రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, October 11, 2021

1062 : రివ్యూ


రచన- దర్శకత్వం :  నెల్సన్ దిలీప్ కుమార్
తారాగణం : శివ కార్తికేయన్
, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్, యోగిబాబు, మిలింద్ సోమన్, రెడిన్ కింగ్ స్లే, జారా వినీత్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
, ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కణ్ణన్
నిర్మాతలు : శివ కార్తికేయన్
, కోటపడి రాజేష్
బ్యానర్ : శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్
, కేజేఆర్ స్టూడియోస్
విడుదల అక్టోబర్ 9
, 2021

***

        మిళంలో డాక్టర్ అనే టైటిల్ తో ఈవారం విడుదలైన శివ కార్తికేయన్ మూవీ తెలుగులో వరుణ్ డాక్టర్ గా అనువాదమైంది. ఓ స్టార్ తో కమర్షియల్ సినిమాని డార్క్ కామెడీ క్రైమ్ గా తీయడం సాహసమే. నయన తారతో కూడా కొలమావు కోకి (కోకో కోకిల) అనే డార్క్ కామెడీ క్రైమ్ తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, శివ కార్తికేయన్ ని ఫ్యాన్స్ వూహలకి పూర్తి వ్యతిరేకంగా- నాన్ కమర్షియల్ గా ప్రెజెంట్ చేస్తూ, తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకున్నాడు పదిన్నర కోట్ల బంపర్ బాక్సాఫీసుతో.

        ముందున్న నిర్మాత తప్పుకోవడంతో శివ కార్తికేయనే భుజాన వేసుకుని నిర్మాతగా మారాడు. ఇదొక సాహసం. ఈ సాహసాలకి సోలో రిలీజ్ కూడా తోడై, సెక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ వారమంతా. దీని కథాకమామిషేమిటో చూద్దాం...

కథ

     వరుణ్ (శివ కార్తికేయన్) మిలిటరీ డాక్టర్. రూల్స్ తో కచ్చితంగా వుంటాడు. నవ్వడు. మాట్లాడడు. మొహం సీరియస్ గా పెట్టుకుని, దేనికీ చలించక, బెల్లం కొట్టిన రాయిలా వుంటాడు. పెళ్ళి చేసుకోడానికి వూరెళ్ళి పద్మిని (ప్రియాంకా అరుళ్  మోహన్) తో నిశ్చితార్ధం చేసుకుని తిరిగి వస్తాడు. వచ్చాక పెళ్ళి క్యాన్సిల్ చేస్తుందామె. మళ్ళీ ఆమె ఇంటికెళ్ళి కారణం అడుగుతాడు. నీలాటి ఎమోషన్లు లేని రోబో మొహంతో పెళ్ళి కుదరదని చెప్పేస్తుంది. ఇక ఏం చెయ్యాలా అని బయటి కెళ్ళి టీస్టాల్ దగ్గర కూర్చుంటే, ఆమె కుటుంబ సభ్యులు బయటికి వచ్చి గోల చేస్తూంటారు. స్కూలు కెళ్ళే పద్మిని చెల్లెలు చిన్నూ (జారా వినీత్) కిడ్నాపైందని గోల. పద్మిని సహా వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు వరుణ్ డాక్టర్. పోలీసులు కిడ్నాప్ ని లైట్ గా తీసుకునేసరికి, ఆ కుటుంబ సభ్యుల్నే టీముగా ఏర్పాటు చేసి, తానే ఒక ప్లానేస్తాడు చిన్నూని వెతకడానికి. ఇంతకీ చిన్నూ ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? టీముతో కలిసి ఆమెని కిడ్నాపర్ల చెర నుంచి ఎలా విడిపించాడు వరుణ్ డాక్టర్? ఇదీ మిగతా కథ.  

ఎలా వుంది కథ

    డార్క్ కామెడీ జానర్లో క్రైమ్ థ్రిల్లర్ ఇది. అవతలి వాడు బాధలో వుంటే, ఆ బాధ మీద జోకులేసి ఆనందించే శాడిజం డార్క్ కామెడీ లేదా బ్లాక్ కామెడీ. చావింటికెళ్ళి కూడా ఆ చావు మీద జోకులేయవచ్చు - చచ్చాడా? నేనొచ్చే వరకూ ఆగమన్నానే - అనడం లాంటిది. ఈ జానర్లో చేసిన సీరియస్ కిడ్నాపుల కథ ఇది. ఒక కిడ్నాప్ కామెడీ కావచ్చు, కానీ వందల మంది పిల్లల కిడ్నాపులతో హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడితే అది సీరియస్ వ్యవహారం. ఈ సీరియస్ వ్యవహారాన్ని బ్లాక్ కామెడీగా తీశాడు. నాని గ్యాంగ్ లీడర్ లో నాని ఫ్యామిలీని వెంట బెట్టుకుని అడ్వెంచర్ చేసినట్టు, ఇందులో శివ కార్తికేయన్ కూడా ఫ్యామిలీని టీముగా చేసుకుని అడ్వెంచర్ చేస్తాడు. ఈ రెండిటిలోనూ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహనే. ఈ పోలికలు కన్పిస్తాయి.

        కిడ్నాప్ తో వచ్చిన కథలు, హ్యూమన్ ట్రాఫికింగ్ తో వచ్చిన కథలు కొత్త కాదు. హ్యూమన్ ట్రాఫికింగ్ ని డార్క్ హ్యూమర్ జానర్లో చూపించడం కొత్త. అయితే ఈ కథ సగానికి వచ్చేసరికి ఆ కామెడీ కాస్తా కనుమరుగై పోతుంది. కన్నడ ఫ్రెంచి బిర్యానీ లోలాగా, పాత రొటీన్ మాఫియా కథనే కామెడీ చేసి, ఆద్యంతం ఇన్నోవేట్ చేసిన ఫన్ తో నిలబెట్టినట్టు, ఇక్కడ డార్క్ కామెడీని కొనసాగించి నిలబెట్టడం జరగలేదు. మొదటి సగానికే సరుకు అయిపోయింది. రెండో సగం కథ సీరియస్ గా మారిపోయి, కథ కూడా తేలిపోయి రొటీన్ గా ముగియడం, అయినా వేరే సినిమాల్లేక తమిళంలో హిట్టవడం దీని ప్రత్యేకతల్లో కెల్లా ప్రత్యేకతగా భాసిస్తోంది.

నటనలు -సాంకేతికాలు

    శివ కార్తికేయన్ ఈసారి ఫ్యాన్స్ కోసం తన బ్రాండ్ మాస్ నటన జోలికి పోకుండా, ఏ భావాలూ పలకని బండ రాయి లాటి మొహంతో, మరమనిషి బాడీ లాంగ్వేజీతో, లోలోన మాత్రం అన్ని విలువలూ దాచుకున్న డాక్టర్ సుగుణాలతో, మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయన్నట్టు, నవ్వితే నవరత్నాలు జారి పోతాయన్నట్టు- ఒక అర్ధం కాని  మానవాకారంలా వుంటాడు. ఇతణ్ణి చూసి మనం నవ్వడం తప్ప ఇతను నవ్వడు. ఇలా వుండడమే కామెడీ. ఇతడి వాలకం చూసి చూసి పెళ్ళి చూపుల్లో అడిగేస్తుంది పద్మిని, మీరెన్ని గంటలకి లేస్తారు?’ అని. ఫోర్ థర్టీ అంటాడు. ఏఁ? ఇంటింటికీ వెళ్ళి పాల పాకెట్లు వేస్తారా?’ అని డార్క్ కామెడీ వేసుకుంటుంది.  

        అస్సలు ఎంటర్ టైన్మెంటు జోలికి పోకుండా, గంటు మొహం పెట్టుకుని, యాక్షన్ చేసుకుంటూ పోయే ఇలాటి సింగిల్ ఎక్స్ ప్రెషన్ క్యారక్టరైజేషన్ని షూటింగ్ జరిగినన్నాళ్ళూ నిలుపుకోవడం కష్టమైన పనే. ఈ రిస్కుకి శివ కార్తికేయన్ని ఒప్పుకోవాలి. సెకండాఫ్ లో కథ కుంగినా, ఈ క్యారక్టరైజేషన్ కోసమే చూసేలా చేస్తాడు. కథ లేకపోయినా క్యారక్టరైనా కొత్తగా వుంటే బతికి బయట పడొచ్చు. ఎంటర్టైన్మెంట్, ఫైట్స్, సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా తమిళ అభిమానులు కిక్కురుమనక పోవడాన్ని బట్టి - ఇదొక కట్టి పడేసే క్యారక్టర్స్ మూవీగా ఎస్టాబ్లిష్ అవుతోంది. శివ కార్తికేయన్ ఈ క్యారక్టర్ ని నమ్మే నిర్మాతగా మారి వుంటాడు.

        హీరోయిన్ ప్రియాంకాకి పెద్దగా పాత్రేమీ లేదు. టీములో హీరోతోనే వున్నా, పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంది కాబట్టి రోమాన్స్ కూడా లేదు. మళ్ళీ అతడికి దగ్గరయ్యే సూచనలతో కథనం కూడా ఆమెకివ్వలేదు. సినిమాలో హీరో హీరోయిన్ల రోమాన్స్ లేని లోటు కూడా కన్పించదు. సెకండాఫ్ లో కిడ్నాప్స్ కథ తేలిపోయినా, రోమాన్స్ తో, సాంగ్స్ తో భర్తీ చేయాలనుకోలేదు.

        కమెడియన్ యోగిబాబు మరోసారి కామెడీని నిలబెట్టాడు. ఛోటా కిడ్నాపర్ పాత్ర వేశాడు. వరుణ్ డాక్టర్ తన కిడ్నీ తీసి దాచిపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నమ్మి అతడి వెంటే వుండే అమాయక పాత్ర. అలాగే కానిస్టేబుల్ గా, గొంతు చించుకుని మాట్లాడే కామెడీ పాత్రలో రెడిన్ కింగ్ స్లే బాగా నవ్విస్తాడు. పై అధికారితో కూడా అలాగే అరిచి మాట్లాడతాడు. ఎందుకలా అరుస్తావ్? భోం చేశావా?’ అంటాడు అధికారి. కిడ్నాప్ కంప్లెయింట్ ని లైట్ గా తీసుకుంటే, విసిగి వెళ్ళి పోతున్న హీరోయిన్ తండ్రిని చూసి, అమ్మాయి ఇక రాదని తెలుసుకుని ఇంకో బిడ్డని కంటానికి వెళ్తున్నాడు చూడు!’ అని డార్క్ కామెడీ చేస్తాడు కింగ్ స్లే. ఇతను, యోగిబాబు కథ చెదిరిన సెకండాఫ్ లో అక్కడక్కడా సైడ్ కామెడీతో నవ్విస్తూంటారు.  

        విలన్ గా వినయ్ రాయ్ బలహీన క్యారక్టర్. ఈ మధ్య సినిమాల్లో విలన్లు ఇలాగే వుంటున్నారు. ఇక ముందు రోజుల్లో విలన్లు కనపడరేమో. కల్నల్ గా మిలింద్ సోమన్ కన్పిస్తాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంలో మాంటేజీ సాంగ్స్ వచ్చి పోతూంటాయి. ఏ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజికల్ అని టైటిల్స్ ప్రారంభంలో ప్రత్యేకంగా వేశారు. విజయ్ కార్తీక్ కణ్ణన్ కెమెరా వర్క్ రిచ్ గా వుంది. ప్రొడక్షన్ విలువల కోసం బాగా ఖర్చు పెట్టారు. పాతిక కోట్ల బడ్జెట్ అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే మెట్రో ట్రైన్లో ఫైట్ ఎక్సైటింగ్ గా వుంది.

చివరికేమిటి

    ఫస్టాఫ్ వరకూ డార్క్ హ్యూమర్ తో కథ నడిపించగల్గిన దర్శకుడు సెకండాఫ్ లో చేతులెత్తేశాడు. డార్క్ హ్యూమర్ తో ఫస్టాఫ్ లో సీన్లు వినోదాన్నందిస్తాయి. సెకండాఫ్ లో కిడ్నాపైన కూతురు కోసం సీరియస్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా, బరువుగా  మార్చేయడంతో డార్క్ హ్యూమరంతా అదృశ్యమైపోయింది. సెకండాఫ్ కి శివ కార్తీకేయన్ క్యారక్టరొక్కటే దిక్కుగా తయారైంది. కానీ వొట్టి క్యారక్టర్ కోసం సినిమా చూడాలా, కథతో కూడిన క్యారక్టర్ కోసం సినిమా చూడాలా? తమిళంలో మొదటిదే పట్టుకుని తెగ చూసేస్తున్నారు. శివ కార్తికేయన్ అక్కడ పాపులర్ కాబట్టేమో.

        ఇంటర్వెల్లో అసలు పెద్ద సంఖ్యలో గోవా గ్యాంగ్ పిల్లల కిడ్నాప్ కి పాల్పడుతోందని తెలుసుకున్నాక, సెకండాఫ్ లో గోవాకి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యాక ఇంటర్వెల్ దగ్గర ఆపిన కథ వదిలేసి ఫ్యామిలీ డ్రామా మొదలెడతారు. ఫస్టాఫ్ ఫన్ అంతా మాయమై పోతుంది. అలాగని ఒక థ్రిల్లర్ గా ఫస్టాఫ్ తో బాటు, సెకండాఫ్ లో కూడా థ్రిల్ చేసే సన్నివేశాలేం వుండవు. కథలో మలుపులుండవు. టెన్షన్ వుండదు, సస్పెన్స్ వుండదు. ఎక్కడా లాజిక్ అనే మాటే వుండదు. ఇన్ని లేకుండా ఈ డార్క్ క్రైమ్ కామెడీని ఒక్క హీరో విభిన్న క్యారక్టర్నే చూసి ఆనందించాలంటే తెలుగు ప్రేక్షకులు సాహసించాల్సిందే. అప్పుడు ఈ ప్రాజెక్టుతో సాహసాలు చేసిన హీరో సరసన, దర్శకుడి సరసన, తెలుగు ప్రేక్షకులు కూడా సరేలెమ్మని టికెట్లు కొనుక్కుని చేరతారు. సాహసవంతులుగా నిరూపించుకుంటారు.

సికిందర్