రచన –దర్శకత్వం : సింగీతం శ్రీనివాస రావు
తారాగణం: అయాన్, అహల్యా బమ్రూ, షాలినీ కొండేపూడి, తులసి, శివ
నారాయణ, బెనర్జీ
తదితరులు
రచయితలు : గౌతమి, శశాంక్, రత్న శ్రీకర్, నంద కిషోర్, రాహుల్ రాజేశ్వర్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : అంకుర్ సంజీవ్
బ్యానర్స్ : వైజయంతీ మూవీస్, స్వప్న
సినిమా
నిర్మాత : నాగ్ అశ్విన్, అశ్వినీ దత్, స్వప్నా దత్
విడుదల : జూన్ 12, 2026
***
40 ఏళ్ళ నాటి ఆలోచనకి
తెరరూపమిచ్చారు సుప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ప్రయోగాలకి
పేరుబడ్డ తను, ఈసారి మాటలే పాటలై కథ చెప్పుకుంటూ పోయే మ్యూజికల్ ఫాంటసీని
సృష్టించారు. దీనికి ‘సింగ్ గీతం’ అని పేరు పెట్టారు. పుష్పక విమానం, ఆదిత్య 369,
అపూర్వ సహోదరులు, మయూరి మొదలైన ప్రయోగాలతో బాటు కామెడీలూ కలుపుకుని 60 సినిమాలు
తీసిన తను,13 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత, ఇప్పుడు 61వ సినిమాగా ఈ మ్యూజికల్ ఫాంటసీతో
ప్రేక్షకుల ముందుకొచ్చారు. టీజర్ రిలీజైనప్పుడు ఇంటర్నెట్లో పెద్ద దుమారమే
రేగింది. 94 ఏళ్ళ వయస్సున్నసింగీతం దర్శకత్వ ప్రతిభ చూసి జేన్ జీ దర్శకులకి గట్టి
పోటీ నిస్తున్నట్టు, తెలుగు సినిమా తిరిగి తలెత్తుకోబోతోందనీ, 94 ఏళ్ళ వయస్సులో దృఢ సంకల్పం అంటే ఏమిటో టాలీవుడ్ కి ఆయన రుచి చూపిస్తున్నారంటూ నెటిజనులు
వెల్లువెత్తారు.
ఇతరులు పది సినిమాలు తీసి
ఔట్ డేటెడ్ అయిపోతున్న ఈ రోజుల్లో, సింగీతం తన లోని ఇన్నర్ చైల్డ్ ని కాపాడుకోవడమే
ఈ విజయానికి మూల కారణం. రోమాంటిక్ కామెడీలు తీసే వుడీ అలెన్ కూడా 2023 లో, 87 ఏళ్ళ
వయస్సులో 50 వ సినిమా ‘కూప్ డీ ఛాన్స్’ తీస్తే, థ్రిల్లర్లు తీసే, నటించే క్లింట్
ఈస్ట్ వుడ్ కూడా 2024 లో 94 వ యేట
‘జ్యూరర్ నంబర్ 2’ కి దర్శకత్వం వహించి 45 సినిమాలు పూర్తి చేశాడు. ఇలా
నానేజనరియన్లు అయివుండి కూడా తమ ఉనికిని చాటుకుంటున్న వెనుకటి తరం దర్శకులకి, 80
సమీపిస్తున్న స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూడా తోడై ‘డస్క్లోజర్ డే’ తీసి జూన్ 12
నే విడుదల చేశాడు సింగీతం సినిమాతో బాటు.
కథేమిటి?
ఒక ఆర్ధిక నేరంలో కేడీగా జైలు కెళ్ళి విడుదలవుతాడు ప్రతాప్ (అయాన్). బయటికి రాగానే లాయర్ అతడికో బ్రీఫ్ కేసు ఇచ్చి ఇది మీ నాన్నది అంటాడు. నాన్న మీద కోపంతో దాన్ని విసిరేస్తాడు ప్రతాప్. అందులో మీనాన్న ఆస్తి పత్రాలున్నాయిరా బాబూ అనగానే పరుగెత్తుకెళ్ళి బ్రీఫ్ కేసు తెచ్చుకుంటాడు. తండ్రి (రాహుల్ రవీంద్రన్) తనకి రాసిచ్చిన ఆ పత్రాలతో భూమిని సొంతం చేసుకుని ఎంజాయ్ చేద్దామని కుబేర పురం వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆ భూమి మధ్యలో ఒక పెద్ద చెట్టు, దాని మీద ఈగని కూడా వాలనివ్వని ఒక సెంటిమెంటల్ గర్ల్ గౌరీ (అహల్యా బమ్రూ), ఆ చెట్టుని కూల్చి ఆ భూమిలో బంగారాన్ని తవ్వుకోవాలనుకునే మైనింగ్ కాంట్రాక్టర్లూ ఎదురవుతారు.
ఆ వూళ్ళో మనుషులు తప్ప ఇతర జీవులు కనపడవు. సంవత్సరాల తరబడి జరిగిన బంగారం అక్రమ మైనింగ్ కారణంగా ఎండిపోయిన బీడు భూములు మిగిలాయి. ఎటు చూసినా కనీసం ఒక్క మొక్క లేకుండా ఎడారిలా వుంటుంది. ప్రతాప్ భూమిలో గోల్డ్ ని కాజేసే ఇంకో ప్లానుతో ఇంకో నాన్ సెంటిమెంటల్ గర్ల్ రేణూ (షాలినీ కొండేపూడి) వుంటుంది. ఈమె నల్ల జాతీయుడు స్వాహిలి (అగు స్టాన్లీ చిడోజీ) తో వంద కోట్లకి డీల్ కుదుర్చుకుంటుంది. ఈ విషయం ప్రతాప్ కి తెలిసి ఫిఫ్టీ - ఫిఫ్టీ డీల్ కుదుర్చుకుంటాడు. ఇప్పుడా చెట్టుని కొట్టాలంటే ఆ చెట్టు తొర్ర లోనే నివాసం ఏర్పాటు చేసుకున్న గౌరీ అడ్డుంది.
ఇక దౌర్జన్యంగా చెట్టుని కొట్టి పడేస్తారు. ఆమె ఏడుస్తూ కుబేరుడి గుడికెళ్ళి చెప్పుకుంటే భూకంపం వస్తుంది. ఆ గుహలో పడిపోతుంది. అందులో తన గోడునంతా చెప్పుకుంటుంది. తర్వాత బయటికొస్తే, వూళ్ళో షాకింగ్ దృశ్యాలు ఎదురవుతాయి. వూళ్ళో జనాలెవరికీ మాటలు రావు. మాట్లాడితే మాటలే పాటలుగా వస్తూంటాయి. ఎటు చూసినా పాటలే. గ్రామ దేవత శాపం. దీంతో బెంబేలెత్తిపోతారు. గౌరీకి కూడా ఇదే శాపం తగులుతుంది.
ఇప్పుడా చెట్టుతో గౌరీకి చిన్నప్పట్నుంచీ వున్న అనుబంధం ఎలాటిది? గోల్డ్ మైనింగ్ వెనకున్న కథేంటి? ప్రతాప్ పేరెంట్స్ కి, ఈ సంఘటనలకీ సంబంధమేమిటి? శాప విముక్తికి చేసిన ప్రయత్నాలేమిటి? అందులో సఫలమయ్యారా? ఈ ప్రశ్నలతో సాగేదే మిగతా కథ.
ఎలావుంది కథ?
పర్యావరణ పరిరక్షణ గురించి సింగీతం 40 ఏళ్ళ క్రితం అనుకున్న కథ. ఒక ఫ్రెంచి మూవీ ‘అంబ్రెల్లాస్ ఆఫ్ షెర్బోర్గ్’ (1964) చూసినప్పుడు మాటలే పాటలుగా వుండే సినిమా తీయాలన్న ఐడియా వచ్చినట్టు చెప్పారు. ఆ ఐడియాని పర్యావరణ పరిరక్షణ కథకి అన్వయించి సినిమా రూపొందించామన్నారు. ప్రకృతికి నష్టం చేస్తే ప్రకృతి పగదీర్చుకుంటుంది. అన్ని విధ్వంసాలూ చూస్తూ వున్న ప్రకృతి, ఇక చెట్టు కూడా ధ్వంసం కావడంతో మనుషులు మాటలే పలక్కుండా చేసింది. ఏ మాటైనా పాటగానే పలికే వింత మనుషులుగా వుండమని శాపం పెట్టింది.
కథ సింపుల్. ఫాంటసీ కావడంతో దీన్ని ఆ దృష్టితోనే చూడాలి. కథనం బలంగా లేకపోయినా ప్రయోగం కొత్తది కావడంతో, ఆ ప్రయోగం కోసం చూడాలి. మాటని పాటగా వినిపించే ప్రయోగం దేశంలోనే మొదటిది. దీంతో రొటీన్ కి భిన్నంగా మొత్తం కథా ప్రపంచమే సరదాగా, ఫన్నీగా, నాటకీయంగా మారిపోతుంది.
మొదటి ఇరవై నిమిషాలు మామూలు సినిమాలాగానే
డైలాగులతో సాగుతుంది. కథ, దాంతో బాటు అన్ని పాత్రలూ పరిచయమవుతాయి. ఈ ఇరవై నిమిషాల
తర్వాత ఎప్పుడైతే చెట్టుని కొట్టేస్తారో, అప్పుడు శాపం అనే కాన్ఫ్లిక్ట్ తో కథ,
సన్నివేశాలూ మాటల స్థానంలో పాటల్ని పలకడం ప్రారంభిస్తాయి. ఒక కొత్త ప్రపంచంలో కెళ్ళి పోతాం. అయితే
ఫస్టాఫ్ నిడివి ఎక్కువకావడంతో ఈ కొత్త ప్రపంచం నావెల్టీని కోల్పోవడం
ప్రారంభిస్తుంది. ఇంటర్వెల్లో బలమైన మలుపేమీ వుండదు. మొత్తం కథ లైటర్ వీన్ గా
సాగుతుంది.
సెకండాఫ్ లో తిరిగి అదే ధోరణి. వివిధ పాత్రల మధ్య వాటి వ్యక్తిగత సంఘర్షణలు, హీరో
హీరోయిన్ల మధ్య ప్రేమలో సమస్యలు, మైనింగ్ పాత్రల కుయత్నాలూ మొదలైన సన్నివేశాలు
వస్తూంటాయి. చెట్టుతో గౌరీ పాత్ర అనుబంధం గురించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ కథకి
ఎమోషనల్ సపోర్టు నిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ తప్ప మిగతా కథ భావోద్వేగా బలంతో కాక
లైటర్ వీన్ లోనే సాగుతుంది. ఫాంటసీ కాబట్టి అద్భుతాలే తప్ప భావోద్వేగాలు
వున్దకూదదనుకున్నారేమో తెలీదు. చివరికి పర్యావరణం గురించి ఒక సందేశంతో ముగుస్తుంది.
నటనలు- సాంకేతికాలు
అయాన్, అహల్యా, షాలినీ కొత్తవాళ్ళు ముగ్గురూ ఈ ప్రయోగాన్ని నిర్వహించడంలో పూర్తిగా
రాణించారు. ఎవరి మాటని వాళ్ళే పాటగా మార్చి పలికే ధోరణి కొత్త వాళ్ళకి సవాలే అయినా
సహజంగా నటించేశారు. రేణూ పాత్ర తండ్రిగా బెనర్జీ, హీరో తండ్రిగా రాహుల్ రవీంద్రన్,
ఇంకో పాత్రలో తులసి, నల్లజాతీయుడు స్టాన్లీ చిడోజీ పాత్ర చిత్రణలు, నటనలు
చెప్పుకోదగ్గవి. ఇక అనుదీప్ ఒక చోట,విజయ్
దేవరకొండ క్లయిమాక్స్ లో సర్‌ప్రైజ్ చేస్తారు. చిన్న పాత్రైనా అందులో నివేదా
పేతురాజ్ బలంగా నటించింది.
ఈ మాటలే పాటలుగా పలికే సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చేసిన కృషి చాలా
కలిసొచ్చింది. దాదాపు రెండు గంటలు మాటల్ని పాటలుగా మార్చడం మామూలు విషయం కాదు.
వివిధ పాత్రలకి వివిధ బాణీల్లో సంగీతం లేని పద్యాలుగా మాటలు కూర్చి నాన్ స్టాప్ గా
వినిపించడం అన్నిటికన్నా కష్టమైన ప్రయోగం. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట థీమ్
ని ఎమోషనల్ గా ఎలివేట్ చేస్తుంది. నటీనటులే ప్రాక్టీసు చేసి ఈ మాటల్ని పాటలుగా
పలికారు.
అంకుర్ సంజీవ్ కెమెరా వర్క్ ఫాంటసీ ప్రపంచాన్ని ఉన్నతంగా ఆవిష్కరించింది.
అన్యాయాల, అక్రమాల పాలబడిన ఎడారిలాంటి ఒక డిస్టోపియన్ ప్రపంచాన్నిసృష్టించడం లో
ప్రొడక్షన్ డిజైనర్ అరవింద్ మూలే కూడా కష్టపడ్డాడు. ప్రొడక్షన్ విలువలు బ్యానర్స్
కి తగ్గట్టే బలంగా వున్నాయి. నిర్మాతలు నాగ్ అశ్విన్, అశ్వనీ దత్, స్వప్నా దత్,
సింగీతం చిరకాలపు కలని నిజం చేసిన అదృష్టవంతులుగా మిగులుతారు. వయస్సుతో బాటు
ఆరోగ్య సమస్యల కారణంగా సింగీతం ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న వర్చువల్ మానిటర్ ద్వారా
రిమోట్‌గా సినిమాకి దర్శకత్వం వహించారు అసిస్టెంట్ల సాయంతో.
చివరికేమిటి?
ఇదే ప్రయోగంతో ‘అంబ్రెల్లాస్ ఆఫ్ షెర్బోర్గ్’ ఫ్రెంచి
మూవీ గంటన్నర సినిమానే. ఈ ప్రయోగాన్ని 17 శతాబ్దపు ఇటాలియన్ ఒపెరాల ఆధారంగా తీశారు.
మాటల్ని పాటలుగా ప్రయోగించే ఈ టెక్నిక్ ని ‘రెసిటేటివ్’ కళ అన్నారు. దీన్లో డైలాగుల్ని
సాంప్రదాయ రాగంలా మాట్లాడడం లేదా ప్రదర్శించడం కాకుండా, ప్రసంగం లాంటి లయలో పాడతారు. ఇలాటి ఒక ఒపెరాలో ఖగోళ
శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ తండ్రి విన్సెంజో గెలీలీ ఒక ముఖ్య పాత్ర నటించాడు.
అయితే మాటే పాటయిన ఈ ‘రెసిటేటివ్’
కళతో కథనంలో భావోద్వేగ బలం బలైంది. ఎంతసేపూ లైటర్ వీన్ కథనానికే
వీలిచ్చేలా ఒకే ధోరణిలో డైలాగులు పాటలుగా మారడంతో కథనం ఫ్లాట్ గా మారింది. ఎలాగూ ఈ
మాటల పాటలకి సంగీతం లేనప్పుడు- ఈ పరాయి ‘రెసిటేటివ్’ కళ కాకుండా, స్వదేశీ కళ- అందునా
తెలుగులో మాత్రమే సాధ్యమవుతున్న పద్యాలతో సినిమా అంతా కథ నడిపివుంటే, ఆ వూపే
వేరుగా వుండేది నవరసాల్ని పలికిస్తూ.
2002 లో ఆరు ఆస్కార్లు పొందిన బ్రాడ్వే మ్యూజికల్ లాంటి ‘షికాగో’ లో, హేమాహేమీలైన
నటీనటులతో ఎడతెగని 16 పాటల మర్డర్ కథ ఎంత ఉర్రూతలూగించిందో తెలిసిందే. ఈ 1930 లలో
జరిగే కథకి అప్పటి జాజ్ మ్యూజిక్ తో పాటలు చేసి - ఆ సాంగ్ అండ్ డాన్సులతోనే థ్రిల్లింగ్
సన్నివేశాల్ని చూపించేశారు. ఇంత బిగ్ బడ్జెట్ హంగామా నిడివి గంటా 55 నిమిషాలే.
ఈ ప్రస్తావనలన్నీ భావోద్వేగ బలాన్ని పెంచడం కోసమే. కానీ సింగీతం లైటర్ వీన్ ధోరణిలో
చందమామ కథల సింప్లిసిటీని ఊహించి వుంటారు కాబట్టి ఆయన విజన్లో వినోదాత్మక
ప్రయోగంగా చూస్తే- దీనికిదే అద్భుతమన వచ్చు.
-సికిందర్
Links :
Sing Geetham,
Trailer
Umbrellas of Cherbourg, Trailer



