తెలుగు సినిమాతో కాదర్ ఖాన్ అనుబంధం
కెనడాలో మృతి చెందిన హిందీ నటుడు, రచయిత కాదర్ ఖాన్ దక్షిణ
భారత సినిమాకు ఎంతో సన్నిహితుడు. ముఖ్యంగా తెలుగువారు హిందీలో నిర్మించిన ఎన్నో
చిత్రాల్లో నటించడమే కాకుండా రచన చేశాడు. దాసరి నారాయణ రావు, తాతినేని రామారావు, మురళీ మోహన్ రావు, రాఘవేంద్ర రావు, కె . బాపయ్య దర్శకత్వం
వహించిన సినిమాలకు పని చేశాడు.
మేరీ
ఆవాజ్ సునో, హిమ్మత్ వాలా, అనారీ, జ్యోతీ బనే జ్వాలా, జస్టిస్ చక్రవర్తి, తోఫా,
మక్సడ్, గిరఫ్తార్, దిల్ వాలా, రఖ్ వాలా, సూర్యవంశ్ మొదలైన సినిమాలను పేర్కొనవచ్చు. కాదర్ ఖాన్
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను బాగా ఆకళింపు చేసుకునేవాడు. ఆయన రచయితగా విజయవంతమైన
తెలుగు సినిమాలను హిందీలో పునర్నిర్మించేవారు.
ఇలాంటి
సినిమాలకు డైలాగ్స్ రాయడంతో పాటు చక్కటి పాత్రల్లో కాదర్ ఖాన్ నటించేవాడు. హైదరాబాద్
ఎప్పుడు వచ్చినా 15 లేదా 20 రోజులు తప్పకుండా ఉండేవాడు. ఆరోజుల్లో అన్నపూర్ణ, పద్మాలయా స్టూడియోల్లో తప్పకుండా
కనిపించేవాడు. కాదర్ ఖాన్ నటుడుగా ఎంత ప్రతిభావంతుడో, రచయిత గా కూడా పదునైన
మాటలతో, హాస్యోక్తులతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టేవాడు .హైదరాబాద్
వచ్చినప్పుడు ఆయన అందరితో సరదాగా ఛలోక్తులతో మాట్లాడేవాడు. తెలుగు వంటకాలంటే
అమితమైన ఆసక్తి. ఇక మధ్యాహ్న భోజనంలో కూడా వివిధ రకాలైన విజిటేరియన్, నాన్ విజిటేరియన్ వంటకాలు ఉండేవి.
ఎక్కడో ఆఫ్గనిస్తాన్ లోని కాబూల్ లో జన్మించిన కాదర్
ఖాన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సైన్సు, గణితం బోధించేవాడు. 1972 లో ‘జవానీ దివానీ’
సూపర్ హిట్ తో రచయితగా సినిమా రంగ ప్రవేశం చేశాడు. 1973 లో ‘దాగ్’ తో
నటుడయ్యాడు.
కాదర్
ఖాన్ 300 సినిమాలకు పైగా నటించాడు.100 చిత్రాలకు పైగా మాటలు రాశాడు. ఆయన మోకాలు చికిత్స కోసం
కుమారుడు సర్ఫరాజ్ ఖాన్ కెనడాలో ఉంటే
వెళ్ళాడు. ఆ ఆపరేషన్ విజయవంతమైనా లేచి నడవలేకపోయాడు. కోలుకుంటాడని కుటుంబ సభ్యులు
భావించినా ఊహించని విధంగా మంగళవారం గుండెపోటు వచ్చింది. కాదర్ ఖాన్ మృతి భారతీయ
సినిమా రంగానికి తీరని లోటు.
―రాం ప్రసాద్