దర్శకత్వం
: తనూజా చంద్ర
తారాగణం : ఇర్ఫాన్ ఖాన్, పార్వతీ తిరువోత్ కొట్టువట్ట, నేహా ధూపియా, పుష్టీ శక్తి, ఈషా శర్వాణీ, భజరంగ్ బలీ సింగ్ తదితరులు
కథ : కామనా చంద్ర, స్క్రీన్ ప్లే : తనూజా చంద్ర – గజల్ ధలీవాల్, మాటలు : గజల్ ధలీవాల్
సంగీతం : బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రావర్కర్; ఛాయాగ్రహణం : ఈషిత్ నారాయణ్
బ్యానర్ : జీ స్టూడియోస్, జార్ పిక్చర్స్
నిర్మాతలు : సుతపా సిక్దర్, శైలజా కేజ్రీవాల్, అజయ్ రాయ్
విడుదల : నవంబర్ 10, 2017
***
యంగ్ రోమాంటిక్ కామెడీలకి, రోమాంటిక్ డ్రామాలకీ, రోమ కామ యమ డ్రామాలకీ ఎప్పుడూ మార్కెట్ రెడీగానే వుంటుంది, కాకపోతే ఎప్పుడు ఫ్లాపవుదామా అని అవి కూడా రెడీగా వుంటాయి. కారణం అవి ప్రేమలు కాక కథకుల చాదస్తాలు గనుక. అదే మిడిలేజీ ప్రేమ సినిమాలు అరుదుగా వస్తాయి, కానీ వచ్చినప్పుడల్లా నచ్చి తీర్తాయి. కారణం కథకుల కామన్ సెన్సు గనుక. కాలేజీ ప్రేమలకి వయసు అవరోధం కాదు, మిడిలేజీ ప్రేమలకి వయసే అవరోధం. ఈ అవరోధం ప్రేమకి ఒక మర్యాద నిచ్చేస్తుంది. అలా దర్జాగా ప్రేమలు దోబూచులాడతాయి వయసు మీరిన జంటల మధ్య. అచ్చి బుచ్చి కాలేజీ ప్రేమలు అప్పచ్చి అవకుండా అచ్చి వచ్చేది మిడిలేజీ ప్రేమల్ని చూసి చస్తేనే. చాదస్తపు కథకులు వీణ సినిమాలతో యూత్ ని ఇంకా ముసలి మూకలా తయారు చేసి రోకలి కట్టేస్తారు. కామన్ సెన్సు కథకులు మిడిలేజీ ప్రేమ సంగతులతో యూత్ ని గిటార్ వాయించగల్గేంత అప్డేట్ చేసి వదుల్తారు. ఐతే ఐరనీ ఏమిటంటే, ఈ వయసు మళ్ళిన ప్రేమలు చూసేదేమిటని యూత్ ఛీ థూ అనుకోవడం. బుద్ధిగల ప్రేమల్ని చూపించే ఆ థియేటర్లకి డుమ్మా కొట్టి, కాలేజీల్లో బుద్ధిలేని ప్రేమలు వెలగబెట్టుకోవడం, అవి ఆరిపోగానే అల్లరై పారిపోవడం. ప్రేమనేదాన్ని కాలేజీలు కాదు, మిడిలేజి ప్రేమ సినిమాలు చక్కగా నేర్పుతాయి.
తారాగణం : ఇర్ఫాన్ ఖాన్, పార్వతీ తిరువోత్ కొట్టువట్ట, నేహా ధూపియా, పుష్టీ శక్తి, ఈషా శర్వాణీ, భజరంగ్ బలీ సింగ్ తదితరులు
కథ : కామనా చంద్ర, స్క్రీన్ ప్లే : తనూజా చంద్ర – గజల్ ధలీవాల్, మాటలు : గజల్ ధలీవాల్
సంగీతం : బెనెడిక్ట్ టేలర్, నరేన్ చంద్రావర్కర్; ఛాయాగ్రహణం : ఈషిత్ నారాయణ్
బ్యానర్ : జీ స్టూడియోస్, జార్ పిక్చర్స్
నిర్మాతలు : సుతపా సిక్దర్, శైలజా కేజ్రీవాల్, అజయ్ రాయ్
విడుదల : నవంబర్ 10, 2017
***
యంగ్ రోమాంటిక్ కామెడీలకి, రోమాంటిక్ డ్రామాలకీ, రోమ కామ యమ డ్రామాలకీ ఎప్పుడూ మార్కెట్ రెడీగానే వుంటుంది, కాకపోతే ఎప్పుడు ఫ్లాపవుదామా అని అవి కూడా రెడీగా వుంటాయి. కారణం అవి ప్రేమలు కాక కథకుల చాదస్తాలు గనుక. అదే మిడిలేజీ ప్రేమ సినిమాలు అరుదుగా వస్తాయి, కానీ వచ్చినప్పుడల్లా నచ్చి తీర్తాయి. కారణం కథకుల కామన్ సెన్సు గనుక. కాలేజీ ప్రేమలకి వయసు అవరోధం కాదు, మిడిలేజీ ప్రేమలకి వయసే అవరోధం. ఈ అవరోధం ప్రేమకి ఒక మర్యాద నిచ్చేస్తుంది. అలా దర్జాగా ప్రేమలు దోబూచులాడతాయి వయసు మీరిన జంటల మధ్య. అచ్చి బుచ్చి కాలేజీ ప్రేమలు అప్పచ్చి అవకుండా అచ్చి వచ్చేది మిడిలేజీ ప్రేమల్ని చూసి చస్తేనే. చాదస్తపు కథకులు వీణ సినిమాలతో యూత్ ని ఇంకా ముసలి మూకలా తయారు చేసి రోకలి కట్టేస్తారు. కామన్ సెన్సు కథకులు మిడిలేజీ ప్రేమ సంగతులతో యూత్ ని గిటార్ వాయించగల్గేంత అప్డేట్ చేసి వదుల్తారు. ఐతే ఐరనీ ఏమిటంటే, ఈ వయసు మళ్ళిన ప్రేమలు చూసేదేమిటని యూత్ ఛీ థూ అనుకోవడం. బుద్ధిగల ప్రేమల్ని చూపించే ఆ థియేటర్లకి డుమ్మా కొట్టి, కాలేజీల్లో బుద్ధిలేని ప్రేమలు వెలగబెట్టుకోవడం, అవి ఆరిపోగానే అల్లరై పారిపోవడం. ప్రేమనేదాన్ని కాలేజీలు కాదు, మిడిలేజి ప్రేమ సినిమాలు చక్కగా నేర్పుతాయి.
దర్శకురాలు తనూజా చంద్ర ఎప్పుడో 1998 -99 లలో
మహేష్ భట్ క్యాంపులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ తో ‘సంఘర్ష్’,
‘దుష్మన్ ‘అనే రెండు బిగ్ థ్రిల్లర్ హిట్స్ తీసి, ఇంకో మూడు చిన్నతరహా సినిమాలు
చేసి, గత పదేళ్లుగా పూర్తిగా తెరమరుగైపోయింది. ఇప్పుడు తను వయసు పైబడి, వయసుమళ్ళిన ప్రేమ సినిమాతో ఒక స్లీపర్ హిట్
ఇస్తోంది. ఇది అరుదైన విన్యాసం. ఇంత గ్యాప్ తర్వాత ఓ సినిమా అంటేనే హడలిపోతారు ప్రేక్షకులు. కానీ తనూజా అంత వడలి
పోలేదు.
ఖాన్లలో ఇర్ఫాన్ ఖాన్ వేరు. భారీ
బడ్జెట్లు అవసరం లేదు. కమర్షియల్ హంగామాలక్కర్లేదు. ఓ చిన్న పరిధిలో, జీవితం కన్పిస్తే చాలు –ఒప్పుకుని నటించేస్తాడు.
పాన్ సింగ్ తోమార్, డీ- డే, హైదర్, పీకూ, లంచ్ బాక్స్, హిందీ మీడియం, ఇప్పుడు
ఖరీబ్ ఖరీబ్ సింగిల్...దేనికదే సినిమాటిక్ కాని ఒక సినిమాయేతర జీవితం, అనుభవం,
నటనా.
ఖరీబ్ ఖరీబ్ సింగిల్ (చాలా మతిపోయే
టైటిల్. దీన్ని తెలుగు చేయాలంటే కవులే కావాలి, ఖరీబ్ అంటే సమీపం) లో ఇంకేమని
మెచ్యూర్డ్ ప్రేమల్ని చూపిస్తారు. ఇటీవలి కాలంలో అమితాబ్ – టబులతో ‘చీనీ కమ్’
వచ్చింది, ఇర్ఫాన్ – దీపికా లతో ‘పీకూ’ వచ్చింది, ఇర్ఫాన్ – నిమ్రత్ కౌర్ లతో
‘లంచ్ బాక్స్’ కూడా వచ్చింది...ఇలా మూడింట్లో రెండూ ఇర్ఫాన్ వే వచ్చాక, ఇంకా తనకి మూడోది దేనికి? ఇంకేం వయసు మళ్ళిన ప్రేమలు చూపిస్తారు? ఇదే
చూద్దాం...
కథ
జయా సుశీంద్రన్ (పార్వతీ తిరువోత్ కొట్టువట్ట)
ముంబాయిలో ఇన్సూరెన్స్ కంపెనీ ఉద్యోగి. వయసు 35. భర్త చనిపోయాడు. ఈమెని చూసి కొంటె
కొలీగ్ ఒకామె, ఇంకెంత కాలమిలా సింగిల్ గా
వుంటావ్, త్వరగా సెటిలవ్వు, లేకపోతే
‘దర్వాజా బంద్ అయిపోతుంది’ అని టీజ్ చేస్తూంటుంది. భర్త పేరే పాస్ వర్డ్ పెట్టుకున్నజయ, అతడి జ్ఞాపకాల్ని చేరిపేసుకో లేకపోతుంది. ఏమైతే
అయిందని ఓ డేటింగ్ సైట్ లో ప్రొఫైల్ పెట్టేస్తుంది, రెండేళ్ళు వయసు తగ్గించుకుని.
ఇద్దరు పోకిరీలు రెస్పాండ్ అవుతారు. ఒక కవి కూడా జాయినవుతాడు. కవిని కలుసుకుంటుంది. యోగేంద్ర కుమార్ ధీరేంద్ర నాథ్ ప్రజాపతి అలియాస్ కవి
యోగి (ఇర్ఫాన్) అనే చాంతాడంత పేరున్న నలభై ఏళ్ల బ్రహ్మచారి ఆమెకి అస్సలు నచ్చడు.
అతడి వేష భాషలు, తన గురించే గొప్పలు చెప్పుకోవడం, లేకి జోకులేయడం, ముగ్గురు మాజీ
గర్ల్ ఫ్రెండ్స్ గురించి బయట పెట్టుకోవడం
ఇదంతా చీదరగా వుంటుంది. తను విడో అనేస్తుంది. అయినా వదలడు. ఏం చేస్తూంటావంటే, తను
ఆల్రెడీ రిచ్ కాబట్టి ఏమీ చెయ్యనంటాడు. తిట్టుకుంటూనే రోజూ కలుస్తూంటుంది. పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయినా, ఆ ముగ్గురు
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ తననే తల్చుకుని తల్లడిల్లిపోతున్నారని ఇంకా వంత పాడేసరికి –
నీకంత సీను లేదని ఛాలెంజి చేస్తుంది. తనతో వస్తే చూపిస్తానంటాడు తన సీనేమిటో.
హృషికేష్, ఆళ్వార్, గ్యాంగ్ టక్ ... మూడు చోట్ల ముగ్గురు ఎక్స్ ల పరిస్థితి.
వద్దనుకునీ, వెళ్దామనుకునీ, మళ్ళీ వద్దనుకునీ – విమాన మెక్కేస్తుందతడితో లాంగ్ జర్నీకి. ఈ జర్నీలో అతడితో ఆమెకేమేం జరిగాయన్నది, జరిగి చివరికేం నిర్ణయం తీసుకుందన్నదీ మిగతా కథ.
ఎలా వుంది కథ
హృద్యమైన
కథ అని సినిమాలకి వాడి ఎంత కాలమైంది? మర్చేపోయాం. పైగా ఒక రోమాంటిక్ కామెడీ హృద్యమైనది కావడం
ఎక్కడైనా జరిగిందా - హృషికేశ్ ముఖర్జీ
కాలంలో జరిగిందేమో. ఇప్పుడు టీనేజీ
రోమాన్సుల్ని టీనేజర్లే చూడడం లేదు. ప్రస్తుత రోమాంటిక్ కామెడీ వయసు మళ్ళిన పాత్రల వల్ల, ఫార్ములా
పైత్యాలు లేకపోవడంవల్లా, ఇంకే సినిమాటిక్ అభద్రతా భావాలకి లోనవకపోవడం వల్లా, ఇంత హృద్యమైనది అయింది. దీన్ని ఇలాటి ఇతర
కథలతో (చీనీ కమ్, పీకూ, లంచ్ బాక్స్) పోల్చలేం. దీనికిదే
ఒక విభిన్నమైనది- మోస్ట్ బ్యూటిఫుల్. ఒకసారి చూస్తే మర్చిపోలే కుండా చేస్తుంది.
మళ్ళీ మళ్ళీ చూడాలన్పించేలా చేస్తుంది (మూడేసి సార్లు చూడ్డం వల్లే ఈ రివ్యూ డిలే అయింది. అయినా ఇలా రాయడం మీద కన్నా ఇంకోసారి చూడ్డం మీదే వుంది).
ఇంత గాఢంగా హత్తుకుని ఉక్కిరిబిక్కిరి
చేసే మిడిలేజీ రోమాన్స్ దరిదాపుల్లో కన్పించదు. చాలా సింపుల్ గా వుంటూనే అంత బలంగానూ వుంటుంది. ఒకటే చెప్తుంది పైకి చెప్పకుండానే
– ఓసారి ప్రేమ పుట్టిందా, గౌరవించుకో ఆ ప్రేమని.
ఏ
సంబంధంలోనైనా తనని గౌరవించక పోతే ఆ సంబంధం లోంచి తప్పుకుని గౌరవమున్న చోటికెళ్ళిపోతుంది ప్రేమ. మనిషిని గౌరవించనక్కర్లేదు, ఆ మనిషిని చూడగానే కలిగిన ప్రేమని
గౌరవించు, దాన్ని గుర్తు పెట్టుకో, అప్పడా ప్రేమే ఆ మనిషి మీద గౌరవం పెరిగేలా చేసి కలిపి
వుంచుతుంది. దట్సాల్. ప్రేమ డిసప్పాయింట్ చెయ్యదు, నువ్వే డిసప్పాయింటయి ప్రేమని అగౌరవ
పరుస్తావ్. నీ డిసప్పాయింట్ మెంట్ కేవలం నీ దురవగాహనే.
ప్రేమ కథల్ని మణిరత్నం కూడా ఇక తీయలేడేమో అనుకుంటున్నప్పుడు, ఎలాతీయవచ్చో చెబుతూ ఈ కథ వచ్చింది. ప్రేమని మూలంలో అర్ధం జేసుకుంటే ప్రేమ కథలు బాగానే తీయవచ్చు.
ఎవరెలా చేశారు
చూస్తే ఇందులోని
పాత్రలు రెండూ - కాన్షస్ మైండ్ కి ఒకటి, సబ్ కాన్షస్ మైండ్ కి మరొకటీ ప్రతీకలుగా కన్పిస్తాయి. అయితే కథలో ఈ పాత్రలు తారుమారై వుంటాయి. ఇందుకే ఇవిసూదంటు రాయిలా
ఆకర్షిస్తున్నాయి. వెండి తెర మీద సినిమా చూపించడమంటే కాన్షస్ – సబ్ కాన్షస్ ల లడాయి (ఇంటర్ ప్లే) చూపించడమేగా. ఈ ఇంటర్ ప్లే
తారుమారయిందిక్కడ. సాధారణంగా కాన్షస్ మైండ్ (ప్రధాన పాత్ర), సబ్ కాన్షస్ (కథలో సమస్య- లేదా ప్రత్యర్ధి
పాత్ర ) తో తలపడుతుంది. కానీ ఈ కథలో రివర్స్ లో సబ్ కాన్షసే వెళ్లి కాన్షస్ తో తలపడుతుంది. ఈ
కథలో జయ ప్రధాన పాత్ర, యోగి ప్రత్యర్ధి పాత్ర అయ్యాయి. ఎందుకు జయ ప్రధాన
పాత్రయింది? పెళ్లి చేసుకోవాలని తనే
ప్రయత్నానికి దిగింది కాబట్టి. లక్ష్యమున్న పాత్ర తనే కాబట్టి. అయితే ఈ పాత్ర సర్వసాధారణంగా వుండే
ప్రధాన పాత్రల్లాగా ఓపెన్ గా వుండదు. గుంభనంగా వుంటుంది. తనేమిటో బయటపడదు. పాసివ్
గా వుండదు, యాక్టివ్ గా వుంటుంది.
దుస్తులు లైట్ కలర్స్ వేసుకుంటుంది. ఇవి సబ్ కాన్షస్ మైండ్ లక్షణాలు. సబ్
కాన్షస్ ఓపెన్ గా వుండదు. గుంభనంగా వుంటుంది. తానేమిటో బయటపడదు. పాసివ్ గానూ
వుండదు, నిత్యం కాపలా కాస్తూ యాక్టివ్ గా వుంటుంది. దానికి కలర్స్ వుండవు.
యోగి
కాన్షస్ మైండ్ ఎలా అయ్యాడు? అతను ఆర్భాటంగా వుంటాడు. షోకిల్లా రాయుడిలా
తిరుగుతాడు. ఔట్ స్పోకెన్. తనగురించి అన్నీ వాగేస్తూంటాడు. వేసుకునే డ్రెస్ లు
కూడా బ్రైట్ కలర్స్. యాక్టివ్ గానే వుంటాడు. ఇవి కాన్షస్ మైండ్ లక్షణాలు. అది కూడా
షోకిల్లా రాయుడే. ప్రదర్శనాభిలాష ఎక్కువ దానికి. ఏదీ దాచుకోకుండా ఎంజాయ్
చేస్తుంది. అందరి దృష్టినాకర్షిస్తూ
బ్రైట్ గా వుంటుంది. కానీ అప్పుడప్పుడు పాసివ్ గా కూడా అయిపోతుంది. సబ్ కాన్షస్ నుంచి లైఫ్ లైన్
అందినప్పుడు తిరిగి యాక్టివ్ గా అవుతుంది.
కాన్షస్ మైండ్ కి, సబ్ కాన్షస్ (అంతరాత్మ) అంటే మా చెడ్డ భయం. అంతరాత్మ వేసే ప్రశ్నల్ని, చెప్పే నీతుల్నీ అది తట్టుకోలేదు. అందుకే దాన్ని తప్పించుకు తిరుగుతూ తన స్టయిల్లో తాను బయట ఎంజాయ్ చేస్తూంటుంది. ఇలా అయితే అది జీవితం కాదు. అందుకని కథల్లో దాన్ని తీసికెళ్ళి సబ్ కాన్షస్ లో (సమస్యలో లేదా, ప్రత్యర్ది పాత్రతో లడాయికి) తోసి పారేస్తారు. అప్పుడది నానా యాతనలు పడి, చచ్చీ చెడి జీవిత సత్యాలూ అవీ బుద్ధిగా నేర్చుకుని, గెల్చి ఒడ్డున పడుతుంది పునీతమై. ఇదీ కథల వెనుక వుండే మానసిక శాస్త్రో చిత ఫ్రేమ్ వర్క్.
ఇంకా గొప్ప కథల్ని విడమరిస్తే కాన్షస్
మైండ్, అంటే హీరో అనేవాడు ఇగో. ఆ ఇగో
పొగరు అణచడానికే సబ్ కాన్షస్ లో పడేస్తారు గొప్ప కథల్లో. అప్పుడది సబ్ కాన్షస్
లో అన్ని పోరాటాలూ జయించి, ఒడ్డునపడి, మెచ్యూర్డ్ ఇగోగా మారుతుంది. మనుషులు ఇగోని చంపుకోలేరు.
దాన్ని మెచ్యూర్డ్ ఇగోగా అభివృద్ధి
చేసుకుంటే బాగుపడతారు. ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చి చూపించేవే గొప్ప కథలు.
గొప్ప కథలంటే సైకో థెరఫీ. అవి ప్రేక్షకులకి కూడా సైకో థెరఫీ చేస్తాయి. పురాణాల మర్మం కూడా ఇదే.
ఇప్పుడు ప్రకృతి ధర్మం ప్రకారం, ఇలాటి కాన్షస్ మైండ్ అనే యోగి, సబ్ కాన్షస్ అయిన జయతో తలపడాలే గానీ, జయే వచ్చి యోగితో తలపడ్డమేమిటి? దీనికిలా చెప్పుకుందాం : ఫాంటసీ కామెడీలుంటాయి. వాటిలో పైలోకాల నుంచి దేవుళ్ళు ఆర్భాటంగా దిగివస్తారు. వాళ్ళని ఓ పట్టుపడుతూంటారు మనుషులు. తట్టుకోలేక లబోదిబో మంటారు దేవుళ్ళు. దేవుళ్ళంటే సబ్ కాన్షసే కదా. మనుషులు ఉత్త కాన్షస్ బేవార్సులు. ఇదీ ఫాంటసీ కామెడీల ఫార్ములా.ఒకరి ఆటస్థలం లోకి మరొకరొస్తే ఇంతే, దేవుళ్ళయినా సరే. అలవిగాని చోట అధికులమనరాదు.
ఇలాగే సబ్ కాన్షస్ అయిన జయ, వెళ్లి కాన్షస్ యోగితోనే తలపడుతూ దేవత అయిపోయింది ఫాంటసీ రూలు ప్రకారం. అంటే ఒకరకంగా ఈ రోమాంటిక్ కామెడీ ఫాంటసీ కామెడీ రూపంలో వుందన్న మాట. ఫాంటసీ కామెడీ లాంటి పాత్రలతో! ప్రకృతి ధర్మం ప్రకారం, సబ్ కాన్షస్ తన ఆటస్థలంలోకి కాన్షస్ ని రప్పించుకుని ఓ ఆటాడుకోవాలి గానీ, తగుదునమ్మా అని బయట కాన్షస్ ఆట స్థలంలో కెళ్ళి తనే ఆడాలనుకోవడం కరెక్ట్ కాదు, కామెడీ. ఇదీ ఈ రోమాంటిక్ కామెడీ పాత్రల వెనకాల వున్న రహస్యం. డైనమిక్స్ తో వున్నవే మంచి పాత్రలు, తిరగేసిన డైనమిక్స్ తో ఇంకా క్రేజీ పాత్రలు.
***
మలయాళ నటి పార్వతికిది మొదటి హిందీ. ఆమె
వండర్ఫుల్ నటి. 35 ఏళ్ల ప్రౌఢ పాత్రలో ఎక్కడికెళ్ళినా
ఆంటీగానో, ఆపాజాన్ (అక్కయ్య) గా పిలిపించుకుంటూ, గ్రేస్ ఫుల్ గా రెస్పాండ్ అయ్యే
మెచ్యూర్డ్ పర్సనాలిటీని అలవోకగా పోషించేస్తుందీమె. ముఖ్యంగా ఆమె క్లోజప్స్ కి ఆమె
హావభావాలే వన్నె తెస్తాయి. ఒక మతిపోయే క్లోజప్ - పాస్ వర్డ్ గా పెట్టుకున్న భర్త పేరు డిలీట్ చేసే ముందు క్షణాలు – ముఖభావాలు ఒక దీర్ఘాలోచన నుంచి క్రమక్రమంగా చిరునగవుగా మారుతూ - భర్తకి వీడ్కోలుగానా, యోగికి ఆహ్వానంగానా? అంతుచిక్కదు! అదొక మోనాలిసా నవ్వుకి తక్కువ కాదు. ఇలాటి ఉత్సుకత రేపే దృశ్యాలెన్నో
వున్నాయీమెతో.
ఇర్ఫాన్ సరే. స్టార్ గా తన హవా ఏమాత్రం ప్రదర్శించకుండా పాత్రనీ, దాంతో నటననీ, డైలాగుల్నీ అండర్ ప్లే చేస్తూ రిక్షావాళ్ళని కూడా ఫుల్ ఖుష్ చేసేస్తాడు. ఎక్కడా కూడా ప్రేమించాలన్నట్టు హీరోయిన్ వెంటపడడు. ముందు తన ముగ్గురు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ ని హీరోయిన్ కి చూపించుకోవాలి. అంతవరకూ ఆమె తన తోటి ప్రయాణికురాలే. ఈ తోటి ప్రయాణీకురాలు ప్రేమ డెవలప్ చేసుకోవాలా వద్దా అని తన్నుకు చస్తూంటే తనేం చేయగలడు. ఈ తరహా వ్యక్తిత్వపు పాత్రని నిజజీవితంలోంచి వూడిపడ్డట్టు కూల్ గా పోషించాడు.
ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ గా నేహా ధూపియా, పుష్టీ శక్తి, ఈషా
శర్వాణీ కన్పిస్తారు. ఈ పాత్రల గురించి చెప్తే కథలో సస్పన్స్ పోతుంది. ఒక్కో
వూళ్ళో ప్రత్యక్షమయ్యే మోస్ట్ కేటలిస్టు పాత్రలివి. అలాగే చివర్లో గ్యాంగ్ టక్ లో
వచ్చే భజరంగ్ బలీ సింగ్ పాత్ర. ఇవి కథలో
కన్పించని చాలా లోతుల్లోకి తీసికెళతాయి.
సాంకేతికంగా ఉన్నతంగా వుంది. ముంబాయి, డెహ్రాడూన్, హృషికేశ్, రాజస్థాన్ లోని ఆళ్వార్, సిక్కిం లో గ్యాంగ్ టక్ దృశ్యాలు ఈ ప్రయాణపు కథని సమున్నతం చేశాయి.
చివరి
కేమిటి
తనూజా చంద్ర,
కామనా చంద్ర, గజల్ ధలీవాల్
|
దర్శకురాలు తనూజా చంద్ర,
సీనియర్ రచయిత్రి కామనా చంద్ర, మాటల రచయిత్రి గజల్ ధలీవాల్ ల విజయమిది. దర్శకురాళ్ళు
ఎందుకో తమ ఆస్తిత్వాన్ని కోల్పోతూ మేల్ డైరెక్టర్స్ ని అనుకరించి - మేల్ వెర్షన్
కమర్షియల్ మసాలాలే అందించడానికి ఉత్సాహపడుతూంటారు. ఫిమేల్స్ గా తామేం
ఫీలవుతున్నారో ఆ దృక్కోణంలో సినిమాల్ని చూపించాలనుకోరు. ఇది చాలా కాలంగా వుంటున్న ధోరణి. ఇదంతా త్రోసిరాజని తనూజా చంద్ర, తన
లోని ఆడతనాన్ని సుకుమారంగా, అంతే బలంగా, అర్ధవంతంగా ప్రస్ఫుటింపజేస్తూ, తన స్త్రీ
సహజాతం కొద్దీ ప్రేమని చూసి, తన విజన్ లో
తీయడం వల్ల ఇవాళ్ళొక విభిన్నతరహా వయసుమళ్ళిన రోమాంటిక్ కామెడీని చూస్తున్నాం.
ఎక్కడా తాను పురుష భావజాలానికి లోనైంది లేదు, అలాగని ఫెమినిజం కూడా లేదు. భావజాలాల కతీత మైనది ప్రేమ. ఎవరైనా నోర్మూసుకుని అక్కడికి చేరాల్సిందే. ఇంకా అలాగని తన ఆడ చాదస్తాలు ప్రదర్శించిందీ లేదు. ఆఁ... ఏవుందీ మగాడిలాగే తీసిందనో, ఆడ బుద్ధి పోనిచ్చుకోలేదనో అన్పించుకోకుండా జెండర్ న్యూట్రాలిటీతో వుంది. ప్రొఫెషనలిజమింతేగా.
తనే కాదు, మిగతా ఇద్దరు రచయిత్రులూ ఇదే విజన్ తో వున్నారు. ప్రేమ అనే వొక శాశ్వత విలువకి లోతులు తెలిసిన సీనియర్ కథా రచయిత్రి , దీనికి నేటికాలపు శబ్దం పలికించడానికి యువతరపు మాటల రచయిత్రి. ఇక దర్శకురాలూ మాటల రచయిత్రిల స్క్రీన్ ప్లే!
రోమాంటిక్
కామెడీలు రోమాంటిక్ కామెడీలు ఎందుగ్గాకుండా పోతున్నాయి? మధ్య కొచ్చి రోమాంటిక్
డ్రామాలుగా మార్చెయ్యడం వల్ల. ఇంటర్వెల్ రాగానే మొదలవుతాయి వియోగాలూ ఏడ్పులూ. ఇలా
అయినప్పుడు రోమాంటిక్ డ్రామాలే తీసుకోవాలి. రోమాంటిక్ కామెడీ నిర్వచనం తెలియకుండా
- అమ్మో సెంటి మెంట్ లేదనో, ఫీల్ లేదనో వాటిని
చొరబెట్టేసి, ప్రేమికుల చేత ఏడ్పుల మోత
మోగిస్తే, గొప్ప రోమాంటిక్ కామెడీ
అయినట్టు తమకు తామే ఫీలై పోవడం. అవన్నీ 90 శాతం ఫ్లాపుల కిందికి చేరిపోతున్నా, ఇంకా ఇంకా అదే ఫీలింగు,
ఫ్యాషనబుల్ గా ‘రోంకామ్’ అంటూ కొత్త డీలింగులు.
రోమాంటిక్ కామెడీలు ఒక సైకలాజికల్ ప్రయోజనాన్ని ఆశించి వుంటాయి. ప్రేమికులు తమ సమస్యలు తామే పరిష్కరించుకునే విజేతలు కావాలన్నది వీటి పరమార్ధం. ఇందుకే రోమాంటిక్ కామెడీల్లో హీరో హీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులు. ప్రేమలో వాళ్ళే సమస్యల్ని సృష్టించుకుంటారు, వాళ్ళే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకోవ డానికి చాతుర్యంతో ఏ వ్యూహాలు పన్నుతారో అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ ఖర్మ. వాళ్ళు వేసుకున్న చిక్కు ముడిని వాళ్ళే విప్పుకోవాలి. ఫ్రెండ్సో, తల్లిదండ్రులో, మరొకరో జోక్యం చేసుకుని పరిష్కరించరాదు. అప్పుడు రోమాంటిక్ కామెడీ అవదు, రోమాంటిక్ డ్రామా అయిపోతుంది. హీరో హీరోయిన్లు పాసివ్ అయిపోతారు. విడిపోతారు. ఏడుస్తారు. జానర్ మర్యాద చెడుతుంది. అది కథ గాకుండా గాథ అవచ్చు. ఇంకా అన్ని దరిద్రాలూ చుట్టుకుంటాయి.
రోమాంటిక్ కామెడీల్లో హీరోహీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్థులు. ఇద్దర్లో ఎవరూ పాసివ్ గా వుండరు. ఇద్దరూ యాక్టివ్ క్యారక్టర్స్ అయి వుంటారు. ఎప్పుడూ విడిపోరు, ఏడుస్తూ కూర్చోరు. ఫీలింగులూ, సెంటి మెంట్లూ, ఫ్లాష్ బ్యాకులూ చూపిస్తూ, వాళ్ళ పోటాపోటీ కామెడీ పోరుకి రసభంగం కల్గించరు. చిట్టచివర్లో ఒక్క ఐదు పది నిమిషాలే రోమాంటిక్ కామెడీ బరువెక్కుతుంది. అప్పుడే సెంటిమెంట్లూ, ఫీలింగులూ, ఏడ్పులూ ఏవైనా వుంటే బయట పడేది. తర్వాత మళ్ళీ ఒక ఫన్నీ నోట్ తో సుఖాంతమయ్యేది.
తనూజా చంద్ర మేకింగ్ ఈ నిర్వచనాన్ని గౌరవిస్తూ వుంది. జానర్ మర్యాదతో బాటు, స్ట్రక్చర్, కథనంలో సస్పెన్స్, క్లయిమాక్స్ లో వూహించని మలుపుతో సీరియస్ అవడం ఇవన్నీవిజయవం
తమైన మేకింగ్ కి తోడయ్యాయి. మేకింగ్ కి
మిడిలేజీ రోమాన్స్ అనే కాన్సెప్ట్
తీసుకుని, దీనికింద రోమాంటిక్ కామెడీ జానర్ ని ఎత్తుకుని, మళ్ళీ దీనికింద జర్నీ
కథగా చెబుతూ, అప్పుడు దీనికింద స్క్రీన్ ప్లేని సెట్ చేయాలి. సార్వజనీన మూడంకాల
స్క్రీన్ ప్లే. ఇందులో మళ్ళీ మూడు సెగ్మెంట్లు గా కథనముండాలి :1. నవ్వించే, ఇదయిపోగానే, 2. కవ్వించే, మళ్ళీ ఇదైపోగానే, 3. విలపించే – ఇలా విడివిడి ఎమోషన్స్ ని
పోషించాలి. అన్నీ కలిపేసి పోషిస్తే గజిబిజి
అవుతుంది రసాస్వాదన. ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్ వెళ్తూంటే టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ పైపైకి సాగుతుంది.
ఈ మొత్తం చట్రంలో జర్నీ కథని నడపడమే కత్తిమీద సాము. జర్నీ సినిమాలెన్నో వచ్చాయి, వస్తూనే వున్నాయి. దీన్ని ఎలా నిలబెట్టాలి? సిడ్ ఫీల్డ్ ప్రకారం అటెన్ బరో ‘గాంధీ’ తీసినప్పుడు ఇదే సందేహం వచ్చింది. మహాత్ముడి జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి – ఏదని చెప్పాలి? ఎన్నని చెప్పాలి? అవన్నీ చెప్పాలంటే ఎన్ని సినిమాలు తీయాలి? అందుకని అయన జీవితాన్ని సమగ్రంగా చూపేందుకు మూడుగా విభజించాడు : 1. దక్షిణాఫ్రికాలో లాయర్ గా జీవితం, పొందిన అవమానం; 2. ఇండియా కొచ్చి సహాయనిరా కరణోద్యమం, స్వాతంత్ర్యం; 3. హిందూ ముస్లిం సమస్య, నిర్యాణం. ఆయన స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ ఇదీ. దీంతో సమగ్రంగా వచ్చేసింది గాంధీజీ జీవితం.
తనూజా చంద్ర జర్నీ కథనంతో స్క్రీన్ ప్లే నిలబడాలంటే ఇలాటి పిల్లర్లు కావాలి. ఒక్కో పిల్లర్ ఒక్కో అనుభవం కావాలి. ఈ జర్నీ హీరోయిన్ ని తీసుకుని హీరో తన గతంలోకి చేస్తున్నాడు. ఆ గతంలో ముగ్గురు మాజీ గర్ల్ ఫ్రెండ్స్. మూడు పిల్లర్స్ గా ఈ ముగ్గురితో కథ మూడు మలుపులు తిరగాలి – ఈ మలుపులు హీరోయిన్ ని ప్రభావితం చేస్తూండాలి. మొత్తం ఈ జర్నీనీ, కథనీ. ఈ మూడు పిల్లర్లే నిర్ణయించాలి. అప్పుడు సమగ్రమవుతుంది ‘గాంధీ’ లాగే.
ఫస్టాఫ్
లో ఇద్దరి మధ్య నవ్వించే కథనం, మొదటి ఎక్స్ ని కలిశాక హీరోయిన్ హీరోని కవ్వించే కథనంగా మారుతుంది.
సెకండాఫ్ లో రెండో ఎక్స్ ని చూశాక హీరోయిన్
అలిగి, కవ్వించే కథనంగానే కొనసాగుతుంది. ఇక క్లయిమాక్స్ లో మూడో ఎక్స్ ని కలవడాన్ని తప్పిస్తూ, తనే మలుపు తిప్పేస్తుంది
కథ. అతడి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఇది అసహజమని ఇద్దరికీ తెలుసు. ఎవరు చొరవ చేసి చక్కదిద్దుకోవాలి?
క్లయిమాక్స్ పది నిమిషాలూ ఈ సస్పన్స్ కట్టిపడేస్తుంది. ప్రేమ కథల్లో, కుటుంబ కథల్లో సస్పెన్స్ అంటే అదేదో శంఖినీ జాతి స్త్రీ పాడు వ్యవహారమనుకుంటారు. కేవలం థ్రిల్లర్స్ లోనే సస్పన్స్ వుంటుందనుకుంటారు. కానీ ఎప్పుడయినా క్రైం ఎలిమెంట్ వున్న కుటుంబ కథలు, సస్పన్స్ తో వున్న ప్రేమ కథలు నిలబడ్డాయి.
మొదటి పది నిమిషాల్లోనే కథ జర్నీ కి సిద్ధమవుతూ ప్లాట్ పాయింట్ వచ్చేస్తుంది. ఇలా మొదటి పది నిమిషాల్లో ప్లాట్ పాయింట్ వన్ వేసుకునే కథకులు ఇంటర్వెల్ కల్లా కథ అవగొట్టి సెకండాఫ్ ని మట్టిలో కలిపేసే ఘటనలే ఎక్కువ. కనీసం ఇంటర్వెల్ కి గానీ ప్లాట్ పాయింట్ వన్ వేసుకుంటే గట్టెక్క గల్గే ఊత కర్రలు దొరుకుతాయి. సగానికి కుదించుకు పోయే మిడిల్ ని దాటడా
నికి ఓ కర్ర,
పావుశేరు మిగిలే ఎండ్ ని దేకడానికి ఇంకో కర్ర.
అలాటిది ఇక్కడ పది నిమిషాల్లో మిడిల్లో పడ్డ కథని, ప్లాట్ పాయింట్ టూ వరకూ గంటా నలభై నిమిషాల సుదీర్ఘ కాలమంతా నడపాలంటే కత్తిమీద సామే. ఆ సాము చేయడానికే కథని జ్వలింప జేసే మూడు పిల్లర్ల ఏర్పాటు.
‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లో బోరు కొట్టే ఒక్క క్షణంలేదు, చాలా సినిమాల్లో వచ్చేసిన సీన్లే కదాని ఒక్క సెంటి మీటరు తీసేసే అవసరమే లేదు. ఇదంతా మూస ఫార్ములాలకి వర్తిస్తుంది. ఇంటర్వెల్ కి కావాలని ఏదో ట్విస్ట్ ఇచ్చే, బ్యాంగ్ ఇచ్చే, దిగువతరగతి క్రియేటివిటీ లేదు. ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ ఏ కోణంలో చూసినా ఈ యేటి మేటి బాలీవుడ్ కానుక.
-సికిందర్
.