రచన- దర్శకత్వం : అజయ్ భూపతి
తారాగణం : శర్వానంద్, సిద్ధార్థ్, అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్, జగపతి
బాబు, రావురమేష్ తదితరులు
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : రాజ్ తోట
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
విడుదల : అక్టోబర్ 14, 2021
***
తొలి సినిమా ‘ఆరెక్స్ 100’ తో హిట్ సాధించిన దర్శకుడు అజయ్
భూపతి రెండో సినిమా కోసం మూడేళ్ళూ స్టార్స్ చుట్టూ తిరిగి మొత్తానికి శర్వానంద్, సిద్ధార్థ్ లతో ‘మహా సముద్రం’
తీశాడు. శర్వానంద్ కి గత నాలుగు వరస పరాజయాల తర్వాత ‘మహాసముద్రం’ తో ఒక హిట్ అవసరం. ఇక దాదాపు పదేళ్ళ తర్వాత తమిళ
హీరో సిద్ధార్థ్ తెలుగులో నటించిన సినిమా ఇది. మరో పక్క ఇద్దరు గ్లామర్ హీరోయిన్లు
అదితీ రావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయెల్ లు. ఇన్ని ఆకర్షణలున్న ‘మహా సముద్రం’ పండక్కి విడుదలవడం కలెక్షన్స్ కి సానుకూలాంశం.
మరి ఇన్ని పాజిటివ్స్ వున్న ఈ మల్టీ స్టారర్ పండగ మూడ్ ని మరింత ఆహ్లాదకరంగా మార్చుతుందో
లేదో చూద్దాం...
వైజాగ్ లో శర్వానంద్
(అర్జున్), విజయ్(సిద్ధార్థ్) లు ప్రాణ స్నేహితులు. అర్జున్
చిన్న వ్యాఫారం చేసుకోవాలనుకుంటాడు. సిద్ధార్థ్ ఎస్సై పరీక్ష రాస్తాడు. డాన్స్
స్కూలు నడిపే మహా(అదితీ రావ్ హైదరీ) తో ప్రేమలో వుంటాడు. అర్జున్ లా చదివే స్మిత
(అనూ ఇమ్మాన్యుయెల్) తో ప్రేమలో పడతాడు. వైజాగ్ లో చుంచు మామ (జగపతి బాబు) సముద్రం
మీద బతికే స్మగ్లర్. ఇతడి ప్రత్యర్ధులు ధనుంజయ్ (గరుడ రామ్)
అతడి అన్న గూని బాబ్జీ (రావు రమేష్). ఒక రోజు విజయ్ ధనుంజయ్ తో ఘర్షణ పడి
చంపేస్తాడు. దీంతో చుంచు మామా వూరొదిలి పారిపొమ్మంటాడు. విజయ్ మహాని కూడా వదిలేసి
పారిపోతాడు. కానీ బతికే వున్న ధనుంజయ్ చంపడానికి మహా మీదికొస్తే అర్జున్ అతడ్ని
చంపేస్తాడు. దీంతో ఇక గూని బాబ్జీని ఎదుర్కోవాలంటే స్మగ్లర్ గా మారిపోవాలని
అర్జున్ మీద ఒత్తిడి తెస్తాడు చుంచు మామ.
ఇప్పుడు విజయ్ ఏం చేశాడు? స్మగ్లర్ గా మారాడా? విజయ్ ఏమయ్యాడు? ఇంట్లోంచి తండ్రి వెళ్ళ గొడితే మహా ఏమైంది? అర్జున్
ప్రేమిస్తున్న స్మిత ఏమైంది? ఈ సమస్యలన్నీ అర్జున్ ఎలా
పరిష్కరించాడు? ఇదీ మిగతా కథ...
అనుకోని పరిస్థితుల్లో
దుష్టుడ్ని చంపేసిన హీరో ఆత్మ రక్షణకి తానే దుష్టుడుగా మారడం, ప్రాణ మిత్రులైన ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడం, ప్రేమించిన అమ్మాయి గురించి ఇద్దరు హీరోల మధ్య అపార్ధాలు రేగడం, ఘర్షణ, త్యాగం...ఈ టెంప్లెట్స్ అన్నీ పెట్టుకుని
తయారు చేసిన కథ ఇది. సముద్రం మీద స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ టెంప్లెట్
దీనికి జోడింపు. పాత్ర చిత్రణలు, లాజిక్, కామన్ సెన్సు వంటి వాటికి దూరంగా వున్న కథ. పాత్రల్ని బట్టి కథలో
సముద్రమంత లోతైన డెప్త్ వున్నా, పైపై కథనంతో నడిపేసిన కథ.
రెండు మూడు చోట్ల తప్ప మాస్ చేత కేరింతలు కొట్టించడంలో అంత కమర్షియల్ గా లేని కథ. పాత్రల్నిఎస్టాబ్లిష్ చేసిన తీరు మాస్ కి ఉత్కంఠ రేపుతూ
కూర్చోబెట్ట గల్గింది. కానీ ఆ పాత్రల్ని నడిపిన తీరుతో రెండున్నర గంటల పాటు అదే
ఉత్కంఠని రేపదు.
నాలుగు వరస పరాజయాల తర్వాత
శర్వానంద్ కి ‘మహాసముద్రం’ అనే కమర్షియల్
మాస్ యాక్షన్ టెర్రిఫిక్ నటనని ప్రదర్శించే అవకాశాన్నిచ్చిన పాత్ర ఇది. ఫస్టాఫ్
అతను కదలకుండా కూర్చో బెట్టేస్తాడు. తల్లితో ఒక కుటుంబం,
కొన్ని విలువలు, స్నేహితుడి పట్ల విశ్వాసం, ప్రేమించిన అమ్మాయితో ఆమె నిర్ణయాల్ని గౌరవిస్తూ సత్సంబంధాలు...ఇవన్నీ వున్న పాత్రతో ప్రేక్షకులకి దగ్గరవుతాడు. ఇంటర్వెల్ కి ముందు గరుడ
రామ్ గ్యాంగుతో యాక్షన్ సీను, సెకండాఫ్ లో రావు రమేష్ గ్యాంగుతో యాక్షన్ సీన్లూ ఇవన్నీ విజృంభించి చేస్తాడు. అనూ ఇమ్మాన్యుయెల్ తో ఒక
రోమాంటిక్ సాంగ్ తో అలరిస్తాడు. సిద్ధార్థ్ తో ఒక బ్రోమాన్స్ సాంగ్ కూడా ఓకే.
కానీ సెకండాఫ్ లో పాత్ర బలహీన
పడడంతో కథా పరంగా సెకండాఫ్ ని నిలబెట్టలేని నిస్సహాయ స్థితిలో పడిపోతాడు. కారణ
మేమిటంటే, పాత్రకి గోల్ లోపించడం. దీంతో ఏ సమస్య వచ్చి పడితే
దానికి అప్పటికప్పుడు రియాక్షనిచ్చి వూరుకునే పాసివ్ రియాక్టివ్ పాత్రగా వుండడం.
సమస్యలకి మూలమేమిటో దాన్ని తానుగా పెకిలించి వేసే గోల్ తో యాక్టివ్ పాత్రగా లేకపోవడం.
యాక్టివ్ పాత్ర లేని మూల్యం చాలా చెల్లించుకోవాల్సి వచ్చింది. స్టార్ సినిమాలకిది
మామూలే.
ఇక సాఫ్ట్ రోల్స్ వేసే సిద్ధార్థ్ ఈసారి
నెగటివ్ గా రఫ్ పాత్ర వేశాడు. ఇందులో ఎక్కడా తేలిపోకుండా రాణించాడు. ఫస్టాఫ్ లో అసలు ఎస్సై కావాలని ఎందుకనుకున్నాడో రివీల్ చేస్తూ అసలు
స్వరూపం బయట పెడుతూ మాంచి కిక్కిస్తాడు. కానీ ఇంటర్వెల్ ముందు పారిపోయి ఆ కిక్కుని
నీరుగార్చేస్తాడు. ఐదేళ్ళ కాలం తర్వాత క్లైమాక్స్ ముందు తిరిగి వచ్చి శర్వానంద్ కి
ప్రాణ శత్రువుగా మారే ఫార్ములా పోషించడం కూడా సరిపెట్టుకున్నా, చివరికి ఇచ్చుకునే అరిగిపోయిన ఫార్ములా ముగింపుని మాత్రం సరిపుచ్చుకోలేం.
ఈ పని ‘షోలే’ లో అమితాబ్ బచ్చన్
ఎప్పుడో చేశాడు. కానీ జయబాధురి జీవితం అప్పుడు కూడా ప్రశ్నగానే మిగిలిపోయింది. సిద్ధార్థ్
తన పాత్ర ద్వారా ప్రేమించిన ఆదితీ రావ్ హైదరీకి రాడికల్ ముగింపు నిద్దామనుకున్నాడు
గానీ, నిజానికి తనకీ శర్వానంద్ కీ మధ్య ఆటబొమ్మలా వున్న
అదితీకి వ్యక్తిత్వాన్నిస్తూ, ఆమె నిర్ణాయానికి వదిలేస్తే
రాడికల్ ముగింపయ్యేది.
అదితీ రావ్ హైదరీ పాత్రకి తగ్గ
నటనతో ఒక సెక్షన్ని ఆకట్టుకోవచ్చుగానీ, అసలు పాత్రేమిటన్నదే
ప్రశ్న. అంత వైభవంగా డాన్స్ స్కూలు నడుపుతూ సిద్ధార్థ్ కి డబ్బు సాయం కూడా చేస్తూ
వుండిన తను, సిద్ధార్థ్ పారిపోగానే శర్వా పంచన చేరి, అతడింట్లో దీనంగా జీవించడమేమిటో అర్ధం గాదు. పైగా సెకండాఫ్ లో కథని
మెలికలు తిప్పడం.
పోతే లా చదివే అమ్మాయి పాత్రలో అనూ
ఇమ్మాన్యుయెల్ కూడా కథలోంచి ‘నాల్గేళ్ళ పాటు’ వెళ్ళిపోతుంది. హైదారాబాద్ లో లాయర్ గా మారి సెకండాఫ్ లో తిరిగొస్తుంది.
ఈ నాల్గేళ్ళూ కాంటాక్ట్ వుండదు. ఇవేం
ప్రేమలో అర్ధంగాదు. కథకుడి సౌలభ్యం కోసం ఒకవైపు అదితిని వదిలేసి సిద్ధార్థ్ వెళ్ళి
పోయాడు, మరోవైపు శర్వాని
వదిలేసి అనూ వెళ్ళిపోయింది.
విలన్లుగా మాత్రం విచిత్ర పాత్రల్లో, తెలుగు నేటివిటీతో జగపతి బాబు, రావు రమేష్ లు తమ
సీన్లని తాము బాగా దున్నేసుకున్నారు వేరే కమెడియన్లు అవసరం లేకుండా.
చైతన్
భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగున్నా, పాటల విషయంలో
వెనుకబడ్డాడు. మొదటి బ్రోమాన్స్ సాంగ్ తప్ప మిగిలిన సాంగ్స్ క్యాచీగా
ఇవ్వలేకపోయాడు. హెవీగా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరుకి,
పాటల్ని లైట్ మ్యూజిక్ తో ఇస్తే కదా కాంట్రాస్ట్ వస్తుంది. అప్పట్లో ఇళయరాజా ఇదే
పాటించే వాడు కదా.
రాజ్ తోట కెమెరా వర్క్ వైజాగ్ సముద్రానికి, లొకేషన్స్ కి, సముద్రపు వివిధ మూడ్స్ కి విజువల్ గా
హైస్కోరు చేసింది. దర్శకుడి కథా కథనాలు మాత్రం ఈ విజువల్స్ తో పోటీపడలేక పోయాయి.
ఈ రెండో సినిమాతో దర్శకుడు అజయ్
భూపతి హెవీ మల్టీ స్టారర్ కి సాహసించడం బావుంది గానీ, ‘మహా సముద్రం’ లాంటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుకి ఇంకా ఇన్
పుట్స్ అవసరం. సముద్రం మీద స్మగ్లర్ల బ్యాక్ డ్రాప్ లో చెడిన స్నేహాల మధ్య ప్రేమ
కథ చెప్తున్నప్పుడు ఆ ప్రేమ కథ ఒక్కటే హైలైట్ అవ్వాల్సింది కాలేదు. దీంతో ప్రేమ కథ
కాలేక, స్మగ్లింగ్- మాఫియా కథ కాలేక వూగిసలాడింది.
రమేష్ సిప్పీ రిషీ కపూర్, డింపుల్ కపాడియా, కమల హాసన్ లతో ‘సాగర్’ అనే చాలా లైటర్ వీన్ సూపర్ హిట్ ప్రేమ కథ తీసినప్పుడు, సాగరమంత లోతైన మెచ్యూరిటీతో తీసి సక్సెస్ అయ్యాడు.
―సికిందర్