రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, September 4, 2021

1056 : రివ్యూ

 రచన - దర్శకత్వం:  ఎస్. దర్శన్
సుశాంత్, మీనాక్షీ చౌదరి, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, వెంకట్, రవి వర్మ తదితరులు 
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : ఎం సుకుమార్
బ్యానర్ : ఏవన్ స్టూడియోస్, శాస్త్ర మూవీస్
నిర్మాతలు: రవి శంకర్ శాస్త్రి, ఏకతా శాస్త్రి, కె హరీష్
విడుదల : 27 ఆగస్టు, 2021
***
      సుశాంత్ నటించిన ఏడు సినిమాల్లో చిలసౌ’, అల వైకుంఠపురం రెండే చెప్పుకోదగ్గవిగా నమోదయ్యాక, ఎనిమిదో సినిమాగా ఇచ్చట వాహనములు నిలుపరాదు తెరపై కొచ్చింది. ఒక కొత్త దర్శకుడితో  చిలసౌ లాంటి వినూత్న ప్రయత్నం చేశాడు తను. ఇప్పుడు ఇంకో కొత్త దర్శకుడితో మరో వైవిధ్యాన్ని అందించాలన్న తపనతో ఈ సినిమా చేసినట్టుంది. ఇందులో కొత్త హీరోయిన్ మీనాక్షీ చౌదరి తోడయ్యింది. హీరో హీరోయిన్లుగా ఇద్దరూ బావున్నారు. మరి కొత్త దర్శకుడు ఎస్ దర్శన్ ఈ ఇద్దరితో కలిపి చేసిన కృషి ఏమైనా కొత్తగా వుందా? సినిమాలో కొత్తదనం పక్కన పెడదాం, అసలు కొత్త దర్శకుడంటే అర్ధమేమిటి? ఏం చేస్తే కొత్త దర్శకుడన్పించుకుంటాడు? ఇవి తెలుసుకోవడానికి సినిమాలోకెళ్దాం...

కథ

    అరుణ్ (సుశాంత్) ఓ ఆర్కిటెక్ట్. అదే కంపెనీలో ఆర్కిటెక్చర్ ఇంటర్న్ గా చేరుతుంది మీనాక్షి (మీనాక్షీ చౌదరి). ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈమెకో అన్న నర్సింగ్ యాదవ్ (వెంకట్) అనే కార్పొరేటర్ వుంటాడు. ఇతనుండే కాలనీలో దొంగతనాలు జరుగుతూంటే కాలనీ వాసుల చేత గస్తీ ఏర్పాటు చేస్తాడు. ఒక రోజు అన్న వూరికెళ్ళింది చూసి అరుణ్ ని ఇంటికి రమ్మంటుంది మీనాక్షి. కొత్త బైక్ కొనుక్కుని వెళ్తాడు అరుణ్. నో పార్కింగ్ బోర్డున్న ఇంటి ముందు బైక్ ఆపి లోపలికెళ్ళి, ఈ ఇల్లు కాదని పక్క ఫ్లాట్లోకి వెళ్ళి మీనాక్షిని కలుసుకుంటాడు. అదే సమయంలో తను వెళ్ళిన ఇంట్లో వుంటున్న ఓ సీరియల్ నటిని చంపి దోచుకుని పారిపోతాడు ఓ దొంగ. ఇంటి ముందు బైక్ చూసిన గస్తీ ప్రజలు దొంగ ఇక్కడే వున్నాడనుకుని కాలనీని దిగ్బంధం చేసి గాలించడం మొదలెడతారు. జరిగింది తెలుసుకున్న అరుణ్, మీనాక్షీ వాళ్ళ ఫ్లాట్ లో ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ ఫ్లాట్లోంచి ఎలా సురక్షితంగా బయటపడి, నేరం తాను చేయలేదని  నిరూపించుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

      జానర్ రీసెర్చ్ మర్చిన కిల్లర్ అయిడియా. ఈ బాపతు కిల్లర్ - అంటే కత్తి లాంటి అయిడియాని ఏ జానర్లోకి కూర్చి తీయవచ్చో తెలుసుకోకుండా కల్పన చేసుకున్న ఓ మూస కథ. 'డైహార్డ్' టైపు హాస్టేజ్ జానర్ డ్రామాని డిమాండ్ చేస్తున్న అయిడియాని, 'సి గ్రేడ్' కింద కిష్కింధ చేసుకున్న కథ. పారిపోయిన నేరస్థుడు ఒకింట్లో మనుషుల్ని బందీలుగా పట్టుకుని సృష్టించే డ్రామా హాస్టేజ్ డ్రామా అయినప్పుడు, ఇదే పరిస్థితిని నేరారోపణ ఎదుర్కొంటున్న ఓ అమాయకుడి మీద రివర్స్ ప్లే చేస్తే, కొత్త కథగా మారిపోయే ఈ అయిడియాని  - అనాలోచిత రాత తీతలతో వృధా చేసుకున్న అవకాశం. 

        బహుశా అమాయక పాత్ర ఇలాటి పరిస్థితిలో ఇరుక్కుని తానుగా సృష్టించే హాస్టేజ్ డ్రామా అయిడియాగా సినిమాలు రాలేదు. ఈ ఇన్నోవేషన్ ని జారవిడుచుకుని తనదైన ముద్రతో ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. మొదటి సినిమా పట్టుకోవడానికి ఎన్నో సంవత్సరాలు యాతన పడతారు. తీరా ఆ మొదటి సినిమాతో ముద్ర వేయకపోతే మళ్ళీ అదే యాతన రీప్లే. ఈ ముందున్న మొసళ్ళ పండగని తెలుసుకుంటే ఇలా చుట్టేయరు మొదటి సినిమాని. కొత్త దర్శకుడు కొత్తని దర్శించక పోతే మళ్ళీ పాత స్ట్రగులే. ఇలా ఈ అయిడియా డిమాండ్ చేస్తున్న మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ రెండూ చెల్లకుండా పోతాయి. 1955 లో 'డెస్పరేట్ అవర్స్' నుంచీ, 1988 లో 'డైహార్డ్' మీదుగా, 2021 లో 'రోగ్ హాస్టేజ్' వరకూ నేరస్థుల మీద వందల్లో వున్నాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అమాయకుడి మీద కథగా కొత్త తరహా థ్రిల్లర్ గా మార్చుకునే ఛాన్సు ఇది మౌలికంగా.

        మొదటి కోవిడ్ కి పూర్వం జనవరి 2020 లో ఈ సినిమా ప్రారంభమైంది. కోవిడ్ కారణంగా సెప్టెంబర్ లో తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ విరామంలో ఓటీటీ వల్ల మారిన బిజినెస్ మాడెల్ దృష్ట్యా ఈ మూస కథని, మేకింగ్ నీ మార్చుకునే ఆలోచన చేయలేదు. 2021 లో రెండో కోవిడ్ కూడా వచ్చి పడి ఓటీటీ ఇంకింత విజృంభించింది. అయినా రెండో కోవిడ్ తర్వాత ఈ ఆగస్టులో అదే మూస మోడల్ తో విడుదలై గల్లంతైపోయిందీ సినిమా. కోవిడ్ ఒక్కటే సినిమాలని ఆపితే నష్టమేం లేదు. కోవిడ్ లో సందు చూసుకుని దాన్ని మించిన వైరస్ లా తిష్టవేసిన ఓటీటీయే ఇలాటి మూసలకి చావుదెబ్బ. ప్రేక్షకులు ఓటీటీలో ఏమేం చూస్తున్నారో కాస్త తెలుసుకుని ఇలాటి చిన్న సినిమాలు తీస్తే సొమ్మేం పోదు.

నటనలు- సాంకేతికాలు  

    2018 లో హీరోగా సుశాంత్ చిలసౌ అనే ఫర్వాలేదన్పించుకున్న ప్రయోగాత్మకం నటించింత్తర్వాత, ఈ రెండో ఎంపిక ట్రాక్ తప్పింది. కథ ఏమీ లేకుండానే ఒకే రాత్రి జరిగే కథతో సినిమా అంతా కూర్చోబెట్ట గల్గిన రియలిస్టిక్ రోమాంటిక్ డ్రామెడీ చిలసౌ. కొత్తగా దర్శకత్వం చేపట్టిన నటుడు రాహుల్ రవీంద్రన్, దీంతో కాస్త  వాస్తవ జీవితాలు ఉట్టిపడే రియలిస్టిక్  ప్రేమ సినిమాల కొరత తీర్చడంతో సుశాంత్ కా మాత్రం తలెత్తుకునే అవకాశం లభించింది. రాహుల్ రవీంద్రన్ కి ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ అవార్డు లభించడంతో బాటు, ఉత్తమ నూతన దర్శకుడుగా నామినేట్ అయ్యాడు. రుహానీ శర్మ ఉత్తమ నటిగా, వెన్నెల కిషోర్ ఉత్తమ హాస్య నటుడుగా నామినేట్ అయ్యారు. ఈ వైభవమంతా ఎక్కడికి పోయింది.   

జానర్ ని మన్నిస్తూ చిలసౌలో హీరోహీరోయిన్లే ఒకరికొకరు ప్రత్యర్ధులు కావడంతో పాత్రల లోతుపాతుల్లో కెళ్ళి నటించడానికి ఒక ఆధారమంటూ ఇద్దరికీ దొరికింది. ప్రస్తుత ప్రయత్నంలో ఆధారమే లేదు సుశాంత్ తో బాటు మీనాక్షి పాత్రకీ. సుశాంత్ యువ ప్రేమికుడుగా ఫ్రెష్ గా, వైబ్రంట్ గా నటించాడు తప్పితే పాత్రలో విషయం లేదు. విషయం లేకపోవడంతో ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ చెయ్యడు. ఆర్కిటెక్చర్ పాత్ర దేనికో తెలీదు. ప్రేమిస్తున్న హీరోయిన్ కోసం ఓ అద్భుత స్ట్రక్చర్ ని నగరం మధ్య నిలబెట్టడం లాంటి డ్రీమ్ కూడా వుండదు. ఆర్కిటెక్చర్ అన్పించే ప్రవర్తన, మాటలూ వుండవు. నటిస్తున్నది ఒక క్యారక్టర్ అన్న భావమే కనపడదు.

        సెకండాఫ్ లో కథలో కొచ్చి హీరోయిన్ ఇంట్లో ఇరుక్కున్నప్పుడు అర్ధవంతమైన డ్రామా లేకపోవడంతో కథతో బాటు పాత్రా చెల్లాచెదురై నటుడిగా చూపించుకునేందుకు ఏమీ మిగల్లేదు. హాస్టేజ్ డ్రామా క్రియేట్ చేసివుంటే నటించడానికి వుండేది. ఇక్కడున్న పరిస్థితితో స్ట్రగుల్ చూపించడం మానేసి, దీంతో సంబంధం లేని బయటెక్కడో తల్లికి యాక్సిడెంట్ కల్పించి - ఆ మదర్ సెంటిమెంటుతో అతకని ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తే నటన ఏం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ తో కూడా ఇలాగే ఎమోషనల్ ఎటాచ్ మెంట్ లేక సుశాంత్ యాంత్రికమై పోయాడు. ఫస్టాఫ్ గంటా ఇరవై నిమిషాలు హీరోయిన్ తో సాగించిన రోమాన్స్ కి సెకండాఫ్ లో అర్ధమే లేదా?

        డైహార్డ్ లో బ్రూస్ విల్లీస్ భార్యతో చెడిన సంబంధాల్ని మెరుగు పర్చుకోవడం కోసం ఆమె ఆఫీసుకెళ్ళి, క్రిమినల్స్ జరిపే దాడిలో హాస్టేజ్ డ్రామాలో ఇరుక్కుంటాడు. సుశాంత్ కూడా ఫస్టాఫ్ లో మీనాక్షితో చెడి ఆమె ఇంటికెళ్ళి ఇరుక్కుని వుంటే, ఒక అర్ధవంతమైన ఎమోషనల్ డ్రామా ఇన్నర్ స్ట్రగుల్ గా క్రియేటయ్యేది. నిరపరాధిగా ఇంట్లోంచి ఎలా బయటపడాలన్నది ప్రధాన కథకి తగిన ఔటర్ యాక్షన్ గా వేరే వుండేది.

        మీనాక్షి స్లిమ్ గా, గ్లామరస్ గా బావుంది. నటన కూడా వచ్చు సరైన పాత్రంటూ వుంటే. వెన్నెల కిషోర్ కామెడీ కుదర్లేదు. ప్రియదర్శిది కామెడీయే లేని ట్రాజడీ పాత్ర. కమెడియన్ - హీరో సునీల్ సెకండాఫ్ లో దొంగ ఎస్సై గా చేసిపోయే కామెడీ ఏమిటో అర్ధం గాదు. వెంకట్, రవి వర్మ, విలన్ కృష్ణ చైతన్య పాత్రలేం ఆకట్టుకోవు. సుశాంత్ తల్లిగా ఊర్వశి నటించింది.  ఇక సంగీతం గురించి ఏం చెప్పుకుంటాం. కెమెరా వర్క్ బావుంది.

చివరికేమిటి
     ఇది కూడా రెండున్నర గంటల సినిమా! వరుసగా రెండున్నర గంటలతో ఇలా బాదుతున్నారు. ఈ కథ చెప్పడానికి గంటన్నర కూడా ఎక్కువే. ప్రారంభ దృశ్యాలే మిగతా సినిమా ఎంత అద్భుతంగా వుంటుందో చెప్పేస్తాయి. ఈ కథని కూడా ఫస్టాఫ్, సెకండాఫ్ రెండు ఫ్లాష్ బ్యాకులుగా చూపించే క్రియేటివిటీ. ఫస్టాఫ్ లో సుశాంత్ బైక్ కొనడానికి కారణం చెప్తూ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే, అది దాదాపు గంట సేపు మీనాక్షితో విషయం లేని టెంప్లెట్ రోమాంటిక్ ట్రాకుని సాగలాగుతుంది. ఈ సేమ్ మోడల్ టెంప్లెట్ రోమాంటిక్ ట్రాకుని  గతవారమే శ్రీదేవి సోడా సెంటర్ లో చూడలేక ఆర్తనాదాలు చేశాం. ఇక ఎవరైనా సినిమా కెళ్ళాలంటే అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని, బితుకుబితుకు మంటూ, టెంప్లెట్టేనా బాబూ? అని అడుక్కుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకో ఇరవై నిమిషాలకి ఆమె ఇంటికెళ్ళి ఇరుక్కుంటే గానీ ఇంటర్వెల్ కి ప్రారంభం కాని కథ. ఇదంతా బడ్జెట్ వృధా. ఇలా ఫస్టాఫ్ లో విషయం లేకపోయాక, ఇంటర్వెల్ సంగతితో సెకండాఫ్ చేయడానికి చేతులెత్తేయడంతో అంతా రసాభాస.

        ఏ ఇంట్లో దొంగ దాక్కున్నాడో వెతికే కాలనీ వాసులతో లెక్కలేనన్ని క్రౌడ్ దృశ్యాలు. ఏవేవో కామెడీ సీన్లు. ఇంటి ముందు బైక్ వుంది. ఆ బైక్ ని చూస్తారు. చూసినప్పుడు దాని నెంబర్ తో అదెవరి బైకో తెలుసుకుంటే పోయేడానికి, వచ్చిన పోలీసులూ కూడా దొంగెవరో పట్టుకునే గుడ్డి పరుగులే.        

       చేయని నేరానికి మీనాక్షీ ఫ్లాట్లో దాక్కున్న సుశాంత్, బయట పడలేక చివరికి పోలీసులు వచ్చేసే వరకూ మీనాక్షితో కంగారు పడుతూ వుండడమే. బ్రూస్ విల్లీస్ భార్యని మంచి చేసుకోవడాని కెళ్ళి ఇరుక్కున్నాడు కదా, సుశాంత్ కూడా ఫస్టాఫ్ లో మీనాక్షితో చెడినట్టు కథ రాయించుకుని, మంచి చేసుకోవడానికి ఆమె ఇంటి కెళ్ళినట్టు వుంటే, ప్రేమ కథకి సెకండాఫ్ లో బలం కదా. ఆమె వినకపోతే బయటపడడానికి ఆమెనే బందీగా పట్టుకుని హాస్టేజ్ డ్రామా క్రియేట్ చేసుకుని- పోలీసులతో, కాలనీ గుంపుతో ఒక హీరోగా ఆడుకోవచ్చు కదా. బైక్ ని ప్రధానంగా చేసి వరుణ్ సందేశ్ తో కుర్రాడు తీస్తే పోయింది, రాజ్ తరుణ్ తో లవర్ తీస్తే పోయింది. ఇక మూడో దానికి పార్కింగ్ ఎక్కడుంటుంది? 

సికిందర్