రచన - దర్శకత్వం: కరుణ కుమార్
తారాగణం: సుధీర్ బాబు, ఆనంది, నరేష్, రఘు
బాబు, పావెల్ నవగీతన్, అజయ్, హర్షవర్ధన్, సప్తగిరి, సత్యం రాజేష్ తదితరులు
కథ : నాగేంద్ర కాశీ, సంగీతం: మణిశర్మ , ఛాయాగ్రహణం : షందత్ సైనుద్దీన్
బ్యానర్ : 70 ఎంఎం ఎంటర్ ప్రైజెస్,
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుదల : ఆగస్టు 28, 2021
***
మొత్తానికి సుధీర్ బాబు డీ గ్లామరైజుడు పాత్రతో వచ్చాడు. బడుగు జీవి నటనకి ఒప్పుకున్నాడు.
సిక్స్ ప్యాక్ బడుగు జీవి. సల్మాన్ ఖాన్ లా అనవసరంగా షర్టు విప్పే అవసరం హీరో
లెవరికీ రాదు, సిక్స్ ప్యాక్ వుంటేనే చూపించాలి కాబట్టి షర్టు
విప్పే అవసరం వస్తుంది. కమెడియన్- హీరో సునీల్ కీ తప్పలేదు. బాడీ సిక్స్ ప్యాక్
వుంటే సరిపోతుందా, చేసే సినిమా ప్యాకేజీ సరిగ్గా
వుండక్కర్లేదా అనేది సుధీర్ బాబుతో ప్రశ్న. టైటిల్ ప్రకారం సోడా వాటర్ అన్నిసార్లు
తాగినా అది హీరోయిన్ ని మెప్పించడం కోసమే, ప్రేక్షకుల్ని
మెప్పించడానికి? అలాగే ‘పలాస’ అనే రియలిస్టిక్ తీసిన దర్శకుడు కరుణ కుమార్ తిరిగి అదే కుల సమస్యతో
కమర్షియల్ టైటిల్, హంగూ ఆర్భాటాలతో ఈసారి వచ్చాడు. ఈ
రియలిస్టిక్ లో రియలిస్టిక్ ఎంత? దేని గురించి ఈసారి కథ? ఇవి చూద్దాం...
అమలాపురంలో సూరిబాబు (సుధీర్ బాబు) ఎలక్ట్రీషియన్.
అక్కడే సంజీవరావు (నరేష్) శ్రీదేవి సోడా సెంటర్ నడుపుతూంటాడు. శ్రీదేవి
(ఆనంది) అతడి కూతురు. ఒక ఉత్సవంలో ఈమెని చూసి ప్రేమిస్తాడు సూరిబాబు. ఆమే ప్రేమిస్తుంది.
అతడి కులం చూసి అడ్డుపడతాడు తండ్రి. ఈ తండ్రి కులస్థుడు కాశీ (పావెల్ నవగీతన్)
వుంటాడు. ఇతను పడవల పోటీల్లో సూరిబాబుతో గొడవపడి అనుచరుడి చేత సూరిబాబు తండ్రిని
అవమానిస్తాడు. ఈ గొడవలో సూరిబాబు అనుచరుణ్ణి పొడిచేస్తాడు. దీంతో సూరిబాబు-
శ్రీదేవి పారిపోయి పెళ్ళి చేసుకుందామనే ప్రయత్నం విఫలమై సూరిబాబు జైలుకి పోతాడు.
ఇప్పుడీ ప్రేమ ఏమైందనేది మిగతా కథ.
‘పలాస’ లాంటి రియలిస్టిక్ జానర్ తీసిన
దర్శకుడు కరుణ కుమార్ నుంచి అదే కుల సమస్యతో ఈసారి కాంప్రమైజ్ అయిన మూస ఫార్ములా
ప్రేమ వచ్చింది. ట్రాజడీతో ముగిసే మరో ఆనర్ కిల్లింగ్ కాన్సెప్టు. కుల సమస్యతో
మామూలు ప్రేమ సినిమాలే కాలాన్ని బట్టి మారకుండా కూర్చున్నాయి మారుతున్న నూనూగు
మీసాల తరాల ముందు ఏమిటో అర్ధం గాకుండా. దీనికి ఆనర్ కిల్లింగ్ జోడింపు ఈ మధ్య
ట్రెండ్ గా మారింది. కులం గెలిచి ప్రేమ ఓడిపోయే అవే అభ్యుదయ వ్యతిరేక భావజాలాలతో. కులాంతరం
చేసుకోకండ్రోయ్ ఛస్తారు - అని మెసేజిలిస్తున్నట్టు ఆధిపత్య భావజాల ముక్తాయింపులతో.
కులాలుండ కూడదంటూనే ఈ రకమైన కథలతో. ఇక కుల సమస్య ఎప్పుడు పోవాలి? డబ్బు ముందు కులం అప్రధానమై సంబంధాలు కలుపుకుంటున్న వైనాలు ఇంకా సినిమా
కథలకి పనికిరావు కాబోలు.
ఈ కథతో జానర్ కల్తీ ఇంకో సమస్య. రియలిస్టిక్
కథకి రొటీన్ అరిగిపోయిన, లేదా కాలం చెల్లిన ఫార్ములా
టెంప్లెట్ ప్రేమ జోడింపు. సుధీర్ బాబు లాంటి కమర్షియల్ హీరోతో సినిమా కాబట్టి
రియలిస్టిక్ కథ రూపురేఖలు మారిపోవడం. రియలిస్టిక్ కథలతో ఇలా కాంప్రమైజ్ అవడంకన్నా
కమర్షియల్ దర్శకులుగా మారిపోవడమే బెటర్. రియలిస్టిక్ కథల మార్కెట్ అంతర్జాతీయం. దర్శకులు
రియలిస్టిక్ సినిమాల్ని ప్రాంతీయ సినిమాలుగా భావిస్తే తప్ప తెలుగు రియలిస్టిక్స్ తో
జాతీయ- అంతర్జాతీయ దృష్టి నాకర్షించలేరు.
దేశంలో వివిధ ప్రాంతీయ భాషల యువ దర్శకులు
చేస్తున్నదిదే. ‘పడ్డాయి’ అనే తుళు
సినిమాతో అభయ సింహా ఇదే చేశాడు. రివ్యూ కోసం ఇక్కడ
క్లిక్ చేయండి. ఇతను షేక్స్ పియర్ ‘మాక్బెత్’ ని మత్స్యకారుల రస్టిక్ కథగా, పచ్చిగా, కళాత్మకంగా తీసి జాతీయ అవార్డులు పొందాడు. ఇంకా కమర్షియల్సే మెయిన్
స్ట్రీమ్ కాదు, కోవిడ్ పుణ్యాన రియలిస్టిక్స్ కూడా ఇప్పుడు మెయిన్
స్ట్రీమే. ఎగబడి చూస్తున్నారు ప్రేక్షకులు. కాబట్టి మూసఫార్ములా పోకడలు
పక్కనబెట్టి, భయపడకుండా వాస్తవికతని ప్రతిబింబించే పక్కా పవర్ఫుల్
రియలిస్టిక్స్ తో తమ ప్రత్యేకతేదో చాటుకోవడమే చేయాలి.
కథకి కథా ప్రయోజనమనే దొకటుంటుంది. ఈ
కథతో ఏం చెప్పదల్చారు? కులం తప్పి ప్రేమిస్తే చావు తప్పదనేనా? ప్రేమికులారా మీరింకేం చేయలేరనేనా? అయితే ఇది కథా
ప్రయోజనం ఆలోచించని కథ.
సుధీర్ బాబు కింది కుల పాత్రలో తన
ఇమేజితో అసహజత్వం కనబడనీయకుండా మమేకమై నటించాడు. కొన్ని కీలక దృశ్యాల్లో కమర్షియల్
హీరోగా ఇమేజి కూడా చూసుకోవాలి కాబట్టి ఆ బిహేవియర్ లో హీరోయిజం ప్రదర్శించాడు.
రోమాన్స్ లో రెగ్యులర్ లవర్ బాయ్ నటనే. ఐటెం సాంగ్ లో మాస్ హీరో అయ్యాడు. సంఘర్షణలో, ప్రేమలో విషాదంలో రియలిస్టిక్ పాత్రకి దిగివచ్చాడు. అన్నిటి కంటే ఏడ్పు
దృశ్యాల్లో బాగా రాణించాడు. కమర్షియల్ సినిమాలు చేసే తనకి తనలోని నటుణ్ణి
పరీక్షించుకునే అవకాశాన్ని ఈ సినిమా ఇచ్చిందని చెప్పొచ్చు.
సిక్స్ ప్యాక్ హీరోగా పడవల పోటీల్లో
ఎక్స్ ఫోజ్ అయి, ఆ తర్వాత ప్రతీ ఫైట్ సీన్లో యాక్షన్ హీరో
టైపులో విజృంభణ కొనసాగించాడు. ఇక్కడొక ప్రశ్న వస్తుంది : అంత సిక్స్ ప్యాక్ హీరో అయినప్పుడు
హీరోయిన్ ని కాపాడుకో లేడా? ధైర్యంగా నిలబడి పెళ్ళి
చేసుకోకుండా, హీరోయిన్ ని లేపుకు పోయి పెళ్ళి చేసుకోవడ మేమిటి? అలాంటప్పుడు సిక్స్ ప్యాక్ దేనికి సిద్ధం చేసుకున్నాడు? బడుగుజీవి పాత్రకి సిక్స్ ప్యాక్ అవసరమా? ఈ
కాన్సెప్ట్ కి ఏది అవసరం- కమర్షియల్ పాత్రా, రియలిస్టిక్
పాత్రా? ఇది తేల్చుకోక పోవడంతో ఈ సమస్య. గ్లోబల్ జంబో ప్యాక్
‘రాంబో’ తో ఈ కథ తీస్తే ఎలా వుంటుందో
అలా వుంది. దీనికి పరిష్కారం? పడవల పోటీల్లో అలా షర్టు
విప్పి సిక్స్ ప్యాక్ సంపద చూపించకుండా వుంటే సరిపోతుంది.
హీరోయిన్ ఆనంది ఎప్పటిలానే ఛార్మింగ్.
కాలేజీ కెళ్తూ సోడా షాపులో తండ్రికి సహకరించే శ్రీదేవి పాత్రలో మొదట గ్లామరస్ గా, బలంగా వుంటూ ఆసక్తి రేపే నటనే కనబరుస్తుంది. కానీ ప్రేమలో సమస్యలో పడ్డాకే
తద్విరుద్ధంగా బలహీనురాలిగా మారిపోతుంది పాత్ర. ఇలా బలహీనమవడానికి తండ్రి ఏదైనా
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వుంటే జస్టిఫికేషన్ వుండేది. అలాంటిదేమీ లేకుండా
యూటర్న్ తీసుకోవడం సహేతుక పాత్ర చిత్రణ
అన్పించుకోదు.
తండ్రి ఆమెని బందీగా వుంచి ఒక
సంబంధం చూసి ఓ పెళ్ళి చూపులయ్యాక, వచ్చి హీరోని
కలుసుకుంటుంది. హీరో తానెంత ప్రేమిస్తున్నాడో నిరూపించుకున్నాక, నా ప్రేమని ఎలా చూపించనూ - అని వెంటనే లైంగికంగా నిరూపించుకుంటుంది. ఆ
తర్వాత అతడితో పారిపోతుంది. తండ్రి పట్టుకొచ్చి ఇంకో సంబంధం చూసి పెళ్ళి
చేసేస్తాడు. ఇదంతా గజిబిజిగా వుంటుంది. వేరే పెళ్ళి చేస్తూంటే- నాకు హీరోతో ఏ టూ జెడ్ అన్నీ అయిపోయాయని చెప్పేస్తే ఆ పెళ్ళి తప్ప వచ్చు.
చెప్పాల్సిన సమయంలో ఈ మాట చెప్పకుండా, చెప్పకూడని సమయంలో
చెప్పకూడని మాట అనేస్తుంది. శోభనం రాత్రి ఆ భర్తని గాయపర్చి గొడవ చస్తుంది.
కులపెద్ద సహా అందరి ముందూ సీన్ క్రియేట్ చేసి, తన చావు తను
తెచ్చుకునే మాటలనేస్తుంది- మొగుడు చేత కాని వాడని చెబుతూ వూరంతా పడుకుంటానంటుంది.
ఇప్పుడర్ధమయ్యే వుంటుంది ఈ ఆనర్ కిల్లింగ్ కాన్సెప్ట్ కూడా ఎంత డొల్లగా వుందో.
నాకు హీరోతో ఏ టూ జెడ్ అన్నీ
అయిపోయాక ఇలా పెళ్ళి చేశారు చూడండీ- అని చెప్పుకుంటే ఒక అర్ధం, సానుభూతి. వూరంతా పడుకుంటానంటే ఏ కులస్థులు, ఏ కుల
పెద్ద వూరుకుంటారు. ఇప్పుడు తన ఆనర్ కిల్లింగ్ కి కారణ మెవరు, తనే! తను పేలిన మాటలే. కుల పెద్దనో, తండ్రినో
దూషించాల్సిన అవసరమే లేదు. ప్రేమించిన వాణ్ణి పెళ్ళి చేసుకుంటానంటే చంపడం తప్పే
కావచ్చు, వూరంతా పడుకుంటానంటే పెద్దల్ని తప్పుబట్టడానికేమీ
వుండదు, చట్టం దానిపని అది చేసుకుపోవడం తప్ప. చట్టంలో ఆనర్
కిల్లింగ్ కి నిర్వచనమే లేదు. అదో హత్య, అంతే. అలా మాటలు పేలి సమర్ధించుకునే అవకాశం పెద్దల కిచ్చేసింది తను.
తండ్రి పాత్రలో నరేష్ టాప్ నటన
కన్పిస్తుంది. క్లయిమాక్స్ దృశ్యాల్లో మానసిక సంఘర్షణ ప్రదర్శించిన తీరు నిజంగా
ప్రశంసనీయం. కృత్రిమ డ్రామా కాకుండా ఆర్ట్ సినిమా తరహా వాస్తవిక నటనతో తానున్న
పరిస్థితికి అద్దం పట్టాడు. విలన్ గా నటించిన పావెల్ నవగీతన్ మాత్రం చాలా మైనస్ ఈ
కథకి. ఇంత బలహీన విలన్ సిక్స్ ప్యాక్ సుధీర్ బాబుకి కుదర్లేదు. సుధీర్ బాబు
తండ్రిగా రఘుబాబు నేపథ్యంలో వుంటాడు. సెకండాఫ్ లో కనిపించడు. ఫస్టాఫ్ లో విలన్
అనుచరుడు అవమానించే సంఘటన అట్రాసిటీ కేసు కిందికొస్తుంది. ఇదేమీ ఈ రియలిస్టిక్
కథకి పట్టలేదు, ఫార్ములా కథ కింద సర్దేసినట్టున్నారు. సుధీర్
బాబు పక్క కమెడియన్ గా సత్యం రాజేష్, అతిధి పాత్రలో కమెడియన్
సప్తగిరి కన్పిస్తారు.
విజువల్స్ బావున్నాయి షాందత్
సైనుద్దీన్ ఛాయాగ్రహణంలో. పడవల పోటీ దృశ్యాలు, కొన్ని
ప్రకృతి దృశ్యాలూ బాగా తీశాడు. ఈ పడవలు మోటార్ బోట్లు. ఇలా కాకుండా కేరళలో ఓనం
పండక్కి జరిగే ‘వాళ్ళం కలి’ పడవల
పోటీల్లో తెడ్డేసి పాల్గొంటారు. ఇందులో యాక్షన్, థ్రిల్
ఎక్కువుంటాయి. ఇక మణిశర్మ సంగీతంలో పాటలు ఓ మాదిరిగా వున్నాయి.
ఇది క్లయిమాక్స్ వరకూ ఫ్లాష్ బ్యాక్ లో నడిచే నాన్
లీనియర్ కథ. హత్యకేసులో హీరో జైలుకొచ్చే దృశ్యాలతో ప్రారంభమై ఫ్లాష్ బ్యాక్
లోకి వెళ్తుంది. ఎలక్ట్రీషియన్ గా పరిచయం, హీరోయిన్ తో ప్రేమ, విలన్ తో వైరం, హత్యా యత్నం కేసులో అరెస్టు వగైరా
ఫస్టాఫ్ కథ. గంటా ఇరవై నిమిషాల సుదీర్ఘ సమయం. ఇంత సమయమంతా ప్లాట్ పాయింట్ వన్ కి
రావడానికే. ఇంటర్వెల్ సీనుకి ప్లాట్ పాయింట్ వన్. అతను జైలు కెళ్తూ వుండడం, ఆమె ఏడుస్తూ వెంటపడడం.
ఇంతసేపూ లవ్ ట్రాక్ ప్రతీ ప్రేమ
ఫార్ములా సినిమాలో చూసే టెంప్లెట్ తరహాలోనే రిపీటవుతుంది. అతను తొలిచూపులో ప్రేమలో
పడడం, ఆమె వెంటపడడం, ఆమె బెట్టు చేయడం, తర్వాత ఎందుకో తెలియకుండా ఫ్రేమలో పడిపోవడం లాంటి చూసి చూసి వున్న
ఫార్ములా రొటీన్. ఈ సీన్లకి చేసిన నిర్మాణ వ్యయం నిర్మించిందే నిర్మించడమవడంతో సేలబిలిటీ
లేక వృధా అయినట్టే అనుకోవాలి.
ఈ ఫస్టాఫ్ లో ఆనర్ కిల్లింగ్ కథకి
అవసరమైన ఎమోషనల్ హుక్ కూడా లేదు. స్టేక్ (పణం), తీసుకుంటున్న
రిస్కు వంటివి కూడా లేవు. ఇది కులాంతర కథ అన్న భావం ఎక్కడా పుట్టదు. ఈ భావం
పుట్టనప్పుడు ఆడియెన్స్ కి ఎమోషనల్ హుక్, హీరో హీరోయిన్ల
పాత్రలు స్టేక్, రిస్కు ఫీలయ్యే అవకాశం కూడా వుండదు. కోడి
రామకృష్ణ తీసిన ‘అదిగో అల్లదిగో’ లో - ‘మీ
కొడుకు శివానంద శాస్త్రి అగ్రహారంలో బ్రహ్మణ్యంపై తిరగబడి హరిజన ప్రవేశం
కల్పించాడు. వర్ణసంకరానికి పుట్టిన పిల్లతో ప్రేమలో పడ్డాడు’ అనే
డైరెక్టు డైలాగులు వుంటాయి. ‘ఆ కులహీనురాలికి తాళి కట్టావో, ఈ
యజ్ఞోపవీతంతో వురేసుకుంటా!’ అని పరిస్థితి తీవ్రతని తెలిపే డైలాగులు కథానుసారం వుంటాయి. ఏ తరహా కథ డ్రామా
రగిలించడానికి ఆ తరహా డైలాగుల్ని కలిగి వుంటుంది. ప్రస్తుత ఫార్ములా రియలిస్టిక్ కథకుడెందుకో
ఉన్నదున్నట్టు చెప్పడానికి మొహమాటపడ్డాడు. దీంతో బలమైన డ్రామా లేకుండా పోయింది.
సెకండాఫ్ హీరో జైలునుంచి పారిపోయి
రావడం, హీరోయిన్
తో సిటీకి పారిపోవడం, పెళ్ళి చేసుకోవడం, పోలీసులు వచ్చి మళ్ళీ పట్టుకోవడం, తండ్రి తీసికెళ్ళి
హీరోయిన్ పెళ్ళి చేసేయడం, ఇంకా తర్వాత ట్రాజిక్ క్లయిమాక్స్
వగైరా. హీరో జైలు కెళ్ళడం రావడం రిపీటవుతూ వుంటాయి. జైల్లోంచి పారిపోతే
పట్టుకుపోయి జైల్లో వేస్తారు, వేశాక బెయిల్ మీద వదిలేస్తారు.
పారిపోయిన ఖైదీకి బెయిల్ ఇస్తారా. ఫార్ములా కథనం కాబట్టి లాజిక్ చూడకూడదేమో.
ఇంకోటేమిటంటే ఈ సెకండాఫ్ లో వేరే
హిందూ ముస్లిం పెళ్ళి, పాట సహా అనవసరంగా చూపించడం. బడ్జెట్
వేస్ట్. ఈ సామరస్యం ఎవరికి చూపించడానికి? ప్రేక్షకులకా? ప్రేక్షకులకి అవసరం లేదు. హీరో హీరోయిన్లకా? వాళ్ళు
సామరస్యంతోనే వున్నారు. ఈ పెళ్ళికి హీరోయిన్ తండ్రిని పిలిపించి వుంటే
సార్ధకమయ్యేది బడ్జెట్ కూడా. కథ ఇందులో వుంది, డ్రామా
ఇక్కడుంది.
ప్లాట్ పాయింట్ టూ తర్వాత విలన్
రివీల్ చేసే పాయింటు మాత్రం తేరుకునేలా చేస్తుంది. ఇదంతా మొదట్నుంచీ హీరోకి విలన్ పన్నిన
వలేనని రివీలవడం ఒక్కటే ఈ కథలో క్రియేటివిటీ ఏదైనా వుంటే దానికి తార్కాణం. ఎండ్
సస్పెన్స్ ని ఎండ్ సస్పెన్స్ కథనం చూస్తున్నట్టు అన్పించకుండా ప్లే చేసే ట్రిక్.
ప్లాట్ పాయింట్ టూ వచ్చేసి కేసు విషయంలో విలన్ తనని ఇంకా బలంగా ఇరికించినట్టు హీరో
తెలుసుకోవడం. ట్రాజిక్ క్లయిమాక్స్ మాత్రం పైన చెప్పుకున్న హీరోయిన్ పేలిన తెలివి
లేని మాటల ఫలితమే. ఇదేం ఒప్పించేదిగా వుండదు కాన్సెప్ట్ కి.
“Everything that's realistic has
some sort of ugliness
in it.
Even a flower is ugly when it wilts, a bird when it seeks its prey,
the ocean when it becomes violent.” ―Sharon Tate
the ocean when it becomes violent.” ―Sharon Tate
―సికిందర్