రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, నవంబర్ 2017, శుక్రవారం

549 : రివ్యూ!



రచన దర్శకత్వం : హెచ్. వినోద్
తారాగణం : కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మల్లేష్ విల్సన్, మాథ్యూ వర్గీస్, జమీల్ ఖాన్, రోహిత్ పాఠక్ తదితరులు
సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : సత్యన్ సూర్యన్, యాక్షన్ : దిలీప్ సుబ్రమణ్యన్
బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , రిలన్స్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా
విడుదల : నవంబర్ 17, 2017
***
        తమిళ స్టార్ కార్తీ మరోసారి పోలీస్ పాత్రతో వచ్చాడు. తమిళ మాతృకకి తెలుగు టైటిల్ అంత కొత్తగానూ బలంగానూ లేకపోయినా (‘కీ’ అని  దీర్ఘం కూడా లేకపోయినా), నాన్ స్టాప్ యాక్షన్ పోషిస్తూ తన రొటీన్ మసాలాకి భిన్నంగా రియల్ పోలీసు అయ్యాడు. ఎన్నో పోలీసు సినిమాలు వచ్చాయి. వాటిలో ఏముంటుందో తెలిసిందే. ముఖ్యంగా ‘సిన్సియర్ పోలీ సాఫీసర్ని’ అన్నగొప్ప  డైలాగు ఖంగు మంటుంది. అవెంత సిన్సియర్ సినిమాలో చూస్తూనే వుంటాం. కార్తీ ఇంకా కొత్తగా ఏం చూపించాడన్నదే ప్రశ్న. ఎలా వుంటాయో తెలిశాక ఎందుకు మరో పోలీసు సినిమా చూడాలి. ఇందులో వున్న ప్రత్యేకత లేమిటి? ఆ ప్రత్యేకతలు ఎంతవరకూ అర్ధవంతంగా వున్నాయి?...ఇవన్నీ తెలుసుకుందాం.
కథ 
      ధీరజ్ ( కార్తీ ) చనిపోయిన తండ్రి బాటలోనే పోలీసాఫీసర్  అవాలనుకుంటాడు. ఆ సంబంధమైన ట్రైనింగు వగైరా పొంది ఇంటికొస్తాడు. ఇంట్లో చెల్లెలు, తల్లీ వుంటారు. పక్కింట్లో చదువబ్బక ఫెయిలవుతున్న ప్రియ (రకుల్ ప్రీత్ సింగ్) వుంటుంది. ఈమెని చూడగానే ప్రేమలో పడి, చదువు నేర్పుతూ ఆమె ప్రేమలో పడేట్టు చేసుకుంటాడు. పెళ్ళయిపోతుంది. 

          ధీరజ్ కి డీఎస్పీ గా పోస్టింగ్ వస్తుంది. తన దుందుడుకుతనంతో అన్ని చోట్లా ట్రాన్స్ ఫరవుతూంటాడు. తాజాగా చెన్నై దగ్గరలో తిరువళ్ళూరుకి బదిలీ అవుతాడు. అక్కడ ఒక ఎమ్మెల్యే హత్యకి గురవుతాడు.  కౄరుడైన దోపిడీ దొంగ  ఓంవీర్ ( అభిమన్యు సింగ్) ముఠా సభ్యులు ఈ హత్యచేసి ఇల్లు దోచుకుంటారు.  గత పదేళ్లుగా రాజస్థాన్ కి చెందిన ఈ ముఠా దోపిడీలూ హత్యలూ చేసి తప్పించుకుంటోంది. దీన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు ధీరజ్. ఈ క్రమంలో ఏఏ ప్రయత్నాలు చేశాడు, ఏఏ  ప్రమాదాలెదుర్కొన్నాడు, చివరికి పట్టుకున్నాడా లేదా అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ 
      తమిళనాడులో జరిగిన నిజ కథ అన్నారు. 1995 – 2005 మధ్యకాలంలో పోలీసులకి సమస్యగా పరిణమించిన  దోపిడీ ముఠాని ప్రాణాలకి తెగించి రాజస్థాన్ వెళ్లి పట్టుకున్న ఓ తమిళనాడు  పోలీసాఫీసర్ కేసు రికార్డే ఈ కథ. కర్ణాటకలో ఇలాటి కిరాతక ముఠా కథతో దండుపాళ్యం అనే సినిమాలొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత ముఠాకి హాజ్ పుత్ వంశానికి చెందిన హవేలీల ముఠా అని ఏదో కల్పిత పేరిచ్చారు (రాజస్థాన్ లో రాజ్ పుత్ లు, హవేలీలూ ధ్వనించేలా ).  అయితే అసలు మూలాల్లోకి వెళ్లి  శతాబ్దాల కొంత చరిత్ర కూడా చెప్పుకొచ్చారు. థగ్స్ లేదా తెలుగులో థగ్గులు అనే ఈ హిందూ ముస్లిం కిరాతక నేరస్థముఠాలు ఆరు శతాబ్దాల క్రితం పుట్టాయి. ఎన్నో తెగలుగా విడిపోయి ఉత్తరాన వివిధ రాష్ట్రాల్లో చెలరేగాయి. ఓ ఇరవై లక్షల మందిని చంపేశాయి. చివరికి బ్రిటిష్ పాలకులు ఈ సంచార నరహంతక దోపిడీ ముఠాల్ని తుదముట్టించినా,  అక్కడక్కడా ఇంకా వారసులు ఉనికిని చాటుకుంటూనే వున్నారు. అమీర్ ఖాన్ నటిస్తున్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ఈ కథే. ప్రస్తుత కథకీ ఈ చారిత్రక నేపధ్యంతో ఒక విలువ వచ్చింది. ఇలాటి ఆలోచనలు తమిళులకే వస్తాయి. తెలుగూస్ కి రానేరావు.


ఎవరెలా చేశారు 
      మసాలా పోలీసులా కాకుండా కార్తీ సమాజంలో పోలీసులా కనపడతాడు. బాధపడతాడు. కష్టపడతాడు. కసి పెంచుకుంటాడు. విజయవంతంగా డ్యూటీ పూర్తి చేస్తాడు. నాన్ స్టాప్ యాక్షన్తో వేడి పుట్టిస్తాడు. హీరోయిన్ తో రోమాన్స్ చేస్తాడు. పాటలు పాడడు, డాన్సులు చెయ్యడు. ముఠాలతో తన రొటీన్ కామెడీ ఫైట్లు చెయ్యడు. రాజస్థాన్ లో తమిళనాడు పోలీసు బృందానికి  నాయకత్వం వహించే సీరియస్ డీఎస్పీ గా కన్పిస్తాడు. ఐతే ఇదే రాజస్థాన్ బీడు భూముల్లో  ‘సర్ఫరోష్’ లో తన టీముతో యాంటీ టెర్రర్ ఆపరేషన్ నిర్వహించే ఎసిపి పాత్రలో అమీర్ ఖాన్ అంత పవర్ఫుల్ అయితే కాదు, కానీ ఫర్వాలేదు. 

          రకుల్ ప్రీత్ సింగ్ ఇంటి దగ్గర ప్రియురాలి హొయలు పోతూ, ఆపైన ఇల్లాలి కళలు పోతూ, కథకి అవసరం లేని హోమ్లీ పాత్రలో  ఫ్యామిలీ ఆడియెన్స్ ని పట్టేయాలని తెగ కృషి చేసింది. ఇదంతా మనకి ఖుషీ కాకుండా పోయింది. ఎందుకో తర్వాత తెలుసుకుందాం. థగ్గుల చరిత్రకి ప్రతినిధి అయిన ముఠా నాయకుడు ఓంవీర్ గా నటించిన ప్రద్యుమ్న సింగ్ పాత్రే మంటగలిసి పోయింది. అసలు ముఖ్యంగా నిలబెట్టాల్సిందీ, బాగా ప్రొజెక్టు చేయాల్సింది ఈ పాత్రనే. 

          మిగిలిన పాత్రల్లో తమిళులకే కొత్త వాళ్ళు ఎక్కువ. కాబట్టి మనకీ కొత్తే. అందరూ ఆయా పోలీసు, దోపిడీ ముఠాల పాత్రల్లో బాగా చేశారు. మహమ్మద్ జిబ్రాన్ నేపధ్య సంగీతం ‘హైపర్’ తర్వాత మళ్ళీ ఇంకోసారి నరాల మీద సమ్మెట పోట్లు. సినిమాలో ఇంకేమీ కనపడకూడదనీ, తనే వినపడాలనీ తపన చాలా వున్నట్టుంది.  దాదాపు ముప్పాతిక భాగం హై ఓల్టేజి యాక్షన్ సీన్లే వున్న ఈ మూవీకి సత్యన్ సూర్యన్ కెమెరా, దిలీప్ సుబ్రమణ్యన్ యాక్షన్ కోరియోగ్రఫీ అద్భుతంగానే వున్నాయి. ఈ రీసెర్చి సహిత భారీ పోలీస్ యాక్షన్ మూవీ దర్శకుడు వినోద్ కి రెండో సినిమా. అయితే ఈ మొత్తం ప్రయత్నంలో మిస్సింగ్ ఇన్ యాక్షన్ అనదగ్గవి రెండున్నాయి. ఇవి కూడా వుంటే ఇంకో మెట్టు పైనుండేది ఈ ప్రయత్నం. అవేమిటో కింద చూద్దాం. 

చివరికేమిటి 
     పోలీస్ ప్రోసీజురల్ జానర్ ని రొటీన్ యాక్షన్ జానర్ లో తీస్తే చాలా ఇబ్బంది వస్తుంది. యాక్షన్  హోరులో పాత్ర చిత్రణలు గల్లంతై
పోతాయి. వాటి మీద ఫోకస్ వుండదు.  వాటికి తగినంత స్పేస్ వుండదు. పక్కా  యాక్షన్ అయితే  ఇవి అంతగా అవసరంలేదు. కానీ ఓ రియల్ పోలీసు కేసు చూపిస్తున్నప్పుడు- ఆ రియల్  పోలీసాఫీసర్ పడే మానసిక సంఘర్షణ, బాధల చిత్రణ హత్తుకోవాలి. అప్పుడే నిజ సంఘటన సార్ధకమవుతుంది. ఇదేమీ ఇక్కడ కన్పించదు. కథకి అవసరం లేని ప్రియుడిగా, భర్తగా హీరోని చూపించడం మీదే ఏదో బాక్సాఫీసు ఆదుర్దా పడిపోయారు. దీంతో ఏమైందంటే ఒక రొమాంటిక్ సీను, ఒక యాక్షన్ సీను, ఒక కామెడీ సీను ... మళ్ళీ ఒక రొమాంటిక్ సీను, ఒక యాక్షన్ సీను, ఒక కామెడీ సీను...ఇలా పూరీ జగన్నాథ్ స్టయిల్లో అవే రిపీటయ్యే తతంగమే నడిచింది. సెకండాఫ్ లో సీరియస్ యాక్షన్ సీన్స్ మధ్య  కూడా – హీరో ఇంటిదగ్గరున్న హీరోయిన్ని వూహించుకునే షాట్స్ , లేదా హీరోయిన్ హీరోని  వూహించుకునే షాట్స్ సడెన్ గా  వచ్చి పడుతూంటాయి. చాలా చిరాగ్గా వుంటుంది డైరెక్షన్. ఫ్యామిలీ చూపించక పోతే ఆడియెన్స్ ఏమనుకుంటారో ఏమో నన్న కంగారే  ప్రవర్థమాన మవుతూంటుంది అంతటా. 

          ఇక ప్రద్యుమ్న సింగ్ క్యారక్టర్. అంత చారిత్రక నేపధ్యం చెప్పిన ఈ పాత్రకి కథే లేకుండా పోయింది. కథంతా హీరో వైపు నుంచి ఏక పక్షమే. ఇతను వెంటాడడం, అతను పారిపోవడం. పారిపోతూ వుండే దొంగోడి పాత్రకి పరిమితం చేశారు. ఒక దశ కొచ్చేటప్పటికి ఈ మొనాటనీ సినిమాలో విషయం లేదనే ఫీలింగ్ కి దారి తీస్తుంది. శతాబ్దాల నాటి థగ్గులు  అని యానిమేషన్స్ తో చరిత్ర చెప్పి వదిలేస్తే అయిపోతుందా. ఇప్పుడు చూపిస్తున్న థగ్గులకి పాత్రచిత్రణ, వాళ్ళ జీవితాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక సంబంధాలు, మానసిక లోకం, ఆశయాలు, గమ్యాలు... ఇవన్నీ చూపించి ఒక అవతలి పక్షం కథగా ఎష్టాబ్లిష్ చేసినప్పుడే వాళ్ళు కూడా అర్ధమై మొత్తం సినిమాలో    ఇన్వాల్వ్ అవగలం. 

          ‘షోలే’ లో గబ్బర్ సింగ్ పుట్టుపూర్వోత్తరాలూ, ఎందుకు బందిపోటు అయ్యాడో ఫ్లాష్ బ్యాకూ  అవసరంలేదు. తనదైన ప్రత్యేక శైలిలో ఆ పాత్ర నటించడానికి, డైలాగులు పేల్చడానికి,  దోచుకోవడాని చంపడానికీ ఇచ్చిన చాలా స్పేస్ చాలు, అన్నీ కవరై పోతాయి. కానీ ఇక్కడ థగ్గు  పాత్రకి ఇదంతా ఏదీ?  గుంపులో ఒకడిగా సరిగ్గా రిజిస్టర్ కూడా కాడు. 


       ప్రద్యుమ్న పాత్రకి క్యారక్టర్ బయోగ్రఫీ లేకపోవడంతో, చోటు చేసుకున్న రెండో లోపం మొత్తం  కథలో ఎక్కడా సస్పెన్స్ లేకపోవడం. కథా కథనాలు పోలీసుల వైపు నుంచి ఏక పక్షమైనప్పుడు సస్పెన్స్ ఎలా క్రియేటవుతుంది. 

          అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ వస్తున్న నేపధ్యంలో,  వినోద్ తీసిన ‘ఖాకీ’ ఇంకో మెట్టు పైనుండాల్సింది.

-సికిందర్  
https://www.cinemabazaar.in