రచన - దర్శకత్వం : సురేష్
ఉత్తరాది
తారాగణం : నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్, అదితి, క్రిష్ సిద్దిపల్లి,
రాజారవీంద్ర
సంగీతం : జువెన్ సింగ్, ఛాయాగ్రహణం : ఎస్ కె భూపతి
నిర్మాతలు : కె కళ్యాణ్, ఎన్ దుర్గా ప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఏ భాస్కర్ రావు
విడుదల : అక్టోబర్ 8, 2021
***
ప్రేమ కథల్ని కొత్తగా
చెప్పాలనుకుని కొత్త దర్శకులు ప్రయత్నించడం మంచిదే. రెండే రకాల ప్రేమ కథలతో గత రెండు దశాబ్దాలుగా అదేపనిగా
తీసిందే తీసి ప్రేమంటేనే విరక్తి పుట్టించాక, ఈ మధ్య అలాటి
కొత్త బైరాగి దర్శకుల తాకిడి దాదాపు తగ్గిపోయి ప్రాణాలు హాయిగా వున్నాయి. ఇతర
పనులు చేసుకోగల్గుతున్నాం. ఈ సినిమాలతో ప్రేక్షకులకి ఉపయోగం లేదు గానీ నిర్మాణంలో
ఎందరికో ఉపాధి కల్పిస్తూంటాయి. ఈ కార్మిక సేవకే వీటిని అలా వుండనివ్వాలి తప్ప కళా సేవకి
కాదు. కళా సేవ కూడా చేస్తూ ‘నేను లేని నా ప్రేమ కథ’ లాంటివి అప్పుడప్పుడు వస్తూంటే చిన్న సినిమా బతికే వుందని ఒక సంకేతం
వెళ్తుంది.
అయితే ఆ సంకేతం ఎంత బలంగా వెళ్ళి
ప్రేక్షకుల్ని తన వైపు తిప్పుకుంటుందనేదే సమస్య. ఇందుకే చిన్న సినిమా బేషరతుగా అన్ని
విభాగాల్లో బలంగా వుండాలంటారు. మరి అంత బలంగా ప్రస్తుత కొత్త దర్శకుడి ప్రేమ కథేమైనా
వుందా లేదా చూద్దాం...
ఆ వూళ్ళో నాట్యమంటే ఇష్టమున్న
రాధ (గాయత్రీ సురేష్) సామాజిక కార్యకర్త రామ్ (నవీన్ చంద్ర) తో ఏకపక్ష ప్రేమలో
వుంటుంది. రామ్ కి వసుధ అని ఒక ఫ్రెండ్ వుంటుంది. ఇంకో వూళ్ళో కృష్ణ (క్రిష్
సిద్ధిపల్లి) అనే అతను వుంటాడు. ఇతడికో గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. ఇతను శబ్ద తరంగాల
మీద పరిశోధన చేస్తూంటాడు. ఐన్ స్టీన్ పదార్ధానికి వినాశం లేదని చెప్పాడు కాబట్టి, విశ్వం లో శబ్ద తరంగాల రూపంలో నిక్షిప్తమైన ఒక పదార్ధాన్ని
అన్వేషిస్తూంటాడు. ఆ పదార్ధం కాశ్మీరు సమస్యకి పరిష్కారం. కాశ్మీర్ సమస్యని
పరిష్కరించాలంటే దాని సమస్యా మూలాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అది తెలిసిన వాళ్ళు
నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు అనీ, వాళ్ళ సంభాషణలు శబ్ద తరంగాల రూపంలో విశ్వంలో ఎక్కడో వుంటాయనీ పరిశోధన
చేస్తూంటాడు.
ఇటు రాధ చదువుతున్న కాలేజీ లెక్చరర్
(రాజా రవీంద్ర) ఒక ఫంక్షన్ లో హామ్ రేడియోని పరిచయం చేసి దాన్ని రాధకి బహుమతిగా
ఇస్తాడు. ఆమె దాన్ని ట్యూన్ చేస్తూంటే ఒక రోజు కృష్ణ విశ్వంలోకి పంపుతున్న
ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతుంది. ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలెడతారు. అప్పుడు కృష్ణకి ఏమర్ధమవుతుందంటే, తను 1983 కాలంలో వున్న అమ్మాయితో
కనెక్ట్ అయ్యాడని. ఈ విషయమే ఆమెకి చెప్పి, తను 2020 లో
వున్నానంటాడు. ఆమె నమ్మలేకపోతుంది. రామ్ కి చెప్తుంది.
తను 1983 లో,
కృష్ణ 2020 లో వున్నారు. మరి రామ్ ఏ కాలంలో వున్నాడు? ఈ ముగ్గురి మధ్య వున్న సంబంధమేమిటి? వీళ్లతో వసుధ
పాత్రేమిటి? ఆమె ఎవరికి ఏమవుతుంది?
చివరికి నల్గురూ ఏమయ్యారు? ఇదీ మిగతా కథ.
టైమ్ ట్రావెల్ జానర్ కథ ఇది. కృష్ణ
అనే అతను కాలంలో 1947 లోకి ప్రయాణించి కాశ్మీర్ సమస్యని పరిశీద్దామనుకుని చేసే
ప్రయత్నం, మధ్యలో 1983 దగ్గర రాధ అనే అమ్మాయితో కనెక్టయితే ఏం
జరిగిందన్నది ప్రేమ కథగా చేసి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు సురేష్. ఆలోచన
కొత్తదే.
గత మార్చి లోనే ‘ప్లేబ్యాక్’ అని ఇలాగే భిన్న కాలాల్లో పాత్రల్ని
కనెక్ట్ చేస్తూ తెలుగులోనే వచ్చింది గానీ కథ వేరు. ప్రస్తుత ప్రేమ కథ ప్రేమ కథగానే
వుండక కుటుంబ కథగానూ బయటపడే విషయంతో వుంటుంది. టైమ్ ట్రావెల్ తో కుటుంబ కథ అనగానే
రాబర్ట్ జిమెకిస్ 1985 క్లాసిక్ ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’ గుర్తుకొస్తుంది. ఇందులో కీచులాడుకునే తల్లిదండ్రుల్ని భరించలేని
కుర్రాడు టైమ్ మెషీన్ లో తల్లిదండ్రుల టీనేజీ కాలంలో కెళ్లి,
వాళ్ళ కీచులాటలకి కారణాన్ని అక్కడ, ఆ టీనేజీ వయసులో తొలగించి
తిరిగొస్తాడు. సైకలాజికల్ గా చెప్పాలంటే ఇది సైకో థెరఫీకి కథా రూపం.
హిప్నాటిస్టులు కూడా హిప్నాటిజంతో గతంలోకి తీసికెళ్ళి మానసిక సమస్యల్ని మరమ్మత్తు చేయడం
తెలిసిందే.
ప్రస్తుత కథ ముక్కోణ ప్రేమ కథ.
ఇందులో 1983లో రాధ ఆ ప్రేమ దక్కించుకోలేని బాధతో వున్నప్పుడు, 2020 లో వుంటూ ఆమెతో కనెక్ట్ అయిన కృష్ణ చేయాల్సింది ఆమెకి సైకో థెరఫీనే.
ఇది చేయకుండా ఆమె పుణ్యాన ఆ కాలంలో తన తల్లిదండ్రులతో మాట్లాడగల్గిన తను, దానికే జన్మ ధన్యమైనట్టు ఫీలై, ఆమెని గాలి కొదిలేసి
ముగించడం పాత్రోచితంగా లేదు.
పదార్ధానికి వినాశం లేదన్నారు గానీ
రూపం మారవచ్చు. పదార్ధమంటే శక్తి. శక్తి ఏ రూపం ధరిస్తే ఆ పదార్ధం. కాబట్టి
శక్తికి వినాశం లేదు గనుక పదార్ధమూ నశించదు. అందుకని కాశ్మీరు గురించి నెహ్రూ, జిన్నా, కాశ్మీరు రాజు ఏం మాట్లాడుకున్నారో ఆ శబ్ద
తరంగాలు విశ్వంలో వుండే వుంటాయని ఈ కథ ప్రతిపాదన. శబ్దం కూడా శక్తియే. పదార్ధం
నుంచి శక్తి రూపంలో వెలువడే వైబ్రేషనే శబ్దం. పదార్ధం ఏ రూపం మార్చుకుంటే ఆ రకమయిన
అణువులతో వైబ్రేషన్ ప్రసారమవుతుంది.
మనం మాట్లాడుకునే మాటల వైబ్రేషన్స్
గాలిలోని అణువుల ద్వారా ప్రయాణించి అన్ని వైపులా ప్రసరిస్తాయి. దారిలో ఏ అవరోధముంటే
దాన్ని తాకి ఆ శక్తి రూపంలోకి మారిపోతాయి. గోడలుంటే గోడల్ని తాకి గోడల శబ్దంగా ప్రతిధ్వనిస్తాయి.
గదిలో తివాచీ, సోఫాలు లాంటి మెత్తని ఉపరితలాలుంటే వాటిలోకి
మిళితమై పోతాయి. కాబట్టి నెహ్రూ, జిన్నా, కాశ్మీర్ రాజు మాట్లాడుకున్న మాటల తరంగాలు మాట్లాడుకున్న చోటే ఫినిష్
అయిపోతాయి. అవే తరంగాల రూపంలో అలాగే విశ్వంలో పడి వుండవు. పైగా శూన్యంలో శబ్దం ప్రయాణించదు, వాయు మండలంలోనే ప్రయాణిస్తుంది.
ఇక కాశ్మీరు సమస్యకి మూల కారకులు
జిన్నా, కాశ్మీరు రాజులతో బాటు, మౌంట్
బాటెన్ కూడా. వీళ్ళు కంపు చేసిన చరిత్ర లోంచి 55 శాతం కాశ్మీరు భూభాగమైనా
లాక్కొచ్చారు నెహ్రూ, పటేల్ లు.
ఇది రాధ పాత్ర చెప్పుకునే ఆమె కథ. ఈ
పాత్ర నటించిన గాయత్రి కాలానికి తగ్గట్టు పాత్రకి సరిగ్గా సరిపోయింది- రూప స్వరూప
లావణ్యాలతో, ముఖభావాలతో, మాటతీరుతో, డ్రెస్ సెన్స్ తో, నాట్య కళతో. అమాయక పాత్ర. కథ
వుంటేనే పాత్రలు నిలబడతాయి.
ఉద్యమ కార్యకర్తగా, ప్రేమలో పడని పాత్రగా నవీన్ చంద్ర కథతో పాటు వుంటాడు, కథగా కాదు. ఆ మేరకే నటన వుంటుంది. కాశ్మీరు పరిశోధన చేసే పాత్రలో క్రిష్
కథ నడపే పాత్రగా వుంటాడు. నటన కాస్త అతిగా కూడా వుంటుంది. గర్ల్ ఫ్రెండ్ గా అదితి
ఎక్స్ ట్రోవర్ట్ పాత్ర. రెండు మూడు సీన్లలో లెక్చరర్ గా రాజారవీంద్ర.
పాత్రల పేర్లు రామ్, రాధ, కృష్ణ, వసుధ అని వాటి
మధ్య సంబంధాల్ని తెలపడానికన్నట్టుఅమెచ్యూరిష్ రైటింగ్ గా వున్నాయి. రామ్ పక్కన రాధని చూసిన లెక్చరర్, ఆమెని సీతా అని పిలవడం మరీ చాదస్తపు స్క్రిప్టు రచనగా వుంది. యూత్ సినిమా
అన్నప్పుడు యూత్ అప్పీల్ లేకపోతే కష్టం. పాటలు మెలోడీ ప్రధానంగా వున్నాయి. సాంకేతికంగా
బడ్జెట్ కి తగ్గట్టు వుంది.
టైమ్ ట్రావెల్ జానర్
ప్రేమ కథని సైన్స్ ఫిక్షన్ చేయకుండా ప్రేమ
కథే ప్రధానంగా సగటు ప్రేక్షకుడికి అర్ధమయ్యేట్టు తీశారు. ఫస్టాఫ్ లో హీరోయిన్ హామ్
రేడియోతో సెకండ్ హీరోతో కనెక్ట్ అయినప్పుడు గానీ హీరోయిన్ 1983 లో వున్నట్టు
తెలీదు. ఇలా ఫస్టాఫ్ లో కథనం రీఫ్రెష్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య ట్రాక్
ప్రశ్నల్ని రేకెత్తించేలా సాగుతూ, ఫస్ట్ హీరోని ముందుకు
తెస్తూ, ఇంటర్వెల్ కి కథనం మరో ప్రశ్నతో రీఫ్రెష్ అవుతుంది.
ఇలా సెకండాఫ్ లో కూడా మరో మూడు
సార్లు కథనం రీఫ్రెష్ అవుతూ ప్రశ్నల్ని రేకెత్తించే మలుపులతో బలంగా మారుతుంది.
కథనమంటే ప్రశ్నలు రేకెత్తించి జవాబులివ్వడమనే చైతన్యం కాబట్టి, ఇక్కడ ఇది భిన్నకాలాల్లో సాగే సమాంతర కథకి కుదిరింది. ఇలా కథనం రీఫ్రెష్
అవుతూ కూర్చోబెట్టే సినిమాలు ఎక్కడొస్తున్నాయి గనుక. ప్రేమ కథ కాస్తా కుటుంబ కథగా మలుపు
తిరిగి చిక్కుముడి వేయడం, ఆ ముడి విప్పి మళ్ళీ ప్రేమ కథగా
మారడం ఇవన్నీ సస్పెన్సుని కూడగట్టుకుని సాగుతూంటాయి సెకండాఫ్ లో.
అయితే రచన,
దర్శకత్వం, మేకింగ్ మరింత యూత్ ఓరియెంటెడ్ గా, మార్కెట్ యాస్పెక్ట్ ని దృష్టిలో పెట్టుకుని వుంటే,
సినిమా ఇలా అనామకంగా వచ్చి వెళ్లిపోయేది కాదు. పబ్లిసిటీ పరంగా కూడా సినిమాకి
డిజిటల్ ప్రెజెన్స్ లేదు. రివ్యూలు సరే, ఎక్కడా కన్పించవు. సినిమా వివరాల గురించి ఒక వీకీపీడియా పేజీని కూడా
క్రియేట్ చేసుకోలేకపోతే, సినిమాఎందుకు రిలీజ్ చేయడమనేది
ప్రశ్న. కథలో ప్రశ్నలున్నట్టు పబ్లిసిటీలో కూడా ప్రశ్నలుండా లనుకున్నారేమో?
―సికిందర్