రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, అక్టోబర్ 2021, శనివారం

1061 : రివ్యూ

దర్శకత్వం : బి గోపాల్
తారాగణం: గోపీచంద్
, నయన తార, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అభిమన్యూ సింగ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంత రావు  తదితరులు
కథ : వక్కంతం వంశీ
, మాటలు : అబ్బూరి రవి, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : బాలమురుగన్
బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా
నిర్మాత : తాండ్ర రమేష్
విడుదల : అక్టోబర్ 8
, 2021

***

        త నెల తాజా సీటీ మార్ తో వచ్చిన గోపీచంద్ ఈవారం పాత  ఆరడుగుల బుల్లెట్ తో వచ్చాడు. 2017 నుంచీ విడుదల కష్టాల్లో వున్న ఈ సినిమా ఇప్పుడు విడుదలైంది. ఇందులో నయన తార హీరోయిన్ గా నటించింది. మరో మూడు  పాత్రల్లో దివంగతులైన ఇద్దరు నటులు జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, గుండు హనుమంత రావు నటించారు. బ్రహ్మానందం కూడా తన బ్రాండ్ కామెడీతో నటించారు. బి. గోపాల్ దర్శకత్వం వహించారు.

         సినిమాని ఇప్పటి ప్రమాణాలతో కాక, టైమ్ ట్రావెల్ చేసి, 2012 లో చూస్తున్నట్టు చూడాలి. ఎందుకంటే ఇది 2012 లోనే ఓ తమిళ దర్శకుడితో ప్రారంభమై, అతను తప్పుకోవడంతో చాలాకాలం వాయిదా పడి, చివరికి బి. గోపాల్ దర్శకత్వంలో 2017 లో నిర్మాణం పూర్తయింది. కనుక 2017 లో పూర్తయినా 2012 ప్రమాణాలతోనే చూడాలి. మరి అప్పుడైనా ఇది పేలే బుల్లెట్టేనా అన్న ప్రశ్న వస్తుంది. మొత్తం కలిపి తొమ్మిదేళ్ళు ఈ బుల్లెట్ ప్రయాణించి బాక్సాఫీసు చేరింది. బాక్సాఫీసు వుందా, బద్దలైందా ఓసారి చూద్దాం...

కథ

    హైదరాబాద్ లో శివ (గోపీచంద్) చదువులేని, గొడవలు పెట్టుకునే  ఆవారా బ్యాఛీ. ఇతడికో ప్రభుత్వోగి అయిన మూర్తి (ప్రకాష్ రాజ్) తండ్రి. ఆవారాగా తిరిగినా కుటుంబ మంటే పంచ ప్రాణాలు శివకి. తండ్రికి సెంటిమెంట్లు లేవు. తిడుతూంటాడు. ఇలా కాదని ముంబాయిలో ఉద్యోగం వేయిస్తాడు. అక్కడ గొడవ పెట్టుకుని వచ్చేస్తాడు శివ. ఇప్పుడు తండ్రి విజయవాడలో వుంటాడు. మళ్ళీ ఇక్కడా ఆవారా బ్యాచీయే శివ. ఈసారి ఓ అమ్మాయి (నయన తార) తో ప్రేమలో కూడా పడతాడు. ఇక్కడ కాశీ (అభిమన్యూ సింగ్) అనే బడా రౌడీ బెజవాడ కింగ్ గా వుంటాడు. వీడు మూర్తి ఆస్తిని కబ్జా చేస్తాడు. శివకి ఒళ్ళు మండుతుంది. ఇక వీడి కబ్జా నుంచి ఆస్తిని విడిపించుకుని, తండ్రి చేత ఎలా శెభాష్ అన్పించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ

  మూడు వారాల క్రితమే సందీప్ కిషన్ నటించిన ఫ్రెష్ గల్లీ రౌడీ' యే ఔట్ డెటెడ్ కథతో వచ్చినప్పుడు, పురాతన కాలపు ఆరడుగుల బుల్లెట్ కథని ఇప్పుడు తప్పు పట్టడానికి లేదు. రెండూ బాక్సాఫీసుకి రొమ్ము విరిచే నిల్చున్నాయి. బాక్సాఫీసు ఫిరంగి ఎదురు మోతకి రివర్స్ లో వచ్చిన చోటుకి 1980 లోకి వెళ్ళిపోయాయి. మనిద్దరి ఆస్తిని విడిపించుకునే కథలు మరింకోసారి దండయాత్రలో ప్రయోగిద్దాంలే అని బుల్లెట్ ని ఓదారుస్తూ రౌడీ.   

      ఆరడుగుల బుల్లెట్ 2017 లో కాదు 2012 లో వచ్చినా ఇంతే. ఇలాటి ఆవారా హీరో కథలు 2008-10 నాటికే తనువు చాలించాయి. అయినా 1980-90 ల నాటి కథని 2012లో రుద్దే ధైర్యానికి మెచ్చుకోవాలి. అదీ ఇప్పుడు 2021 లో ఓటీటీలో విడుదల చెయ్యక థియేటర్ల మీద దండయాత్రకి వదలడం ఇంకా విచిత్రం - సరికొత్త మాస్ సినిమా సీటీమార్ నే మాస్ ప్రేక్షకులు కాదన్నాక!

      2012 లో గబ్బర్ సింగ్, దమ్ము, దరువు, జులాయి, రచ్చ, రెబల్ వంటి మాస్ సినిమాల మధ్య వచ్చినా ఫ్లాపయ్యేదే ఈ పాత కాలం కథతో. ఒక్కడున్నాడు, లక్ష్యం, ఒంటరి, శౌర్యం, శంఖం, గోలీమార్, వాంటెడ్ వంటి యాక్షన్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న గోపీచంద్ కి, ఈ మందుగుండు లేని బుల్లెట్ యెక్కడ దొరికిందో అర్ధం గాదు. టైటిల్ కి మాత్రం పేల్చి చూసుకుంటే బావుందన్పించి నట్టుంది- కథ పేలుతుందా లేదా అనవసరం. ఈ కథ పేలనందుకు బాధ కాదు, ఇంత మంచి కమర్షియల్ టైటిల్ ఇంకొకరు వాడుకోకుండా వృధా పోయిందే అన్నదే  చింతించాల్సిన విషయం.

నటనలు - సాంకేతికాలు 
  శివగా మాస్ పాత్రలో గోపీచంద్ ఇంత అంకితభావంతో లీనమైపోయి నటించడం చాలా గ్రేట్. అతను టాలెంటెడ్ నటుడే. బుల్లెట్ పేలడానికి తన వంతు కృషినంతా చేశాడు. దర్శకుడు, రచయిత నకిలీ బుల్లెట్ ఇచ్చారని తెలుసుకోలేక పోయాడు. డాన్సులూ ఫైట్లతో తను డైనమైట్లే పేల్చి వుండొచ్చు గాక, పక్కన కథని పేల్చడం దర్శకుడు, రచయిత మర్చిపోతే ఏం చేయగలడు.

నయన తారలాంటి స్టార్ హీరోయిన్ తో రోమాన్స్ కూడా పేలకుండా చేశారు. నయనతారని అదిరిపోయే గ్లామర్ తో మాత్రమే చూపిస్తే సరిపోతుందా? అసలు మాస్ సినిమా అంటేనే అన్ని హద్దులూ దాటేసి ఇష్టానుసారం కథని పేల్చడమే కదా? లాజిక్ ఎవడు అడుగుతాడు. లేనప్పుడు మాస్ సినిమా తీయడమెందుకు? విలన్ అభిమన్యూ సింగ్ ని కూడా పేలవంగా, పరమ వీక్ గా తయారు చేశారు. అతను వీకైతే అతడి తమ్ముడ్ని దించారు. తమ్ముడు కూడా వీక్ కి వీకున్నర.

        ఇక బ్రహ్మానందం బారెడు కామెడీ ట్రాక్. సెకండాఫ్ లో స్పేస్ ఫిల్లర్ గా అప్పట్లో బ్రహ్మానందం బకరా కామెడీ ట్రెండ్ నడిచింది. 2012 లో తయారు చేసుకున్న కథకి ఇదొక్కటే అప్పటి ట్రెండ్ ప్రకారం వుందని సంతోషించాలి.

        మణిశర్మ సంగీతంలో పాటలు ఇప్పుడు గుర్తుండి వుండవు. పాటలు అప్పటివి. మిగతా ప్రొడక్షన్ విలువలు తన జమానాలో అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి. గోపాల్ స్థాయిలోనే వున్నాయి. వీటి విషయంలో ఆయన తన ఇమేజికి లోటు రానివ్వలేదు. 2009 లో మస్కా తో తన శకం ముగిశాక, 2017 లో అప్డేట్ అవకుండా పాత స్టయిల్లోనే  దర్శకత్వం వహించడం మాత్రం బాగాలేదు.

చివరికేమిటి

   పరుచూరి బ్రదర్స్ రచనలతో అనేక విజయవంతమైన మాస్, యాక్షన్, ఫ్యాక్షన్ సినిమాలు తీస్తూ వుండిన బి. గోపాల్ కి సినిమా కథ అవసరాలేమిటో తెలియకుండా వుండదు. అయినా కొత్త తరం రచయిత రాసిన ఈ మిడిల్ మటాష్ కథని అంగీకరించడం ఆశ్చర్య పర్చే విషయం. కథతో సమస్య వల్లే మొదట్లో వున్న తమిళ దర్శకుడు వెళ్లిపోయాడు. గోపాల్ పరుచూరి బ్రదర్స్ ని ఎంటర్ చేయాల్సింది.

    ఈ కథ 2012 నాటికే కాలం చెల్లిన కథ అవచ్చు. కథనమైనా బావుండాలిగా? మిడిల్ మటాష్ కి బలి చేస్తే ఏ కథ బతుకుతుంది? పరుచూరి బ్రదర్స్ ఈ మిడిల్ మటాష్ ని త్రీయాక్ట్ స్ట్రక్చర్లో బతికించే వాళ్ళు. కోట్లు వ్యయం చేసే సినిమాకి మిడిల్ మటాష్ తో కథా? లక్షతో తీసినా క్షమించరాని నేరమే. ఇలా తీసిన సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. అయినా రచయితలు తెలుసుకుని మారకపోతే నేరస్థులే.  

        ఫస్టాఫ్ లో హీరో జీవం లేని కుటుంబ సీన్లు, ఆవారాతనం, హీరోయిన్ తో జీవం లేని లవ్ ట్రాక్, కామెడీ, ఇవన్నీ ఇంటర్వెల్ దగ్గర్లో విలన్ వచ్చేదాకా స్పేస్ ఫిల్లర్లుగా వుంటాయి. విలన్ వచ్చాక అందుకున్న కథ వాడికీ, హీరోకీ మధ్య సంఘర్షణగా నడవదు. వాణ్ణి మూల కూర్చో బెట్టేసి సెకండాఫ్ టెంప్లెట్ ప్రకారం బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి కామెడీ. విలన్ కాసేపు కనిపించి మళ్ళీ వెళ్ళిపోతాడు. హీరోకి వాడు లాక్కున్న ఆస్తి గురించి బాధే వుండదు. హీరోయిన్ తో సాంగ్స్, ఫారిన్ లొకేషన్స్ లో డాన్సులు. క్లయిమాక్స్ లో గానీ ఇంటర్వెల్లో ఆగిపోయిన విలన్ తో కథ ప్రారంభం కాదు! దీన్ని సినిమాగా ఎవరైనా ఒప్పుకుంటే హిట్ చేయమని చెప్పాలి.

సికిందర్
(Published in telugurajyam.com,
 a US based website)