రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, సెప్టెంబర్ 2021, గురువారం

1055 : టిప్స్

       సినిమాల్లో హీరోలతో చూపించే ప్లాట్ పాయింట్ వన్ మలుపు అనే రొటీన్ ని బ్రేక్ చేసి, కొత్త పంథా పట్టిన ఉదాహరణలు రెండు చూశాం ఇటీవల :  రెండు తమిళంలో వచ్చిన సార్పట్టా’, మండేలా ల్లో. వీటి రివ్యూలలో  రొటీన్ ప్లాట్ పాయింట్ వన్ (కథా ప్రారంభం) మలుపు నుంచి హీరోలని తప్పించిన  క్రమాన్ని పాఠకుల దృష్టికి తెచ్చాక, ఒకరిద్దరు ఇన్స్పైరై  తెలుగు సినిమాల ఆధారంగా దీన్ని వివరించమని కోరాక, మొత్తం ఆసక్తి పరులందరికీ ఉపయోగపడ వచ్చన్న ఆలోచనతో ఇలా బ్లాగు ముఖంగా చెప్పుకోవాల్సి వస్తే - శివ నే తీసుకుందాం. శివ లో జేడీ, అమలని టీజ్ చేస్తే, నాగార్జున సైకిలు చైనుతో కొట్టడం ప్లాట్ పాయింట్ వన్ ఘట్టమని తెలిసిన విషయమే. ఇక్కడ నాగార్జునని ఈ ఘట్టం నుంచి తప్పిస్తే, ప్లాట్ పాయింట్ వన్ అమల - జేడీల మథ్యే వుంటుంది. అప్పుడు అమలని జేడీ టీజ్ చేస్తూంటే నాగార్జున అలా చూస్తూ వుంటాడు. అమలే జేడీని ఎదుర్కోబోయి, వల్లకాక ఏడ్చిందనుకుందాం. ఇది ఆమెని జేడీతో సమస్యలో పడేసే ప్లాట్ పాయింట్ వన్ మలుపు. ఇక ఈ సమస్యతో సంఘర్షణ, గోల్ ఆమెవే అవుతాయి. వుమన్ ఎంపవర్మెంట్ పేరుతో నాగార్జున మోటివేట్ చేస్తాడు. ఆమెకి ఎదురయ్యే ఒకానొక విషమ ఘట్టంలో తను జోక్యం చేసుకుని కథని అందుకుంటాడు. ఈ కోవలో ఆలోచిస్తే రొటీన్ ని బ్రేక్ చేసే వేరియెంట్ వస్తుంది. ఆల్ ది బెస్ట్.


      2. కమర్షియల్ సినిమాల్లో స్క్రీన్ ప్లే పరంగా ఏముండాలీ అంటే చాలా వుండాలి. ఆ వుండే వేమిటో వాటి అర్ధం తెలియాలి. ఎలా ఎక్కడ వాడాలో టెక్నిక్ తెలియాలి. ఇలాటివి ఓ పదహారు వుండొచ్చు : ప్రామాణికమైన కాన్సెప్ట్ చుట్టూ కథ, సంక్షుభిత డ్రామా, స్ట్రక్చర్, మాటలతో గాకుండా చేతలతో కథ చెప్పడం, పాత్రలకి పణం, రిస్కు ఎలిమెంట్స్, పరిపూర్ణ పాత్రలు, యాక్షన్ లో వుండే పాత్రలు, ఫోర్ షాడోలు, పేఆఫ్ లు, సస్పెన్సులు, సర్ప్రైజులు, రివర్సల్స్, ట్విస్టులు, హాఫ్ వేలో సీన్లు, సీను సీనుకీ డైనమిక్స్ మొదలైనవి... రెండు నిమిషాలు చొప్పున ఓ అరవై గొప్ప సీన్లుంటే విజయవంతమైన సినిమా అన్నాడు జార్జి లూకాస్.   


        3. ఒక సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లోకి వచ్చి, కొంత స్క్రీన్ ప్లే అదీ తెలుసుకున్న అభ్యర్ధి నవలల్ని సజెస్ట్ చేయమని అడిగాడు. నవలలతో సినిమా కథ స్ట్రక్చర్ ఎలా తెలుస్తుందబ్బా అనుకుంటూ వుంటే ఈ మధ్య వస్తున్న కొన్ని సినిమాల్లో పాత్రచిత్రణ లోపాలు ఆనవాయితీగా మారిపోవడం గుర్తొచ్చింది. పాత్రచిత్రణలు, మనస్తత్వాలు. మానసిక సంఘర్షణలు స్పష్టంగా అర్ధమవాలంటే నవలలు చదవడమే బెస్ట్. మహోజ్వల నవలలని వుంటాయి. అలాటి తెలుగు, ఇంగ్లీషు క్లాసిక్స్ చదవాలి. గోపీచంద్ నుంచీ జేన్ ఆస్టిన్ వరకూ. కొత్త వాళ్ళకి సినిమాలు చూస్తూంటే పాత్రచిత్రణలు, మనస్తత్వాలు, మానసిక సంఘర్షణల తెరవెనుక నిర్మాణం అర్ధం గాదు. నవలలు చదివితే ఇవి అక్షరరూపంలో కళ్ళముందుంటాయి. బాగా అర్ధమవుతాయి. ఇందుకోసమైతే నవలలు చదవొచ్చు.  

సికిందర్