రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, September 4, 2014

ఆనాటి సినిమా!

క్లాస్ విలనీకి కేరాఫ్!
గుమ్మడి వెంకటేశ్వరరావు ఉరఫ్ జడ్జి విశ్వనాథ్ 


కొన్ని పాత్రలు ఫలానా ఆ ఒక్కరి కోసమే అన్నట్టుగా పుడతాయి. ఆ చెప్పుల్లోకి వేరొకళ్ళు కాళ్ళు పెడితే పుళ్ళే పడతాయి. గుమ్మడి ఎందులో కాలెట్టినా పూలే పూస్తాయి. అయినా ఎందుకో గుండె పోటుకి పర్యాయపదంగా ఆయన్నిచేసి ఓ చట్రంలో బిగించేశారు. చూసి చూసి ఆ గుమ్మడి ఓ వాటమైన గుండె దిట వుగల పాత్రతో గుండెదడే  పుట్టించి వదిలాడు. పోయెటిక్ జస్టిస్ అన్నమాట అది. కాబట్టి బివేర్ ఆఫ్ గుమ్మడి వెంకటేశ్వర రావు ఉరఫ్ జడ్జి విశ్వనాథ్ క్యారక్టర్!

నేనూ విలన్నే..అని చాటుకోవడం గుమ్మడికి కొత్తేం గాదు. 1956 లోనే ‘ఏదినిజం’ తో అది పూర్తయ్యింది. నవీన యుగంలో ‘మొండిఘటం’ లో చిరంజీవితోనూ ఆ దుష్టత్వం పండింది. ఇక పూర్తిస్థాయిలో, అదికూడా టైటిల్ రోల్ లో, తన విలనీ విశ్వరూపాన్ని దిగ్విజయంగా చూపించిన చలనచిత్రం మాత్రం –‘నేనూ మనిషినే!’

సినిమా రచయితలు నాటకాలు రాయాలని, నటులు సైకాలజీ చదవాలనీ ఎవరో అన్నారు. కానీ  చదివీ రాసీ అభివృద్ధి చెందాలనుకోవడం బొత్తిగా లో- క్లాస్ యాక్టివిటీ గా, పరమ నామోషీగా ఫీలైపోయే వాళ్లకి,  ‘నేనూ మనిషినే’ ఖామోషీగా, శ్రమ లేకుండా ఒక లై షోయే చూపించేస్తుంది! ఏమిటా లైవ్ షో? సినిమా రచనంటే ఏమిటో, నటనంటే ఏమిటో కూడా చిత్తగించ డానికి క్రైం పిక్చర్ ఎప్పుడూ ఒక ఛాన్సే. క్రైం సినిమాల్ని ఉత్త టైంపాస్ బఠానీలుగా తీసి పారెయ్యొచ్చు ఎవరైనా. ఐతే వాటిలో వుండే మేధకి కాస్త హృదయ బాధని కూడా జోడిస్తే కలకాలం గుర్తుండి పోనూవచ్చు. ఈ సినిమా తీసిన నిర్మాత దీన్నే ఆచరణలో పెట్టి చూపించాడు!

రామప్ప సుందరం 
తమిళనాడు సేలంలోని మోడరన్ థియేటర్స్ లిమిటెడ్ పేరు  తెలియని వాళ్ళుండరు. దీని అధినేత రామప్ప సుందరం తండ్రి ప్రవేశ పెట్టిన  లో-బడ్జెట్ సినిమాల మేకింగ్ ని తు. చ. తప్పక పాటించిన వాడు.  సీనియర్ సుందరం (1907-63) రచయితల్ని సంస్థకి గొప్ప ఎస్సెట్స్ గా పరిగణించి, ఉద్యోగ ప్రాతిపదికన నియమించుకుని, రాయించుకునే వాడు. ఆ రచయితల్లో  కరుణానిధితో మొదలుకొని భారతీ దాసన్, ఆశై తంబీల వరకూ ఎందరో  వున్నారు. అతను తన చిన్న తరహా సినిమాలకంటూ కొన్ని నిర్దిష్ట ప్రమాణాల్ని స్థిరీకరించాడు. సూటిగా స్పష్టంగా ఉండే కథ, పరుగులెత్తే కథనం, షార్ప్ టేకింగ్, సూపర్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్, క్యాచీ సంగీతం, నృత్యాలూ హాస్యం వగైరా. ఇలా తండ్రి సాంప్రదాయాన్నే తుదివరకూ కొనసాగించిన జూనియర్  సుందరం కూడా, తనెలా సక్సెసయ్యాడో చెప్పడానికి ఎస్వీ రంగారావుని రౌడీగా చూపిస్తూ ‘మొనగాళ్ళకి మొనగాడు’, గుమ్మడి ని విలన్ గా  చేసి ‘నేనూ మనిషినే’ ...రెండు విజయవంతమైన ప్రయోగాలూ  చాలు!

గుమ్మడిదసలే  గ్రెగరీ పెక్ ని మరపించే నటన, ప్రాణ్ ని తలపించే ఉచ్ఛారణ...
ఇవన్నీ ఒకెత్తు- ‘నేనూ మనిషినే’ లోని జడ్జి క్యారెక్ట రొక్కటీ ఒకెత్తు. ఆ దర్జా, దర్పం, ఫుల్ సూటులో టక్ చేసి, 
నెత్తిన హేటుతో, కళ్ళకి బ్లాక్ స్పెక్ట్స్ తో, , నోట సిగరెట్ పట్టించి పొగ మేఘాలు వదుల్తూ, చేత రివాల్వర్ పట్టి, ఎవర్నీ లెక్క చెయ్యని తనంతో, ఇలా ఫెళఫెళ లాడే గుమ్మడిని ఇంకే సినిమాలోనూ చూడం! చేసుకోక చేసుకోక పెళ్లి చేసుకుంటే ...ఎడారిలో ఒయాసిస్సు లా దక్కిన భార్యని కడదేర్చిన వాణ్ణి స్వయంగా అంతమొందించ కుండా ఎలా ఉంటాడు ఎంత జడ్జి అయినా...అనే మనసులోని చీకటి కోణంతో రగిలిపోతాడు జడ్జి పాత్రలో గుమ్మడి! నేరం గిట్టుబాటు కాదని తెలిసీ మనిషి ప్రతీకారేచ్ఛతో తనలోని రెండో మనిషి వైపే మొగ్గు చూపుతాడు...

ఇక్కడ డా. సి. నారాయణ రెడ్డి జోక్యం చేసుకుని తన పదునైన కలానికి పని చెప్తారు- సినిమా ప్రారంభాన్ని ఏకాగ్రతతో చూసే వాళ్ళకి సినారె రాసిన పాట గుండెల్లో గుబులెత్తిస్తుంది. ఇది ముందు జరగబోయే కథకి సూచనప్రాయంగా  స్క్రీన్ ప్లేలో వాడిన ఫోర్ షాడోవింగ్ అనే టెక్నిక్. గుమ్మడి హత్య చేయడానికి బయల్దేరి పోతూంటే, నేపధ్యంలో దాని పర్యవసానాల్ని హెచ్చరించే పాట .. ‘ఏది కలలోన అసలైన న్యాయం, తెల్చగల్గేది కనరాని దైవం, మనిషి పగబూని చేసేటి నేరం, ఎపుడు దిగిపోని పెనుపాప భారం..’

ఇంత భావోద్వేగంతో ఈ పాట వస్తూంటే గుమ్మడిని అలా వెళ్ళకుండా ఆపెయ్యాలన్పిస్తుంది... ‘మనసు పోరలోన పెరిగే కళంకం, కడిగినా మాసిపోని పంతం, అచట లేదోయీ ఏ కాలిబాట, కానరాదోయీ ఏ పూల తోటా, అచట కరిసేను రాకాసి ముళ్ళూ, అపుడు కురిసేను కన్నీటి జల్లూ..’

పాథెటిక్!

సాగిపోతున్న ట్రైన్ లో గుమ్మడి చేసే హత్యకి ప్రత్యక్ష సాక్షి అవుతుంది కాంచన! ఐరనీ ఏమిటంటే, ఈవిడ తెలీక అదే గుమ్మడి కూతురికి పాఠాలు చెప్పే టీచరుగా వచ్చేస్తుంది. సాలెగూడులో సాక్షి అన్నమాట. ఇక ఆడుకోవడమే గుమ్మడి పని! బ్యూటిఫుల్ డైనమిక్స్.
ఈయన తమ్ముడి గా ఎస్పీ పాత్రలో హీరో కృష్ణ ఉంటాడు. కాంచనని  ప్రేమిస్తున్న ఇతను హంతకుణ్ణి గుర్తించడానికి పోలీస్ స్టేషన్ కి రమ్మంటాడు. అప్పుడు కాంచన నోర్మూయించడానికి గుమ్మడి ఆమె చిన్నారి చెల్లెల్నే ఎత్తుకొచ్చేసి ఇంట్లో పెడతాడు. కాంచన నోరు విప్పితే ఈ పిల్ల ఫినిష్ అవుతుందన్న మాట. ఎత్తుకు పై ఎత్తుల కథాపథకం! కాంచనకి పెద్ద డైలమా. పైగా పదవికి రాజీనామా చేసిన గుమ్మడిని  ఇంకా అదే జడ్జి హోదాలో అవే  దానధర్మాలు చేస్తున్న  దైవంగా కొలుస్తూ జనాలు! దీన్ని కూడా ఎలా ఛేదించాలి  కాంచన?

ఇలాటి అంతర్మథనంతో ఈమె వుంటే, ఓ ప్రమాదం జరిగి సాక్షాత్తూ అదే గుమ్మడి ఆమెకి రక్తదానమిచ్చే పరిస్థితి దాపురిస్తుంది! మోరల్ గా కూడానూ ఇలా బందీ అయిపోయాక ఇంకేం చేస్తుంది? పాజిటివ్ గా, నెగెటివ్ గా ఇలా ప్రతిబంధకాలు పెరిగిపోతున్నాయి- దోషిగా గుమ్మడిని పట్టివ్వడం ఎప్పటికీ సాధ్యం కాదా?

ఇక పూర్తిగా గుమ్మడికే వత్తాసు పలకాల్సిన ఘట్టమూ వస్తుంది..గుమ్మడి అసలు తనెందుకు హత్య చేయాల్సి వచ్చిందీ  చనిపోయిన భార్య రాసిన లేఖ చూపించేసరికి భోరు మంటుంది కాంచన! జడ్జియే  విలన్ అయిపోతే ఇక సాక్షికి సాగుతుందా?

కాంచనతో సమస్య సమసిపోయాక మరొకరితో ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఓపెన్ చేయడం...కథనంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ నెస్ కోసం టైమింగ్ తో పాత్రల్ని రప్పించడం!

సత్యనారాయణకి ఈ జరుగుతున్న పరిణామాలేవీ నచ్చవు. . కాంచన గుమ్మడికి వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్తుందని నమ్మాడు.  అది జరక్కపోవడంతో ఆ గుమ్మడినే రివాల్వర్ పెట్టి  షూట్ చేసి పారేస్తాడు. వెళ్లి కోర్టు బోనులో నిలబడతాడు. అయితే దీనికి ముందు అసలా హంతకుడు తన అన్నే అని తెలుసుకున్న కృష్ణ ఠారెత్తిపోతాడు. ఏం చేయాలో పాలుపోదు. రక్తసంబంధంతో అన్నని కాపాడాలా, ఉద్యోగ ధర్మంతో పట్టివ్వాలా?
సత్యనారాయణ చేసుకున్న ఖర్మ మేమిటంటే, గుమ్మడి హత్య చేశాడని భావిస్తున్న సంఘటనలో, గుమ్మడి మీద సత్యనారాయణ హత్యాయత్నం జరిపిన ఘటనలోనూ ఫాటల్ బుల్లెట్స్ ఒకటేనని ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది! అంటే గుమ్మడి చంపి పడేసిన రివాల్వర్ ని తెచ్చుకుని గుమ్మడినే చంపబోయాడన్న మాట. దీంతో సీను రివర్సై, గుమ్మడి చేసిన హత్యలో తనే హంతకుడిగా ఇరుక్కుంటాడు!

గుమ్మడికి ఎంతో రిలీఫ్, సత్యనారాయణకి లైఫ్ తో కటీఫ్!

మరి కృష్ణకి?
ఒకానొక ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ నవల్లో  ప్రఖ్యాత క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ అంటాడు సెక్రెటరీ డెల్లా స్ట్రీట్ తో- “నా దృష్టిలో లాయరనేవాడు వాస్తవాలతో పేకాడేవాడు. సాక్షి విశ్వసనీయత ఏపాటిదో తెలుసుకోవాలంటే  వాస్తవాల్ని పేకముక్కల్లా కలిపేస్తూ తికమక పెట్టేయాల్సిందే. ఆ వాస్తవాల్ని తను తొ క్కిపట్టనంతవరకూ, వక్రీకరణలతో కేసుని తారుమారు చేయనంత వరకూ, సాక్షితో ఏం చేసినా లీగల్ గా అతను తన హక్కుల పరిధిలో తాను ఉంటూ కేసు వాదిస్తున్నట్టే లెక్క”-అని!

ఒక ఉన్నత పోలీసు అధికారిగా కృష్ణ తన అన్నకి అనుకూలంగా ఈ వాస్తవాల వక్రీకరణలకే  పాల్పడబో తాడు! రక్తసంబంధానికే లొంగి పోయాడతను. హోదావల్ల అవకాశం దక్కితే స్వార్ధాలు, నైతికపతనాలు, అధికార దుర్వినియోగాలూ సమస్త రుగ్మతలూ ఎలా వెల్లువెత్తుతాయో ఇక్కడ చూస్తాం మనం. వీటన్నిటికీ కేంద్రబిందువులా ఉంటూ తమాషా చూసే గుమ్మడి!

కథనంలో గాఢత పెరుగుతూ కథాత్మ ఆవిష్కారమౌతోంది!

మనిషి దేవుడిలా కన్పిస్తే ఇంతేనా? ఎలాటి శిక్షకీ అతను అతీతుడైపోతాడా?

హాలీవుడ్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ‘జడ్జి డ్రెడ్’ (1995) లో అతడిది జడ్జి పాత్ర. అతడిమీద హత్యానేరం రుజువయ్యాక, చీఫ్ జస్టిస్ మరణశిక్ష విధిస్తున్నట్టు ఎంతో గంభీరంగా తీర్పు చెప్పేసి, పక్కనున్న జ్యూరీ వైపు చూసి- “మనోడే! ఎప్పట్నించో వున్నాడు-కాస్త చూసుకోండి!”- అని మెత్తగా అనేసి వెళ్ళిపోతాడు.

అప్పుడా జ్యూరీ గుసగుసలాడుకుని, బోలెడు సెంటిమెంటుతో తోటి జడ్జీ అయిన స్టాలోన్ కి యావజ్జీవానికి ఆ శిక్షని కుదిస్తూ పైకి మాత్రం- “మన జేవితాల్లోంచీ, జ్ఞాపకాల్లోంచీ వీడి గుర్తుల్ని చెరిపి పారేద్దాం!” –అని కటువుగా లోకానికి ప్రకటించి,  ‘నిజాయితీ’ ని చాటుకుంటారు!

ఇదన్న మాట ‘మనోడు’ అనుకున్న వాడితో జరిగే యూనివర్సల్ ప్రహసనం. కాబట్టి గుమ్మడి తోనూ ఇంతే!
1960లో బీఆర్ చోప్రా తీసిన ‘కానూన్’ (చట్టం) అనే హిందీ ఆఫ్ బీట్ సినిమాలో జడ్జి పాత్రధారి అశోక్ కుమార్ ఇలాగే హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఈయన ఉబుసుపోక చేసిన ప్రయోగం ఏమిటంటే,  నేరం చేసి తప్పించుకోవచ్చని పందెం కాయడం! ఐతే దర్శకుడు చోప్రా ఈ జడ్జి ముద్దాయిని ఫార్ములా ముగింపుతో ఒడ్డున పడేస్తాడు. ఆఫ్ బీట్ సినిమాకి ఫార్ములా ముగింపులు బావుంటాయా?

గుమ్మడి కిచ్చిన ముగింపు అలా కాదు- ‘అచట లేదోయీ ఏ కాలిబాట, కానరాదోయీ ఏ పూల తోటా’- అనే జ్ఞానోదయమైంది చివరికి... ఇందర్ని బాధపెడుతూ పొందే సుఖం ఓ సుఖమా? అమాయకుడు ఉరికంబ మెక్కడం న్యాయమా? – “లోకం లోని న్యాయ స్థానాలు కేవలం తీర్పులు మాత్రమే చెప్పగలవు-కానీ  సరైన న్యాయాన్ని చేకూర్చగల న్యాయస్థాన మేమిటో తెలుసా? మానవుడి అంతరాత్మ!”- అంటూ గుండెలు విప్పుకుని ఉద్ఘోషిస్తాడు గుమ్మడి!

ముగింపులో ఈ కోర్టు రూమ్ హై డ్రామా చాలా ఉద్వేగభరితంగా వుంటుంది. నేనూ మనిషినే, నాకూ సగటు మనిషి భావోద్రేకాలుంటాయి - అనే అర్ధంలో గుమ్మడి గుండె చెరువు చేసుకునే దృశ్యం చూసి కదిలిపోని ప్రేక్షకులెవరూ వుండరు!

అసలు నేనూ మనిషినే అని స్టేట్ మెంట్ ఇవ్వడంలోనే ఎన్నో అర్ధాలున్నాయి. ఆశ ఆడిస్తే వాస్తవం నిలేస్తుంది. నీతిగల అధికారికి హోదా అనేది మనసు విచలితం కాకుండా కాపాడే రక్షక కవచమే. ఈ కవచాన్ని కాపాడుకోవడం దగ్గరే వస్తోంది సమస్య!

జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వంలో ఈ సినిమా ఆద్యంతమూ ఎంత ఉత్కంఠభరితమో అంత గుండెల్ని బరువెక్కిస్తుంది. ముందే చెప్పుకున్నట్టు- మేధకి కాస్త హృదయ బాధకూడా జతపడ్డ  క్రైం సినిమా ఇది- సక్సెస్ ఫుల్ క్రైం సినిమా! సినిమా రచయితలకి ఓ డిక్షనరీ లాంటి లైవ్  షో. సాత్విక ఇమేజి వున్న నటుడ్ని ప్రతినాయక పాత్రలో, సంస్కారయుతంగా వుంచుతూనే, పవర్ఫుల్ గా ఎలా చూపించ వచ్చన్న దానికి క్యారక్టర్ స్టడీ!
ఈ థ్రిల్లర్ పాటల పందిరి కూడా. సినారే కాక కొసరాజూ ఓ పాట రాశారిందులో. సంగీత దర్శకుడు వేదా. ఇతడి మీద హిందీ ప్రభావ మెక్కువ. తబలా శైలి ఓపీ నయ్యర్ ది. ఇందులో ‘చూసెనులె నా కనులే’ యుగళగీతం ‘చోరీ చోరీ’ (1956, శంకర్-జైకిషన్) లోని  ‘పంచీ బనూ ఉడ్తీ ఫిరూ’ (పక్షినై ఎగరాలనుంది) డ్యూయెట్ కి పక్కా అనుసరణే.  పోతే, ఈ సినిమాలో గుమ్మడి కూతురిగా ఎనిమిదేళ్ళ శ్రీదేవిని చూడొచ్చు!

1971 లో విడుదలైన మోడరన్ థియేటర్స్ వారి ఈ 110 వ (!) సినిమా క్లాస్ విలనీ కి చెరగని చిరునామా. ఈ సినిమాతో  గుమ్మడి మనకి ఇలా స్వాగతం పలుకుతున్నట్టు వుంటుంది -‘రండి బ్రదర్!జడ్జి విశ్వనాథ్ లా ఓ మర్డర్ చేసి చూద్దాం. పెద్ద వయసు పాత్రలు వేసి వేసి తెగ బోరు కొట్టేస్తోంది బాబు నాకూ!”  అని ఊరిస్తూ. సీడీ వేసుకుని ఈ సినిమాని ఆమూలాగ్రం అవధరించండి!

-సికిందర్
(అక్టోబర్ 2009 ‘సాక్షి’ కోసం)