రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, ఆగస్టు 2014, ఆదివారం

'రభస' రివ్యూ..




                                   
కామెడీ సీసాలో కషాయం!


రచన- దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్ 

తారాగణం: ఎన్టీఆర్, సమంతా, ప్రణీత, షాయాజీ షిండే, నాజర్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అజయ్, రఘుబాబు, జయసుధ, హేమ తదితరులు.
సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : శ్యాం కె.నాయుడు, కళ : ప్రకాష్, కూర్పు : కోటగిరి, పోరాటాలు : రాం- లక్ష్మణ్, 
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, సమర్పణ : బెల్లంకొండ సురేష్ 
సెన్సార్ : U/A, విడుదల : 29 ఆగస్టు 2014


***

2010 ‘బృందావనం’ తర్వాత- ఎన్టీఆర్ నటించిన ఐదు సినిమాల్లో ఒక్క ‘బాద్షా’ తప్ప- ‘దమ్ము’, ‘ఊసరవెల్లి’, ‘రామయ్యా వస్తావయ్యా’ - ఇప్పుడు ‘రభస’- నాల్గుకి నాల్గూ అపజయాల పాలవడానికి కారణాలేమిటో ఈపాటికి ఎన్టీఆర్ తెలుసుకునే వుండాలి. తన సీనియర్లైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి వాళ్ళు కూడా పంథా మార్చుకుని ‘మనం, ’దృశ్యం’, ‘లెజెండ్’ లలాంటి కొత్తదనాలతో సెకెండ్ ఇన్నింగ్స్ ని దిగ్విజయంగా ప్రారంభించుకుని ప్రేక్షకులకి కొత్తానుభూతుల్ని పంచిపెడుతోంటే, తానింకా ఆ సీనియర్లు ఏనాడో నటించి వదిలేసిన 1980-90 లనాటి పురాతన కథా కమామిషుల మీదే ఇంకా మోజుపెంచుకోవడం విచారకరం. మాస్ చిత్రాలకి ఆనాటి సినిమాలే గీటు రాయి కావు. ఏ కాలంలోనైనా భావోద్వేగాలు అలాగే వుంటాయి. అభిరుచులే మరిపోతూంటాయి. భావోద్వేగాల్లోంచి అభిరుచులు పుట్టవు, అభిరుచుల్లోంచే భావోద్వేగాలు ఉద్భవిస్తాయి. ఇదెలాగో, సినిమా సమకాలీన ధర్మానికి అభిరుచుల్ని అనుసరించే భావోద్వేగాలెలా వస్తాయో తర్వాత తెలుసుకుందాం.

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కిది రెండో సినిమా. మొదటి సినిమాగా 2011 లో ఇదే నిర్మాతలతో, యంగ్ స్టార్ రామ్ తో ‘కందిరీగ’ అనే రోమాంటిక్ సూపర్ హిట్ కామెడీ తీస్తూ తనదొక శైలినీ, సృజనాత్మకతనీ ఏర్పాటుచేసుకున్న తను, ఇప్పుడు రెండో సినిమాకే అవన్నీ తీసి పక్కనబెట్టేసి, ఓ పెద్ద స్టార్ తో చవకబారు సినిమా లాగించెయ్యడం విషాదకర పరిణామం. తన అనారోగ్యకారణంగా ఇలా జరిగిందనుకోవడానికి వీల్లేదు. స్క్రిప్టు చాలా ముందే తయారైపోయి వుంటుంది.

ఈ స్క్రిప్టుతో దర్శకుడు తెలిసో తెలీకో ‘కందిరీగ’ స్క్రిప్టుతో చేసిన గిమ్మిక్కే చేశాడు. ‘కందిరీగ’ స్క్రీన్ ప్లేది ఫ్రాక్చరైన స్ట్రక్చర్. ఐతే ఇంటర్వెల్లో ఈ ఫ్రాక్చర్ ఫీలవ్వకుండా మొదట్నించీ ఒక స్పష్టమైన ఎజెండాతో స్పీడుగా నడిపిన కథనం, దానికిస్తూ వచ్చిన అమోఘమైన ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన షుగర్ కోటింగ్, దాని సెకండాఫ్ ని బతికించింది.

‘దర్శకులం డాట్ కామ్’ లో ‘కందిరీగ’ రివ్యూ రాసినప్పుడే, ఇలాటి ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లేలతో ఏం జరగవచ్చో హెచ్చరించడం కూడా జరిగింది. ‘కందిరీగ’ లాంటి సంపూర్ణ హాస్యప్రధాన యాక్షన్ కథని మాత్రమే ఆ స్పీడు కథనమూ, అంతేసి షుగర్ కోటింగూ ఫ్రాక్చర్ ని మరిపించగలవేమోగానీ, అదే ఫక్తు సీరియస్ యాక్షన్ కథై నప్పుడు ఆ ఫ్రాక్చర్ దగ్గరే కుప్ప కూలిపోతుందని చెప్పడం జరిగింది.


చెప్పినట్టుగానే సరీగ్గా ‘రభస’ అనే ఫక్తు సీరియస్ యాక్షన్ కథతో మళ్ళీ ‘కందిరీగ’ లాంటి గిమ్మిక్కుకే పాల్పడి మొత్తం కుప్పకూల్చుకున్న దర్శకుడ్ని చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధంగావడం లేదు! ఈ గొడవేంటో ‘స్క్రీన్ ప్లే’ సంగతులు విభాగంలో పూర్తిగా చూద్దాం..


అమ్మకిచ్చిన మాట - వదిలేసి పరోపకారాల బాట! 
అనగనగా కార్తీక్ (ఎన్టీఆర్) అనే అమెరికాలో చదువుకునే విద్యార్ధి. చిన్నప్పుడు తన తల్లి మేనత్త కి మాటిస్తే, ఆ మాట నిలబెట్టడంకోసం ఇండియా వస్తాడు. పాతికేళ్ళ క్రితం మేనత్త చచ్చిపోతూ తన కూతురు చిట్టి (సమంతా) ని కార్తీక్ తల్లి చేతుల్లో పెట్టి, నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని మాట తీసుకుంది. అయితే దీన్ని బేఖాతరు చేసి కుటుంబంతో సహా సిటీ కెళ్ళి పోయి రాజకీయంగా బాగా ఎదిగాడు మేనమామ ధనుంజయ్ (సాయాజీ షిండే). ఇప్పుడతన్ని లొంగ దీసి మరదల్ని పెళ్లి చేసుకురమ్మని పురమాయిస్తుంది కార్తీక్ తల్లి (జయసుధ).

ఇలా సిటీ కొచ్చిన కార్తీక్ చిట్టీ అనుకుని ఆమె ఫ్రెండ్ భాగ్యం ( ప్రణీత) తో ప్రేమలోపడతాడు. ఆమెని ప్రేమలో దింపడం కోసం ఆమె కాలేజీలోనే యాంటీ లవర్స్ స్క్వాడ్ పేరుతో కాలేజీలో ప్రవేశిస్తాడు. అదే కాలేజీలో చదువుతున్న చిట్టీ అలియాస్ ఇందూ అతడితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ వుంటుంది. అసలైన ప్రేమల గురించి లెక్చర్లిచ్చే కార్తీక్ ని చూసి భాగ్యం ప్రేమలో పడుతుంది. ఇంతలో తన మరదలు భాగ్యం కాదు, చిట్టీ అని తెలుసుకుంటాడు కార్తీక్. కానీ మరదలు చిట్టీని చూస్తే ఆమె ఇంకెవర్నో ప్రేమిస్తూంటుంది. ఇప్పుడు అమ్మమాట కోసం చిట్టీని కార్తీక్ తనవైపు ఎలా తిప్పుకున్నాడన్నది మిగతా కథ....అని అనుకుంటా రెవరైనా! కానీ కాదు-మాటా గీటా వదిలిపారేసి, ఇంకేవో రెండు ఫ్యాక్షన్ (గంగిరెడ్డి అనే నాగినీడు- పెద్దిరెడ్డి అనే జయప్రకాష్ రెడ్డి) కుటుంబాల మధ్య ఎప్పుడో తనవల్ల ఏర్పడిన స్పర్ధల్ని తొలగించడానికి వాళ్ళింట్లోనే మకాం వేస్తాడు.

ఎన్టీఆర్ మంచి లుక్ తో, మంచి నటనతో అభిమానులవరకూ అలరిస్తాడేమో. విషయపరంగా సినిమా లుక్ కూడా బావుండాలని చూసుకోకపోతే ఇమేజి పరంగా ఏ లుక్కయినా, ఏ స్టెప్పులూ ఫైట్లయినా సినిమాని ఏం కాపాడతాయి. అరిగిపోయిన పురాతన పాత్రతో, బాగా నలిగిపోయిన అతిపురాతన మామా అల్లుళ్ళ సవాల్ కథతో, అదికూడా అర్ధంకాని గందరగోళపు కథనంతో వుంటే, ట్రెండ్ లో వున్న స్టార్ అనేవాడు ఎన్ని షోకులు చేసుకుంటే ఏం లాభం.


సమంతా ఈ సారికూడా బోల్తా కొట్టింది. ఆమెకీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి- ఇలాటి పనికిరాని పాత్రలతో ఇలాగే కొనసాగితే కనీసం త్రిష లాగించినంత కాలం కూడా సినిమాల్లో వుండదు. ప్రణీత మొహం నిండా పెద్ద పెద్ద కళ్ళే ఇబ్బందికరంగా డామినేట్ చేసే వ్యవహారం. ఈ సినిమాలో అర్ధాంతరంగా ఈమె పాత్ర ముగిసిపోతుంది. అరుపుల షాయాజీ షిండే, ఇంకో అరుపుల అజయ్, భోళా జయప్రకాష్ రెడ్డి, సీరియస్ నాగినీడూ లవి, ఫ్యాక్షన్ సినిమాల్లో ఎప్పుడో అరిగిపోయిన పాత్రలు, నటనలు.

ఇక సెకండాఫ్ అనగానే బ్రహ్మానందం రావడమనే స్కీము ఇంకెన్నాళ్ళు తెలుగు సినిమాల్ని పట్టి పీడి స్తుందో తెలీదు. ఈ స్కీము రహస్యం కూడా తెలిసిపోయేదే- సెకండాఫ్ లో కథ నడపడలేక దర్శకుడు చేతులెత్తేస్తే- బ్రహ్మానందం వచ్చేసి కథతో సంబంధం లేకుండా నవ్వించి వెళ్ళిపోతే, ఓ అరగంట స్క్రీన్ టైము గడిచిపోయి దర్శకుడికి తేలికవుతుంది! పదేపదే ఈ అరిగిపోయిన స్కీము గిన్నీసు బుక్కు బ్రహ్మానందానికి ఎంత త్వరగా బోరుకోడితే అంతమంచిదని ఎదురు చూడ్డం తప్పితే చేసేదేం లేదు. సినిమా మొదట్నుంచీ కథలో భాగంగా ఆ పాత్ర వుంటే అది వేరే విషయం.

చీటికీ మాటికీ ఫైట్స్ ఇంకో సహన పరీక్ష. అలాగే పాటల మీద కూడా శ్రద్ధపెట్టలేదు. ఒక్క ఛాయాగ్రహణం మాత్రమే సాంకేతిక విభాగంలో మార్కు లేయించుకుంటుంది. కథకి తగ్గట్టే సంభాషణలు పేలవంగా ఉన్నాయి.

స్క్రీన్ ప్లే సంగతులు

దర్శకుడు తన తొలి సినిమా ‘కందిరీగ’ ఫ్రాక్చరైన స్క్రీన్ ప్లే తో తెలిసో తెలీకో చేసిన గిమ్మిక్కు సక్సెస్ కావడంతో- రెండో సినిమాకీ రిస్కు ఎందుకని దాన్నే నమ్ముకున్నట్టున్నాడు...ఐతే తను చేసిన గిమ్మిక్కు ‘కందిరీగ’ లో ఎలా వర్కౌటయ్యిందో సశాస్త్రీయంగా విశ్లేషించుకో నందున, గుడ్డిగా నమ్మి దాన్నే ‘రభస’కీ అన్వయింప జేసినట్టుంది. అప్పుడిది ఎలా తయారయ్యిందంటే, ‘కందిరీగ’ అనే యాక్షన్ కామెడీ సీసాలో ‘రభస’ అనే సీరియస్ యాక్షన్ ని నింపేసి కషాయం తయారు చేసినట్టయ్యింది!

‘కందిరీగ’ ఫస్టాఫ్ లో విలన్ తో ఛాలెంజి ప్రకారం హీరోయిన్ని హీరో ప్రేమించేట్టు చేసి, అతడికి బుద్ధి చెప్పించడంతో, హీరో లక్ష్యం పూర్తయ్యి ఇంటర్వెల్లోనే కథ ముగిసినట్టయ్యింది. ఇక సెకండాఫ్ లో కథే ముంటుంది?

సెకండాఫ్ లో అతికించిన కథే! విలన్ మళ్ళీ అదే హీరోయిన్ని ఎత్తుకుపోయి పెళ్ళాడే ప్రయత్నం చేయడమనే సెకండాఫ్ కొనసాగింపు తెచ్చి అతికించిన ముక్కే. అది ఫస్టాఫ్ కథా కథనాల్లోంచి సహజంగా ప్రవహించిన ప్రక్రియ కాదు. అయితే అతికించిన ముక్క అనే ఫీల్ కలక్కుండా కాపాడిందేమిటంటే, సినిమాప్రారంభం నుంచీ దీన్నో అనితరసాధ్యమైన షుగర్ కోటింగ్ తో- తెగ నవ్వించే యాక్షన్ కామెడీగా స్పీడుగా నడిపించుకు రావడమనే కథన చాతుర్యమే. ఒక్క బోరు కొట్టే సీను గానీ, డైలాగు గానీ లేకుండా పడిన జాగ్రత్తే. షుగర్ కోటింగ్ పాత మూసలో వెలసిపోయిన దై వుంటే కూడా ఎంత కథనమూ ఫ్రాక్చర్ ని మరిపించేది కాదు. ఒక్క అనితరసాధ్యమైన ఇన్నోవేటివ్ షుగర్ కోటింగ్ వల్ల మాత్రమే నిలబడ్డ వికలాంగ స్క్రీన్ ప్లే ‘కందిరీగ’ ది!

ఏమిటా ఇన్నోవేటివ్ షుగర్ కోటింగ్? హీరో రామ్ పాత్రకిచ్చిన వినూత్న తరహా క్యారెక్టరైజేషనే. పాత్ర మేనరిజమ్స్ ప్రధానాకర్షణ అయ్యాయి. రియల్ ఫన్ కీ, వెకిలితనానికీ మధ్యన సన్నని రేఖ వుంటుంది. దీన్ని గుర్తుంచుకుని క్లాస్-మాస్ రెండూ కలగలిసిన టిపికల్ క్యారెక్టర్ గా తీర్చిదిద్దారు. దీన్ని గురించి ఇంకా చెప్పాలంటే- జేమ్స్ బానెట్ తన ప్రసిద్ధ స్క్రీన్ ప్లే పుస్తకంలో రాసినట్టు- ‘Another factor augmenting the sugar coat is real life. Audiences are fascinated and delighted by successful imitations of real life -real human gestures, expressions, moods and conversations, when a great story artistically treats real life to create a metaphor, it retains that fascination and becomes a primary interest holder. It riverts their attention’ అదన్న మాట- నిజజీవితానికి షుగర్ కోటింగ్ ఇస్తూ సక్సెస్ ఫుల్ గా ఇమిటేట్ చేసిన పాత్ర చిత్రణ అది! పాత్ర కలర్ ఫుల్ గా వుంటే కథ ఎన్ని లోపాలనైనా జయించేస్తుంది!

ఈ షుగర్ కోటింగ్ ఏమీ సాధ్యపడని ‘రభస’ లాంటి సీరియస్ (ఫ్యాక్షన్) యాక్షన్ కథని ఇంటర్వెల్లో చేర్చిన మజిలీ- విలన్ కూతుర్ని చేసుకుని తీర్తానని హీరో చేసే ఛాలెంజి – ఆతర్వాత సెకండాఫ్ లో ఐపులేకుండా పోవడమనే ఫ్రాక్చర్ ని ఏం చేసీ- ఎన్ని ఫైట్లు పెట్టీ మరిపించలేకపోయారు. ‘కందిరీగ’ కామెడీతో చేసిన స్కీము సీరియస్ యాక్షన్ కి పనికిరాదని ముందే చెప్పుకున్నాం. సెకండాఫ్ లో హీరో తన లక్ష్యం మర్చిపోయి వేరే కథ నడపడమే- ఉపకథ ని ప్రధాన కథగా మార్చెయ్యడమే ఘోర తప్పిదమైపోయింది.

ఇంకా పాత సినిమాలే ఉన్నదున్నట్టూ అనుసరణీయమనే దురభిప్రాయం కూడా తోడయ్యింది. ఆనాటి సినిమాల్లోని భావోద్వేగాలు (ఎమోషన్స్ ) నిస్సందేహంగా కాలదోషం పట్టనివే. భావోద్వేగాలు ఎప్పుడైనా ఒకలాగే వుంటాయి. వుండనివేమిటంటే ఆయాకాలాల అభిరుచులే (టెస్ట్స్). అభిరుచులు మారిపోతూంటాయి. ముందు ట్రెండ్ లో వున్న ప్రేక్షకాభిరుచుల్ని ఎష్టాబ్లిష్ చేసుకుంటే- వాటిని అడ్డంపెట్టుకుని ఏ ఎమోషన్స్ నైనా ప్రదర్శించుకోవచ్చు. అదే పాత సినిమాల్లోని ఎమోషన్స్ ని ఆనాటి అభిరుచులతో సహా ఎత్తేసి పెట్టుకుంటే మొత్తం సినిమా కాలంచెల్లిన లుక్ తో ‘రభస’లాగే వుంటుంది. ఇటీవలి తాజా హిట్ ’రన్ రాజా రన్’ లో, ముందు ట్రెండ్ లో వున్న అభిరుచుల్ని హైలైట్ చేస్తూ, విలన్లూ -పోలీసుల మూస తరహా భావోద్వేగాలతోనే నింపేసి అలరించారు.

సినిమాలో ఒక చోట షాయాజీ షిండే ఎన్టీఆర్ మీద రెచ్చిపోతూ- ‘చంపండ్రా!’అని గ్యాంగ్ ని ఎగదోస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ కూడా- ‘ఇది కదరా నాకావాల్సిన ఎమోషనూ!!’-అని వాళ్ళ మీద విరుచుకుపడతాడు.

కాస్త ప్రేక్షకాభిరుచులతో ట్రెండ్ లో కూడా ఉంటూ ఎమోషనలై పోవాలని ఇంకెప్పుడు గుర్తిస్తారో!

-సికిందర్