రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, జూన్ 2021, గురువారం

1043 : టిప్స్


          పేసింగ్ : పేసింగ్ (నడక) గురించి మాట్లాడేప్పుడు తెలుగు సినిమాల్లో వుంటున్న స్పీడుగా కదిలే సీన్ల పేసింగ్ దేనికి పనికొస్తోంది? గంటన్నరకి ఇంటర్వెల్ వరకూ కథలోకే వెళ్ళదు బిగినింగ్ ఉపోద్ఘాతం. బిగినింగ్ తో అంతసేపూ కాలహరణ చేయడం పేసింగ్ అన్పించుకుంటుందా? తెలుగు సినిమాలు ఆడే థియేటర్లలో ప్రేక్షకుల మొహాలు లైటింగ్ తో వెలిగిపోతూంటాయి. ఏమిటా అంటే స్మార్ట్ ఫోన్ల లైటింగ్. తెరమీద ఓపికని పరీక్షించే ఫస్టాఫ్ ని కట్ చేసి, సెకండాఫ్ చూసుకునే రిమోట్ లేదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తూంటారు. మేకర్లకి ఇదేం పట్టదు. ఫస్టాఫ్ బ్రహ్మాండంగా తీసి మెప్పించామనుకుంటారు. తీయడమే తప్ప థియేటర్లలో ఎవరి పరిస్థితేమిటో తొంగి చూడ్డం వుండదు.

        ఇంటలిజెంట్ :  కమర్షియల్ సినిమా అనే పదార్ధం- ఇంటలెక్చువల్ అనే పదం రెండూ ఒకే  ఒరలో ఇముడుతాయా? ఇంటలెక్చువల్స్  కమర్షియల్ సినిమాలు తీసెంత కింది స్థాయిలో వుండరు. వాళ్ళ సినిమాలు పై స్థాయికి చెందినవి. తలపండిన మేధావులు చూసేవి. కమర్షియల్ సినిమా అర్ధవంతంగా వుండాలంటే కేవలం అది ఇంటలిజెంట్ రైటింగ్ ని డిమాండ్ చేస్తుంది. ఇంటలిజెంట్ రైటింగ్ కి ఇంటలెక్చువల్  అయి తీరాల్సిన పని లేదు. ఏవేవో సినిమా పుస్తకాలు చదివేసి మెదడుని బాధ పెట్టుకోనవసరం లేదు. ఉన్న కమర్షియల్ సినిమా క్రాఫ్ట్ నీ, క్రియేటివిటీనీ కంటెంట్ పరంగా అర్ధవంతంగా ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళి స్థాపించగల స్థోమత వుంటే సరిపోతుంది. మయూరితో బాటు కంచెఇలాటి ఇంటలిజెంట్ రైటింగ్స్ తో విజయవంతమైన కమర్షియల్ సినిమాలు. ఇంటలిజెంట్ అయివుంటే చాలు, ఇంటలెక్చువల్ అవనవసరంలేదు కమర్షియల్ సినిమాలకి. 

        సీక్వెన్స్ :  కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ళ నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో ఫిలిం రీళ్ళతో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు కథనాన్ని రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్ళే, ఎపిసోడ్లే తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ళ నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వెన్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే!

        క్లయిమాక్స్ :   స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్యా స్థాపనా జరిగిపోతే, చప్పున అరగంట- ముప్పావు గంట లోపు కథ పాయింటు కొచ్చేసే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షనాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్ళివెళ్ళి  ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి -  క్లయిమాక్స్ కొచ్చేస్తుంది కథ!  

        మిడిల్ : నిజంగా మిడిల్ ఓ కీకారణ్యం. ఎటు వైపు ప్రయాణించాలో తెలీదు. ఎప్పుడు? రూట్ మ్యాప్ లేనప్పుడు. దాంతో కంపార్ట్ మెంటలైజ్ చేసుకోనప్పుడు. ప్లాట్  పాయింట్- 1 ని గుర్తించకపోతే, లేదా ప్లాట్ పాయింట్ -1 ఎప్పుడో ఏర్పడిందన్న స్పృహ లేకపోతే, మిడిల్ నిజంగా కీకారణ్యంలాగే కన్పించి ఎటు వైపు వెళ్ళాలో తెలియకుండా చేస్తుంది. బెంగాల్ టైగర్లో సినిమా ప్రారంభమైన పదినిమిషాల్లోనే చక్కగా బిగినింగ్ ముగుస్తూ ప్లాట్ పాయింట్ -1 ఏర్పాటయితే, పెళ్ళి చూపులప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఫేమస్ కాదని హీరోని తిరస్కరించడంతో హీరోకి గోల్ ఏర్పడి మిడిల్ సంఘర్షణ ప్రారంభమైతే, ఇది గుర్తించకుండా ఇంటర్వెల్లో వచ్చిన టర్నింగే  కథకి మలుపు అనుకుని, వేరే పగాప్రతీకారాల కథ ఎత్తుకున్నారు. సైజ్ జీరోఇంటర్వెల్ దగ్గర ఆలస్యంగా ప్లాట్ పాయింట్ -1 ఏర్పడి బరువు తగ్గాలని నిశ్చయించుకున్న హీరోయిన్ నిఇంటర్వెల్ తర్వాత ఆ సమస్యతో సంఘర్షించక, బోగస్ హెల్త్ సెంటర్ మీద పోరాటానికి ఒడిగట్టే హీరోయిన్ గా మార్చేశారు. మిడిల్ తో ఇంత కన్ఫ్యూజన్ అన్నమాట! అదీ పెద్ద బడ్జెట్ సినిమాలకి.

సినాప్సిస్ :  సినాప్సిస్ అంటే కథా సంగ్రహం లేదా క్లుప్తంగా కథ.  దీని రచనకి హాలీవుడ్ లో కొన్ని మార్గదర్శకాలున్నాయి. సినాప్సిస్ -4 సైజు పేజీల్లో వుండాలి. ఒక పేజీకి మించి వుంటే డబుల్ స్పేస్ లో, ఒక పేజీ మాత్రమే  వుంటే సింగిల్ స్పేస్ లో టైపు చేయాల్సి వుంటుంది. లెఫ్ట్ ఎలైన్ మెంట్  వుండాలి. వర్డ్ డీ ఫాల్ట్ మార్జిన్స్ ని మార్చకూడదు. పేరాలో మొదటి లైను అర ఇంచు ఇండెంట్ వుండాలి. ఫాంట్  టైమ్స్ న్యూ రోమన్ 12 పాయింట్ ఉండాలి. పాత్రల పేర్లు మొదటిసారి  ప్రస్తావించినప్పుడు వాటిని కేపిటల్ లెటర్స్ లో ఉంచాలి. పేజీ నంబర్లు హెడర్ కుడివైపు వేయాలి. సినాప్సిస్ అని టైటిల్ కింద డబుల్ స్పేస్ ఇచ్చి టైప్ చేయాలి. దీనికింద నాల్గు స్పేస్ లిచ్చి సినాప్సిస్ ని టైప్ చేయాలి. ఇలా ఇంకా చాలా నిర్దుష్ట  సాంకేతికాంశాలతో ముడిపడి వుంటుంది వ్యవహారం. స్క్రీన్ ప్లే స్క్రిప్టుకి కూడా ఇలాటి మార్గదర్శకాలు అనేకం వుంటాయి. వీటిలో ఒక్కటి తప్పినా స్క్రీన్ ప్లేని, లేదా సినాప్సిస్ నీ అవెంత బాగున్నా మొదటే తిప్పికొట్టేస్తారు. వాటి సృష్టి కర్తని హీనంగా చూస్తారు. మనకెందుకిది, వదిలేద్దాం!

సికిందర్