రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, August 23, 2026

1441 : ట్రూ రైటర్స్ స్పెషల్!


 

    ఇదొక ‘సినిమా డైలాగ్ రైటింగ్ బూస్టర్‌ క్లాస్’ అనుకుందాం. ఈ ఐదవ భాగాన్ని ఒక రచయిత నేర్చుకునే క్రమంలో ప్రారంభిద్దాం :

1. డైలాగ్ అంటే ఏమిటి?
చాలామంది అనుకునేది : పాత్రలు మాట్లాడేది డైలాగు అని. కానీ అసలు నిర్వచనం: డైలాగ్ అనేది పాత్ర తన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగించే చర్య (యాక్షన్).

ఉదాహరణ: తండ్రి కొడుకుతో  ‘భోజనం చేయి’ అంటాడు. ఇది సమాచారం కాదు. ఇది ఒక చర్య - కొడుకుని భోజనం చేయించే ప్రయత్నం. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అన్నది డైలాగు కాదు. ‘నీకిష్టమైన బ్రాస్ లెట్ కొనిస్తాను’ అన్నది డైలాగు. ఇందులో ప్రేమని వ్యక్తపరచే చర్య వుంది- బ్రాస్ లెట్ కొనివ్వడం. డైలాగ్ విజువల్ గా వుంది. బ్రాస్ లెట్ ప్రస్తావనతో విజిబిలిటీ వచ్చింది. వెంటనే ప్రేక్షకులు బ్రాస్ లెట్ ని ఊహించుకుంటారు. దాంతో మనోహరమైన ఫీలింగ్ కి లోనవుతారు. మన సబ్ కాన్షస్ మైండ్ మాటలకి స్పందించదు, విజువల్స్ కి స్పందిస్తుంది. దానికి అర్ధమయ్యే భాషలు రెండే రెండు : విజువల్స్, ఫీలింగ్స్. విజువల్స్ ని మెదడు క్రియేట్ చేస్తుంది. మరి ఫీలింగ్స్? ఫీలింగ్స్ ని రెండో మెదడు అయిన గుండె క్రియేట్ చేస్తుంది. కనుక విజువల్ గా ప్రకాశించని మాటలు విజువల్స్ ని క్రియేట్ చేయవు, ఫీలింగ్స్ నీ క్రియేట్ చేయవు. మెదడు అలా విని వూరుకుంటుందంతే.

విజువల్స్, ఫీలింగ్స్ రెండూ వుంటే, అప్పుడు ఆ సమాచారం మెదడులో వుండే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టంకి అందుతుంది. అప్పుడేం జరుగుతుందంటే, ఓహో ఈ మనిషి బ్రాస్ లెట్ ని ఫీలవుతున్నాడా- అని బయట ఎక్కడికెళ్ళినా బ్రాస్ లెట్స్ ని చూపిస్తూంటుంది. ఇది వరకు ఎన్నో బ్రాస్ లెట్స్ ని చూసి వుండొచ్చు. వాటిని పట్టించుకుని వుండరు. కానీ ఇప్పుడు సినిమాలో చూసి ఫీలవడం వల్ల ఆర్ ఏ ఎస్ పనిగట్టుకుని బ్రాస్ లెట్స్ ని చూసేలా చేసుకుంటూ పోతూంటుంది. సినిమాలో హీరో పలికిన డైలాగు ఇంతపని చేసిందా అని ఉక్కిరిబిక్కిరవడం ప్రేక్షకుల పనై పోతుంది. అందుకని  మంచి రచయితలు సబ్ కాన్షస్ మైండ్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాంతో విజువల్ రైటింగ్ చేస్తే డైలాగులు ప్రేక్షకుల జీవితాల్లో మ్యాజిక్ చేస్తాయి.

2. ప్రతీ డైలాగుకి ఒక ఉద్దేశం వుండాలి
డైలాగ్ రాయడానికి ముందు ఒక ప్రశ్న: ఈ పాత్ర ఈ మాట ఎందుకు చెబుతోంది? జవాబు వీటిలో వీటిలో ఒకటి కావాలి: ఒప్పించడం, బెదిరించడం, ప్రేమని చూపించడం, అవమానించడం, మోసం చేయడం, ధైర్యం చెప్పడం, నిజం దాచడం, నిజం బయటపెట్టడం. ఇలా కాకపోతే, ఆ డైలాగ్ అవసరం లేకపోవచ్చు. డబ్బింగ్ ఖర్చు కూడా వేస్ట్.

3. సమాచారం ఇవ్వొద్దు
కొత్త రచయితలు ఎక్కువగా చేసే తప్పు: నాన్న చనిపోయిన తర్వాత నేను ఒంటరిగా పెరిగాను. ఇది ప్రేక్షకుడికి సమాచారం. దాన్ని భావోద్వేగంగా మార్చండి: నాన్న ఫోటోతోనే మాట్లాడటం అలవాటైపోయింది. ఒకే లైన్‌లో విషయం బాధ రెండూ ఉన్నాయి.

4. పాత్ర మాట్లాడక ముందు ఆలోచించాలి
ముందు ఈ మూడు విషయాలు రాయాలి : వయసు, చదువు, జీవితం నేర్పిన పాఠం.
ఉదాహరణ: 60 ఏళ్ళ రైతు –‘విత్తనం వేసిన రోజే పంట రాదలే అబ్బాయా’. 25 ఏళ్ళ  సాఫ్ట్‌వేర్ ఇంజనీర్- ‘ఒక బగ్ కూడా మొత్తం సిస్టమ్‌ని ఆపేస్తుంది’ ఇద్దరూ ఓపిక గురించే మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ప్రపంచాలు వేరు.

5. డైలాగులో దాచిన భావం (సబ్ టెక్స్ట్)
పాత్ర మనసులో- ‘నువ్వు నన్ను వదిలి వెళ్ళకు’ అనే భావం. పైకి డైలాగు - ‘వెళ్తే తలుపు వేసి వెళ్ళు’ అసలు భావం మాటల్లో లేదు.

6. గొప్ప డైలాగ్ మూడు స్థాయుల్లో పనిచేస్తుంది
ఉదాహరణ: ‘మంటని ఆర్పొచ్చు’ ... కాస్తాగి, ‘కానీ కాలిన గుర్తుని కాదు’
ఇందులో 1. మాటలకి అర్థం వుంది, 2. పాత్ర మనసు కనిపిస్తోంది, 3. జీవిత సత్యం కూడా మెరుస్తోంది. ఇలాంటి త్రీ ఇన్ వన్ డైలాగులు గుర్తుండి పోతాయి.

7. ప్రతి సీన్‌లో ఒక ‘ఉల్టా పల్టా’ వుండాలి.
సీన్ మొదట్లో విలన్ బలంగా వుంటాడు. చివరి కొచ్చేసరికి హీరో బలంగా మారాలి. ఈ మార్పు మాటల వల్ల కూడా జరగొచ్చు.

8. ప్రేక్షకులు తర్వాతి లైన్ ఊహించకూడదు
ఉదాహరణ : ‘నేను నిన్ను చంపేస్తాను’ అంటాడు విలన్. హీరోలో రియాక్షన్ కన్పించక పోయేసరికి ఆశ్చర్యంగా- ‘నిన్ను చంపితే...’ అని ఆగిపోతాడు. ‘ఏముంది, నువ్వు తప్పించుకుంటావు’ అంటాడు హీరో.

9. డైలాగ్ రాయడానికి రోజూ చేసే ప్రాక్టీసు
రోజుకోక సీన్ తీసుకోవాలి. ఒకే సీన్‌ని ఇన్ని స్టైల్స్ లో రాయాలి : హీరో స్టైల్, విలన్ స్టైల్, కామెడీ స్టైల్, ప్రేమ కథ స్టైల్, పోలీస్ స్టైల్.

ఇలా 30 రోజులు చేస్తే, ప్రతి పాత్రకి వేర్వేరు స్వరం (వాయిస్) ఇవ్వడం సహజంగా వస్తుంది.

10. హోమ్‌వర్క్
ఈ ఒక్క పరిస్థితికి 5 డైలాగులు రాయాలి
పరిస్థితి: ఒక కొడుకు, 20 సంవత్సరాల తర్వాత తండ్రిని మొదటిసారి కలుస్తాడు. ఈ ఒకే పరిస్థితిని ఈ ఐదు భావాలతో రాయాలి: కోపం, ప్రేమ, ద్వేషం,వ్యంగ్యం, మౌనం (చాలా తక్కువ మాటలతో రాయాలి). ఇది చేస్తే, భావోద్వేగం డైలాగుని ఎలా మార్చుతుందో స్పష్టంగా తెలుస్తుంది.

సాధారణంగా దర్శకులు ఒక సీను చెప్పి రాయమంటారు. అలాంటప్పుడు ఎలా రాయాలో, ఎలా రాస్తే నచ్చుతుందో తలబద్దలు కొట్టుకుంటూ వాయిదాలు వేస్తూ పోనవసరం లేదు. అదే సీనుని పైన చెప్పిన ఐదు వెర్షన్లలో విడివిడిగా రాసిచ్చేస్తే, ఏదో ఒక భావం నచ్చి తీరుతుంది దర్శకుడికి. ఆ అయిదు భావాలకి మించి ప్రత్యామ్నాయం లేనే లేదు. ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. రూపాయికి ఐదు రూపాయల పని చేయడమే రచయిత ముందున్న జీవన మార్గం. దాంతో రాయడంలో తనే రాటుదేలతాడు.

వచ్చే ‘బూస్టర్ క్లాస్’ లో హీరో ఇంట్రడక్షన్ డైలాగులు, విలన్ డైలాగులు, క్లయిమాక్స్ డైలాగులు, కామెడీ టైమింగ్, మాస్ పంచ్ డైలాగుల రహస్యాలు విప్పుకుందాం.

-సికిందర్