రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

31, డిసెంబర్ 2018, సోమవారం

720 : సందేహాలు - సమాధానాలు.



          Q  : గోల్కు వుండాల్సిన నాలుగు ఎలిమెంట్స్లో ణంకు, రిణామాల హెచ్చరికకు తేడా ఏంటి? రెండూ ఒకటే అనిపిస్తోంది. శివలో నాగార్జున అల్లారుముద్దుగా చూసుకునే అన్నకూతురును కోల్పోయే ప్రమాదముందని తెలియజేయడం రిణామాల హెచ్చరిక, కోల్పోవడం ణం అంతే దా. వీటి తేడాను కూలంకషంగా వివరించరా?
చల్లా నాగర్జున చౌదరి, పాత్రికేయుడు
          A : సర్వసాధారణంగా బిగినింగ్ విభాగంలో ప్రధాన పాత్రని పరిచయం చేసినప్పుడు దానికేదో విలువైనదై వుంటుంది. బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్య పుట్టి గోల్ ఏర్పడినప్పుడు, అంటే సంఘర్షణ మొదలైనప్పుడు, ప్రధానపాత్ర ఆ విలువైనదాన్ని పణంగా పెట్టి ముందుకు దూకుతుంది. కొన్నిసార్లు ప్రాణాల్ని పణంగా పెడుతుంది.‘శివ’ లో ప్రధానపాత్ర శివ అన్న మీద ఆధారపడి, వదిన ఈసడింపుల్ని భరిస్తూ కాలేజీలో విద్యనభ్యసిస్తూంటాడు. ఈ విద్య అతడికి విలువైనది. దీన్ని పణంగా పెట్టి మాఫియా భవానీతో తలపడతాడు. ఇలా తనకి విలువైన దాన్ని పణంగా పెట్టినప్పుడు భావానీతో గెలిచి తీరాల్సిందే. లేకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతాడు. చదువూ చెడి, బ్రతుకూ చెడి నవ్వులపాలవుతాడు. కనుక పణం అనే ఎలిమెంటుకి రిస్కు తీవ్రత ఎంత ఎక్కువ చూపిస్తే కథ అంత బలంగా వుంటుంది. పణం ప్రధాన పాత్ర తీసుకునే ప్రథమ రిస్కు. 

          పరిణామాల హెచ్చరిక ప్రధాన పాత్రకి సంఘర్షణలో ఎదురయ్యే తర్వాతి  రిస్కు. దీనిగురించిన స్పృహ గోల్ తీసుకుంటున్నప్పుడు, అంటే ప్లాట్ పాయింట్ వన్ లో వుండదు. ఇది ప్రధాన పాత్రకి పరోక్షంగా వుంటుంది, ప్రేక్షకులకి ప్రత్యక్షంగా వుంటుంది. తనకి విలువైన దాన్ని పణంగా పెట్టి ముందుకి దూకుతుంది ప్రధాన పాత్ర. అయితే ముందున్న సమస్య లేదా ప్రత్యర్ది పాత్రే దానికి ఎదుట కనబడే ప్రమాదంగా వుంటుంది. వెనుకనున్నఇంకో అపాయం గురించి తెలియదు. ముందున్న ప్రమాదంతో బాటు వెనకున్న అపాయం కూడా ప్రేక్షకులకి తెలియడంతో ప్రధాన పాత్ర అది వూహిస్తున్న దానికంటే ఎక్కువ విషమ పరిస్థితిలో పడుతోందని ఆందోళన పెరుగుతుంది. ముందున్న ప్రమాదం ప్రధాన పాత్రకి ఫిజికల్ యాక్షన్ కోసం, వెనకున్న అపాయం ప్రేక్షకులకి ఎమోషనల్ యాక్షన్ కోసం. ఆ వెనకున్న అపాయాన్ని బిగినింగ్ విభాగంలోనే సూచించి వదిలేస్తారు. ‘శివ’ బిగినింగ్ విభాగంలో అన్నకూతురితో శివ అనుబంధాన్ని అంతగా చూపడం ఇందుకే. అనుబంధ పాత్రతో అనుబంధాన్ని చూపిస్తున్నారంటే ఆ అనుబంధ పాత్రకేదో మూడుతున్నట్టే. వీటిని మేకపిల్ల పాత్రలంటారు. ‘షోలే’ లో కూడా మౌల్వీసాబు మైనర్ కొడుకు పాత్ర ఇలాటిదే. ఇలా శివ తీసుకున్న గోల్ తర్వాత నుంచి, ఇక ఈ అన్నకూతురి కేమైనా జరగవచ్చన్న  హెచ్చరికని  ప్రేక్షకులు ఫీలవుతారు. ఈ హెచ్చరిక గోల్ పరిణామమే కాబట్టి, ఆ సంఘర్షణలో ఇది ‘పరిణామాల హెచ్చరిక’ అవుతుంది. 

          ఈ పణం, పరిణామాల హెచ్చరిక అనే గోల్ ఎలిమెంట్స్  యాక్షన్ కథలకే ఉద్దేశించింది కాదు, ప్రతీ జానర్ కథకీ దాని రస ప్రధానమైన (కామెడీ అయితే కామెడీగా, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీగా, రోమాన్స్ అయితే రోమాంటిక్ గా) ఎలిమెంట్స్ గా ఇవి వుంటాయి. ఈ ఎలిమెంట్స్ లేని కథలు చప్పగా వుంటాయి.      

          Q  : ‘పడి పడి లేచే మనసుస్క్రీన్ ప్లే సంగతులు రాయగలరా? నాకు ఇంటర్వెల్ పాయింటు అర్ధం గాలేదు. రోజుల్లో ఏడాది పాటు వేచి వుండే ఓపిక లవర్స్ కి వుంటుందంటారా?
పివిటి రాజు, అసోషియేట్
         
A : స్క్రీనే అవసరం లేని రోమాంటిక్ కామెడీలకి స్క్రీన్ ప్లే సంగతులెందుకు. ఆ ప్రేమికుల మానసిక కల్లోల్లాల్లోకెళ్ళి మనం లొల్లి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటర్వెల్ పాయింటు అర్ధం గాలేదని అందరూ అంటున్నదే, అదేమైనా మోనాలిసా నవ్వా? ఇంటర్వెల్ దగ్గర పాయింటేమిటన్నది కాదు ప్రశ్న, ఆ పాయింటుకి దారి తీయించిన కారణమేమిటన్నది పాయింటు. దేన్ని పట్టుకుని ప్రయాణిస్తూ కథనాన్ని అర్ధంజేసుకోవాలో తెలియకపోతే కథలు రాయడం కష్టం. అంతవరకూ ప్రేమిస్తున్నానని వెంటపడి, ప్రేమించేలా చేసుకుని ఉన్నట్టుండి తర్వాతి సీన్లో (ఇంటర్వెల్), నేను పెళ్లి చేసుకోను, పెళ్ళిమీద నాకు మీద నమ్మకం లేదు...అంటూ కథనాన్ని బ్రేక్ చేస్తున్నాడంటే, ఇది ట్విస్ట్ అనుకోవాలా? ట్విస్టు ఇలా వుంటుందా? బ్లాగులో కిందటి ఆర్టికల్ నెం. 719 లో రచయిత, నిర్మాత, దర్శకుడు క్లైవ్ డేవిస్ ఇలా చెప్పింది చదివే వుంటారు :  ఆడియెన్స్ జర్నీతోనే కధన లోపాల్ని తీర్చాలి. ఆడియెన్స్ జర్నీలో పాత్ర ఏం చేస్తోంది, ఎందుకు చేస్తోందనే ప్రశ్నలు తలెత్తాలి. ఈ ప్రశ్నోత్తర పారంపర్య కథనాన్ని పట్టించుకోకుండా - ఉదాహరణకి, ఇంటర్వెల్ పాయింట్లో పాత్ర అకస్మాత్తుగా విపత్తులో పడ్డట్టు చూపిస్తే, ఆ మలుపు ప్రేక్షకుల పరంగా దారుణంగా విఫలమవుతుంది (సవ్యసాచిలో ఇలాగే వుంటుంది - సి).

         
కాబట్టి ఆ హీరో కథనంలోంచి పాయింటుకి రావాలి. కథనాన్ని బ్రేక్ చేసి గాలిలో విన్యాసాలు చేస్తే కాదు. ఇంటర్వెల్ కి బేస్ లోనే  విఫలమయ్యాక ఇక అతనేం చెప్పినా అబద్ధాలుగానే వుంటుంది. అంతవరకూ వెంటపడి ప్రేమించి ప్రేమించి- ఆమె ప్రేమించేలా చేసుకుని, తీరా ఆమె కమిటయ్యాక – తనెందుకు సడెన్ గా తోక ముడుస్తున్నాడు? 
ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడా? ఈ అనుమానం హీరోయిన్ కి రావాలి. లేదా – పెళ్లి ఇష్టం లేకపోతే నా వెంట ఎందుకు పడ్డావని రెండు పీకుళ్లు పీకి వెళ్లిపోవాలి. కానీ పాతికేళ్ళ వయసున్న హీరో హీరోయిన్ల పాత్రలు ఇలా చెయ్యవు. ఎందుకంటే ఇవి అవే 2000 – 2005 మధ్య నాటి లైటర్ వీన్ టీనేజి అపరిపక్వ ప్రేమలనే  రోమాంటిక్ కామెడీల మాయదారి టెంప్లెట్ లోనే వుండే పాత్రలు. ఏ ఏజి గ్రూపు లవర్ పాత్రలైనా ఈ టీనేజీ టెంప్లెట్ లోనే పెట్టేసి సినిమాలు తీసి పారేస్తున్నారు. ఇందుకే ఫుట్ బాల్ ప్లేయరైన హీరో, మెడికల్ స్టూడెంట్ అయిన హీరోయినూ ఏజికి తగ్గట్టుగా ఎదగక, సిల్లీగా బిహేవ్ చేస్తూ చిన్న పిల్లల్లా  ప్రేమకథని నడుపుకున్నారు. ఇందుకే ఇంటర్వెల్ పాయింట్లో పాలు తాగే పాపాయిలా హీరోయిన్ అతను చెప్పే నాన్సెన్స్ అంతా నోరెళ్ళ బెట్టి వింది. మనం ఏడాదిపాటు విడిగా వుందాం, విడిగా వుండలేమనుకున్నకున్నప్పుడు పెళ్లి చేసుకుందామని అతను పెట్టే సిల్లీ ప్రపోజల్ కి కూడా తలూపింది. 

         
రోజుల్లో ఏడాది పాటు వేచి వుండే ఓపిక లవర్స్ కి వుంటుందంటారా? – అనే ప్రశ్న సదరు కథకుడికి తట్టలేదు. 1978 నాటి ‘మరోచరిత్ర’ లోని ప్లాట్ పాయింటు బావుందనుకున్నాడు. కాలంతో సంబంధం లేకుండా తెచ్చి ఇంటర్వెల్లో పెట్టేశాడు. ప్రేమని ఏడాది వూరగాయ వేసే కాలమిది ఎలా అవుతుందని మొదట యూత్ అప్పీల్ ప్రశ్నిస్తుంది. తర్వాత అసహనం ప్రదర్శిస్తుంది. ఇవ్వాళ్ళ ఇప్పటికిప్పుడు తేల్చేసే రియల్ టైం లైవ్ కథలు కావాలి. ఏడాది తర్వాత, రెండేళ్ళ తర్వాత అని వాయిదాలు  వేస్తే వర్కౌట్ కాదు. ఏడాది తర్వాత ఏమౌతుందనో, ఏడాది క్రితం ఏం జరిగిందనో కాదు. ఇప్పుడేం చెప్తున్నామో అదిప్పుడే  తేల్చేయ్యాలి వేడివేడిగా. ఈ మధ్య ఒక ప్రొడ్యూసర్ కి ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్న ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ (ఒక దృశ్యం పై ఏకాగ్రత నిలిపే కాలం) పది సెకన్లకి తగ్గిపోయిందని నిపుణులు చెప్తున్నారంటే, ఆయనకి అర్ధంగాలేదు. పోతే, మనకి అన్పించిన ప్రకారం ఇవ్వాళ్ళ సినిమా సీనంటే టీఆర్పీ కోసం ప్రాకులాట లాంటిదే అన్నాకూడా అర్ధంగాలేదు. ఛానెళ్ళు ప్రతీనిమిషం టీఆర్పీ కోసం పోరాడుతూ ప్రోగ్రాములు ఎలా ప్రసారం చేస్తాయో- సినిమా సీన్ల రూపకల్పనకి కూడా ఇదే చిట్కా అనుకోవాలిక - ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ దృష్ట్యా. టీఆర్పీ సీన్ల సృష్టి.

          Q  : పెదరాయుడు’ విశ్లేషణ గురించి ప్రకటించి ఇంకా రాయలేదు. దాని కోసం ఎదురు చూస్తున్నాం. మీరన్నట్టు అది గొప్ప ‘గాథ’ ఎలా అయిందో తెలుసుకోవాలని వుంది.
జేఎస్ రెడ్డి, పాఠకుడు
          A : దీన్ని జనవరి ఫస్టు కానుకగా ఇద్దామనుకున్నాం. సాధ్యం కాలేదు. ఇంకో రెండు మూడు రోజులు పట్టొచ్చు.

***