రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 13, 2021

1058 : రివ్యూ

దర్శకత్వం: రాచకొండ విద్యాసాగర్
తారాగణం: అవసరాల శ్రీనివాస్, రుహానీ శర్మ, రోహిణి తదితరులు
రచన: అవసరాల శ్రీనివాస్,  సంగీతం: శక్తి కాంత్ కార్తిక్, ఛాయాగ్రహణం : రామ్
బ్యానర్: ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు: శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి
విడుదల : 3 సెప్టెంబర్, 2021
***

      నటుడు రచయిత దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మరో ప్రేమ కథ రాసి కొత్త దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ కి అప్పగించాడు. బట్టతల గురించి కథ. విషయం చిన్నది, వ్యవసాయం పెద్దదిగా వుండాలి. అలా వుందా? ఇందులో చిలసౌ ఫేమ్ రుహానీ శర్మ హీరోయిన్. ఈసారి ఈమెకి చిలసౌలో లాంటి బలమైన పాత్ర దక్కిందా? బట్టతల మీద ఇదివరకే రెండు సినిమాలొచ్చాయి. అవసరాల బట్టతల కథ ఏమైనా భిన్నంగా వుందా? కొత్త దర్శకుడు ఏమైనా కొత్త ముద్ర వేశాడా? ఇవి తెలుసుకోవడానికి విషయంలో కెళ్దాం...

కథ

   జీఎస్సెన్ అనే గొత్తి సూర్య నారాయ‌ణ (అవ‌సరాల శ్రీనివాస్‌) ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్. తల్లి (రోహిణి) వుంటుంది. వంశపార్యంపరంగా వచ్చిన బట్టతల వుండడంతో అది బయటపడకుండా విగ్గు పెట్టుకుని స్ట్రగుల్ చేస్తూంటాడు. ఇంట్లో వున్నప్పుడు క్యాప్ పెట్టుకుంటాడు. అదే కంపెనీలో అంజలి (రుహానీ శర్మ) కొత్తగా చేరుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. తన బట్టతల ఆమె నుంచి దాస్తూ తప్పు చేస్తు న్నానేమోనని ఫీలవడం మొదలెడతాడు. ఇంతలో అతడి బట్టతల ఆమె చూసేస్తుంది. మడిపడి తెగతెంపులు చేసుకుంటుంది. ఇప్పుడీమె ప్రేమని ఎలా గెలుచుకున్నాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

            బట్టతలతో ఇన్నోవేట్ చేయని రోమాంటిక్ కామెడీ కథ. ఓ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చి వుంటే ఈ కథని నమ్మొచ్చు. ఇప్పుడు కాదు. ఇప్పుడు బట్ట తల సమస్యే కాదు. ఈ ఇరవై ఏళ్ళ కాలంలో హేర్ ట్రాన్స్ ప్లాంట్ టెక్నాలజీ  వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. హైదారాబాద్ లోనే డజనుకి పైగా క్లినిక్స్ వున్నాయి. రెండు సిటింగ్స్ తో, ఓ యాభై వేల ఖర్చుతో, ఆరు నెలల్లో గర్వ కారణమైన కేశ సంపద పొంద వచ్చు.

        వాస్తవమిలా వుండగా, బట్ట తల సమస్య నెదుర్కొన్న వెనుకటి కాలపు కథ అందించారు. మనమున్నది 2021 లో. 2019 లో విడుదలైన బాలా’, ఉజ్డా చమన్ కూడా ఇలాటివే. వీటికి ముందే ఈ కథ అనుకున్నట్టు అవసరాల వివరణ. ఈ కథ ముందే అనుకుంటే అనుకోవచ్చు గానీ, డీహెచ్ఐ (డైరెక్ట్ హేర్ ట్రాన్స్ ప్లాంటేషన్) టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని అప్డేట్ చేసుకుని వుంటే, ఆ రెండిటి కాపీ అన్న అపోహ వుండేది కాదు. డీహెచ్ఐ టెక్నాలజీ 43 దేశాల్లో వుంది. లక్షల మంది దీని సేవలు పొందుతున్నారు.

        సరే, పాత కాలపు పరిస్థితితోనే కథ చేయకుండా డీహెచ్ఐ తో కథని ఇన్నోవేట్ చేసివుంటే వచ్చే లాభమేమిటి? ఒకటి, బట్టతల- విగ్గు- విగ్గూడిపోయి బట్టతల బట్టబయలు- చివరికి విధిలేక బట్టతలతో రాజీపడి, అందమే ఆనందం కాదు, ఆనందమే అందమని బలవంతాన నవ్వుతెచ్చుకుని, ముగించే విషయంలేని మూస అయ్యేది కాదు కథ.

        ఇలా సైంటిఫిక్, సైకలాజికల్, మెడికల్ సబ్జెక్టులతో కమిటెడ్ గా వుండలేక, లేదా విషయ సేకరణ పట్ల అలసత్వం వల్ల ఇలాటి కథలు ఫ్లాపవుతున్నాయి. డిస్కో రాజాలో, ‘సవ్యసాచిలో సైంటిఫిక్ పాయింట్స్ ని ఇలా చెడగొట్టుకోవడం వలన భారీగానే ఫ్లాప్స్ నెదుర్కొన్నారు. సైజ్ జీరోలో మెడికల్ పాయింటుతోనూ ఇంతే.  వరల్డ్ ఫేమస్ లవర్లో సైకలాజికల్ పాయింటుతోనూ ఇంతే. ఇవి కొన్ని మాత్రమే ఉదాహరణలు. ఈ సబ్జెక్టులకి వాటివైన జానర్ మర్యాదలుంటాయి. ఇదికూడా లేకుండా మూసగా తయార్రు చేసుకుంటున్నారు కథలు.

నటనలు -సాంకేతికాలు

    హాస్య ప్రధానమైన బట్టతల పాత్రధారి అవసరాల నటన ఫర్వాలేదు. కామిక్ సెన్స్ వుంది, టైమింగ్ వుంది. ముఖ్యంగా హోటల్లో పెళ్ళి సందర్భంగా సృష్టించిన కామెడీ ఎక్కువ నవ్వు తెప్పించేదే. ఇలాటి పంచ్ కామెడీ ఇదొక్కటే కన్పిస్తుంది. హీరోయిన్ తెలుగు రాని హిందీ అమ్మాయి అనుకుని నటించిన సీన్లూ ఓకే. కానీ పాత్రకి కథ లేనప్పుడు ఎంతసేపు ఏ కామెడీతో నడిపిస్తారు. సెకండాఫ్ లో ఈ సమస్య ఎక్కువైపోయింది. పైగా మొదట్నుంచీ పాసివ్ పాత్ర. బట్టతలతో సమస్యైతే వుంది, ఈ సమస్యని పరిష్కరించుకోవాలన్న గోల్ మాత్రం లేదు.

        ఇంటర్వెల్లో హీరోయిన్ కి బట్టతల బయట పడ్డాక, ఇప్పుడామె ప్రేమనెలా పొందాలన్న గోల్ కూడా లేదు. తనకి దూరమైన హీరోయిన్ తానే దగ్గరై కౌన్సెలింగ్ చేసి, సమస్యతో రాజీ పడమని మోటివేట్ చేస్తుంది. అలా సమస్య నుంచి బయటపడతాడు పాపం! సొంత గోల్ లేకుండా ఇంతకంటే సినిమాని ఫ్లాప్ చేసే పాసివ్ ప్రధాన పాత్ర వుంటుందా?

1. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
2. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
3. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
4. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
5. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.
6. పాసివ్ పాత్ర సినిమాలకి పనికి రాదు.

        ఈ బ్లాగు అంతా ఈ హెచ్చరికలే నిండిపోయాయి. అయినా సినిమాల్లో పదేపదే పాసివ్ పాత్రలే! సిగరెట్ ప్యాక్ హెచ్చరికల్లా కన్పిస్తున్నాయి కాబోలు. మనకి తెలుసు- ఇలా సినిమా కథా శాస్త్రం నల్గురికి తెలియడం కోసం చదవడం, నల్గురి ముందు గొప్ప కోసం చర్చించడం వరకే. తీరా సినిమా చేసేప్పుడు ఇవన్నీ కట్టకట్టి అవతల పెట్టి, సొంత పైత్యాలతో సినిమాల్ని సింగారించుకుని మునిగిపోవడం. అనుభవమైతే గానీ తత్వం బోధపడదన్నట్టు అనుభవించి తీరాల్సిందే!

        ఆ మధ్య  మనియారయిలే అశోకన్ అనే మలయాళం వచ్చింది. ఇందులో పాత్రకి పొట్టి తనమనే సమస్య వుంటుంది గానీ, దీన్నుంచి ఎలా బయటపడాలన్న గోల్ వుండదు. పొట్టి తనం శాపం కాదు, సమస్య కూడా కాదు. తన సైజు అమ్మాయిని చేసుకుంటే సరిపోతుంది. ఈ గోల్ పెట్టుకుని అలాటి అమ్మాయి కోసం పాట్లు పడితే సరిపోతుందని ఆలోచించడు.

     పొట్టితనం ఎప్పుడు సమస్య కావచ్చంటే, మై మేరీ పత్నీ ఔర్ వో అనే హిందీ సూపర్ హిట్ లో పొట్టి లెక్చరర్ రాజ్ పల్ యాదవ్, పొడుగు రీతూపర్ణా సేన్ ని పెళ్ళి చేసుకుని, అందరూ నవ్వుతున్నారని గింజికు చావడంలో వుండొచ్చు. పొట్టి రాజ్ పల్ యాదవ్ కి పొడుగు భార్యతో వుండే ఆత్మ న్యూన్యతా భావం, దాంతో సమస్యలు తెచ్చుకుని  పడే బాధా చిత్రించాలంటే దర్శకుడికి సామర్ధ్యం అవసరం. నవ్విస్తూ ఏడ్పించడమనే ద్వంద్వాల పోషణతో ఈ సామర్ధ్యాన్ని ప్రదర్శించాడు.  

        పాత్ర ఏదో సమస్య పెట్టుకుని లోలోపల కుమిలిపోవడం దాని బాధ, ఆ బాధలోంచి బయటపడేదుకు పాల్పడే చర్యలు ప్రేక్షకులకి హాస్య వినోదం. ఇలాగే  జో సమ్ బడీలో పిరికివాడైన టిమ్ అలెన్, తన కూతురి ముందు ఒక బలవంతుడు తనని కొట్టాడని, తనూ  బలవంతుడై కూతురి ముందే వాణ్ణి కొట్టాలని చేసే ప్రయత్నాలు ఆ పాత్రకి సీరియస్, ప్రేక్షకులకి నవ్వులు. ఇంత సింపుల్ ఎంటర్ టైనర్స్ లో చెప్పకుండానే ఎంత బలమైన సందేశం, నీతీ వుంటాయో చెప్పక్కర్లేదు.

        అవసరాల బట్టతల పాత్రకి ఈ ద్వంద్వాల పోషణ అనే స్క్రిప్టింగ్ టూల్ లోపించడం వల్లే సజీవ పాత్ర కాకుండా అట్ట ముక్కలా వుంది. తనకి లేని జుట్టు ఎదుటి వాడికుందన్న అక్కసు లోలోపల వేధిస్తూంటే ఎదుటి వ్యక్తులతో పాల్పడే చర్యలెలా వుంటాయో సైకలాజికల్ స్టడీ చేసుకుని రూపకల్పన చేసుకోవాల్సిన సందర్భం. పాత్రంటే అదీ, కథంటే అదీ. ఇక పాత్రకి గోల్ విషయం చివర్లో చూద్దాం.

        ఈసారి రుహానీ శర్మ హీరోయిన్ పాత్రకి విషయం లేదు. ఆమెలోని నటిని బయట పెట్టే సన్నివేశాల్లేవు. అవసరాల పాత్రకే కథ లేనట్టు తనకీ లేకపోతే చేసేదేముంది. సాంకేతికంగా కెమెరా వర్క్ రిచ్ గా వుంది. సంగీతం నిరాశ.  

చివరికేమిటి

     ఫస్టాఫ్ హీరోయిన్ కి బట్టతల తెలియకుండా ప్రయత్నాలు. ఇంటర్వెల్లో బట్ట తల తెలియడం. సెకండాఫ్ చూసి చూసి హీరోయినే అర్ధం జేసుకుని దగ్గరై సమస్య నుంచి బయట పడేయడం. బొత్తిగా విషయం లేదు. బట్ట తలతో ఎలా మొదలైందో పరిష్కారం లేకుండా అలాగే బట్ట తలతో ముగుస్తుంది. ఇంటర్వెల్లో హీరోయిన్ కి బట్టతల తెలిసే ప్లాట్ పాయింట్ వన్ మలుపు- కాన్ఫ్లిక్ట్ అత్యంత బలహీనం. ఈ బలహీన కాన్ఫ్లిక్ట్ లో సెకండాఫ్ ని నిలబెట్టే విషయం లేకపోవడంతో కథకి సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడిగుండం. ఇందుకే మధ్యలో దూరమైన హీరోయిన్ ని దగ్గర చేసి కాన్ఫ్లిక్ట్ ని ముగించేశారు. ఇక హీరోయిన్ తోడ్పాటుతో బట్టతలతో తన మానసిక సమస్య నుంచి ఎలా బయటపడ్డాడో చూపించడం. చివర్లో హడావిడిగా ఓ స్టేజి ప్రసంగంతో నీతి చెప్పి ముగించడం.

        హీరోయిన్ కి వెంట్రుక వాసిలో బట్టతల తెలిసిపోయే ప్రమాదకర ఘట్టం నుంచి బయట పడి, ఇక లాభం లేదు, పెళ్ళి టైములోగా సీక్రెట్ గా జుట్టు మొలిపించుఒకోవడమే మార్గమని గోల్ పెట్టుకుని- క్లినిక్స్ లో ఆ జుట్టు మొలిపించుకునే పాట్లు, అదెంతకీ మొలవక పోవడం, పెళ్ళి టైము ముంచుకు రావడం - ఇలా వాస్తవికంగా, ప్రాక్టికల్ గా థ్రిల్లింగ్ గా - ఇన్నోవేట్ చేసి ఈ కథ చెప్పొచ్చు కదా?

        పోతే, దీనికి వారం క్రితం విడుదలైన ఇచ్చట వాహనములు నిలపరాదు లో ఫస్టాఫ్ లవ్ ట్రాక్ ఎలా వుందో, అదే మళ్ళీ అదే సెటప్ లో చూడాల్సి రావడం సహన పరీక్షే. కాకపోతే అందులో ఆర్కిటెక్చర్ కంపెనీ, ఇందులో రియల్ ఎస్టేట్ కంపెనీ.

        గోల్ లేకపోవడం, కాన్ఫ్లిక్ట్ లేకపోవడం, పాసివ్ పాత్ర కావడం - దీని తర్వాత మొన్న విడుదలై దెబ్బతిన్న  టక్ జగదీష్ లోనూ చూశాం. తెలుగు సినిమాలు అద్భుత క్రియేటివ్ టాలెంట్ తో ముందడుగేస్తున్నాయి. ఇలాగే మరిన్ని కదం తొక్కుతూ వస్తూంటే తెలుగు సినిమాల కీర్తి దశదిశలా మార్మోగుతుంది. జీవితం పండుగలా వుంటుంది. 
సికిందర్