ఈ అంకెలేమిటి? 70 87 54 50 00 (ఏడు వందల ఎనిమిది కోట్ల,
డెబ్బై ఐదు లక్షల, నలభై ఐదు వేలు), 34 96 90 14 500 (ముప్పై నాలుగు వేల తొంభై ఆరు
కోట్ల,
తొంభై లక్షల, పద్నాలుగు వేల, ఐదు వందలు)... లేదా 750, 000
డాలర్లకి 370 మిలియన్ డాలర్లు. మొదటిది బడ్జెట్, రెండోది కలెక్షన్లు. ఈ సంవత్సరం
ఇప్పటికి హాలీవుడ్ బాక్సాఫీసు చార్ట్స్ లో ఐదవ స్థానం. దీంతో సినిమా గురించి చర్చ తక్కువ,
కలెక్షన్ల గురించి రచ్చ ఎక్కువై పోయింది.
ఇది ‘అబ్సెషన్’ సంగతి. ఇంకా షాకింగ్
ఏమిటంటే, ఒక బిగ్ మల్టీ స్టారర్ సినిమా కాదు, ఇంకెవరో టాప్ స్టార్ సినిమా కూడా కాదు
– కేవలం ఒక యానిమేషన్ అడ్వెంచర్ కామెడీ ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ 110
మిలియన్ డాలర్ల బడ్జెట్ (ఒక వెయ్యీ ముప్పై
తొమ్మిది కోట్ల, అరవై రెండు లక్షల
రూపాయలు) కి, 1008 బిలియన్ డాలర్లు (తొంభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల, అరవై ఏడు లక్షల రూపాయలు) వసూలు
చేసి టాప్ పొజిషన్లో నిలవడం!
ఐదారు పాత్రలతో చిన్న
తారాగణంతో ‘అబ్సెషన్’ లాంటి హార్రర్, అసలు తారాగణమే లేని ఇంకో యానిమేషన్ ఈ విధంగా
వేలకోట్ల వసూళ్ళతో నిలబెట్టి రికార్డుల్ని బద్దలు కొడుతూంటే, మాంద్యం ఎక్కడుంది?
నిరుద్యోగం ఎక్కడుంది? ద్రవ్యోల్బణపు తాకిడి ఎక్కడుంది? సినిమాలు చూసేందుకు ప్రేక్షకుల
దగ్గర డబ్బులే డబ్బులు! ఓటీటీల్లో వచ్చేదాకా ఆగే కక్కుర్తి కాదు. ఏకంగా థియేటర్లకి
వెల్లువెత్తి వాటి కళకి కొవ్వొత్తులు వెలిగించే కమిట్మెంట్. ఇంకో యానిమేషన్ ‘టాయ్
స్టోరీ 5’ ఐదో స్థానంలో వుంది. హాలీవుడ్ నిజంగా సెలెబ్రేట్ చేసుకుంటోంది. బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నులు కడుతూ, జీడిపీ
లో 0. 5 శాతం, అంటే 1.17 ట్రిలియన్ల డాలర్ల వాటాతో అత్యంత భారీ వినోద పరిశ్రమగా నమోదవుతోంది...
నిజమేమిటంటే, మళ్ళీ ‘అబ్సెషన్’ లాటి పాకెట్ మనీకి బకెట్స్ తో
బాక్సాఫీసు తన్నుకు వచ్చే మూవీ
ఎప్పుడొస్తుందో, ఎవరు తీస్తారో ఏమీ తెలియదు, ఎవరూ చెప్పలేరు. ఇలాటి హిట్స్ ని
అనుకుని ఎవరూ తీయలేరు. దీనికొక ఫార్ములా, మంత్రం, తంత్రం ఏమీ వుండవు. ‘లాలో: కృష్ణ
సదా సహాయతే’ గుజరాతీ మూవీ 50 లక్షలతో తీస్తే 120 కోట్లు వచ్చాయి! ఇదింకో అరుదయిన
సంఘటన. దీని రహస్యమేమిటి? ఆ సూత్రం ఏమిటి? దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు వీటి నుంచి ఏ
పాఠం నేర్చుకోవాలి? ఏమో, ఏమీ
చెప్పలేం!
సింపుల్ గా చెప్పాలంటే, ‘అబ్సెషన్’ మూవీ ని మిలియన్ డాలర్ల లోపు బడ్జెట్ తో నిర్మిస్తే,
భారీగా 370 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని26 ఏళ్ళ ఒక యూట్యూబర్ సాధించాడు. తను తీసింది ఇండిపెండెంట్
(స్వతంత్ర) సినిమా. ‘ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్’, ‘పారానర్మల్ యాక్టివిటీ’, ‘మై
బిగ్ ఫ్యాట్ గ్రీక్ వెడ్డింగ్’ లాటి స్వతంత్ర సినిమాలు అనూహ్య విజయాలు సాధించాయి.
రిస్కు లేని మైక్రో బడ్జెట్. పోతే తక్కువ నష్టంతో పోతాయి, వస్తే భారీ లాభాలు
వస్తాయి. కథగా చెప్తే అందులో నిర్మాతలకి కనకవర్షం కనిపించని అనుభవాలుంటాయి
దర్శకులకి. అప్పుడు స్వయంగా నిర్మించుకోవడమే. స్వయంగా నిర్మించాలంటే డబ్బులుండవు.
‘అబ్సెషన్’ దర్శకుడు కర్రీ బార్కర్ ముందుగా 2024 లో కేవలం 800 డాలర్లతో ‘మిల్క్ & సీరియల్’ అనే హార్రర్ తీసి
యూట్యూబ్ లో ఫ్రీగా వదిలాడు. అది జెన్ జీ ప్రేక్షకుల్లో బాగా సక్సెస్ అయింది.
దాంతో నల్గురు నిర్మాతల్ని పోగేసుకుని ఏడున్నర లక్షల డాలర్లతో జెన్ జీ ని టార్గెట్ చేస్తూ ‘అబ్సెషన్’ తీస్తే,
అది బంపర్ సక్సెస్ కావడంతో హాలీవుడ్ లో ఈజీగా
ఎంట్రీ సంపాదించేశాడు. ప్రస్తుతం ఏం చేయాలో అర్ధం కానన్ని ఆఫర్స్ వస్తున్నాయి. మన
దగ్గర ఏళ్ళ తరబడి నిర్మాతలకోసం తిరగడమే గానీ, టార్గెట్ ప్రేక్షకులకి శాంపిల్ గా ఒక
క్రేజీ థాట్ ని యూట్యూబ్ లో ఫ్రీగా వదలడానికి లక్ష రూపాయలు తెచ్చి పెట్టుకునే
ప్రయత్నాలు కూడా చెయ్యరు. నిర్మాతలే పెట్టాలి, కెరీర్ కోసం తామేమీ ఖర్చు
పెట్టుకోరు.
స్పష్టంగా
కనిపిస్తోందేమిటంటే, కర్రీ బార్కర్ ‘అబ్సెషన్’
తీయకముందే అతడికి ప్రేక్షకులు తయారుగా వున్నారు.
800 డాలర్లతో ఓ హార్రర్ తీసి యూట్యూబ్‌లో ముందే ఫ్యాన్స్ ని సంపాదించుకుని రెడీగా
వున్నాడు. అయినా అతను స్టూడియోలకెళ్ళి అది
చూపించుకుని అవకాశాలు పొందే ప్రయత్నం చేయలేదు. స్వయంగా ఇండిపెండెంట్ సినిమా
మాత్రమే తీయాలనుకున్నాడు. స్టూడియోల్లో ప్రయత్నించి వుంటే, ‘అబ్సెషన్ ‘ ఈ సంవత్సరపు
ప్రధాన థియేట్రికల్ సక్సెస్ స్టోరీస్ లలో ఒకటిగా నిలుస్తుందని ఎవరూ గుర్తించి
ప్రోత్సహించే వాళ్ళు కారు. ఈ మొత్తం బ్యాక్ గ్రౌండ్ లో నీతి : లక్ష పెట్టుబడితో
ఒకటి తీసి యూట్యూబ్ ఫ్యాన్స్ ని సమకూర్చుకో, ఆ పైన తీయాలనుకుంటున్న దానిని
ఇండిపెండెంట్ సినిమాగా తీయ్, టాలీవుడ్ ద్వారాలు వాటికవే బార్లా తెరచుకుంటాయ్!
వూరికే టైం వేస్ట్, లైఫ్ వేస్ట్ చేసుకుంటూ టాలీవుడ్ గడపలో కూర్చోకు!
.jpg)
నిజానికి ఈ బ్యాక్ గ్రౌండ్ లోకి లోతుగా
వెళ్ళేకొద్దీ,
ఆసక్తి
కలిగించింది సినిమా కాదనీ, ప్రేక్షకులేనని తెలుస్తోంది. యువ ప్రేక్షకుల్ని తిరిగి థియేటర్లకి ఎలా తీసుకురావాలా అని హాలీవుడ్ కూడా సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వుంది. ఆర్భాటంగా
పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు ఈ సమస్యని పరిష్కరిస్తాయోమో ననుకున్నారు. అది రుజువు కాలేదు. కానీ ఒక చిన్న
హార్రర్ సినిమా వస్తే ఒక్కసారిగా యువ
ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో సినిమా హాళ్ళకి రావడం మొదలుపెట్టేశారు. ఈ సినిమాలో చూపించింది
తమ కథ అన్న ఒకేఒక్క మౌత్ టాక్ తో వెల్లువెత్తారు ప్రేక్షకులు. ఫ్రాంచైజీలు తమ
కథలతో కూడిన సినిమాలు కావుగా? ఈ రోజుల్లో యూట్యూబ్, టిక్‌టాక్, డిస్కార్డ్, ట్విచ్, రెడ్డిట్, గ్రూప్ చాట్లు, గేమింగ్
కమ్యూనిటీలలో జోరుగా మౌత్ టాక్ వ్యాపిస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్స్ సినిమా థియేటర్లకి పోటీ అని విమర్శిస్తారు. కానీ
ప్రేక్షకుల్ నాడిని పట్టుకోవడానికి ఇవే ప్రధాన వనరులు.
'అబ్సెషన్' గురించి చెప్పుకోవాల్సిన ప్రధానాంశం ఏమిటంటే, ఇది హాలీవుడ్
సాంప్రదాయ మార్కెటింగ్ యంత్రాంగం నుంచి రాలేదు. సమాజాల నుంచి వచ్చింది. సామాజిక
మాధ్యమాల నుంచి వచ్చింది. సమాజాలు శక్తివంతమైనవి, అవి
ప్రచారకుల్ని సృష్టిస్తాయి.
ఇంతా చేసి విజయం సాధిస్తే
అప్పుడు రెగ్యులర్ నిర్మాతలు రంగ ప్రవేశం చేసి వాటి నకిలీలని తయారు చేయడానికి
ముందు కొస్తారు. ‘అబ్సెషన్’ లాంటివి మరెన్నో నిర్మించి అవతల పడేస్తారు. ప్రతీ ‘బ్లెయిర్
విచ్ ప్రాజెక్ట్’ కి వందల సంఖ్యలో ఫౌండ్-ఫుటేజ్ సినిమాలు తీసి వదిలారు. ప్రతీ ‘పారానార్మల్
యాక్టివిటీ’ కి లెక్కలేనన్ని కాపీలు కుమ్మారు.
ఈ మొత్తం నుంచీ, యువ ప్రేక్షకులు ఇప్పటికీ తమ గురించి కొత్త విషయాల్ని వెండితెర
మీద చూడాలని ఆరాటపడుతున్నారన్నదే నేర్చుకోవాల్సిన పాఠం. నిర్మాతలు తరచుగా మరచిపోయే విషయం అదే. తెలిసిన వాటినే,
చూసిన వాటినే సీక్వెల్స్. ప్రీక్వెల్స్, రీబూట్స్. రీమేక్స్ అంటూ తీస్తూ ప్రచారంలో
వుండడాన్నే కోరుకుంటున్నారు.
-సికిందర్
‘అబ్సెషన్’ రివ్యూ రేపు!