రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 22, 2016

రివ్యూ!





రచన – దర్శకత్వం : పూరీ జగన్నాథ్

తారాగణం: నందమూరి కల్యాణ్‌రామ్‌, జగపతిబాబు, అదితీ  ఆర్య,
వెన్నెల కిషోర్‌, పోసాని కృష్ణమురళి, అలీ, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ముఖేష్  జి.
బ్యానర్‌: నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌, నిర్మాత: నందమూరి కల్యాణ్‌ రామ్‌
విడుదల : అక్టోబరు 21, 2016
***
   నిర్మాత –నటుడు కల్యాణ్ రామ్  మరోసారి అదృష్ట పరీక్షకి నిలబడ్డారు- ఈసారి నిలబడి తీరాలన్న దృఢ చిత్తంతో-  సిక్స్ ప్యాక్ బాడీతో – ‘ఇజం’ అనే మోడర్నిజపు టైటిల్ తో- పూరీజగన్నాథ్ సౌజన్యంతో. ఎంత బడ్జెట్ అయినా వెనుకాడకుండా రిస్కు తీసుకునే కల్యాణ్ కి సక్సెస్ ఎందుకు రాదు- తప్పకుండా వస్తుంది, ధరించే పాత్రలో కూడా సిక్స్ ప్యాక్ అంత విషయమున్నప్పుడు. మరి ఈసారి ఏం జరిగింది? రిస్కు ని  తన పంచ్ డైలాగు ప్రకారం ‘డకింగ్’ చేయగల్గారా, లేక  తనే డకౌట్ అయ్యారా ఓసారి చూద్దాం....

కథ 
      సుల్తాన్ అనే పేరుతో కల్యాణ్ రామ్ అలియాస్ సత్యా మార్తాండ్ (కల్యాణ్ రామ్) తన సిక్స్ ప్యాక్ దేహదారుఢ్యంతో మొరాకో లోని  ఓ దీవిలో స్ట్రీట్ ఫైట్లు చేసి జీవనం గడుపుతూంటాడు. ఓ స్ట్రీట్ ఫైట్ సందర్భంగా అలియా ఖాన్ (అదితీ ఆర్య) అనే అమ్మాయిని చూడగానే మనసు పారేసుకుని వెంటపడతాడు. ఈమె బడా డాన్ జావేద్ ఇబ్రహీం (జగపతి బాబు) కూతురు. జావేద్ ఇబ్రహీం ప్యారడైజ్ బ్యాంకు  నడుపుతూ ఇండియాలోని నల్లకుబేరుల ధనం దాస్తూంటాడు. ఇండియాలో  ఇతడి ఏజెంటుగా కోటిలింగాల (పోసాని) అనే మంత్రి వుంటాడు. ఆలియా వెంటపడుతున్న సత్యా మార్తాండ్ (అసలు పేరు) ఆమె కన్పిస్తే తాళి  కట్టేస్తానని కూడా బెదిరిస్తూంటాడు. ఇతడి నస తండ్రికి చెప్పుకుంటుంది. ఇతణ్ణి  చంపమని గ్యాంగ్ కి చెప్తాడు. అసలు తనని కలుస్తూ కబుర్లు చెప్తున్న కల్యాణ్ రామ్ అనే బీడీ ఫ్రెండే తన కూతుర్ని వేధిస్తున్న రోమియో అని జావేద్ కి తెలీదు. పైగా డబ్బున్న వాళ్ళ కూతుళ్ళని ఎలా ప్రేమించాలో చిట్కాలు కూడా చెప్తూంటాడు. ఓ పెళ్ళిళ్ళ ఏజెంట్ (అలీ) కి చెప్పి కూతురికి సంబంధాలు చూస్తూంటాడు. ఓ పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు ఇంట్లోకి జొరబడి జావేద్ లాప్ టాప్ ఎత్తుకు పోతాడు సత్య. ఇక తనని కలుస్తున్న కల్యాణ్ రామే సత్య అని జావేద్ కి తెలిసిపోతుంది. అంతే కాదు, ఈ సత్య తన బ్యాంకుని  కొల్లగొట్టేందుకు వల పన్ని వచ్చిన ‘గ్రాండ్ లీక్స్’ అనే అజ్ఞాత వెబ్సైట్ నడుపుతున్న జర్నలిస్టు అని కూడా తెలిసిపోతుంది... ఇక సత్య తన బ్యాంకు కొల్లగొట్టకుండా, లక్షలాది కోట్ల నల్లధనం ఇండియాలో ప్రజలకి పంచకుండా అడ్డుకోవడానికి ఇప్పుడు జావేద్ ఏమేం చేశాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ఈ మధ్య వీకీ లీక్స్ అంటూ, పనామా పేపర్స్ అంటూ నల్ల కుబేరుల బండారాలు పడుతున్న  సంగతి  తెలిసిందే. ప్రభుత్వం కూడా విదేశాల్లోని నల్లధనం తెచ్చి ఇండియాలో తలా ఇరవై లక్షలు పౌరుల జేబుల్లో కుక్కి  చక్కిలిగింతలు పెడతానని అంటున్న- లేదా అనేసి మరచిపోతున్న విషయం కూడా తెలిసిందే. తీరా చూస్తే తేలిందేమంటే- ఆ విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం స్వచ్ఛ భారత్ చేసి పూచిక పుల్ల సహా వూడ్చేసి  తీసుకురావాలన్నా కూడా అదసలు నల్లధనమని ముందు రుజువు చెయ్యాలి ప్రభుత్వం. రుజువు చెయ్యాలంటే కింది కోర్టుల నుంచీ పై సుప్రీం కోర్టు దాకా ఈ ‘నల్ల’ ఖతాదార్లతో ఇన్ కం టాక్స్ శాఖవాళ్ళు  ఎంతకాలం కొట్లాడుతూ కూర్చోవాలో తెలీదు. ఎన్నేళ్ళూ, ఎన్ని యుగాలూ పడుతుందో తెలీదు. ఎన్ని కేసులు రుజువవుతాయో కూడా తెలీదు. పైగా ఇంకో తిరకాసుంది- దొంగా దొంగా అంటూంటే దొంగేమైనా దోచిన సొత్తు దగ్గర వుంచుకుంటాడా? ఆ విదేశీ బ్యాంకుల్లోంచి  నల్లకుబేరులు తమతమ నల్లధనాల్ని ఎప్పుడో తరలించేసుకుని - నల్లతనాల్ని చెరిపేసుకుని తెల్లగా మారిపోయారు. తెల్లధనంగా ఆ సొమ్మంతా విదేశీ పెట్టుబడుల రూపంలో తిరిగి స్వదేశంలోకే దింపి రియల్ ఎస్టేట్ రంగాన్ని దివ్యంగా వెలగబెడుతున్నారు! ఇలా డిమాండ్ కి మించిన భవనాలు నిర్మించేస్తూంటే అవి ఖాళీగా పడి ఉంటున్నాయి, ఐనా వాళ్లకేం నష్టం. 

        ఇప్పుడు పూరీ జగన్నాథ్ కి ఆ బ్యాంకుని హ్యాకింగ్ చేసి నల్లధనమంతా తెచ్చి క్లయిమాక్స్ లో దేశ వ్యాప్తంగా ప్రజలకి తలా ఇంత పంచి చక్కిలిగింతలు పెట్టడానికి - ఎక్కడ్నించి వస్తుందని? తమ ఖాతాల్ని  నల్ల ఖతాదార్లు ఎప్పుడో తామే ‘హ్యాకింగ్’ చేసుకున్నారు పూరీ కంటే ముందే. ఇంకా జనాలకి- పోనీ ప్రేక్షకుల్ని ఆ డబ్బింకా స్విస్ బ్యాంకుల్లోనే వున్నట్టు ఎలా నమ్మిస్తారు. అక్కడి నల్లధనం చక్కగా తెల్లధనంగా  మారిపోయి ఇండియాకే విదేశీ పెట్టుబడులుగా వెనక్కి వస్తోందిగా - ఎందరికో ఉపాధి కూడా  కల్పిస్తూ. 

        ఇంత విశాల కాన్వాస్ వున్న ఓ సామాజిక అంశాన్ని పూరీ తెర కెక్కించే ముందు వాస్తవాల్ని  చెక్ చేసుకోవాల్సింది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకి రాజకీయ, సామాజిక స్పృహ కొంచెం ఎక్కువే. ఏ స్పృహా వుండని రొటీన్ మసాలా సినిమాల్ని ఎన్నైనా సహిస్తారు గానీ, ఇలాటి తప్పుడు సమాచారంతో నిజం లేని ‘ఇజం’ ని కూడా హజం చేసుకుంటారులే అని తక్కువ అంచనా వేయడం తొందరపాటు తనమే అవుతుంది. 

 ఎవరెలా చేశారు?
      కల్యాణ్ రామ్ ఈ సినిమా స్వయంగా నిర్మించి ఎంత లాభ పడినా పడకున్నా నటనలో మాత్రం మంచి శిక్షణ పొందడానికి ఈ సినిమా అవకాశం కల్పించింది. శిక్షకుడు పూరీ జగన్నాథ్ కల్యాణ్ ని నటనలో ఉత్తమ విద్యార్థిగా తీర్చి దిద్దారు. డైలాగులు పలికించడంలోనేమి, కత్తిలానటింపజేయ
డంలోనేమి కల్యాణ్ కెరీర్ ని నిత్య కల్యాణం పచ్చ తోరణం చేశారు పూరీ. కాకపోతే పాత్రే, పాత్ర చిత్రణే వాస్తవ దూరంగా ఉండాల్సి వచ్చాయి. కోర్టు సీనులో కల్యాణ్ భావావేశం, వాక్పటిమ తన పాత్ర సిక్స్ ప్యాక్ దారుఢ్యంతో సింక్ కాకపోవడం- కథలో చివరికొచ్చేసరికి తను సిక్స్ ప్యాక్ అన్న సంగతి మర్చిపోవడం వల్ల జరిగిందేమో. కోర్టు సీన్లకి ఇంకా నందమూరి వంశానిదే పెట్టింది పేరని చెప్పొచ్చు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఆ మధ్య జ్యూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు కల్యాణ్ రామ్. అయితే కల్యాణ్ రామ్ కోర్టు సీను నటన ఫరవా లేదనిపించినా విషయపరంగా ఈ సీనుకి, ఇందులోని పూరీ రాసిన డైలాగులకీ చోటెంతన్నది ప్రశ్న. కథే దేశంలోని అవాస్తవాల మీద అల్లినప్పుడు అందులోని సమస్తం  అప్రస్తుతమే అయిపోతాయి కూడా ఆటోమేటిగ్గా. 

        హీరోయిన్ అదితీ ఆర్య ఆదితీ అగర్వాల్ ముఖకవళికలతో వుంది. ఆమెకి పెద్దగా నటించే అవసరమే రాలేదు. పూరీ హీరోయిన్ కి నటనతో పనేమిటి.  ఉడుక్కో గలిగితే, సణుక్కో గలిగితే, తిట్టుకో గలిగితే, విరుచుకు పడగలిగితే చాలు- క్యారక్టర్ కవరై పోతుంది. 

        జగపతిబాబుది కిల్ అయిన పాత్ర. ఇంతటి కథకి తన విలన్ పాత్ర ఎలా వుండాలి. జోకర్ గా మారిపోయి చివరికి విలనే కాకుండా పోయింది పాత్ర. హాలీవుడ్ లో, కొంత వరకు బాలీవుడ్ లో ఎలా వుంటుందంటే నటులు స్క్రిప్టు పంపించమంటారు. ఆ స్క్రిప్టు చదివి కథతో బాటు, ఇతర పాత్రలతో  ఇంటరాక్షన్ తో బాటు,  తమ పాత్రని ఫాలో అయి, దాని సమగ్రతని బేరీజు వేసుకుంటారు. తేడా వుంటే సరిదిద్దమంటారు. తెలుగులో నటులు స్క్రిప్టు అడగరు. ఇచ్చినా చదవరు. చదవడం, రాయడం అన్నవి చాలా లో - క్లాస్ యాక్టివిటీస్.  ఆ పూటకి సీ ను పేపరు చూసి నటించి వెళ్ళిపోవడమే.  పాత్ర సౌష్టవం, సమగ్రత, ట్రావెల్ ఎలా ఉన్నాయనేది అవసరమే లేదు. అందుకే ఇలాటి జావేద్ భాయ్ లాంటి క్యారెక్టర్ ల రూపంలో నటులు నీరసం తెప్పిస్తారు ప్రేక్షకులకి. పాత్రచిత్రణ తెలిసిన నటులు  తెలుగులో వున్నారో లేదో వెతుక్కోవాలి. 

        సినిమాలో ఇంకా చాలా పాత్రలున్నాయి. వాటి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. టెక్నికల్ గా ఉన్నతంగా వుంది. యాక్షన్ సీన్స్ బాగా కంపోజ్ చేశారు. కెమెరా వర్క్ బ్రిలియెంట్ గా వుంది. పాటల గురించి చెప్పాలంటే, ఈ థీమ్ లో వుండాల్సిన రకం పాటలు మాత్రం కావివి.


 స్క్రీన్ ప్లే సంగతులు  
      పూరీ సినిమాలకి షాట్స్ ప్లే వుంటుంది తప్ప స్క్రీన్ ప్లే ఏముంటుంది. ఆయన సరదాగా ఓల్డ్ స్కూల్ దర్శకుడు. ఎలాటి కథనైనా సరదాగా అదే ఓల్డ్  సీసాలో పోసేస్తారు. ఆయనకి బ్యాంకాక్ బీచిలో సీసా ఏదో దొరికివుంటుంది. అందులో సందేశమేదో ఆకర్షించి వుంటుంది (మెసేజ్ ఇన్ ది బాటిల్ లాగా - దీని మీద ‘శివమణి- 98480 22338’ అని సినిమా కూడా తీశారు).  అందుకే అక్కడి  బీచి కెళ్ళిపోయి ప్రతీ సినిమాకీ అంత సరదాగా పదిహేను రోజుల్లో స్క్రిప్టులు రాసేయ గల్గుతున్నారు. పదిహేను రోజుల్లో!! గిన్నీస్ లో చేరాల్సిన రికార్డ్!! ఆయనది లేజీ రైటింగ్ అనలేం గానీ, క్యాజువల్ రైటింగ్. క్యాజువల్ గా అలా అలా పైపైన ఏదో రాసేసుకుని తీసేస్తారంతే. మరి అంతే క్యాజువల్ గా ప్రేక్షకులు చూడాలిగా! క్యాజువాలిటీ వార్డులో చేరేంత పనవుతోంది. 

        కోన వెంకట్- గోపీ మోహన్ లని వుండే వాళ్ళు. వాళ్ళు అదే పనిగా ఒకటే సింగిల్ విండో స్కీమ్ పెట్టుకుని, ఏ సూపర్ స్టార్ వచ్చినా అందులోకే తోసి పారేసి-  సూపర్ స్టార్ గారు విలన్ గారింట్లో చేరి కామెడీ చేయుట అను బ్రహ్మనందపు ఆటగా ఆడించీ ఆడించీ, ఒక్క ప్లాట్ పాయింట్ టూ లాంటి దెబ్బకి సింగిల్ విండో మూసేసి వెళ్ళిపోయారు. పూరీ ఇంకా అదే ఓల్డ్ సీసాతో కొనసాగడమంటే  -క్లయిమాక్స్ దాకా వెళ్ళకుండా రేపోమాపో ఆ ప్లాట్ పాయింట్ టూ దెబ్బకి తనుకూడా దగ్గరవుతున్నట్టే.

        శంకర్ ‘భారతీయుడు’ తీయకుండా వుండి వుంటే ‘భారతీయుడు’ ని కూడా పూరీ ‘ఇజం’ లాగే తన సీసాలో పోసి తీసేస్తారు. భూమి బల్ల పరుపుగా వుందని ఆనాడెవరో నమ్మినట్టు, తను కూడా ఎలాటి కథనైనా బల్ల పరుపుగా చదును చేసేస్తారు. శంకర్ ‘ఇజం’ తీయాలనుకుంటే ఫ్యూచరిస్టిక్ జానర్ లోకి తీసికెళ్ళి 2050 లలో కథ స్థాపిస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు దీంతో కాలీన స్పృహ లేదు. బిగ్ కాన్వాస్ ని డిమాండ్ చేసే ఇలాటి హై కాన్సెప్ట్ సబ్జెక్టుని అంతే అద్భుత ప్రపంచంలోకి  తీసికెళ్ళి శంకర్ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తారు. పూరీ విజన్ కి హైకాన్సెప్ట్, బిగ్ కాన్వాస్, ఉదాత్త కథా, మానమర్యాదలూ అనే ఉన్నత దృశ్యాలు అందవు. ‘ఈడియెట్’ కాడ్నించీ ‘ఇజం’ వరకూ అదే పాత మూస టెంప్లెట్ పెట్టుకుని అందులోకే భారత రామాయణాల్ని కూడా తోసేసి తన బ్రాండ్ టపోరీ కథలుగా మార్చేయగలరు. హీరోయిన్ ఏ పోలీస్ కమీషనర్ కూతురో, మాఫియా కూతురో, రాజకీయ నాయకుడి కూతురో అయివుండాలి; హీరో ఆవారా టపోరీగా ఉంటూ ఆమెని ప్రేమించమని వేధిస్తూ వుండాలి; ప్రేమించాక తానో అండర్ కవర్ ఏజెంటుగా బయటపడాలి; ఆ తర్వాత ఆమె విలన్ తండ్రితో ఆడుకోవాలి. ఏ సీరియస్ సామాజిక కథయినా కూడా ఈ డ్రామాలోకే సర్దుకోవాలి.  

        ‘ఇజం’ కథని భవనాలు కూలిపోతున్న విషయ గాంభీర్యంతో బ్రహ్మాండంగా ప్రారంభించారు. కానీ జర్నలిస్టు పాత్రకి కూడా అదే బాల్యం నాటి ఫ్లాష్ బ్యాక్, అందులోని అదే అన్యాయం అవసరమా. జర్నలిస్టనే వాడు తన గురించి కాక, సమాజం గురించి ఏదో ఫీలై జర్నలిస్టు అవుతాడు. ఆ తర్వాత తన గురించి ఫీలైపోయి నయూం లాంటి వాళ్ళతో నయా దందాలు చేసుకోవచ్చు దండాలు పెట్టుకుంటూ, అది వేరే విషయం. కానీ తన కేదో అన్యాయం జరిగిందని జర్నలిస్టు అయిపోడు. ఇజం జర్నలిజపు కథ ఒక వాస్తవంగా ఉందనుకుంటున్న సామాజిక సమస్యని డీల్ చేస్తున్నప్పుడు, అంతే వాస్తవికం గా డీల్ చేస్తే సరిపోతుంది. ఫ్లాష్ బ్యాకూ, టపోరీ వేషాలూ అవసరం లేదు. ఈ టపోరీ ప్రేమ కథని ప్లాట్ పాయింట్ అనేదే లేకుండా ఇంటర్వెల్ వరకూ సాగదీసి  ‘ఛేజ్ ఏ క్రూకెడ్ షాడో’ టైపు ఎండ్ సస్పెన్స్ కాని ఎండ్ సస్పెన్స్ కథనంతో నడపనవసరమే లేదు. సామాజిక కథ జానర్ మర్యాద ఇక్కడే తప్పిపోయింది. అసలు చివరి దాకా ప్రేమ కథ అనే సపరేట్ ట్రాకే జానర్ మర్యాదకి ప్రధాన దెబ్బ. ఇతివృత్తపు రసపోషణకి  పెద్ద అడ్డంకి.  సెకండాఫ్ లో కూడా ప్రధాన కథకి అడ్డుపడే - పదే పదే హీరోయిన్ ప్రేమ గోల తాలూకు ట్రాకు - ప్రధాన కథతో సంబంధం  లేకుండా పాటలూ - మాస్ ప్రేక్షకులకి కూడా చీకాకే.  

        ఫస్టాఫ్ లో ఎడతెగకుండా ఇంటర్వెల్ వరకూ గంటా అయిదు నిమిషాలూ, సెకండాఫ్ లో మళ్ళీ అడపాదడపా ఇంకో అరగంటా తినేసే టపోరీ ప్రేమకే ఇంత సమయం పోతే,  ప్రధాన కథకి మిగిలింది కేవలం 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల ‘కథ’ కి పూర్తి వందశాతం టికెట్ ధర చెల్లించుకుంటున్నారు  ప్రేక్షకులు. పదిహేను రోజుల్లో స్క్రిప్టు ఎలా  పూర్తయి పోతోందంటే ఇలాగే - ఓ అరగంటకి  మాత్రమే సరిపడా ప్రధాన కథ ఆలోచించి, ఇక ఆలోచించనవసరం లేని మిగతా భాగాన్ని తయారుగా వున్న బాటిల్లోంచి తీసి ఒంపెయ్యడం వల్లే.   

        అంత భారీ స్థాయిలో తమ బ్యాంకు హీరో కొల్ల గొడుతున్నాడని తెలిసీ వాడితో ప్రేమకోసమే  పారిపోయి రావడం, అదీ పిస్తోలు పట్టుకుని హైదరాబాద్ నగరంలో బాహాటంగా తిరగడం, ఎప్పుడో హీరో చెప్పి వున్న అతడి తల్లిపేరు పట్టుకుని ఆధార్ కేంద్రంలో అడ్రసు తెలుసుకుని ఇంటికి వచ్చెయ్యడం- (ఆ పేరు గల మనిషి నగరం మొత్తం మీద ఆమె ఒకత్తే వుందేమో. పోనీ ఇంటి పేరు కూడా తెలీదు దాన్నాధారంగా పట్టుకుందను కోవడానికి- అయినా ఆధార్  కేంద్రాల్లో ఇలా అడ్రసులు ఇచ్చేస్తారా) -  పిస్తోలుతో ఆ హీరో తల్లిదండ్రుల్ని బెదిరిస్తూ ఆ ఇంట్లో మకాం పెట్టడమూ ఇదంతా- కేవలం ఈ సినిమా ప్రేమ కథే అయితే సరే గానీ, ఒక పెద్ద సామాజిక కథ ఇది. సమాజం కోసం హీరో ఏం చేస్తున్నాడో తెలిసి కూడా అతడి పక్షం వహించి అందులో పాలు పంచుకోకుండా, పిచ్చి ప్రేమంటూ తిరిగే పాత్ర బహుశా ఇంకే బాధ్యత గల సినిమాలోనూ వుండదేమో. 

        అసలీమె డాన్ కూతురే ఎందుక్కావాలి. హీరోతో బాటు పనిచేస్తున్న అజ్ఞాత జర్నలిస్టుల్లో ఒకత్తి ఎందుకు కాకూడదు. ఈ సినిమా ఏకత్రాటిపై, ఏకసూత్రత అనే బేసిక్ కథా లక్షణంతో ఒకే కథగా ఎందుకు వుండకూడదు. గంటా ముప్పయి  ఐదు నిమిషాల టపోరీ ప్రేమ కథగా కూడా ఎందుకుండాలి. 

        జావేద్ ఇబ్రహీం పాత్రని శంకర్ కిస్తే ఆయన పరమ కర్కోటకుడుగా ఆకాశానికెత్తేస్తాడు. పూరీ చేతిలో ఇది హాస్యాస్పదంగా తయారయ్యింది. పైగా హీరో తన బ్యాంకు పని బడుతున్నాడని తెలిసి కూడా ప్రధాన కథ వదిలేసి, ప్రేమ ట్రాకుని ‘పండించడం’ కోసం కూతుర్నివెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఆ బాపతు విలనిజంతో బిజీగా ఉంటాడు. హీరో హ్యాకింగ్ చేస్తూంటే ఆచూకీ తెలుసుకుని చంపించడానికి మనుషుల్ని పంపుతాడు. అంతేగానీ, హ్యాకింగ్ ని నిరోధించే టెక్నికల్ టీం అతడి అంత పెద్ద బ్యాంకులోనే వుండరు. మొదట హీరోయిన్ ఖాతా హ్యాకింగ్ జరిగిందని ఎలా చేతులెత్తేసి మొత్తుకుంటారో, ఆ తర్వాత సర్వర్ హ్యాకింగ్ అయి సొమ్ములు ఖాళీ అయిపోతున్నప్పుడు కూడా అంతే లబోదిబోమంటారు. 

        ఇంతకీ అలా ఖాళీ అయిన సొమ్ములు మన దేశవ్యాప్తంగా ప్రజల బ్యాంక్ ఎక్కౌంట్ లలో పడిపోయి- తండోపతండాలుగా  వాళ్ళ జేబుల్లో సెల్ ఫోన్లు డబ్బులు పడ్డ మెసేజిలతో ఠింగు ఠింగు మని  ఎలా మోగుతాయో అర్ధంగాదు. ఇది చూస్తున్న ఈ సమయంలోనే మన జేబుల్లో మొబైల్స్  కూడా ఇలా మోగివుంటే, ఓ ఇరవైలక్షలతో మనం కూడా కింగు లయ్యేవాళ్ళం కదా పూరీకి పూరాగా ప్రణమిల్లి. అప్పుడు ఈ రివ్యూ ఇలా రాసే బాధ కూడా తప్పేది. 

        జావేద్ భాయ్ కి హీరో డబ్బులు కొల్ల గొట్టేశాడన్న కసే లేదు, సరే నా కూతుర్ని తీసుకుపొమ్మంటాడు. హీరోకి కూడా ఈ జావేద్ భాయ్ తన ఫ్రెండ్స్ అయిదు గుర్నీ చంపించాడన్నపగే వుండదు. పాపం ఫ్రెండ్స్! ఇలా ‘కరీం బీడీ’ కామెడీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటైపోతారు, ఈసారి మామా అల్లుళ్ళుగా! దావూద్ ఇబ్రహీం- సారీ- జావేద్ ఇబ్రహీం అంటే పూరీకి అంత ప్రేమ ఎందుకో అర్ధం గాదు.

        ‘బిజినెస్ మాన్’ లో మాఫియా కార్పొరేటీ కరణ అంటూ నడిపిన ప్రహసనం ఎలా వుందో, అలాగే  వుంది ఈ బ్లాక్ మనీతో ఫార్సు కూడా. జర్నలిస్టు హీరోని అరెస్టు చేయవచ్చు గానీ, జర్నలిస్టు భావజాలాన్ని అరెస్టు చేయలేరన్నారు. ఏమిటా జర్నలిస్టు భావజాలం- అక్కడ స్విస్ బ్యాంకుల్లో నల్ల డబ్బే లేకపోయాక! వున్నా తీసుకొచ్చే వీలే లేనప్పుడు! ఈ నల్లధనం గురించి వివిధ మాంటేజీలు వేస్తూ తెర మీద వివిధ పత్రికల, మీడియా సంస్థల పేర్లేశారే- వాటిలో వున్న ఒక పత్రిక ‘అవుట్ లుక్’ మ్యాగజైన్ లోనే వుంది అసలు కథ! కాకతాళీయంగా ఈ మొత్తం వ్యవహారంపై ఓ పత్రిక్కి వ్యాసం కూడా రాసి ఇవ్వాల్సి వచ్చింది ఈ వ్యాసకర్త అప్పట్లో.

        హీరో హ్యకింగే చేస్తున్నప్పుడు నల్ల డబ్బు తెచ్చేందుకు కోర్టులతో చట్టాలతో పనేముందని అనొచ్చు. హ్యాకింగ్ చేయడానికి వాస్తవంగా అసలక్కడ అలాటి డబ్బే లేదన్నది అలా వుంచితే, హీరో చేసే హ్యాకింగ్ కి ఎథికల్ హ్యాకింగ్ అని నీతివంతమైన పేరెందుకు.  ఈ నైతిక ప్రహరీ వెనుక ఎందుకు దాక్కుంటున్నాడు హీరో. అతను చట్టాన్ని చేతిలోకి తీసుకున్న విజిలాంటీ జర్నలిస్టు అయినప్పుడు నేరాన్ని నిర్ద్వంద్వంగా నేరంతోనే కొట్టాలి- ‘డెత్ విష్’ లో విజిలాంటీ క్యారక్టర్ వేసిన చార్లెస్ బ్రాన్సన్ లాగా. అంతే కదా. పెద్ద పెద్ద పదాలు వాడినంత మాత్రాన, బిల్డప్పులిచ్చినంత మాత్రాన,  అర్ధవంతమైన ఇంటలెక్చువల్ కథ- పాత్ర అయిపోతాయా? అసలు చిన్నప్పుడే హీరో పంటికి పన్ను అన్నట్టు, తన తండ్రి కాలు విరగ్గొట్టిన వాణ్ణి పెట్రోలు పోసి తగలేట్టేశాడు కదా. అలాంటి సిక్స్ ప్యాక్ వయొలెంట్ విజిలాంటీకి ఇంకా ఎథికల్ హ్యాకింగ్ ఏమిటి- మొరాకోలోనే గొడ్డలి తీసుకుని బ్యాంకు బొక్కసాన్ని బద్దలు కొట్టెయ్యకుండా. 

      ఇక ‘జర్నలిజం ఇజం ఇజం ఇజం జర్నలిజం -దిస్ ఈజ్ పెట్రియాటిజం’ అంటూ పాట హోరెత్తించారు చివర్లో. ఈ సినిమా జర్నలిస్టులు చూడాలన్నా తమ వృత్తి గురించి గొప్పగా ఫీలవడానికి ఏమైనా వుందా. అలా కథ చెప్పారా.  ఒక్క సీనులో కూడా హీరోని జర్నలిస్టు కష్టాలతో చూపించలేదు, ఆ వృత్తినే చూపించలేదు, చూపించిందంతా టపోరీ ప్రేమా చిన్నప్పటి అన్యాయమూ. మళ్ళీ ఇందులో దేశభక్తిని గుర్తు చేయడమెందుకు, నిజాల్ని వెలికి తీస్తూనే అన్నేసి లక్షల పేజీల్ని అనునిత్యం నింపుతూనే వుంటారు జర్నలిస్టులు. ఆ నిజాల్ని ముందు పెట్టుకుని సరైన సమాచారంతో బాధ్యత గల సినిమా తీసి నిరూపించుకోవాల్సింది పూరీయే దేశభక్తిని! జానర్ మర్యాద అనేది అత్యవసరం ఇప్పటి రోజుల్లో. జానర్ మర్యాద పాటించిన ఆరేడు సినిమాలే నిలబడ్డాయి గతసంవత్సరం. ప్రేక్షకులు దేనికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారో చెప్పలేరు, దర్శకులే ఆ కనెక్షన్ ఏమిటో అర్ధం జేసుకోవాలి- ఇప్పుడు జానర్ మర్యాద అని! పూరీకి ఆ బాటిల్ వున్నంత కాలం ఇదెప్పుడూ ఆయన సాధించలేరు. ఆయన సబ్జెక్టులు తీయాల్సింది అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని నమ్ముకుని. అల్లావుద్దీన్ అద్భుత దీపమంటే తనలో వుండే సబ్ కాన్షస్ మైండే!



-సికిందర్