినా కాలక్షేపానికి లోటేమీ లేదు. కాకపోతే సెకండాఫ్ లో కాసేపు కథ కుంటుపడినందుకూ, కథ అక్కడక్కడే తిరుగుతున్నట్టు వున్నందుకూ దర్శకుణ్ణి క్షమించాలి.

సికిందర్