రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, June 24, 2016

షార్ట్ రివ్యూ!






రచన- దర్శకత్వం : రామరాజు
తారాగణం :  
నాగశౌర్య, నిహారిక, రావు రమేష్, ప్రగతి,
వెన్నెల కిషోర్, అవసరాల శ్రీనివాస్
సంగీతం : సునీల్ కశ్యప్,  ఛాయాగ్రహణం : రాంరెడ్డి
నిర్మాత : మధుర శ్రీధర్
విడుదల :  24 జూన్, 2016
***
   మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా పరిచయమవుతున్న సినిమా అంటూ విపరీత ప్రచారం జరిగిన ‘ఒక మనసు’ కి దర్శకుడు రామరాజు. హీరో నాగశౌర్య, నిర్మాత మధుర శ్రీధర్. మొదటి సారిగా నాగశౌర్య సినిమా నాగశౌర్య సినిమా అని కాకుండా ఒక హీరోయిన్ సినిమా అన్నట్టు విడుదలవడం, దీనికి తగ్గట్టు ఇదివరకు నాగశౌర్య సినిమాలకి లేనంత  ఓపెనింగ్స్ రావడం ఈ సినిమా ప్లస్ పాయింట్. దర్శకుడి అదృష్టం. నిహారికతో ఈ సినిమా తీయకపోతే  దర్శకుడికి ఈ స్థాయి గుర్తింపు  కూడా రావడం కష్టం. కానీ ఈ స్థాయి  గుర్తింపుతో, ఈ ఓపెనింగ్స్ తో, తీరా సినిమా కెళ్తే  ఎలా వుంటుంది?

        నిస్సందేహంగా సహన పరీక్షలా వుంటుంది. ట్రెండ్ లో వున్న  ప్రేమ సినిమాల సరళికి దూరంగా, ఎక్కడో  1916 లో తీసిన సినిమాలా వుంటుంది. ఆ నాడు కూడా ఇలా రాసి, ఇలా తీసి వుండరు. అంత పాత మోడల్ ప్రేమలా వుండి, అన్ని  తరగతుల యువ ప్రేక్షకులూ గోల చేసేదిలా వుంటుంది. బెంచి క్లాసు ప్రేక్షకులైతే భరించలేక వెటకారాలు చేసేదిలా వుంటుంది. మెగా హీరోయిన్ తో మోడరన్ ప్రేమ కథ ఉంటుందనుకుంటే,  ఏదో పోయెటిక్ కథంటూ తీసిన దర్శకుడి సొంత కవిత్వాన్ని భరించలేక  హాహాకారాలు చేసేదిలా వుంటుంది. 

          ఈ రోజుల్లో పోయెటిక్ సినిమాలు ఎక్కడ ఎవరు తీస్తున్నారని ఈ సినిమా తీశారో అర్ధం గాదు. పోనీ ఆ పోయెట్రీ కూడా విషయపరంగా విఫలమై- చిత్రీకరణలో బావుంటే సరిపోయిందా? రచన, నటనలు, సంగీతం పోయెటిక్ గా ఉండనవసరం లేదా? కథా కథనాలు, పాత్ర చిత్రణలు అర్ధవంతంగా ఉండనవసరం లేదా? అంత పోయెట్రీ వుంటే ప్రేక్షకులు డైలాగులకి ఫీలవకుండా అంత పగలబడి ఎందుకు నవ్వుతున్నారు. ఈ సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ అనేదే లేదు. కానీ వచ్చీ రాకుండా రాసిన గ్రాంథిక డైలాగులతో బాగా ఎంటర్ టైన్ చేశారు. ఎందుకు ఇంటర్వెల్ పడిందో అర్ధం గాదు- ఆ విశ్రాంతి దృశ్యం మీద ‘కాలానికి మార్పు వుంది, ప్రేమకి ఉంటుందా?’ అని సిల్లీగా అక్షరాలు వేసినప్పుడే దర్శకుడు ఇంకా ఏ కాలంలో, ఈ స్థాయి ఆలోచనలతో  వున్నాడో తెలిసిపోతుంది. కాలానికి తను అన్నట్టే మార్పు వుంటుంది, తనే మారాల్సిన అవసరముంది ప్రేక్షకుల ఆర్ధిక మానసికారోగ్యాల దృష్ట్యా. 

          అబ్బాయేమో రాజకీయ నాయకుడుగా ఎదగాలని సెటిల్ మెంట్ల దందా  చేస్తూంటాడు. అమ్మాయేమో ప్రభుత్వాసుపత్రిలో డాక్టరు. ఎందుకు ఇలాటి అబ్బాయిని ప్రేమిస్తుందో అర్ధంగాదు. అబ్బాయి జైలుకు పోతాడు. తిరిగి బెయిల్ మీద విడుదలై వచ్చేవరకూ అతడి కోసమే ఎదురు చూస్తుంది. పోనీ అప్పుడైనా పెళ్లి చేసుకుంటారా అంటే అదీ  లేదు. ఇంకా ప్రేమించుకుంటూనే వుంటారు. జైలుకి వెళ్ళక ముందు ఎలా, ఎంత ప్రేమించుకున్నారో అవే డైలాగులతో, అదే రొటీన్ తో ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూ ప్రేమించుకుంటూనే వుంటారు సాగదీస్తున్న రబ్బరులా.   ఈ ప్రేమలో పోయెట్రీ  ఏమిటంటే- పదే  పదే చేతులు పట్టుకోవడాలు, చేతులు రుద్దుకోవడాలు, నుదుటి మీద పదే పదే పదే ముద్దులు పెట్టుకోవడాలు, ఒక లక్షసార్లు గభీల్మంటూ కావిలించుకోవడాలూ, అద్దం  మీద చేతి ముద్రలు వేసుకోవడాలూ...... సీతాకోక చిలుకలు పట్టుకోవడాలు, తామర పువ్వులు తెంపు కోవడాలు, వర్షంలో ఆడుకోవడాల్లాంటి పాత్రోచితం కాని చిన్నపిల్లల చేష్టలూ....సహన పరీక్ష పెడుతూ చాదస్తంగా, చాలా  అమెచ్యూరిష్ గా వుంటుంది పోయెటిక్ విజన్. ‘చెప్పు సూర్య నన్ను ప్రేమిస్తున్నావా’ అంటే, ‘నా ప్రాణం ఉన్నంత వరకూ’ అంటాడు. ఈ స్థాయిలో, కాకపోతే నవ్వొచ్చే ఏదో గాంభీర్యంతో  వుంటాయి ప్రేమ డైలాగులు. చిట్ట చివరికి అబ్బాయి తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ కి లొంగిన అబ్బాయి అమ్మాయికి కటీఫ్ చెప్పేస్తాడు. ఇక ట్రాజడీయే. ఈ రోజుల్లో ట్రాజిక్ ప్రేమ కథ కూడా వర్కౌట్ అవుతుందనుకోవడం దర్శకుడి దూరదృష్టికి నిదర్శనం.   


          కమర్షియాలిటీ లేని స్లో పాటలు ఇంకా సహన పరీక్ష. ఏదో విషాదం జరిగిపోయినట్టు  ఒక్క పెట్టున శోకాలాపనలతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఇంతకీ  ఏ ఆడియెన్స్ ని దృష్టిలోపెట్టుకుని సినిమా తీశాడబ్బా అన్పిస్తుంది. యూత్ ని కాదు- నడివయసు అభిరుచిగల ప్రేక్షకులా? వాళ్ళయినా మెదడు ఇంటి దగ్గర పెట్టి మనసు చేసుకుని ఈ సినిమా చూడాలా? ఏ అభిరుచి కోసం? దేన్ని  ఆస్వా దించడం కోసం? 

          నాగశౌర్య పాత్రలో, నటనలో హుషారు లేదు, పెప్ లేదు, పంచ్ లేదు. పూర్తి పాసివ్ పాత్ర. ఈ పాసివ్ పాత్ర కూడా అర్ధమే గాదు. ఇక నిహారిక కదలకుండా నిలబడి మూతిముడుచుకుని ఉండడమే నటన అనుకున్నట్టుంది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కన్పించవు  తను చైతన్యవంతంగా ఉండక, డల్ గా వుంటుంది. రెండున్నర గంటల సినిమా నడక అంతా నత్త నడక. పైగా ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకొస్తూంటారు. మధ్యమధ్యలో ప్రెజెంట్ లో కొస్తూంటుంది  కథ. కాసేపటికి ఏది ఫ్లాష్ బ్యాకో ఏది ప్రెజెంట్ కథో అర్ధంకాని గజిబిజి ఏర్పడుతుంది. పైగా ఫ్లాష్  బ్యాక్  ప్రారంభం నిహారిక పాయింటాఫ్ వ్యూలో ఆమె చెప్పుకుంటున్న కథలా  ఉంటూ, ఉన్నట్టుండి నాగశౌర్య  తన వాయిసోవార్ తో చెప్పే కథగా మారిపోతూంటుంది మధ్యమధ్యలో. స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే, పాత్ర చిత్రణల పట్టింపు అన్నవి ఏ కోశానా కనపడవు. 

          నాగబాబు తన కుమార్తెతో ఇలా రంగ ప్రవేశం చేయించడం కచ్చితంగా తప్పటడుగే తన అపార అనుభవం దృష్ట్యా. నాగబాబు కుమార్తె నుంచి శభాష్ అనుకునే హీరోయిన్ని ఆశిస్తారు, జీరోయిన్ని కాదు. మిగతా తన మెగా వారసులు స్టార్లుగా ఎలా విరగదీస్తున్నారో అలా విరగదీయక పోతే నిహారిక సినిమాల్లోకి రావడం అనవసరమే.


-సికిందర్