రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, August 24, 2023

1356 : స్క్రీన్ ప్లే సంగతులు!


     మిళంలో పా. రంజిత్, లోకేష్ కనక రాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ నవతరం దర్శకులు ముగ్గురూ స్టార్ సినిమాల కథల్ని, పాత్ర చిత్రణల్ని మూస ఫార్ములా - టెంప్లెట్ చట్రంలోంచి బయటికి తీసి కమర్షియల్ సినిమాలకి కొత్త రూపం తొడుగుతున్నారు. కథలు, పాత్ర చిత్రణలే కాదు, కథనాన్ని కూడా సాంప్రదాయ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ తో విభేదించి స్ట్రక్చరేతర రియలిస్టిక్ జానర్లోకి మార్చేస్తున్నారు. పా. రంజిత్ రజనీకాంత్ తో తీసిన కబాలీ’, కాలా’, ఆర్యతో తీసిన సార్పట్టా ఈ కోవలో కొస్తాయి. లోకేష్ కనక రాజ్ కార్తీతో తీసిన ఖైదీ’, కమల్ హాసన్ తో తీసిన విక్రమ్ ఈ పంథాననుసరించాయి. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ శివ కార్తికేయన్ తో తీసిన డాక్టర్’, రజనీ కాంత్ తో తీసిన తాజా జైలర్ దీనికి అద్దం పడతాయి. బాలీవుడ్ ఈ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించక ఫ్లాపులతో కుంగుతోంది. టాలీవుడ్ ఇంకా చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్ ల కాలం నాటి మూస ఫార్ములా- టెంప్లెట్ లోనే ఇరుక్కుని భోళాశంకర్ లాంటి పరాభవాల్ని చవిచూస్తోంది.

        రీబూట్ చేసిన సీనియర్ స్టార్ కమర్షియల్ కి జైలర్ ని మించిన ఆధునిక మోడల్ లేదు. ఇంకా సీనియర్ స్టార్ ని మూసఫార్ములా టెంప్లెట్ కథా కథనాలతో బంధించి ఇమేజిని కాపాడలేరు. ఇమేజి మారాల్సిందే. పాత్రలు, పాత్ర చిత్రణలు మారాల్సిందే. నాల్గు పాటలు, వాటికి స్టెప్పులు, నాల్గు ఫైట్లు, కామెడీలూ ఇవన్నీ వదులుకుని ముందుకు పోతున్నారు తమిళ స్టార్ల ఫ్యాన్స్ తో బాటు ప్రేక్షకులు. కానీ తెలుగు స్టార్ల ఫ్యాన్స్, ప్రేక్షకులు కాలంలో ఎక్కడో ఇరుక్కుని వాటినే డిమాండ్ చేసి తృప్తి తీర్చుకుంటున్నారు. ఆధునిక దృక్పథమనే మాటే లేదు.
       
ఈ పూర్వరంగంలో
జైలర్ స్క్రీన్ ప్లే సంగతులు పరిశీలించాల్సిన అవసరమేర్పడుతోంది. అసలు జైలర్ స్క్రీన్ ప్లే కథా, గాథా? కథతో కూడిన గాథా, గాథతో కూడిన కథా? కథ తీస్తున్నామనుకుని గాథ తీసి ఫ్లాప్ చేసుకున్న సినిమాలెన్నో- తాజా బ్రో సహా. సినిమాలు కథతో వుంటాయి, లేకపోతే గాథతో వుంటాయి. ఈ రెండూగాక కథతో కూడిన గాథ ఏమిటి? గాథతో కూడిన కథేమిటి? మళ్ళీ ఇందులో డాక్యుమెంటరీ తరహా స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ఏమిటి? ఇలాటిది బహుశా ఇంతవరకూ చూడలేదు. జైలర్ లో ఎందుకు చూశాం? సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన  జైలర్ అన్ని స్క్రీన్ ప్లే నియమాలనూ ఉల్లంఘించి కూడా పది రోజుల్లో 500 కోట్లు వసూలు చేసిందంటే దీని స్క్రీన్ ప్లేని పోస్ట్ మార్టం చేసి చూడాల్సిందే. ఈ పని మొదలెడదాం. ముందుగా విషయమేమిటో చూద్దాం...

విషయం ఇదీ!

    ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) భార్య విజయ (రమ్యకృష్ణ) తో, కొడుకు అర్జున్ (వసంత్ రవి)- కోడలు శ్వేత (మిర్నా మీనన్) – మనవడు ఋత్విక్ లతో రిటైర్మెంట్ జీవితాన్నిసంతోషంగా గడుపుతూంటాడు. ఋత్విక్ యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుకోవడంలో తోడ్పడుతూ వుంటాడు. కొడుకు అర్జున్ ఎవరికీ భయపడని నిజాయితీగల ఏసీపీ. దేవుళ్ళ విగ్రహాల్ని విదేశాలకి స్మగ్లింగ్ చేసే మలయాళీ గ్యాంగ్‌స్టర్ వర్మ (వినాయకన్) పై అర్జున్ దర్యాప్తు చేస్తూంటాడు. ఈ క్రమంలో వర్మ అనుచరుడు శీనుని ఎదుర్కొంటాడు. వర్మ ఆచూకీ గురించి శీను చెప్పడు. అర్జున్ వర్మని పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ అకస్మాత్తుగా తప్పిపోతాడు. అతడ్ని వర్మ చంపివుంటాడనే విషయాన్ని కప్పిపుచ్చడానికి ఆత్మహత్యకి  పాల్పడి వుండవచ్చని పోలీసు శాఖ ప్రచారం చేస్తుంది. 
        
కొడుకుని పోగొట్టుకున్న ముత్తువేల్ దుఃఖిస్తూ, కొడుకుని మరీ అంత  నిజాయితీపరుడిగా, నిర్భయుడిగా పెంచడం తప్పయినట్టు పశ్చాత్తాపపడుతూ, ఒక నిర్ణయం తీసుకుంటాడు. పోలీసు శాఖ సహకరించక పోతే తానే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాడు. వర్మ అనుచరుడు శీనుని చంపి, స్థానిక టాక్సీ డ్రైవర్ విమల్ (యోగిబాబు) సాయంతో శవాన్ని మాయం చేస్తాడు.
       
దీంతో
వర్మ మనుషులు ముత్తువేల్ మనవడి మీద హత్యాయత్నానికి పాల్పడతారు. ముత్తువేల్ మనవడ్ని కాపాడుకుంటాడు. వర్మ ఫోన్ చేసి, ఎన్నిసార్లు కుటుంబాన్ని కాపాడుకుంటావని వెక్కిరిస్తాడు. కుటుంబంలో ఒకొక్కర్నీ చంపుతానని హెచ్చరిస్తాడు. ముత్తువేల్ వర్మ అనుచరులిద్దరిని ట్రాప్ చేసి చంపేస్తాడు. తర్వాత భద్రత కోసం కుటుంబాన్ని ఒక సైకియాట్రిస్టు ఇంట్లో వుంచి, కర్ణాటక బయల్దేరతాడు. అక్కడ ఒక పరివర్తన చెందిన నేరస్థుడు నరసింహ (శివరాజ్ కుమార్) ని కలిసి, నలుగురు షార్ప్ షూటర్స్ ని ఏర్పాటు చేయమని కోరతాడు ముత్తువేల్.

       
షార్ప్ షూటర్స్ సాయంతో ముత్తువేల్ వర్మని అవమానించి
, బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో వర్మ, బీహారీ గ్యాంగ్ స్టర్ కామదేవ్ (జాకీష్రాఫ్) సాయం తీసుకుంటాడు. గ్యాంగ్ ని పంపి ముత్తువేల్ కుటుంబాన్ని చంపమని కోరతాడు. ఇంటి మీద దాడి చేసిన కామదేవ్ గ్యాంగ్ ని ముత్తువేల్ షార్ప్ షూటర్స్ చంపేస్తారు. విజయగర్వంతో పిచ్చిగా నవ్వుతాడు ముత్తువేల్.
       
ఇప్పుడు వర్మ టార్గెట్ ముత్తువేల్ అని అసలు విషయం తెలుసుకున్న కామదేవ్
, ముత్తువేల్ అసలెవరో వర్మకి చెప్తాడు. పూర్వం ముత్తువేల్ తీహార్ జైలులో జైలర్. ఖైదీలతో కఠినంగా వ్యవహరించే జైలర్ ముత్తువేల్, వాళ్ళని సంస్కరించే ప్రయత్నం చేసేవాడు. ఈ క్రమంలో ఖైదీలతో బాటు గ్యాంగ్ స్టర్ కామదేవ్ తో, ఇంకా అనేక మంది క్రిమినల్స్ తో ముత్తువేల్ కి నెట్ వర్క్ ఏర్పాటయింది. అతడికి సాయపడే ఈ నెట్ వర్క్ లో ఒక సభ్యుడే నరసింహా. ఈ గతమంతా తెలుసుకున్న వర్మకి, ముత్తువేల్ పవర్ అర్ధమవుతుంది.
       
ఇప్పుడు తన ఇంటిమీద జరిగిన దాడిని తిప్పికొట్టిన ముత్తువేల్
, డైరెక్టుగా తేల్చుకుందామని వర్మ స్థావరాని కెళ్తాడు. వర్మని కొట్టిపడేసి చంపబోతూంటే, వర్మ ముత్తువేల్ కొడుకు అర్జున్ వీడియో చూపిస్తాడు. అర్జున్ చనిపోలేదు, వర్మ బందీగా బ్రతికే వున్నాడు. ఈ నిజం తెలుసుకున్న ముత్తువేల్ కి, వర్మ ఒక బేరం పెడతాడు. కొడుకు సజీవంగా దక్కాలంటే, ఒక ఆలయంలో వున్న ప్రసిద్ధ పురాతన కిరీటాన్ని తెచ్చివ్వాలంటాడు.  ఆ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరిలో వుంది.
        
ముత్తువేల్ ఆలయానికి ట్రస్టీగా వున్న బ్లాస్ట్ మోహన్ (సునీల్) అనే సినిమా నటుడి మీద దృష్టి పెడతాడు. మోహన్ నటి కామనా (తమన్నా) ని ప్రేమిస్తూంటాడు. దర్శకుడు కూడా కామనాని ప్రేమిస్తూంటాడు. ఈ వ్యవహారంలో తలదూర్చి ఆలయంలో కిరీటం దోపిడీకి ప్లానేస్తాడు ముత్తువేల్. దీనికి తన నెట్ వర్క్ లో ముంబాయిలోని స్మగ్లర్‌ మాథ్యూ (మోహన్ లాల్) సాయం తీసుకుని కిరీటాన్ని కాజేస్తాడు. దాన్ని వర్మకి పంపిస్తాడు.
        
కిరీటాన్ని అందుకున్న వర్మ ముత్తువేల్ కొడుకు అర్జున్ ని విడుదల చేస్తాడు. ఇప్పుడు ఏసీపీ అర్జున్ తన అసలు స్వరూపం బయటపెడతాడు. నీతీ నిజాయితీలు కాదని, డబ్బు సంపాదించుకోవాలని, వర్మ తనకి షేర్ ఇస్తే తండ్రి ముత్తువేల్ ని చంపి అడ్డు తొలగిస్తాననీ అంటాడు. కిరీటంలో వున్న హిడెన్ కెమెరా ద్వారా ఇదంతా చూస్తున్న ముత్తువేల్, కొడుకు విశ్వాసఘాతానికి ఖిన్నుడవుతాడు. ఆ కిరీటం నకిలీదని తెలుసుకుని వర్మ పిచ్చెత్తిపోతాడు. ముత్తువేల్ వచ్చేసి వర్మ స్థావరాన్ని ధ్వంసం చేసి, అతడ్ని అంతమొందించేస్తాడు. కొడుకుకి ఒక అవకాశమిస్తూ చట్టానికి లొంగిపొమ్మంటాడు. కొడుకు అర్జున్ వినకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు. నరసింహా షార్ప్ షూటర్స్ అతడ్ని చంపేస్తారు.

టెస్ట్ తో స్క్రీన్ ప్లే సంగతులు

ఇప్పుడొక చిన్న టెస్టు పెట్టుకుందాం. ఈ టెస్టుతో స్క్రీన్ ప్లే అంటే ఎవరికెంత తెలుసో తేలిపోతుంది. తర్వాత స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్దాం. పై విషయంలో- ట్రీట్ మెంట్ లో- లేదా స్క్రీన్ ప్లేలో ప్లాట్ పాయింట్స్ ఎక్కడెక్కడున్నాయి? ఇంకోసారి మొత్తం చదవండి. ప్లాట్ పాయింట్ వన్ ఎక్కడుంది? ప్లాట్ పాయింట్ టూ ఎక్కడుంది? బిగినింగ్ ఎంతవరకూ వుంది? మిడిల్ ఎక్కడ ప్రారంభమై ఎక్కడ ముగిసింది? ఎండ్ ఎక్కడ మొదలైంది? ఈ బ్లాగు ద్వారా ఇంతకాలం సంపాదించుకున్న జ్ఞానంతో శ్రద్ధగా చదివి, ప్లాట్ పాయింట్స్ ని, యాక్ట్స్ నీ గుర్తిస్తేనే తర్వాత స్క్రీన్ ప్లే సంగతులు అర్ధమవుతాయి....
        టైమ్ తీసుకోండి. సాయంత్రం ఇక్కడే కలుద్దాం. స్క్రీన్ ప్లే సంగతులు పూర్తి చేద్దాం...
—సికిందర్