రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 4, 2014

సాంకేతికం/ ఆనాటి ఇంటర్వ్యూ





ఇంటూరి సాంబయ్య -మేకప్ మాన్ 
           ఇంటూరి సాంబయ్య ఇప్పుడు మిగిలి వున్న ఐదారుగురు అలనాటి అగ్రగణ్య రూపశిల్పుల్లో ఒకరు. 1958లో రంగ ప్రవేశం చేసి, ఐదు దశాబ్దాల పైబడిన తన కెరీర్ లో మొత్తం 1300 సినిమాలకు మేకప్ మాన్ గా సేవలందించి,  నిన్నమొన్నటి ‘యమదొంగ’, ‘యమగోల మళ్ళీ మొదలైంది’ లాంటి పౌరాణిక పార్శ్వం గల సినీమాలకి ఇప్పటికీ అక్కరకొస్తున్న పెద్ద దిక్కు ఆయన...

          మాదాపూర్ లోని నానోటెల్ త్రీ స్టార్ హోటల్ లాంజిలో ఎమోషనల్ గా  రిసీవ్ చేసుకున్నారు ఈ వ్యాసకర్తని  సాంబయ్య. ఎమోషనల్ గా ఎందుకంటే, తన అన్నేళ్ల వృత్తి జీవితంలో ఆయనకి ఇదే తొలి ఇంటర్వ్యూఅట ! –‘నన్ను గుర్తుంచుకుని మీరింత అభిమానంతో వచ్చినందుకు థాంక్స్’ అని ఓపెనయ్యారు. కొందరినెందుకో సొసైటీ గుర్తించదు. సాంబయ్యకి తెలిసిన చరిత్ర ప్రకారం ( మేకప్ గురించి తెలుగులో పుస్తాకాలేవీ లేకపోవడం ఒక లోటు) నాటకా లెప్పుడు మొదలయ్యాయో మేకప్ అప్పట్నించీ వుంది. కాకపోతే ఆ రోజుల్లో ప్రకృతి సిద్ధమైన అర్ధళం, మసిబొగ్గు, గంగ సిందూరం వంటి పదార్ధాలు మేకప్ కి ఉపయోగపడేవి.

          సినిమాలొచ్చాక ప్రారంభ దినాల్లో సాంబయ్య మేకప్ మెటీరియల్ ని స్వయంగా తయారు చేసుకునే వారు. కృష్ణుడి పాత్రకి బ్లూ మేకప్ వేయాలంటే ఆ రంగుల్ని గురువుగారు భద్రయ్య ఇంట్లో నూరుకునే వాళ్ళు. అమెరికా నుంచీ మ్యాక్స్ ఫ్యాక్టర్ మూవీ మేకప్ ఉత్పత్తులు రావడం మొదలయ్యాక, యావద్దేశ సినిమపరిశ్రమలకీ ఆ ఉత్పత్తులే ఆధారభూతమయ్యాయి. మ్యాక్స్ ఫ్యాక్టర్ విప్లవాత్మక ఆవిష్కరణ ‘పాన్ కేక్’. ఇది తిరుగు లేని మేకప్ ఉపకరణంగా  పాపులరయ్యింది. ప్రోక్టర్ అండ్ గాంబుల్ ఈ ప్రోడక్టు ని  టేకోవర్ చేశాక, 2010లో అమెరికా నుంచి ఉత్పత్తుల్ని నిలిపేసింది. దీంతో లండన్ ఉత్పత్తుల మీద మన దేశ సినిమా పరిశ్రమ ఆధార పడుతోంది.

      మొదట్లో తెలుగు సినిమాలు కలకత్తాలో తయారయ్యేవి. మద్రాసుకి మారాక కొందరు కలకత్తా కళాకారులు అక్కడికి తరలి వచ్చారు. వాళ్ళల్లో  మేకప్ కళకి  పితామహుడు అనదగ్గ హరిపాద చంద్ర ( హరిబాబు అంటారు) ఒకరు. దక్షిణ దేశానికి మేకప్ కళ నేర్పించిందీయనే.  తెలుగులో భద్రయ్య, పీతాంబరం, వీర్రా జూలాంటి తొలినాటి రూప శిల్పులు, వీరాస్వామి, మన్మధరావు, వెంకటేశ్వర రావు, అప్పారావు, లంబా కృష్ణ వంటి  సాంబయ్య సమకాలీనులూ హరిబాబు ఏకలవ్య శిష్యులే.

          ఇప్పుడు మేకప్ అద్భుతంగా అభివృద్ధి చెందిందంటారు సాంబయ్య. ఏకంగా మాస్కులతో రూపాల్నే మార్చేస్తున్నా రన్నారు. ఇదంతా సరే, మీరు సాధించిన ఒక విజయం గురించి చెప్పండంటే, 1967లో ‘కంచుకోట’ సినిమాకి గాను నటుడు ప్రభాకరరెడ్డిని మరో నటుడు ఉదయకుమార్ లా మార్చేసిన తన మేకప్ ప్రయోగం గురించి గర్వంగా  చెప్పుకొచ్చారు. అదెలాగంటే, ఏమీలేదనీ - ఉదయకుమార్ ని పడుకోబెట్టి మౌల్డర్ వేలుస్వామి ఆయన ముఖం మీద ప్లాస్టరాఫ్ పారిస్ పోసి ముఖాకృతిని తీసుకున్నాడ న్నారు సాంబయ్య. దాన్ని ఎం ఎం ఫోం కంపెనీకి పంపిస్తే, ఆ  కంపెనీ దాంతో రబ్బర్ మాస్కు తయారు చేసిచ్చిందన్నారు. అంతే, ఇక దాంతో ప్రభాకరరెడ్డి అచ్చం ఉదయకుమార్ లా మారిపోయి, ఆ వెధవ పనులన్నీ చేశాడట ‘కంచుకోట’ లో!

          తోటి మేకప్ మాన్, నిర్మాత కూడా అయిన ఏ ఎం రత్నం ‘భారతీయుడు’ (1996) కి ముందు కమల్  హాసన్ వృద్ధ పాత్ర మాస్క్ తయారీ పనుల్లో హాలీవుడ్ నిపుణుడితో కలిసి సాంబయ్య కూడా పనిచేశారు. ఆ రోజుల్లోనే 40 లక్షలు ఖర్చయ్యిందట ఆ మేకప్ కి. ఇక మేకప్ సాంకేతికాంశాల్లోకి వెళ్తే, సాంబయ్య చెప్పిందాని ప్రకారం - ఏ మేకప్ కైనా పాన్ కేక్ తో బేస్ వేసి, పౌడరు అద్ది, పాన్ స్టిక్ తో మెరుగులు దిద్దుతారు. ఐతే సోషల్ ఈవెంట్స్ కి,  టీవీకి, నాటకానికి, సినిమాకీ మేకప్పులు వేర్వేరు. నిత్య జీవితంలో స్త్రీ పురుషులు చేసుకునే మేకప్ లైట్ గా, నేచురల్ గా వుంటే, టీవీ కొచ్చేసి మీడియం గానూ, నాటకాలకి బ్రైట్ గానూ, సినిమాలకైతే ఒక్కో ఆర్టిస్టుని బట్టి ఒక్కో విధంగా షేడ్స్ తో మేకప్ వేస్తారు.

          పూర్వం సినిమాల్లో మేకప్, కాస్ట్యూమ్స్, హేర్ స్టయిల్స్ ఒకరే చూసుకునే వారు. రాను రాను అది ఒకరే  నిర్వహించడం భారమై పోవడంతో, మూడుగా వాటిని విడదీసి-   మూడు శాఖలకీ  వేర్వేరు టెక్నీషియన్లని ఉనికిలోకితెచ్చారు- మేకప్, కాస్ట్యూమ్స్, హేర్ డ్రెస్సర్ అనే వాళ్ళు. అయితే కాలక్రమంలో శ్రద్ధ లోపిస్తూ దేవతా పాత్రలకి ఎలా మేకప్ వేయాలో చాలా మందికి తెలీడం లేదనీ, హీనపక్షం దేవతా పాత్రలకి బొట్లు కూడా ప్రామాణికంగా పెట్టలేక పోతున్నారనీ  బాధ పడ్డారు సాంబయ్య.

         గుంటూరు జిల్లా ఇంటూరుకి చెందిన ఈయన చేతిలోముస్తాబైన నటీనటుల్లో చిత్తూరు వి.నాగయ్య, సి ఎస్ ఆర్ ఆంజనేయులు, ఈలపాట రఘురామయ్య, ముక్కామల, ధూళిపాళ, షావుకారు జానకి, దేవిక, పి ఆర్ వరలక్ష్మి, హీరో కృష్ణ, శోభన్ బాబు మొదలైన వారెందరో వుండగా, కృష్ణకుమారి, రాజనాల, సత్యనారాయణ, హీరో రామకృష్ణ లకి పర్సనల్ మేకప్ మాన్ గా వ్యవహరించారు. ఇప్పటికీ మోహన్ బాబు, సత్యనారాయణలకి ఈయనే అభిమాన మేకప్ మాన్. 1969 లో ఎ. పుండరీ కాక్షయ్య అవకాశామివ్వడంతో, ‘భలేతమ్ముడు’ కి మేకప్ చీఫ్ అయి, ఎన్టీఆర్ కి తొలిసారిగా మేకప్ వేశారు సాంబయ్య. ఆ తర్వాత మరో మూడు సినిమాలకి ఎన్టీఆర్ కి పనిచేశారు. జానపదబ్రహ్మ విఠాలాచార్య కైతే, రికార్డు స్థాయిలో 50 సినిమాల వరకూ మేకప్ మాన్ గా సేవలందించిన ఘనత వుంది సాంబయ్యకి.

          పోతే, ఇప్పుడున్న మేకప్ రంగ పరిస్థితుల పట్ల తీవ్ర ఆక్షేపణ వుందాయనకి. మార్పుని అంగీకరించాలి కదా, తరాలువాటి కాలమాన పరిస్థితుల్ని బట్టి తంటాలు అవి పడుతూంటాయి కదా అనంటే, అలా కాదనీ - మేకప్ చెట్ల కింది కొచ్చేసిందనీ,  ఏ వృత్తయినా బజార్న పడకూడనీ అభిప్రాయపడ్డారు. అన్నట్టు ఈ ‘నానోటెల్’ హోటల్ ఈయన అల్లుడు గారిదే. తను టెక్నికల్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు. పదిమంది సంతానంలో పెద్దవారైన ఈయన, రికార్డు స్థాయిలో 36 మంది బంధువుల పెళ్ళిళ్ళు  చేశారు!

          ఇంతవరకూ ఏ అవార్డూ ఈయనకి రాలేదు. ఇంకో రెండేళ్ళల్లో రిటైర్ కావాలనుకుంటున్న ఈయన తనకు ఏ గౌరవ చిహ్నమూ లేదే అన్న వేదనతో వున్నారు. ఇంతే సొసైటీ... దాని బిజీలో కొందరు గుర్తుకు రారు.   


-సికిందర్
(మే 2011 ‘ఆంధ్రజ్యోతి’ సినిమా టెక్ శీర్షిక)