రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జులై 2017, బుధవారం

480 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 7







తర అన్ని జానర్ల మూవీస్ కిలాగే  డార్క్ మూవీస్ బిగినింగ్ బిజినెస్ ని సర్దు బాటు చేయడం కూడా కష్టమే.  స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగమనేది ప్రయాణానికి సన్నాహం లాంటిది. మనమెక్కడికైనా ప్రయాణం పెట్టుకుంటే సూట్ కేసు సర్దుకుంటాం. అందులో పేస్టూ, బ్రష్షు, సబ్బు, టవల్ వగైరా ఎలా పెట్టుకుంటామో అలా- బిగినింగ్ కూడా ప్లాట్ పాయింట్ 1 దగ్గర కథా గమనమనే ప్రయాణం కట్టినప్పుడు, ఆ ప్రయాణంలో ఉపయోగపడే సరంజామా అంతా సిద్ధం చేసుకుంటుందన్న మాట. ఏమిటా సరంజామా? ఈ సరంజామా మూడు సెట్లుగా వుంటుంది. మొదటి సెట్ లో 1. ప్రథాన పాత్రనిఇతర ముఖ్య పాత్రల్నీ పరిచయం చేసికథా నేపధ్యాన్ని (జానర్ ని) తెలిపే; 2. ప్రధాన పాత్రకి సమస్య తలెత్తేందుకు ప్రేరేపించే పరిస్థితుల్ని లేదా శక్తుల్ని చూపే; 3. సమస్య తలెత్తే దిశగా పరిస్థితుల కల్పనచేసే; 4. సమస్యని  ఏర్పాటు చేసే - టూల్స్ ని  టూల్ బాక్సులో సర్డుతాం. ఇదొక సెట్. 

         
రెండో సెట్ లో  ఐదు సప్లిమెంటరీలని సర్దుతాం. అవి : 1. పాత్ర చిత్రణలు, 2. పాత్రకి  అంతర్గత- బహిర్గత సమస్యలు; 3. క్యారక్టర్ ఆర్క్, 4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్, 5. ఎమోషన్.
          ఇక మూడో సెట్లో గోల్ ఎలిమెంట్స్ ని సర్డుతాం. అవి : 1. కోరిక, 2. పణం,  3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. 

          1. ఇప్పుడు స్థూలంగా బిగినింగ్ విభాగపు బిజినెస్  =
 
        
1. ప్రథాన పాత్ర, ఇతర ముఖ్య పాత్రల పరిచయం, కథా నేపధ్య సృష్టి.
        2. ప్రధాన పాత్రకి సమస్య పుట్టే / పుట్టించే పరిస్థితులు/ శక్తులు 
        3. సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన
        4. సమస్య ( ప్లాట్ పాయింట్ – 1 ) ఏర్పాటు.
 
          2. వీటిలో కల్పించాల్సిన సప్లిమెంటరీలు = 
        
1. పాత్ర చిత్రణలు 
        
2. పాత్రలకి అంతర్గత- బహిర్గత సమస్యలు
        3. క్యారక్టర్ ఆర్క్ 
        
4. టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ 
        
5. ఎమోషన్ 
          3. గోల్ లో వుండాల్సిన  ఎలిమెంట్స్ =
        1. కోరిక
        2. పణం 
        3. పరిణామాల హెచ్చరిక
        4. ఎమోషన్ 
                                    ***
        అంటే స్క్రీన్ ప్లేలో అరగంటకో, ముప్పావు గంటకో ఇంటర్వెల్ లోపు వచ్చే ప్లాట్ పాయింట్ -1 కల్లా, బిగినింగ్ కథనంలో పై 13 పనిముట్లూ కనిపించాలన్న మాట. ఇదేదో ‘బ్లడ్ సింపుల్’ కోసం కల్పించి చెబుతున్నది కాదు. ‘శివ’ సార్వజనీన స్క్రీన్ ప్లేకి కూడా ఈ పదమూడే వుంటాయి. 

          అయితే డార్క్ మూవీస్ కి వున్న ప్రత్యేకతల దృష్ట్యా ఇంకొన్ని  ఎలిమెంట్స్ జత కలుస్తాయిక్కడ. చిత్రీకరణలో వచ్చే ఆ ఎలిమెంట్స్ గురించి  జూన్ 15 వ తేదీ వ్యాసంలో తెలుసుకున్నాం. ఇవన్నీ  ‘బ్లడ్ సింపుల్’ బిగినింగ్ 13  సీన్లలో ఎలా సర్దుబాటయ్యాయో చూస్తే, ఈ 13 సీన్లలో మొదటిది వాయిసోవర్ తో వుంది ( వాయిసోవర్ ప్రారంభాలు  నోయర్ జానర్ తప్పని సరి చేస్తున్నా, దీన్ని ఆప్షన్ గా తీసుకోవచ్చు) ఇకపోతే నోయర్ కి ఫ్లాష్ బ్యాక్ కథనం కూడా ఒక ప్రమాణమే అయినా, ఇది ‘బ్లడ్ సింపుల్’ లో లేదు. ఇది కూడా ఆప్షనే. వాయిసోవర్ ఏ పాత్ర చెప్తూంటుందో అదే ప్రధాన పాత్ర అవుతుంది. ఈ మేరకు డిటెక్టివ్ విస్సర్ ని ఇందులో ప్రధాన పాత్రగా చూశాం. ఇతనే ప్రధాన పాత్ర అనడానికి ఇంకో ఆధారం ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఇతనే (ఎబ్బీ, రేలని చంపే) సమస్యని టేకప్ చేశాడు. ఇతనెలాటి వాడో,  ఆశయాలెలా వున్నాయో వాయిసోవర్ తోనే  పరిచయమయ్యాడు. ఈ ప్రధాన పాత్ర యాంటీ హీరో అని కూడా తెలిసిపోతోంది.


          రెండో సీన్లో ఎబ్బీ, రే లు, వాళ్ళ  వ్యవహారాలూ  కూడా పరిచయమయ్యాయి. పాత్రల పరిచయమంటే అన్ని పాత్రల్నీ వరసగా పరిచయం చేసుకుంటూ పోవడం కాదు. బిగినింగ్ కథనం చేసే డిమాండ్ ని బట్టి అవసరమైన  ఒక్కో పాత్రా సందర్భాన్ని బట్టి  పరిచయమవుతూంటుంది. అందుకని  రెండో సీన్లో  ఎబ్బీ, రే ల్ని  పరిచయం చేశాక ఎబ్బీ భర్త మార్టీ పరిచయం జోలికి పోలేదు. కానీ ఆమెకో భర్త వున్నాడని ఈ రెండో సీన్లో చెప్పారు. ఈ మొదటి రెండు సీన్లలోనే మూవీ జానర్ ఏమిటో ఏర్పాటయ్యింది. కథా పరంగా చూస్తే  ఎబ్బీ, రేల రహస్య ప్రేమాయణం, రివాల్వర్ ఉనికి, చుట్టూ వాతావరణం, ఆ వర్షంలో వెనక కార్లో ఎవరో వున్నారన్న భావం   ఇవన్నీ కూడా డార్క్ మూవీ జానర్ లోకి తీసికెళ్ళపోయాయి. 

       డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ లో నైట్ సీన్స్ కూడా ఒకటి. ఈ బిగినింగ్ లో చాలా సీన్లు నైట్లోనే వున్నాయి. ఇక కథనం (కథ అనకూడదు అప్పుడే, ప్లాట్ పాయింట్ -1 దగ్గర్నుంచి మాత్రమే కథ  ప్రారంభమవుతుంది ఏ జానర్ కైనా) ప్రారంభించడానికి అవసరమైన పాత్రల పరిచయాలు చేస్తూనే, డార్క్ మూవీ జానర్ ని ఆవిష్కరిస్తూనే, ఈ విభాగం బిజినెస్ లో రెండవ టూల్ అయిన  ప్రధాన పాత్రకి సమస్య పుట్టే / పుట్టించే పరిస్థితులు/ శక్తులు తెలియ జేశారు. ఇక్కడ ప్రధాన పాత్ర విస్సర్ అయితే, ఇతడికి సమస్య పుట్టించే శక్తులుగా ఎబ్బీ, రేలున్నారు. వీళ్ళిద్దరూ ఎఫైర్ పెట్టుకుని మార్టీకి (ఎబ్బీ భర్తకి), తద్వారా విస్సర్ కీ సమస్య సృష్టించబోతున్నారు. కాబట్టి సమస్య పుట్టించే శక్తులు ఎస్టాబ్లిష్ అయిపోయాయి. ఇక 3 వ టూల్ అయిన సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన  మొదలెట్టారు వీళ్ళు. ఎలా? 

          మోటెల్ లో సెక్స్ కి పాల్పడ్డం ద్వారా, ఆ ఫోటోలని తీసి విస్సర్ మార్టీకి చేరవేసేందుకు దోహదం చేయడం ద్వారా. ఇలా వాళ్ళ ఈ  ఒక్క చర్యే  చైన్ రియాక్షన్ లా  ఒకటొకటే విషమ పరిస్థితులకి దారి తీయిస్తూ పోయింది. భర్త మార్టీకి తెలిసిపోయిందని ఎబ్బీ,  రే తో రే ఇంటికి వెళ్ళిపోయింది. పైగా మార్టీ దగ్గరి కెళ్ళి జీతమడిగి రే ఇంకా మార్టీ మూడ్ చెడ గొట్టాడు. ఫోన్ ద్వారా ఈ జంటని ట్రాక్ చేస్తున్న మార్టీ, ఎబ్బీ రే ఇంట్లో వుందని తెలుసుకుని వెళ్లి ఎటాక్ చేశాడు. అది బెడిసి కొట్టి ఇక ఇద్దర్నీ చంపెయ్యాలని డిసైడ్ అయ్యాడు. మళ్ళీ విస్సర్ నే ఆశ్రయించాడు. విస్సర్  ఆ ఎబ్బీ, రే ల్ని చంపి బయటపడే ‘సమస్య’ ని టేకప్ చేశాడు. ఇదీ సమస్యని సృష్టించే దిశగా పరిస్థితుల కల్పన

    ఇదీ బిగిబింగ్ బిజినెస్ లో మొదటి సెట్ పాలన  జరిగిన విధం. ఒకదానికొకటి లింకులు బలంగానే వున్నాయి. బలహీన మోటివ్స్ ఎక్కడా లేవు. బలహీన మోటివ్ అంటే, ఉదాహరణకి – ‘నిన్ను కోరి’ లో బీచ్ బాల్ ఆడుతున్నప్పుడు హీరోయిన్ భర్త పర్సు మర్చిపోయాడని, తీసికెళ్ళి ఇస్తానని వెళ్ళడం, వెళ్ళినప్పుడు భర్త ఒకమ్మాయితో మాట్లాడడం చూసి తర్వాత దుమారం రేపడం. ఆమె పర్సు తీసుకెళ్ళాడం  బలహీన మోటివ్. తీసి అప్పటికి తనే దాచి పెట్టుకోవచ్చు, అంత అర్జెంటుగా వెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా అతనెటు వెళ్ళాడో తెలీదు. సహజంగా ఏం చేస్తారంటే, ఒక కాల్ చేస్తారు. అప్పుడా భర్త పర్సు నీ దగ్గరే వుంచమంటాడు. అంటే దర్శకుడు ఆ పర్సు తో ఏం చేయాలో పాత్రకి వదిలెయ్యకుండా,  కథా  సౌలభ్యం  (భర్తవేరే అమ్మాయితో వున్నదృశ్యం చూడ్డం) కోసం తనే పాత్రకి లేని ఉద్దేశాలు రుద్దడం వల్ల,  ఇలాటి బలహీన- ఇల్లాజికల్ మోటివ్  అన్నమాట. సింపుల్ గా ఏం చేయవచ్చంటే, అతను ఫోన్ మర్చిపోవాలి. అప్పుడా ఫోన్ మోగితే, ఆ కాల్ లో అమ్మాయి గొంతు పలికితే,   హీరోయిన్ డిస్టర్బ్ అవడానికీ, భర్త ఎటు వెళ్ళాడో వెతుక్కుంటూ వెళ్ళడానికీ, వెళ్లి  వాళ్ళిద్దర్నీఅలా  చూడ్డానికీ తగిన బలమైన ఎమోషన్ తో ప్రాతిపదిక ఏర్పడుతుంది. 

          బ్లడ్ సింపుల్ లో ఈ నిర్మాణమే వుంది. ప్రతీ చర్యకీ సహజంగా ఒక ఎమోషనల్  ప్రాతిపదిక. ఇలా మోటివ్స్ పుట్టే విధం రెండో సెట్ లో గమనించవచ్చు. 1. పాత్ర చిత్రణలు : పాత్రచిత్రణలు జరగకపోతే కథనంలో పై పరిస్థితు లేవీ ఏర్పడవు. ఎంత డబ్బున్నా భర్తతో సుఖం లేదన్న బాధ ఎబ్బీది, ఎబ్బీ కోసం నిలబడాలన్న సంకల్పం రే ది. ఇంత ద్రోహం చేసిన ఎబ్బీకి బుద్ధి చెప్పాలన్న ఉద్రేకం మార్టీది. 

          2. పాత్రలకి అంతర్గత- బహిర్గత సమస్యలు : ఇది పాత్రలకి సైకలాజికల్ ట్రాక్ ని  కల్పిస్తుంది. రే కి ఎబ్బీ తన భర్త గురించి చెప్పుకోవడం దగ్గర్నుంచీ, హేండ్ బ్యాగుల పిచ్చితో తను  ఇలా మారడానికి కారణం తెలుపుకోవడం దగ్గర్నుంచీ, రే తో విడిపోయే దాకావచ్చి వెంటనే లొంగు బాటు ప్రకటించడం వరకూ ఆమె సైకలాజికల్ ట్రాకుని గమనిస్తే, ఇంట్లో సుఖం లేకే హేండ్ బ్యాగుల అబ్సెషన్ పుట్టింది. బ్యాగులతో బయట షికార్లు తిరిగింది. ఈ ఏకాకి తనంవల్ల (మోటివ్) రే కి దగ్గరయ్యింది. రే తో మోటెల్ లో వున్నట్టు భర్తకి తెలిసిపోయిందని (మోటివ్) రే ఇంటికి మారిపోయింది. రే తో విడిపోయే దాకా వచ్చాక, తనకి గతి లేని పరిస్థితి వుందని (మోటివ్) లొంగు బాటు ప్రకటించింది. 

          రే సైకలాజికల్ ట్రాక్ :  బాస్ (మార్టీ) భార్యతోనే ఎఫైర్ పెట్టుకోవడానికి అతడికే  మానసిక నిషేధాలూ లేవు. అదే సమయంలో ఘర్షణ పడదల్చుకోలేదు. బాస్ ఇంటికెళ్ళి నప్పుడు సిగరెట్ నోట్లో పెట్టుకుని కూడా వెలిగించక పోవడానికి మోటివ్ ఇదే. జీతం డబ్బులకోసం బాస్ దగ్గరి కెళ్ళి నప్పుడు అతను  తనని పీకేశానని చెప్పాక- ఇక సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు తను అతడి ఉద్యోగియే కానప్పుడు ఎదురుగా సిగరెట్ కాల్చగలడు. అయితే కాల్చలేదు- మోటివ్- ఏం జరిగినా బాస్ తో ఘర్షణ పడదల్చుకోలేదు. ఇంకా జ్వాలలు రేపదల్చుకోలేదు. ఇందుకు సూచనగానే సిగరెట్ ముట్టించుకోలేదు.

          కానీ బాస్ ఎబ్బీ మీద ఎక్కించి చెప్పిన అలాటి మాటలకి (మోటివ్) ఎబ్బీ తో తేడా వచ్చింది. వచ్చి ఎబ్బీతో బ్రేకప్ కి సిద్ధపడ్డాడు. ఎబ్బీ  బాధపడి సారీ చెప్పలేదు. అలా చెప్పి వుంటే ఓకే అని, పక్కలో చోటిచ్చేవాడేమో క్యాజువల్ గా. ఆమెకి బయట జీవితం లేదని తెలుసుకుని వచ్చినందునే (మోటివ్) అలా అభయ హస్తమిస్తున్నట్టు చేయి చాపి అందుకున్నాడు.

      మార్టీ సైకలాజికల్ ట్రాక్ చూస్తే, ఫోటోలు రాకముందు బార్లో వస్తున్న పాటకి (మోటివ్ ) అతను ఎబ్బీ గురించి పునరాలోచనలో పడ్డాడు. ఫోటో చూసి (మోటివ్) ఆమెని స్పృశించి ప్రేమని చాటుకున్నాడు. కానీ ఎబ్బీతో అడ్జెస్ట్ అవడం చులకనవడం అనుకుని (మోటివ్ ) బార్ లో బార్ టెండర్ ఫ్రెండ్ తో మిస్ బిహేవ్ చేసి సైకోతనాన్ని బయట పెట్టుకున్నాడు. ఈ మానసిక స్థితితో (మోటివ్ )ఎబ్బీమీద కసిని పెంచుకున్నాడు. మంటెక్కిస్తూ రే రావడంతో (మోటివ్) ఎబ్బీగురించి నానా మాటలన్నాడు. తన టార్గెట్  ఎబ్బీయే, రే కాదని చాటుకున్నాడు. రాత్రంతా ఎబ్బీ గురించే నిద్రపట్టక తెల్లారి వచ్చి లైంగిక దాడి చేశాడు. లైంగిక దాడే చేయాలన్న దానికి ‘మోటివ్’ రే తో అన్న మాటల్లోనే బయటపడింది- ఆ ప్రకారం ఆమెని బయటికి లాక్కొచ్చి బహిరంగ మానభంగం చేస్తే ఇంకెవరితోనూపడుకోదనుకున్నాడు. ఆమె గాయపరచడంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈ తీరని కసి (మోటివ్) తో విస్సర్ దగ్గరి కెళ్ళి పోయాయి చంపెయ్యమని చెప్పాడు. ఎబ్బీ రే ల్ని చంపెయ్యాలన్న అంతిమ  నిర్ణయానికి రావడానికి అతడి మానసిక స్థితి ఎలాగెలా డెవలప్ అవుతూ వచ్చిందో అంచెలంచెలుగా ఈ సైకలాజికల్ ట్రాక్ తెలుపుతుంది.  రే మీద కోపం లేని అతను రేని కూడా చంపాలనుకోవడానికి మోటివ్, ఎబ్బీ హత్యతో అతను ప్రాబ్లం అవుతాడని. 

          విస్సర్ సైకలాజికల్ ట్రాక్ కొస్తే, స్వగతమే ఇతడి మైండ్ ఏంటో చెప్పేసింది. అందుకే ఇందులో తన అవసరం చూసుకునే మోటివ్ తో, చూసి రమ్మంటే ఫోటోలు తీసి మార్టీని బ్లాక్ మెయిల్ చేశాడు. తను చేస్తున్నది తప్పని తన మనసే తనకి చెప్తున్నా పట్టించుకునే స్థితిలో లేడు.  ఆ మనసు సిగరెట్ కేస్ ని టేబుల్ మీద పట్టి మర్చిపోయేలా చేసి, మళ్ళీ గుర్తు చేసి తీసుకునేలా చేసింది. అతనొకటి చేస్తోంటే అంతరంగం దాని మోటివ్ తో (పట్టివ్వడానికి) అది చేసుకుపోతోంది.

          ఇలా పాత్రల అంతర్గత- బహిర్గత  ముఖాల వల్ల కథనానికి చలనం వస్తోంది.  మానసిక కారణాలు భౌతిక చర్యలకి దారి తీయడం. ఈ బహిర్గత చర్యలు సమస్యకి దరి తీసే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి.

          ఇక ఈ సెట్ లో మూడవదైన క్యారక్టర్ ఆర్క్ గురించి : క్యారక్టర్ ఆర్క్ అంటే పాత్రల ఉత్థాన పతనాలు. రే ఎబ్బీలు మార్టీకి ఎలాటి  పరిస్థితిని సృష్టిస్తూ ఉచ్ఛ స్థితికి వెళ్లి, రిలేషన్ షిప్ లో తేడాలతో పతనావస్థని సృష్టించుకుని, తిరిగి కమిట్ మెంట్ తో ఉచ్ఛ స్థితి కెళ్లారో  చూశాం. 

      మార్టీ ఫోటో చూడకముందు ఎబ్బీ గురించి డైలెమాలో పడి ( డౌన్), ఫోటో చూశాక ప్రేమని చాటుకుని (ఇంకా డౌన్), అంతలోనే ఇలా కాదనుకుని బార్లో సైకోలా  ప్రవర్తించి (అప్), రే రాగానే అతడి ముందు ఎబ్బీ మీద అక్కసు ప్రదర్శించి (ఇంకా అప్),  రాత్రంతా ఆలోచించి తెల్లారి ఎబ్బీమీద లైంగిక దాడి చేసి (మరింకా అప్), ఫైనల్ గా చంపేసే నిర్ణయంతో పతాకస్థాయికి చేర్చాడు తన పాత్రోచిత చాపాన్ని. 

          విస్సర్ తన స్వగతంతో గొప్ప యాంటీ హీరోలా తన చాపాన్ని పైకెత్తు కుని, విస్సర్ ని బ్లాక్ మెయిల్ చేసి జెండా ఇంకా పైకెత్తుకుని సిగరెట్ కేస్ డైనమిక్స్ తో తెరచాప కంట్రోలు తప్పాడు. 

          చివరిది టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ అంటే తెర మీద సినిమా నడుస్తున్న సమయం గడిచేకొద్దీ కథనం టెన్షన్ ని పెంచుకుంటూ పోవడం. ఇది చూస్తూనే వచ్చాం, సీను సీను కీ పాత్రల అంతర్- బాహ్య చర్యల వల్ల కథనం టెన్షన్ ని ఎలా  పెంచుకుంటూ పోయిందో. ఇక ఎమోషన్ విషయాని కొస్తే, ఇది ప్లాట్ పాయింట్ 1 దగ్గర ఏర్పాటయ్యే సమస్యని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రధాన రసాన్నే ఎమోషన్ గా ఒలికిస్తూ వుంటుంది. హత్యలకి దారి తీస్తున్నందువల్ల ఈ బిగినింగ్ విభాగంలో ప్రధాన ఎమోషన్ సీరియస్ ఎమోషనే.
                                                  ***
      పై రెండు  సెట్స్ లోని ఈ తొమ్మిది పనిముట్లతో బాటు నోయర్ ఎలిమెంట్స్ ని ఎలా వాడుకున్నారో గమనించాం. కెమెరా యాంగిల్స్ ని, మూవ్ మెంట్స్ ని, మిర్రర్స్ ని, నీడల్నీ... ఈ ఎలిమెంట్స్ ప్రేక్షకులకి ఏమర్ధమవుతాయనొచ్చు. పైకి చెప్పలేని అనుభూతి ఏదో సబ్ కాన్షస్ గా అనుభవిస్తూనే వుంటారు. మనం 80 ఏళ్ల తర్వాత మన ప్రేక్షకులకి  ఏమర్ధమవుతా యనుకుంటున్నాం. 1930 లలో అమెరికన్లకి సినిమాలు ఏంతో కొత్త. అంత కొత్తలోనే ఫిలిం నోయర్ మూవీస్ ని ప్రారంభిస్తూ- ఈ ఎలిమెంట్స్ ని కలిపి అంత కళాపోషణ ఎందుకు చేశారు. బెడిసి కొడుతుందని తెలీదా? ఈ ఎలిమెంట్స్ విజువల్ గా ఇబ్బంది పెట్టకుండా, సబ్ కాన్షస్ గా వర్కౌట్ అవుతాయని తెలుసు కాబట్టే అప్పట్లోనే కళాపోషణ చేశారు. మనుషుల మానసిక లోకం ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటే. 

          వీటినలా వుంచితే,  పై రెండు సెట్స్ లోని పనిముట్లన్నీ ఎందుకోసం పనిచేస్తు
న్నాయి? మొత్తం  పాత్రల్నీ పరిస్థితుల్నీ తీసుకెళ్ళి  బిగినింగ్ కి చివరిదైన పదమూడో సీన్లో ప్లాట్ పాయింట్ – 1 దగ్గర బ్లాస్ట్ చేయడానికే! 

          ప్లాట్ పాయింట్ -1 స్క్రీన్ ప్లేలో మొదటి మలుపు తీసుకునే కేంద్రం. కథకి మొదటి మూల స్థంభం. ఈ  మూల స్థంభం పటిష్టంగా లేకపోతే, ఇక్కడే బీటలు వారుతుంది కథ. అందుకే మొదటి మూల స్థంభం ఏ ఏ అంశాలు డిమాండ్ చేస్తుందో, అవన్నీ కలుపు కుంటూ రావాలి బిగినింగ్ విభాగంలో. ఈ కలబోతే కథ ప్రారంభ మవడానికి ముఖ్యం. ఇందులో ఏ లోపం జరిగినా ఈ మొదటి మలుపే బలంగా వుండదు,  ఇక కథనేం బలంగా నడిపిస్తుంది.

          ఉదాహరణకి, రే- ఎబ్బీలు సీరియస్ ఆరోపణలు చేసుకుని విడిపోయినట్టూ, మళ్ళీ అంతలోనే ఎబ్బీ రాజీ పడిపోయినట్టూ బిగినింగ్ విభాగంలోనే చూపించారు. ఆప్పుడే  రాజీ పడడమెందుకు, రాజీ పడ్డాకా రే ఆమెకి అప్పుడే అభయహస్తమిస్తున్నట్టు చూపించడ మెందుకూ, స్టోరీ ఇక్కడే ఎక్కువై పోతోంది, దీన్ని మిడిల్ విభగంలో లో చూసుకుందాంలే, తొందరేముందనుకుంటే కొంప కొల్లేరవుతుంది.

          బిగినింగ్ కి ముగింపు ప్లాట్ పాయింట్ -1. ఈ ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఏం జరగాలని ఆశిస్తారో దాన్ని బలీయం చేసే  భావోద్వేగాల్ని నిర్వీర్యం చేయకూడదు. ప్లాట్ పాయింట్ -1 దగ్గర వీళ్ళని చంపే పథకం ఖరారవుతోంది. అలాంటప్పుడు వీళ్ళ రిలేషన్ షిప్ ని బ్రేకప్ గానే చూపిస్తే, విడిపోయిన ఆ ప్రేమికుల్ని చంపుతున్నారంటే ఏం సానుభూతి, ఆందోళనా వగైరా కలుగుతాయి ప్రేక్షకులకి? కలిసిపోయి ఇక పూర్తిగా కమిటైపోయిన లవర్స్ ని చంప బోతున్నారంటే  ఆందోళనా ఆదుర్దా సానుభూతీ వగైరా అన్నీ పుట్టుకొచ్చే వీలుంది.
***
     ఇక చివరిగా  ‘బ్లడ్ సింపుల్’ ప్లాట్ పాయింట్ -1 నిర్మాణం చూద్దాం. బిగినింగ్ బిజినెస్ 
ప్లాట్ పాయింట్ -1 కి చేరే సరికి అందులో ప్రతిఫలించాల్సినవి నాల్గు  ఎలిమెంట్స్ అని పైన మూడవ సెట్ లో చెప్పుకున్నాం. వీటిని గోల్ ఎలిమెంట్స్ అన్నాం. ఇక్కడ ప్రధాన పాత్రకి ఒక గోల్ ఏర్పడుతుంది గనుక అందులో వుండాల్సిన ఎలిమెంట్స్ ఇవీ... కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్. వీటిలో ఒకటి లోపించినా, లేదా బలహీనంగా వున్నా, ప్లాట్ పాయింట్ -1 కూడా బలహీనపడి ప్రధాన పాత్రకి అంత బలమైన లక్ష్యం కూడా ఏర్పడదు. దీంతో చప్పగా సాగుతుంది ఇక్కడ్నించీ మొదలయ్యే కథ. 

          కోరిక : అంటే ప్రధాన పాత్రకి  దాని కెదురైన సమస్యని సాధించి తీరాలన్న బలమైన కాంక్ష పుట్టడం. తద్వారా తనకో, ఇతరులకో లబ్ది చేకూర్చాలన్న ఆశయం ఏర్పడడం. దీనికి ప్రేక్షకులు కన్విన్స్ కావడం. యాక్షన్ లో అయితే ఎలాగైనా విలన్ ని అంతమొందించాలనుకోవడం ఆ కోరిక కావచ్చు, కామెడీలో నైతే ఎన్ని జిత్తులైనా వేసి హీరోయిన్ని పొందాలనుకోవడం ఆ కోరిక కావచ్చు. 

         
పణం:  ఏదీ ఫ్రీగా రాదు. కొంత  మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రధానపాత్ర దానికున్న విలువైనది పణంగా పెట్టాల్సిందే., పణంగా పెట్టకపోతే కోరిక బలహీనంగా కన్పిస్తుంది. గోల్ పట్ల కమిట్ మెంట్ లేనట్టు వుంటుంది. యాక్షన్లో నైతే తనప్రాణాల్నిపణంగా పెట్టొచ్చు, కామెడీలో పరువు మర్యాదలు పణంగా పెట్టి, ప్రేమకోసం ఎంతకైనా దిగజారవచ్చు, తెగించి నాటకాలాడవచ్చు.

           
పరిణామాల హెచ్చరిక : ప్రధాన పాత్ర ఇక్కడ తీసుకుంటున్న నిర్ణయం ఫలితంగా ఏర్పడబోయే విపరిణామాలని సూచించడం. యాక్షన్ అయితే బలవంతుడైన విలన్ తోనే తలపడతాడు కాబట్టి,   విలన్ తో ఏఏ విపరిణామాలు సంభవించవచ్చో ప్రేక్షకులకి సంకేతాలిచ్చి ఆందోళన పర్చడం. కామెడీ అయితే హీరోయిన్ తండ్రివల్లనో, మరొకరితోనో గొప్ప ఇరకాటంలో పడవచ్చన్న  సంకేతాల్ని ప్రేక్షకులకివ్వడం.  ఈ సంకేతాలకి బిగినింగ్ బిజినెస్ లోనే బీజాలు వేయడం. 

    ఎమోషన్ : పైవన్నీ అర్ధవంతంగా, బలంగా వుంటే దానికదే ఎమోషన్ కూడా శక్తివంతంగా పుడుతుంది. కామెడీ కైతే కామెడీగా వుండే ఎమోషన్, యాక్షన్ అయితే థ్రిల్ చేసే ఎమోషన్, హార్రర్ అయితే భయపెట్టే ఎమోషన్...ప్రేమ కథలకి, ఫ్యామిలీ కథలకి బాధించాలంటే / ఏడ్పించాలంటే సీరియస్ ఎమోషన్...

          ఈ నాల్గు గోల్ ఎలిమెంట్స్ బ్లడ్ సింపుల్’ ప్లాట్ పాయింట్ – 1 దగ్గర  ఎలా వున్నాయో చూద్దాం. ఈ ఎలిమెంట్స్ అన్నీ ప్రధాన పాత్రగా తిరిగి ఇక్కడ ప్రవేశించిన డిటెక్టివ్ విస్సర్ పాత్రకి ఎలా వున్నాయంటే... కోరిక మార్టీ కోసం మర్డర్లు చేసి పెట్టాలని. ఈ కోరికకి   మంచి పేమెంట్ పురిగొల్పింది. డబ్బు తీసుకున్నాక మార్టీ కోరిక నేరవేర్చాల్సిందే (ఇది పైకి కన్పిస్తున్న కోరిక.  నిజానికిది విస్సర్ సొంత కోరికే. దొరికిన బకరాని కోసుకుని నంజుకునే రకం కదా. మిడిల్ విభాగంలో బయటపడతాడు). 

          దీనికి పణంగా ఏం పెడుతున్నాడూ...తన జీవితాన్నే పెడుతున్నాడు. మర్డర్లంటే మాటలు కాదుకదా?  జీవితంతో జూద మాడుతున్నాడు.   

          పరిణామాల హెచ్చరిక ఏమిటంటే, ఎంత డిటెక్టివ్ గా మర్డర్లు చేసినా, దొరికిపోయే ఛాన్సులు ఎప్పుడూ వుంటాయి. సిగరెట్ కేస్ తో, సిగరెట్ లైటర్ తో  అతడి సైకలాజికల్ ట్రాక్ మనకి సూచన లందిస్తోంది ఏదో ప్రమాదం పొంచే వుందని. 

       ఇక ఎమోషన్ కి వస్తే, విస్సర్ పట్ల విముఖతా, థ్రిల్ రెండూ ఏర్పడేట్టు వుంది. ఇది సబబే. మార్టీ పట్ల కూడా ఇవే  ఏర్పడతాయి. ఇది కూడా సబబే. కానీ ఎబ్బీ, రే ల పట్ల తీవ్ర ఆందోళన పెరిగిపోతుంది...ఎందుకంటే విడిపోయి మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారు పాపం. ఆలోచిస్తే అప్పుడే విడదీసి అప్పుడే కలపడం కోయెన్ బ్రదర్స్ ఒక అంశాన్ని దృష్టిలో పెట్టకుని చేశారనిపిస్తుంది. వాళ్ళని అసలు విడదీయకుండా అలాగే వుంచేస్తే, ప్లాట్ పాయింట్ -1 ఘట్టంలో వాళ్ళని చంపాలనుకున్నప్పుడు ప్రేక్షకులకి ఎమోషన్ పుట్టక పోవచ్చు. విడదీసి మళ్ళీ కలపడం ద్వారా ఆ బంధం బలీయమై ప్రేక్షకులు బాగా ఎటాచ్ అవుతారు. అప్పుడు ప్లాట్ పాయింట్ -1 దగ్గర వాళ్ళని చంపే ప్లానుకి అఫెండవుతారు, రియాక్టవుతారు, ఇదన్యాయం అనుకుంటారు. ఈ లెవెల్ ని సాధించే ఉద్దేశంతోనే  విడదీసి కలిపారనిపిస్తోంది.

          ఇదీ బిగినింగ్ విభాగపు నిర్మాణం. ఇక మిడిల్ కెళ్దాం. వెళ్లేముందు ఒకసారి ఈ లింక్ ని క్లిక్ చేస్తే  ఒక వీడియో ఓపెనవుతుంది. అది  2009 లో తీసిన ‘ది రూల్స్ ఆఫ్ ఫిలిం నోయర్’ అనే డాక్యుమెంటరీ. దీన్నోకసారి వీక్షించండి, ఆల్ ది బెస్ట్,


-సికిందర్