రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, సెప్టెంబర్ 2021, ఆదివారం

1057 : రివ్యూ

రచన - దర్శకత్వం: శివ నిర్వాణ 
తారాగణం: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, నాజర్, రావురమేష్, నరేష్, రఘుబాబు, సీవిఎల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగార్, మాలా పార్వతి, రోహిణి, దేవదర్శిని, డేనియల్ బాలాజీ, తిరువీర్ తదితరులు 
సంగీతం: తమన్, గోపీ సుందర్, ఛాయాగ్రహణం : ప్రసాద్ మూరెళ్ళ
బ్యానర్ : షైన్ స్క్రీన్స్
నిర్మాతలు : గారపాటి సాహు, పెద్ది హరీష్
విడుదల : 9 సెప్టెంబర్, 2021, అమెజాన్ ప్రైమ్
***

        త సంవత్సరం  విడుదలైన నేచురల్ స్టార్ నాని  వి  లాగే తాజా  టక్ జగదీష్ ఓటీటీలో విడుదలైంది. వి లో నాని నటించింది సీరియల్ కిల్లరో, రివెంజి తీర్చుకునే క్యారక్టరో తేలక ఆ సినిమా ఫలితం అలా తేలింది. మరి టక్ జగదీష్’? లో ఎలా వుంది? ఈ పాత్ర ఎలాటి కథని సృష్టించింది? సత్కథా కాలక్షేపమేనా? పెద్ద సినిమాల్లేని  క్షామంలో బంపర్ హిట్టేనా? అలాగే నిన్ను కోరి’, మజిలీ అనే రెండు లైటర్ వీన్ సినిమాల దర్శకుడు శివ నిర్వాణా ఈ మూడో ప్రయత్నమెలా వుంది? నాని నుంచి ప్రేక్షకులాశించేది ఇచ్చాడా? లేక శర్వానంద్ కి ఒక  శ్రీకారం లాగా సరిపెట్టేశాడా? ఈ విషయాలు పరిశీలిద్దాం.... 

కథ


    ఆదిశేషు నాయుడు (నాజర్) భూదేవీ పురం భూస్వామి. ఇతడి చనిపోయిన మొదటి భార్య కి బోసుబాబు (జగపతి బాబు), జగదీష్ (నాని) అనే ఇద్దరు కొడుకులు. రెండో భార్య అర్జునమ్మ (మాలా పార్వతి) కి ఇద్దరు కూతుళ్ళు (రోహిణి, దేవదర్శిని), ఒక కొడుకు. మొత్తం ఐదుగురు సంతానం. దేవుడు బాబు (రావు రమేష్), సత్తిబాబు (నరేష్) అనే అల్లుళ్ళు. చంద్రమ్మ (ఐశ్వర్యా రాజేష్) అని మనవరాలు. అంతా కలిసి సుఖపడుతున్న ఉమ్మడి కుటుంబం.      

        గుమ్మడి వరలక్ష్మి (రీతూవర్మ) అని మండలంలో పనిచేసే ఒక వీఆర్వో. ఈమెని జగదీష్ ప్రేమిస్తూంటాడు. జగదీష్ ని చంద్రమ్మ పెళ్లి చేసుకోమని పోరుతూ వూంటుంది. జగదీష్ ఇంకో వూళ్ళో ఏదో చదువుతూ అప్పుడప్పుడూ వస్తూంటాడు. చిన్నప్పుడు తను చూసిన ఒక టక్ చేసుకున్న అధికారి విధి నిర్వహణలో కచ్చితంగా వుండడం ఆకట్టుకుని, తను కూడా అలాటి అధికారిలా ఉద్యోగం చేయాలని అప్పట్నుంచే టక్ చేసుకుని తిరగడం ప్రారంభిస్తాడు. 
   
        వీరేంద్ర నాయుడు (డానియల్ బాలాజీ), అతడి తమ్ముడు తిరుమల నాయుడు (తిరువీర్) వూళ్ళోనే బరితెగించిన దుష్టులు. ఎమ్మార్వోని కలుపుకుని భూములు లాక్కుంటారు. హత్యలు చేస్తారు. ఆదిశేషు నాయుడు ఇతణ్ణి ఎదుర్కొంటూ వుంటాడు. ఈ కక్షలు లేని గ్రామం చూడాలన్న కోరికతో వుంటాడు. ఇంతలో గుండెపోటుతో చనిపోతాడు. చనిపోతూ పెద్ద కొడుకు బోసుబాబుకి ఆస్తి పంపకాలు చెప్పి చనిపోతాడు. ఈ పంపకాలు బోసుబాబుకి నచ్చవు. ఉమ్మడి ఆస్తినంతా చెరబట్టి ఎవరికీ పంచేది లేదని పొమ్మంటాడు. ఇతణ్ణి వీరేంద్ర నాయుడు లోబర్చుకుని చంద్రమ్మని తమ్ముడికిచ్చి పెళ్ళి చేయించుకుని హింసించడం మొదలెడతాడు. వేరే వూళ్ళో వున్న జగదీష్ కి ఈ విషయాలు తెలిసి ఎమ్మార్వోగా తిరిగొచ్చి, పరిస్థితిని చక్కబర్చే కార్యక్రమం  ప్రారంభిస్తాడు...

ఎలావుంది కథ

      శ్రీకారం లో చూపించింది ఉమ్మడి వ్యవసాయపు కథైతే, టక్ జగదీష్ తో ఉమ్మడి కుటుంబపు కథ. శ్రీకారం లో అవాస్తవిక ఉమ్మడి వ్యవసాయం లాగే, టక్ జగదీష్ లో ఇప్పుడు అనుభవంలో లేని కాలగర్భంలో కలిసిపోయిన ఉమ్మడి కుటుంబాల పాత ఫార్ములా కథ. ఈ కాలం చెల్లిన, యూత్ అప్పీల్ వుండని కాన్సెప్ట్ ని పదుల కోట్లతో సినిమాలకి ఇంకా వాడుకోవడం విచిత్రమే.

        ఐతే ఏంటి - బ్రహ్మోత్సవం’, శతమానం భవతి’, అమ్మమ్మ గారిల్లు లాంటివి ఇటీవల రాగా లేనిది - మనం తీస్తే ఫ్యామిలీ, యూత్, మాస్ మసాలా వగైరా బాక్సాఫీసు అప్పీళ్ళన్నిటికీ జవాబిచ్చే స్టార్ మూవీ ఎందుక్కాదని నమ్మి తీసినా ఇంతే. ఎందుకంటే ఫ్యామిలీ, యూత్, మాస్ మసాలా బాక్సాఫీసు - ఇంకా ఏవైతే అప్పీళ్ళు వుంటాయో- అవన్నీఇలాటి కథలు దారితీసే కాలం చెల్లిన క్రియేటివ్ యాస్పెక్ట్ థాటికి హాంఫట్ అయిపోతాయి.  

        చిన్న కొడుకు అనే హీరో ఉమ్మడి కుటుంబంలో దారి తప్పిన అన్నని, చెదిరిన కుటుంబాన్నీ చక్కదిద్దే టెంప్లెట్ ఇంకా సినిమా కథేనా ఇప్పుడు? 54 ఏళ్ళ క్రితం 1967 లో ఎన్టీఆర్ నటించిన ఉమ్మడి కుటుంబం’, 49 ఏళ్ళ క్రితం 1972 లో కృష్ణ నటించిన పండంటి కాపురం’, ఆనాడింకా వున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉనికితో ఐడెంటిఫై అవడంవల్ల అంత హిట్టయ్యాయి. ఇవి కూడా అన్ననో తమ్ముడ్నో చక్కదిద్దే కథలే. అప్పట్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కాపాడాలి కాబట్టి అలాటి చక్కదిద్దే కథలతో సినిమాలొచ్చేవి. ఇప్పుడా వ్యవస్థే లేనప్పుడు చక్కదిద్దే సినిమా లేమిటి?

        ఈ కథలో ఒక ట్విస్టు హిడెన్ ట్రూత్ గా వుంది. దీని ప్రకారం జగదీష్, అతడి అన్న బోసుబాబు ఒక తల్లి పిల్లలు కాదని, ఆదిశేషు నాయుడి మొదటి భార్యకి పుట్టింది జగదీష్ ఒక్కడేననీ, ఒకానొక కీలక ఘట్టంలో బైటపడుతుంది. ఇలా ఆస్తికి ఏకైక వారసుడు జగదీషేననే టర్నింగ్ పాయింటు వచ్చాక- దీన్ని కూడా నీరుగార్చడంతో, ఈ హిడెన్ ట్రూత్ అనే జగదీష్ పాత్రకి అందివచ్చిన అస్త్రం - పాత్ర విలువల్ని ఉదాత్తంగా చిత్రించే అవకాశం లేకుండా చేసింది.

        ఈ ఉమ్మడి కుటుంబం కాన్సెప్టే కాలం చెల్లినదైదే, దీనికి బలహీన కథా కథనాలు తోడయ్యాయి. ఇందులో ఒక డైలాగు కూడా - దారితప్పిన చంటి బిడ్డకి అమ్మ చెప్పే కథ నీది  అని! ఇలాటి కథ అమ్మ చెపితే ఏం చెప్పిందో ఏమర్ధమవుతుందో పిల్లలకి. ఇది నిన్నుకోరి’, మజిలీ తరహా లైటర్ వీన్ గా తీయాల్సిన కథ మాత్రం కాదనేది తెలుసుకోవాల్సిన నీతి. ఏ తరహా మేకర్ ఆ తరహా కథలు తీసుకుంటే సేఫ్ గా వుండొచ్చని టక్ జగదీష్ చెప్తుంది.  

నటనలు సాంకేతికాలు

     పాత్రని బట్టి అది నడిపే కథ, ఆ పాత్ర నడిపే కథని బట్టి నటనా వుంటాయి. పాత్రని పక్కనబెట్టి కథకుడు దాని కథని తనే నడిపితే, ఇలా పాసివ్ నీరస పాత్రతో నీరస కథే, దాంతో నీరస నటనే వస్తుంది. కొన్ని జాతీయ మీడియాలో రివ్యూలు తప్ప, ఓవరాల్ గా రివ్యూలు మెతకగానే రాశారు. సోషల్ మీడియాలో ప్రేక్షకుల కామెంట్స్ మాత్రం అంత మృదువుగా ఏం లేవు. 90% హాహాకారాలే. నానికీ, నాని నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న దానికీ ఇంత ఎడం వుందన్న మాట. పాత్రని, దాని కథనీ జడ్జి చేయడంలో నాని విజ్ఞత ప్రదర్శించలేదు.

        నటన ఎంత బలహీనంగా వుందంటే, మాటలు కూడా డల్ గా, సరిగా విన్పించనంత గొణుక్కోవడం లాగా వున్నాయి. లోలోపల ఏదో సఫర్ అవుతున్నట్టు కన్పిస్తుంది పాత్ర. కాస్త స్టార్ హవా, కాస్త హుషారైన రోమాన్స్, ఇంటినిండా కుటుంబంతో ఫన్, ఎంటర్టయిన్మెంట్ లాంటి హై వైబ్రేషన్స్ తో కూడిన చిత్రీకరణలుంటే నష్టమేమిటి?

        ఫస్టాఫ్ లో పాత్ర ఎంత సీరియస్ మూడ్ తో వుంటుందో, సెకండాఫ్ లో అంత లో- వైబ్రేషన్స్ తో విషాదం తాండవిస్తూ వుంటుంది. అన్నిపాత్రలూ, కథా విషాదచ్ఛాయలలుముకునే వుంటాయి సెకండాఫ్ లో. నాని క్యారక్టరైజేషనే మేకింగ్ కీ, మొత్తం ప్యాకేజీకీ హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ లేకుండా చేసింది. బాక్సాఫీసు రెస్పాండ్ అయ్యేది ఈ ఫ్రీక్వెన్సీ కే.  వి లో లాగే ఇందులోనూ పాత్ర చిత్రణ విషయంలో కన్ఫ్యూజనే.   

        ఒక టక్ చేసుకుని స్ట్రిక్టుగా వుండే ఆఫీసరుని చూసి, తానూ అలా ఆఫీసరవ్వాలని చిన్నప్పట్నుంచీ టక్ చేసుకోవడం మొదలెట్టిన జగదీష్ ని చూసి, పాపం ఇంటా బయటా సరదాగా ఎవరూ ఆఫీసర్ గారూ అని పిలవకపోవడమనే లోటు - పాత్ర ప్రజెంటేషన్ని పట్టించుకోక పోవడం వల్ల జరిగింది.

        అలా పిలుస్తూ వుంటే టక్ చేసుకుని వున్న పాత్రతో సస్పెన్సు వుండేది- ఎందుకలా పిలుస్తున్నారని. ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ సస్పెన్సుకి సమాధానం దొరికేది. కథనమంటే ప్రశ్న రేకెత్తించి, తర్వాత జవాబివ్వడమనే డైనమిక్స్ అని అర్ధం జేసుకోకపోతే ఇంతే, మొత్తం డల్ వ్యవహారమైపోతుంది. పాత్రకి ప్రెజెంటేషన్ పరంగా ఈ బ్యాకప్ లోపించడంతో, టక్ చేసుకోవడానికి కారణమైన చిన్ననాటి ఫాంటసీ ప్రేక్షకులు ఆటలు పట్టించే స్థాయికి వెళ్ళింది.

        ఇంత కుటుంబ కథలో హీరోయిన్ రీతూవర్మ వీఆర్వో పాత్రకి హీరో కుటుంబంతో బాండింగ్ లేకపోవడం కొట్టొచ్చే లోపం. బయట హీరోని కలవడం, రెండు డైలాగులు చెప్పడం వరకే పాత్ర.  పై అధికారి రాత్రి గెస్ట్ హౌస్ కి రమ్మన్నప్పుడు అక్కడే లాగి కొట్టకుండా సైలెంట్ గా వుండిపోతే, హీరో పాత సినిమాల్లోలాగా కామెడీ కొట్టుడు కొట్టించి రక్షించడం హీరోయిన్ పాత్రకీ, హీరో హీరోయిజానికీ ఏమైనా మేలు చేసిందేమో కథకుడే చెప్పాలి. టాలెంటెడ్ నటి రీతూవర్మ ఇందులో వృధానే అయింది. 

    చంద్రమ్మగా ఐశ్వర్యా రాజేష్ అత్తింట్లో ఆరళ్ళు ఏనాటివి! హీరో పెళ్ళి కాదన్నాడన్న కోపంతో దుష్టుల ఇంటికి కొడలిగా వెళ్ళిపోయి ఏం సంకేతాలిచ్చింది? తాత ఆశయాలు గుర్తుకు రాలేదా? పైగా స్త్రీ హక్కులు టైపులో అలాటి మొగుడితో ఘర్షణ. స్త్రీ హక్కుల ఉద్యమమా, తెలిసి తెలిసి ఆ పెళ్ళి చేసుకున్న మూర్ఖత్వమా? కుటుంబ కథా పాత్రలు రాయడం అంత ఈజీ కాదేమో.  

        ఇక తల్లి అర్జునమ్మగా 115 సినిమాల మలయాళ నటి మాలా పార్వతి. హీరో తప్ప మిగతా నల్గురూ సొంత పిల్లలే అన్నది హిడెన్ ట్రూత్. ఆప్యాయతలు సమర్ధవంతంగా నటించగలదు. ఉన్నట్టుండి స్వార్ధపరురాలై పోయి పాత్రని దెబ్బతీయడమే సమస్య. పెద్ద కొడుకు బోసుబాబు, అంటే జగపతిబాబు, తన సొంత కొడుకేనన్న రహస్యం ఇప్పుడు కూడా దాచి, మనసు కరిగినప్పుడు అతనే ఆస్తి పంచుతాడని హీరోకి అడ్డు పడుతుంది. తల్లి మాట విన్నందుకు ఒక అక్క కూడా హీరోని దూరం పెడుతుంది. పాత్రలన్నీ ఆస్తికోసం అర్రులు చాచేవే, హీరో సహా.

        విలన్ గా మారే జగపతి బాబు పాత్ర ఒక్కటే పర్ఫెక్ట్ గా వుంటుంది. విలన్ చేసేదే చెడ్డ పనులైనప్పుడు తప్పులేం వెతుకుతాం. విలన్ ఈజ్ ఆల్వెస్ రైట్ వాడి పాత్ర కొద్దీ. జగపతి బాబుకి ఇలాటి పాత్రలు, నటనలు  కొత్త కాదు.

        రావురమేష్, నరేష్, రఘుబాబు, సీవీఎల్ నరసింహా రావు, శ్రీకాంత్ అయ్యంగార్, రోహిణి, దేవదర్శిని - ఇంకా చాలా మంది నటీ నటులున్నారు గానీ వీళ్ళ పాత్రలు నామ మాత్రమే. డేనియల్ బాలాజీ, తిరువీర్ పాత విలనీని ప్రదర్శిస్తారు. ఈ గ్రామీణ కథలో లొకేషన్స్ బావున్నాయి. ఛాయాగ్రహణం బావుంది. సంగీతం ఓ మోస్తరు. ఒకప్పుడు సినిమా ఎలా వున్నా ఒకదాన్ని మించొకటి ఆరు హిట్ పాటలుండేవి. మధ్యమధ్యలో వచ్చే రొడ్డ కొట్టుడు కథ పట్టించుకోకుండా, పాటలు మాత్రం ఎంజాయ్ చేసి హిట్ చేసే వాళ్ళు. ఈ అదృష్టం కూడా ఇప్పుడు లేదు.  

చివరికేమిటి

      ఇప్పుడు అసలు ప్రశ్న! హీరో నాని ఎమ్మార్వో పాత్ర దేనికి వుందన్న ధర్మ సందేహమొకటి. తను ఎమ్మార్వోగా లేకపోతే వచ్చే నష్టమేమిటన్న ఆత్మఘోష. ఆస్తి మీద అన్న కోర్టు నుంచి స్టే తెచ్చుకుని సమస్య సృష్టించడం కథని మలుపు తిప్పి, నాని పాత్రకి గోల్ ని ఏర్పాటు చేసే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. ఈ గంటా ఇరవై నిమిషాలూ ఫస్టాఫ్ చివర్లో తండ్రి మరణం, అన్న స్టే తెచ్చుకోవడం తప్ప - ఈ సుదీర్ఘమైన బిగినింగ్ విభాగపు బిజినెస్ కొత్తగా ఏమీ వుండదు. కొత్తగా వూహించి చూపించిందేమీ లేదు. చాలా సినిమాల్లో రన్ అయివున్న అవే ఫ్యామిలీ కాపీ సీన్లు టెంప్లెట్స్ గా పడిపోతూంటాయి, గ్రామ కక్షలతో బాటు.

        ప్రశ్న హీరో నానికి ఎమ్మార్వో పాత్ర ఎందుకన్నదే. అన్న స్టే తెచ్చుకోవడంతో కథ ప్రారంభమైనప్పుడు, ఆ కథలో ఎమ్మార్వోగా తానేం చేయలేనప్పుడు దేనికా పాత్ర? అన్న స్టే తెచ్చుకోవడంతో అది కోర్టు పరిధిలో కెళ్ళిపోయిన సమస్య అయిపోయింది. తన చేతిలో ఏమీ లేదు. తన మెజిస్టీరియల్ అధికారాలెందుకూ పనికి రావు. ఇక అన్నకి ఓ తమ్ముడుగా కోర్టు కెళ్ళి సివిల్ కేసు పోరాడుకోవడమే. ఎమ్మార్వోగా అధికార పరిధిలో కాదు. ఇంత లొసుగు వుంది ప్లాట్ పాయింట్ వన్ ఏర్పాటులో. నాని ఎమ్మార్వో పాత్రనే క్యాన్సిల్ చేసే లొసుగు. ఇలా యెలా తయారు చేసుకుంటారు కథ?

        తన ప్రభుత్వాధికారం పనికి రాదు గనుక ఇంట్లో చెప్పి కోర్టులో స్టే వెకేట్ చేసేందుకు సహకరించమంటాడు. ఇది ప్రైవేట్. తర్వాత తల్లి అడ్డుకుని అలా చేస్తే ఒట్టని ఒట్టే యించుకుంకోవడంతో ఆగిపోతాడు. ఇది కూడా ప్రైవేట్. ఆ తర్వాత లాయర్ ఇందాక పైన చెప్పుకున్న హిడెన్ ట్రూత్ వెల్లడించడంతో, ఎవరికీ చెప్పవద్దంటాడు. ఇది కూడా ప్రైవేటే. ఇన్ని చిక్కుల్లో ఎమ్మార్వోగా చేయడానికేమీ లేదు. చివరికి అన్నతో తేల్చుకోవడమూ, విలన్ల అంతు చూడ్డమూ అంతా ప్రైవేటే. మరి ఎమ్మార్వో పాత్ర దేనికి? ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ ముందు ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చిన ఐదు నిమిషాలకే, జగపతి బాబు అడ్డం తిరగడంతో ఎమ్మార్వో పాత్ర ఔటై పోయింది! కథకి పనికి రాకుండా పోయింది. హీరో పాత్ర అవసరం లేకుండా చేసే ఇంత బ్లండర్ ఇంకే  సినిమాలోనూ చూడం.

        ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చాక ఒక సీన్లో నేను మెంటల్ రౌడీ ఆఫీసర్ అంటాడు. ఈ మాట ప్లాట్ పాయింట్ వన్ లో అనిపించి పాత్రని మార్చేసి వుంటే పోయేదేమో. జగపతి బాబు స్టే తెచ్చుకోవడం ఎలాటి ఆయుధమో గ్రహించినట్టు లేదు. నువ్వు ఎమ్మార్వోగా వచ్చావా నాయనా? ఐతే నేను స్టే తెచ్చుకున్నాను, ఇప్పుడు ఏ పవర్స్ తో ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని వుంటే, ఒక బలమైన డ్రమేటిక్ క్వశ్చన్ పుట్టేది కథ బలంగా నడవడానికి.

        నానికి నిషా దిగి, ఎమ్మార్వోగా పవర్స్ లేవని అర్ధమై- ఐతే నేను మెంటల్ రౌడీ ఆఫీసర్ని! అని కౌంటర్ ఇస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని దిగిపోతే, అదో రచ్చ చేసే ఎమ్మార్వో క్యారక్టరైనా అయ్యేది, బతికేది.

        హిడెన్ ట్రూత్ సంగతికొస్తే, ఇది వెల్లడించే లాయర్ (సీవీఎల్ నరసింహారావు) సిన్సియర్ లాయర్ అన్పించడు. ఎందుకంటే, ఆదిశేషు నాయుడు చనిపోతున్నప్పుడు తను అక్కడే వుండి, ఆస్తి పంపకం గురించి చెప్పిన మాటలు వింటాడు. కానీ సైలెంట్ అయిపోతాడు. హిడెన్ ట్రూత్ విషయానికొచ్చేసరికి జన్మ రహస్యం నానికి చెప్పేస్తాడు. సరే, నాని ఇప్పుడేం చేయాలి- ఆస్తికి తను వారసుడైనప్పుడు, ఈ నిజం జగపతి బాబుకి చెప్పేసి - నేను ఆస్తికోసం లేను, ఆస్తిని నువ్వు ఇంట్లో అందరికీ పంచేసేయ్- అని వెళ్ళిపోతే పాత్ర ఉదాత్త పాత్రగానైనా మారేది.

        డబ్బు కాదు కుటుంబ బంధాలు ఎంత ముఖ్యమో చెప్పడానికీ సినిమా తీశామన్నా రు. ఇందులో పోట్లాట అంతా డబ్బు కోసమే కదా. హీరో, విలన్ సహా ఇంట్లో ఎవరికి వాళ్ళ తగువులాట ఏమిటి. విలన్ ఆస్తితో పోతే పోయాడు, మనమంతా కలిసి వుందామని ఎందుకనుకోరు. కుటుంబ సినిమాలు తీయాలంటే చాలా మెచ్యూరిటీ అవసరమేమో. ఇలా యాక్టివ్ పాత్ర, సరైన కాన్ఫ్లిక్ట్, గోల్ లాంటి కనీసావసరాల్లేకుండా రాస్తే స్క్రీన్ ప్లే అయిపోతుందా?

సికిందర్