రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

9, మార్చి 2018, శుక్రవారం

616 : క్యారెక్టర్ సంగతులు!



        సినిమా కథ ఆలోచించడమంటే ‘పాత్ర – ఆ పాత్ర పాల్పడే చర్యలు’  అనే రూట్లో ఆలోచించడ మేనని తెలుకుంటున్న దాఖలాలు  ఈ మధ్య కన్పించడంలేదు. ఒక్క తెలుగులో అనే కాదు, అటు హిందీలో,  ఇంకా అటు హాలీవుడ్ లో సైతం ఇదే పరిస్థితి. తాజాగా ‘చార్లీస్ ఏంజెల్స్- 2’ లో చూడవచ్చు. ఇటీవల విడుదలైన ఓ అగ్ర హీరో సినిమాని ఒక ఇంగ్లీషు పత్రికా సమీక్షకుడు విశ్లేషిస్తూ,  స్క్రీన్ ప్లే అద్భుతంగా వుందని రాశాడు. ఏ సీనుకా సీను విడివిడిగా ఆనందం కలిగిస్తే అదే అద్భుత స్క్రీన్ ప్లే అయిపోతుందన్న మాట. ఇక మొత్తంగా కథేంటో, దాని  నడకేంటో చూడనవసరం లేదన్న మాట. ఇలాగే  వుంటే ఇక భవిష్యత్తు ఇలాటి భయపెట్టే స్క్రీన్ ప్లేలదే!  

          సినిమా కథకి ఏది ముఖ్యం? ఖచ్చితంగా స్ట్రాంగ్  హీరో క్యారెక్టరే.  మార్కెట్లో ఆడుతున్న ఇంకో పది సినిమాలు చూసినా మరపురానంత బలమైన పాత్రచిత్రణతో వుండే స్ట్రాంగ్ హీరో పాత్రే. దీని తర్వాతే మిగతా హంగులన్నీ. మరైతే ఏది స్ట్రాంగ్ క్యారెక్టర్ అవుతుంది? అదెలా పుడుతుంది? ఇక్కడే మనసు చేసే  మాయలోపడి పాసివ్ పంథాలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు  రచయితలు / దర్శకులు. తామో  అద్భుత పాత్ర సృష్టించామని ఉబ్బి తబ్బిబ్బయిపోతారు. చూస్తే అది ఉత్త మనసు రెచ్చగొడితే రొచ్చులో  పడ్డ లేకి పాత్రగానే  కన్పిస్తుంది. ఈ మధ్య గీత రచయిత చంద్రబోస్ ఒక రేడియో ప్రోగ్రాంలో ఒక పనికొచ్చే మాట చెప్పారు : కూలి వాడు చేతులుపయోగించి పనిచేస్తే సరిపోతుందని, కానీ శిల్పి చేతులతో పాటు మెదడు నుపయోగిస్తే, అదే రచయిత ఆ చేతులూ మెదడుతో పాటూ, మనసూ ఉపయోగించి పని చేస్తాడని. 

       రచన చేత్తోనే చేస్తారు గానీ అది మెదడూ మనసుల దోబూచులాట. మెదడూ మనసూ రెండూ కన్పించే రచనే శక్తిమంతమైన రచన. ఇలాకాక కేవలం మనసు మాత్రమే వాడి రాసుకుంటూ పోతే పుట్టుకొచ్చేది బలహీన పాత్రే, అంటే పాసివ్ క్యారెక్టరే. పాసివ్ పంథాలో తిరుగాడే పాత్రలన్నీ కేవలం మనసు చెబితే పుట్టుకొచ్చేవే. అలాటి స్క్రీన్ ప్లే సమీక్షకుడికి గొప్పగా అన్పిస్తే, అతనూ మనసుతో మాత్రమే సినిమా తీసిన దర్శకుడిలాగే,  మనసుతోనే  సినిమా చూశాడనుకోవాలి. మరి దర్శకుడు మెదడు వాడకుండా మనసుతో సినిమా తీస్తే,  ప్రేక్షకులు కూడా మెదడు ఇంటి దగ్గర వదిలేసి మనసుతోనే సినిమా చూసినప్పుడు, హిట్టవ్వాలి గా? ఎందుకని ఇలాటి సినిమాలు హిట్టవడం లేదు?  సినిమాల్లో మెదడు కూడా లేకే హిట్టవడం లేదు. ఇది ఇద్దరి (దర్శకుల, ప్రేక్షకుల) మనసూ తెలుసుకోవడంలేదు. 

          పాత్రల సృష్టిలో మొదట మెదడు పని కల్పించుకుంటుంది. ఎందుకంటే ప్లానింగ్ కి మెదడే కావాలి. మనసు కాదు. మెదడుతో చేసిన ప్లానింగ్ ని తర్వాత మనసుతో చూసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ ప్రక్రియలో మెదడు మిస్సయ్యిందో, ఇక అప్పుడా సృష్టిస్తున్న పాత్ర పాసివ్ నడకలు నడుస్తూ ఎంచక్కా చతికిలబడి ఉస్సూరన్పిస్తుంది. లేదా కథని ఇతర పాత్రలకి అప్పగించేసి ఔటైపోతుంది. ఉదాహరణకి,  హీరోపాత్ర  తన కొచ్చిన ఒక బంగారు అవకాశాన్ని మిత్రుడికి త్యాగం చేసి వెళ్ళిపోవడం ముగింపు అనుకుందాం. అలా వెళ్ళిపోతూ శుభం పడితే బాగానే వుంటుంది. కానీ వెళ్ళిపోడు,  వెళ్ళిపోతూ వుంటాడు. ఇంతలో మిత్రుడికి కనువిప్పవుతుంది. ఇక ఆ బంగారు అవకాశానికి హీరో మాత్రమే పూర్తిగా అర్హుడని, అతడికి ధారాదత్తం చేశాడనుకుందాం - అప్పుడు హీరో ఎవరవుతారు? హీరోనా, మిత్రుడా? అంతిమంగా త్యాగం ఎవరిదైంది?  మిత్రుడిదే అయింది. కాబట్టి మిత్రుడే  గొప్పోడు, అతనే హీరో... హీరో వచ్చేసి తను త్యాగం చేసిందే తిరిగి తనే తీసుకున్నాడు కాబట్టి పాసివ్ పాత్రయిపోయాడు. 

      త్యాగం చేసిన స్ట్రాంగ్ క్యారెక్టర్, అంటే యాక్టివ్ పాత్ర  వెనుదిరగదు. ‘అమరదీపం’ లో కృష్ణంరాజు తమ్ముడి కోసం త్యాగం చేసి తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన భావముద్ర ప్రేక్షకులకి మిగలాలి. తన కోసం త్యాగం చేసిన వాళ్ళ కోసమైతే హీరోపాత్ర తిరిగి వస్తుంది. ఆ ఋణం తీర్చుకుంటుంది. 

          మనసు పాలిస్తే పాత్రల సృష్టి మట్టి పాలవుతుంది. అసలిలా జరగడం వెనకున్న మెకానిజం ఏమిటి? మనసు ఏ రకంగా చెప్తే పాత్రలలా తయారవుతాయి? మొదటే చెప్పుకున్నట్టు, పాత్ర – ఆ పాత్ర పాల్పడే చర్యల చట్రంలో కథని ఆలోచించకపోవడం వల్ల, రాస్తున్న రచయితే ఆ పాత్రమీద బోలెడు జాలిగొంటాడు. అయ్యో హీరో ఇలా అయిపోతున్నాడా పాపమనుకుని, ఇతడి కోసం తానేమైనా చేయాల్సిందేనని నడుం కట్టి, పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే రచయిత వచ్చేసి హీరో కోసం కథని దున్నుతున్నాడో, అప్పుడా హీరో కుదేలై కుక్కిన పేనల్లే వుండిపోతాడు. ఇది ఆ పాత్ర నటించే స్టార్ కూడా తెలుసుకోలేడు. 
*
          ఉదాహరణకి – హీరో చెల్లెల్ని ఎవరో ఎత్తుకుపోయారు. ఆమె కుయ్యోమొర్రో మంటున్న సౌండ్స్ విన్పిస్తున్నాయి. హీరో విషాదంగా మొహం పెట్టుకుని నడుస్తున్నాడు. ఆ చెల్లెలితో తన సెంటిమెంటు దృశ్యాలన్నీ కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి. సిస్టర్ సెంటిమెంటుతో బాగా కన్నీళ్లు వస్తున్నాయి. పార్కులో కూర్చుని ఏడ్చాడు. లేచి టాంక్ బండ్ మీదికి నడిచాడు. అలా  టాంక్ బండ్  తటాకాన్ని చూస్తూంటే చెల్లెలి జ్ఞాపకాలే సుళ్ళు తిరుగుతున్నాయి. మళ్ళీ డీటీఎస్ లో కుయ్యో మొర్రోలు విన్పిస్తున్నాయి. థియేటర్ ఆపరేటర్ కి పట్టరాని కోపం వస్తోంది. హీరో పిడికిళ్ళు బిగించాడు, పళ్ళు నూరాడు. ఫర్వాలేదనుకున్నాడు ఆపరేటర్. హీరో పంజా గుట్ట సెంటర్ కొచ్చాడు.  అక్కడ పక్కింటి  పరమానందం ఎదురై, మీ చెల్లెమ్మ గురించేనా? త్వరగా అమీర్ పేట సెంటర్ కెళ్ళమన్నాడు. వెళ్తే అక్కడ రెండు  గ్రూపులు కొట్టుకుంటున్నాయి. హీరో అర్ధంగాక చూస్తున్నాడు. ఆపరేటర్ ఓపిగ్గా చూస్తున్నాడు. హీరో ఏం జరిగిందని పక్కవాణ్ణి  అడిగాడు. మధుబాల అనే అత్యంత బ్యూటిఫుల్ గాళ్ ని వాళ్ళె త్తుకుపోతే, వీళ్ళు కొట్టడానికొచ్చారని పక్కోడు వివరిస్తు
న్నాడు...ఆపరేటర్ కిక అర్ధమైపోయింది. మ్యాట్నీకల్లా ఈ మొత్తమంతా ఎడిట్ చేసి పారేశాడు  ( సినిమాలకి ఫైనల్ ఎడిటింగ్, ఫైనల్ షేపు థియేటర్లలో ఆపరేటర్ల చేత ప్రొజెక్టర్ల మీద మాత్రమే చేయబడును). 

          ఇలా హీరోకి ఎవరెవరో చెప్తూంటేనే గానీ విషయాలు తెలియడంలేదు. హీరో తన ముందున్న సమస్య గురించి చేసిన ప్రయత్నమేదీ లేదు. పచ్చి పాసివ్ గా వుంటున్నాడు. ఇతడి మీద జాలిపడుతూ రచయిత విషాదంగా మార్చాడు. ఇదే రచయిత తనకే ఇలా జరిగితే ఇలా వుండడు. ఆరాలు తీస్తాడు, పరుగులు తీస్తాడు. కానీ ఎందుకనో కథకొచ్చేసి  అర్ధంలేని మెలోడ్రామాలు సృష్టిస్తూ కూర్చుంటాడు. పై సీనులో గమనిస్తే, రచయితే హీరోకోసం సంఘటనల్నీ, పాత్రల్నీ సృష్టించాడు. ఇలా రచయిత డ్రైవ్ చేస్తేనే గానీ హీరోకి తన చెల్లెలి అదృశ్యం గురించిన విషయాలు ఒక్కోటీ తెలియడం లేదు. దీన్ని కథ  వచ్చేసి పాత్రని నడపడం అంటారు. హీరో కోసం రచయిత వచ్చేసి కథని అల్లుతున్నాడు. రచయిత కథ వైపే వుంటున్నాడు. అదే హీరోవైపు వుంటే, సమస్యలో వున్న హీరోలా ఆలోచించడానికి పరకాయ ప్రవేశం చేస్తాడు. అప్పుడు ఇదే తనకి జరిగితే ఏంచేస్తాడో అలా యాక్టివ్ గా  రాసుకుపోతాడు.

          అప్పుడు చెల్లెలు అపహరణకి గురైందని హీరో పోలీస్ స్టేషన్ కి పరుగెడతాడు. అక్కడ ఎందు
కనో ఎస్సై నవ్వి హేళన చేస్తాడు. హీరో చెల్లెలి ఫ్రెండ్స్ దగ్గరికి పరుగెడతాడు. వాళ్ళేమీ చెప్ప
లేకపోతారు. వెతకాల్సిన చోట్లన్నీ వెతుకుతాడు. రాత్రంతా వెతుకుతూనే వుంటాడు. ఆ మాంటేజీలు పడుతూంటాయి. తెల్లారి కాలేజీ కెళ్తాడు. ప్రిన్సిపాల్ కి  చెప్తాడు. ఆమె పోలీసులకి కాల్ చేస్తుంది. అదే ఎస్సై  వచ్చి మళ్ళీ అలాగే హేళనగా నవ్వుతాడు. ఇప్పుడు హీరోకి అర్ధమైపోతుంది. కీలకమంతా ఎస్సై దగ్గరే వుందని... 

       ఇక్కడ హీరో తనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇలా చెయ్యి అ లా చెయ్యమని ఎవరూ చెప్పడం లేదు. తన ఆలోచనల ప్రకారమే సాగుతున్నాడు. కథనం చాదస్తంగా లేదు.  ప్రమాద నేపధ్యంలో వుండాల్సినంత చురుగ్గా వుంది. తన కథని తనే నడుపుకుంటున్నాడు హీరో. మొదటి కథనంలో ప్రతీదీ హీరో కాళ్ళ దగ్గరికి తెస్తున్నాడు రచయిత. అలా కథని తను నడిపిస్తున్నాడు.  రెండో కథనంలో ప్రతీ అడుగూ తనే వేస్తూ పోతున్నాడు హీరో. ఇలా పాత్ర-  అది పాల్పడే చర్యల చట్రంలో కథ వుంది. ఇలా పాత్ర పాల్పడే చర్యలు మాత్రమే కథవుతోంది. ఇలాటి యాక్టివ్ పాత్రతో  కథనం చైతన్యవంతంగా వుంటుంది. పాసివ్ పాత్రకి రచయిత చేసే కథనం మృతప్రాయంగా వుంటుంది. దేవుడి మీద భారం వేసి కూర్చునే బాపతు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుందని విధికొదిలేసి కూర్చునే విషాద కథనం. 

          యాక్టివ్ పాత్రలతో పూర్వం చాలా సినిమాలే వున్నాయి. ఖైదీ, విజేత, గ్యాంగ్ లీడర్, జానకీ రాముడు, బొబ్బిలిరాజా, గణేష్, శివ...లాంటివి. వీటిని పరిశీలిస్తే  ఈ పాత్రలు కథ నడిపే తీరుకి ఏవేవి మూలమవుతున్నాయో స్పష్టంగా, విజువల్ గా  తెలుస్తాయి.

సికిందర్
(ఆంధ్రభూమి వెన్నెల – జులై 25, 2005)