రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, నవంబర్ 2018, గురువారం

706 : స్ట్రక్చర్ అప్డేట్స్


          చెదిరితే కథ మారుతుంది, బాధ్యత తెలుస్తుంది. బిగినింగ్ విభాగం కొలిక్కి వస్తేనే దాని ప్లాట్ పాయింట్ వన్ తో హీరోకి ఒక గోల్ ఏర్పడుతుంది. బిగినింగ్ విభాగం కథనమంతా హీరోని గోల్ కి చేరవేసే దృష్టితోనే వుంటుంది. అంటే ఆ కథనంతో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్య పుట్టేవరకూ హీరోకి గోల్ ఏర్పడదు. సమస్య పుడితేనే దాన్ని సాధించేందుకు ఒక గోల్ వుంటుంది. అందుకని గోల్ బిగినింగ్ విభాగం ముగింపుతో, అక్కడ సమస్యతో ప్లాట్ పాయింట్ వన్ అనే మలుపుతో ముడిపడి వుంటుంది. అందుకని గోల్ = బిగినింగ్ విభాగం ముగింపు + సమస్యతో ప్లాట్ పాయింట్ వన్ మలుపు అవుతుంది. ఈ గోల్ ఏర్పడ్డంలో పాత్ర నాల్గు గోల్ ఎలిమెంట్స్ ని ఎదుర్కొంటుందని చాలాసార్లు చెప్పుకున్నాం. అవి కోరిక + పణం+ పరిణామాల హెచ్చరిక + వీటి తాలూకు ఎమోషన్.
          లా పైన చెప్పుకున్న బిగినింగ్స్ తోనే రొటీన్ గా సినిమాలొస్తూంటాయి. పాత్రకి గోల్ పెట్టడంవల్లే బిగినింగ్స్ వైవిధ్యం లేకుండా వుంటున్నాయి. పాత్రకి గోల్ బదులు కలలు పెడితే బిగినింగ్ ఫ్రెష్ గా మారిపోతుంది. ఇదింకో బిగినింగ్ క్రియేటివిటీ. పాత్రకి మొదట్నుంచీ ఏవో కలలుండొచ్చు. ఆ కలలకి పరిస్థితులతో సంబంధం వుండాలని లేదు. పరిస్థితులతో నిమిత్తంలేకుండా చిన్నప్పట్నించీ కలలుండవచ్చు. జీవితంలో దశలోనైనా అవి తీర్చుకునే ప్రయత్నం చేయవచ్చు, లేదా తీసి అవతల పడేయవచ్చు. కథల్లో పాత్ర కలల్ని తీసి అవతల పడేసే పరిస్థితే వస్తే అది బాధామయంగా వుంటుంది. సర్వం కోల్పోయినట్టుంటుంది. పరిస్థితి ప్లాట్ పాయింట్ వన్ దగ్గర వస్తుంది. బిగినింగ్ విభాగంలో పాత్రకి గనుక కల వుంటే బిగినింగ్ విభాగపు బిజినెస్ లో కల చెదిరే పరిస్థితుల కల్పన వుండదు. ఆకస్మికంగా బిగినింగ్ విభాగపు ముగింపులో సంఘటన జరిగి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడుతుంది. దీంతో వున్న కల చెదిరిపోయి వూహించని కొత్త బాధ్యత మీద పడుతుంది. అంటే కల చెదిరిపోవడంతో ఇక్కడ్నించీ అనుకున్న కథ కూడా మారిపోతుంది...ఇదీ ప్రేక్షకులు ఇక తప్పనిసరిగా ఎదురుచూడాల్సి వచ్చే మూస గోల్ కి గండి కొట్టి,  చెదిరిన కలలతో బిగినింగ్ ని కొత్తగా మార్చెయ్యడం. 

      గోల్ పరిస్థితులు డిమాండ్ చేస్తే ఆపద్ధర్మంగా ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడుతుంది. కలలు ప్లాట్ పాయింట్ వన్ కి ముందు నుంచీ ఉనికిలో వుంటూ, ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఆకస్మిక సంఘటనతో చెదిరిపోయి కొత్త బాధ్యత తీసుకుంటుంది. గోల్ తో పాత్రకి అది సాధించాలన్న ఏకోన్ముఖ యానముంటుంది. కొత్త బాధ్యత వల్ల పాత్రకి కలల తాలూకు అంతర్ముఖ యానం డిస్టర్బ్ చేస్తూంటుంది. దీంతో కన్నకలలకీ, ఇష్టంలేని కొత్త బాధ్యతకీ పడక పాత్ర ట్రాజెడీ కేసి అడుగులేస్తుంది. 

         
జీవితం దేవుడిచ్చిన గిప్ట్. గిఫ్ట్ తో అంతా వండర్ఫుల్ గానే వుంటుంది. కాదనుకుని జీవితం చాలించుకుంటే కష్టాలు తప్పవచ్చు, కానీ తను లేకుండా వుంటే ఎలావుండేదో తెలుసుకుంటే కష్టాలు పడుతూ కూడా లోకంలోనే వుండాలన్పిస్తుంది. దేవుడి గిఫ్ట్ విలువ తెలుస్తుంది. తను లోకంలోకే రాకుండా వుంటే నీట మునిగి తమ్ముడు చచ్చిపోయే వాడు. తమ్ముణ్ణి కాపాడ్డానికి తనే వుండకపోతే, వాడు లేక యుద్ధంలో వాడు కాపాడిన వాళ్ళందరూ చనిపోయే వాళ్ళు. తను లేకపోతే డాక్టర్ పొరపాటున ఇచ్చిన కల్తీ మందుతో పేషంట్ చచ్చి పోయేవాడు. తను లోకంలోకి వచ్చి వుండకపోతే, శ్రామిక వర్గాలకోసం తన తండ్రి ఏర్పాటు చేసిన బ్యాంకు ప్రత్యర్ధి చేజిక్కించుకునే వాడు. శ్రామిక వర్గాల సొంతింటి కలతీర్చే తండ్రి జీవితాశయం భూస్థాపితమయ్యేది. ప్రత్యర్ధి వూరి పేరు కూడా తన పేర మార్చేసుకుని వ్యాపారాలు చేసుకునే వాడు. బార్లు, డ్రగ్ అడ్డాలు, పేకాట క్లబ్బులూ వెలిసేవి. తమ ఇల్లు అలాగే శిథిలమై వుండేది. తన బాబాయ్ పిచ్చాసుపత్రి పాలయ్యేవాడు. తన భార్య పెళ్ళే లేకుండా లైబ్రరీలో ముసలిదానిగా పనిచేసేది... తన నల్గురు పిల్లలూ లోకంలోకి వచ్చేవాళ్ళూ కారు...ఇదీ గిఫ్ట్ విలువ! వెనక్కి చూసుకుంటే తన వల్ల ఇన్ని మంచి పనులు జరిగితే, ఇక ముందు కూడా ఇంకెన్ని మంచి పనులు జరగవచ్చు... కలలుగన్న జీవితం చిన్నదైనప్పుడు కొత్త బాధ్యతలు మీదపడి విస్తారం చేస్తాయి. కొత్త బాధ్యతలు ఎదురైనప్పుడు కలల్ని చంపేసుకోవడానికి ఎవర్రెడీగా వుంటూ, ఇంకింత మంచి చేయడం కోసం కొత్త బాధ్యతలతో ముందుకెళ్లక తప్పదు.

***
         ‘ఇట్సే వండర్ఫుల్ లైఫ్’ (1946) ప్రపంచంలోని వంద గొప్ప సినిమాల్లో ఒకటిగా నమోదైంది. శ్రీరామనవమి రాగానే ఛానెల్స్ లోలవకుశసినిమా ఎలా వస్తుందో, అలా క్రిస్మస్ కి అమెరికన్ కుటుంబాలుఇట్సే వండర్ఫుల్ లైఫ్ని తప్పక చూసే అలవాటు చేసుకున్నారు. అందుకని దీనికి అమెరికన్ క్రిస్మస్ ఫాంటసీ కామెడీ డ్రామాగా పేరొచ్చింది. ఫిలిప్ వాన్ డొరేన్ స్టెర్న్ అన్నరచయిత రాసిన ‘ది గ్రేటెస్ట్ గిఫ్ట్’ అన్న చిన్నకథ ఆధారంగా దర్శకుడు ఫ్రాంక్ కాప్రా తెరకెక్కించాడు. నిజానికి ఈ కథని వేరే కంపెనీ కొనుక్కుంది. ఆ కంపెనీ నుంచి కాప్రా పదివేల డాలర్లకి కొనుక్కుంటే, ఆ కంపెనీ రాయించుకున్న మూడు వెర్షన్లతో కూడిన మూడు స్క్రిప్టులూ ఫ్రీగా ఇచ్చేసింది. ఫ్ర్రీగా ఇవ్వలేదు, యాభై వేల డాలర్లు నొక్కేశారని తర్వాత కాప్రా చెప్పాడు. ఆ మూడు స్క్రిప్టుల్ని ముగ్గురు రచయితలతో కొత్త స్క్రీన్ ప్లేగా రాయించుకున్నాడు. అప్పటి స్టార్ జేమ్స్ స్టీవార్ట్ కథానాయకుడిగా నటించాడు. 
***



       క్రిస్మస్ రాత్రి మంచు కురుస్తున్న నగర దృశ్యాల మీద వివిధ వాయిసోవర్స్ పోస్ట్ అవుతూంటాయి. వాళ్ళందరూ స్టీవార్ట్ కోసం ప్రార్ధిస్తూంటారు. పై లోకాల్లో దేవదూతలు ఈ ప్రార్ధనలు విని అప్రమత్తమవుతారు. వాళ్ళ వాయిసోవర్స్ పోస్టవుతూంటాయి. జార్జి బెయిలీ ఈ రాత్రి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిపో
యాడట...దేవుడిచ్చిన గిఫ్ట్ ని అతను పారేసుకుంటున్నాడు.అతన్నాపాలి - అనుకుని, ఒక దేవదూతకి బాధ్యత అప్పగిస్తారు. జార్జిని ఆపాలంటే అతనెందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో తెలియాలి కాబట్టి, అతడి జీవితం గురించి తెలుసుకోమంటారు...


         జార్జి బాల్యం ప్రారంభమవుతుంది. నీట మునుగుతున్న తమ్ముణ్ణి కాపాడుకుంటాడు. ఒక చెవికి వినికిడి శక్తి పోతుంది. పని చేస్తున్న మందుల షాపులో డాక్టర్ పొరపాటున ఇచ్చిన విషంతో ఒక పేషంట్ చనిపోకుండా కాపాడతాడు. యువకుడుగా ఎదిగి ఆ చిన్న పట్టణంతో ఇమడలేక రెక్కలొచ్చి ఎగిరిపోవాలనుకుంటాడు. మేరీని ప్రేమిస్తాడు. తండ్రి చేస్తున్న బ్యాంకింగ్ వ్యాపారం నచ్చదు. ఎప్పటిదో పాత భవనంలోఇరుకు ఆఫీసులో కూర్చుని తండ్రి పనిచేయడం అసలే నచ్చదు. శ్రామిక వర్గాలకి సాయపడాలంటే వాళ్ళతో సమానంగా నిరాడంబరంగా వుండాలనే తండ్రి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా రుణాలకే ధారాదత్తం చేస్తున్నాడు. శ్రామిక వర్గాలని ఆదుకుంటే ఎప్పటి కైనా వాళ్ళు రుణం తీర్చేసేందుకు కష్టపడతారనీ, బడాబాబులకి ఈ నిజాయితీ వుండదనీ అంటాడు. ఏమైనా తను మాత్రం బ్యాంకింగ్ లోకి రానంటాడు జార్జి. తనకి వేరే కలలున్నాయి. న్యూ యార్క్ వెళ్లి గొప్ప బిల్డర్ గా ఎదగాలి. అక్కడ పెద్ద పెద్ద భవనాలూ, అద్భుతమైన మౌలిక సదుపాయాలూ నిర్మించాలి. అవి చూసి గర్వించాలి...
          ఈ జోష్ తో కాలేజీ సెలవుల్లో యూరప్ కి విహార యాత్ర ప్లాన్ చేస్తూంటే గుండెపోటుతో తండ్రి హఠాత్తుగా మరణిస్తాడు.
***
       ఇదీ ప్లాట్ పాయింట్ వన్ కొచ్చిన బిగినింగ్ విభాగం. జార్జి కలలు తలకిందులైన విధానం. అప్పటికి కాలేజీ చదువుకి తను దాచుకున్న డబ్బు తమ్ముడి కిచ్చేసి, కాలేజీ పూర్తి చేసి వచ్చి బ్యాంకు చేపట్టమంటాడు. అప్పుడు తన కలల్నినిజం చేసుకోవడానికి తను వెళ్లిపోతానంటాడు. ఆ తమ్ముడు చదువుకుని, పెళ్లి చేసుకుని, ఆ అమ్మాయి తండ్రి చూపించిన వ్యాపారంలో చేరిపోతాడు. ఇదంతా ప్లాట్ పాయింట్ వన్ తర్వాత వచ్చే మిడిల్ విభాగం కథ... దీని జోలికి పోవడం లేదు. బిగినింగ్ క్రియేటివిటీ గురించే చర్చ. 

          బిల్డర్ కావాలన్న జార్జి కలలు తండ్రి అకాల మరణంతో చెదిరిపోవడం కథా ప్రారంభానికి నాంది. తన కలల జోష్ తో తనుంటే తండ్రి మరణంతో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. ఇక్కడ తనకి గోల్ ఏర్పడలేదు. ఇది గోల్స్ కొట్టే మొనగాడి యాంత్రిక కథ కాదు. జీవితమంటే ఇంకేమిటో తెలుసుకునే మనిషి కథ. అందుకని ప్లాట్ పాయింట్ వన్ అనే చౌరాస్తాలో తన కలలు వర్సెస్ మీద పడ్డ కొత్త బాధ్యతల మానసిక సంఘర్షగా పరిస్థితి ఎదురు నిల్చింది. 

          పాత్రకి గోల్ ఏర్పడే కథల్లో ఏదో గోల్ ఏర్పడుతుందిలేనని బిగినింగ్ విభాగం కథనంలో బట్టబయలు అవుతూనే వుంటుంది. గోల్ కాకుండా కలలతో వుండే పాత్ర విషయంలో ప్లాట్ పాయింట్ వన్ వూహకందకుండా నిగూఢంగా వుంటుంది. ఉదాహరణకి, జార్జి తనకున్న కలలు తండ్రికి కూడా చెప్పేశాక, ఆ కలల్ని తీర్చుకునే ప్రయత్నంలో బిల్డర్ గా సమస్య లెదుర్కోవడం ఈ సినిమా కథగా వుంటుందన్న ఆలోచనల్లో మనముంటాం. అతడింకా ఆ కలల్లోకి అడుగుపెట్టకుండానే తండ్రి మరణం ఆ కలలకి చెక్ పెట్టేస్తుందని వూహించం. అతడి కలలతో మనం వూహించుకునే కథ ఒకటైతే, తండ్రి మరణంతో పూర్తిగా ఉల్టా పల్టా అయ్యే  కథ మరొకటన్న మాట. పాత్రకి యాంత్రికమైన గోల్ కాకుండా కలులు పెట్టినప్పుడు ఇలాటి బిగినింగ్ విభాగంతో, ప్లాట్ పాయింట్ వన్ తో క్రియేటివిటీలు సాధ్యమవుతాయి. రొటీన్ గోల్ తో రాసే కథల్ని కలలుగా మార్చి రాస్తే,  మొత్తం గోల్ తో వుండే కథ ఎలా ప్రభావితమవుతుందో రైటింగ్ ప్రయోగశాలలో పరీక్షించి చూడాలి. 

         ఒకటి మాత్రం ఖాయం : పాత్రకి గోల్ ఏర్పాటు చేసినప్పుడు గోల్ ఎలిమెంట్స్ తో వుండే కృత్రిమత్వం కలలు ఏర్పాటు చేసినప్పుడు వుండదు. పైన చెప్పుకున్న గోల్ ఎలిమెంట్లు కోరిక + పణం+ పరిణామాల హెచ్చరిక +వీటి తాలూకు ఎమోషన్- ఈ నాల్గూ కల్పించడానికి బిగినింగ్ విభాగంలో కల్పన చేస్తూ ఆ విధమైన సీన్లు కూడా వేయాలి. కలలతో ఇదేమీ అవసరముండదు. కన్నకలలు తలకిందులైతే చాలు, ఈ ఎలిమెంట్స్ ని తలకిందులైన ఆ పరిస్థితుల్లో ప్రేక్షకులే అనుభవించేస్తారు. ఇది సహజంగా జరిగిపోయే పరిణామం. 

          ‘శివ’ లో ప్లాట్ పాయింట్  వన్ దగ్గర జేడీని కొట్టినప్పుడు గోల్ ఏర్పడేటప్పటికి – ఆ బిగినింగ్ విభాగంలో ఆ గోల్ తాలూకు ఎలిమెంట్స్ నాల్గూ ఏర్పాటయ్యాయి. కాలేజీలో మాఫియా జోక్యాన్ని అంతం చేయాలన్న బలమైన కోరిక, దానికి తన చదువూ భవిష్యత్తూ పణంగా పెట్టడం, ఈ పోరాటంలో అన్నకూతురికి ఏమైనా జరగవచ్చనే పరిణామాల హెచ్చరికా, వీటన్నిటి ఫలితంగా బలమైన ఎమోషన్ తో పాత్ర కన్పించడం వగైరా...  

          శివకి గోల్ ని తీసేసి కలల్నిపెట్టినప్పుడు, ఈ నాల్గు ఎలిమెంట్స్ కోసం పాత్రల్ని, దృశ్యాల్నీ ముందస్తుగా బిగినింగ్ విభాగంలో యాంత్రికంగా సృష్టించే అవసరముండదు. వీటితోనే బిగినింగ్ విభాగం రొటీన్ మూస అవుతోంది. శివకి కలల్ని ఏర్పాటు చేస్తే అతనా కలలతో భవిష్యత్ వ్యూహాలు పన్నుతూంటాడు. ముచ్చటపడి అందరూ తలో చేయి వేస్తూంటారు. ఒక అద్భుత వూహా చిత్రం ఆవిష్కృతమవుతుంది. ఉన్నట్టుండీ జేడీ పంజా విసురుతాడు. అందమైన ప్రపంచమంతా బద్ధలై పోతుంది. కాలేజీ ఇంత అందమైన ప్రపంచంగా మారబోవడాన్ని సహించడు మాఫియా భవానీ. కలలు చెదిరిన శివకిక భవానీని  ఎదుర్కోనే బాధ్యత తీసుకోక తప్పదు. ఇప్పుడు తను కలలుగన్న చిన్న ప్రపంచాన్ని విస్తరించి, భవానీ ముక్త్ ప్రపంచంగా మొత్తం నగరాన్నే అందమైన లోకంగా మార్చేయవచ్చు. 

          ‘శివ’ ని ఇలా తీసి వుండాలని చెప్పడం కాదు. గోల్ కీ, కలలకీ బిగినింగ్ క్రియేటివిటీల్లో తేడాలు చెప్పడం కోసమే ‘శివ’ ని పేర్కొన్నాం. సీనియర్ దర్శకుడు సంజయ్ గుప్తా హృతిక్ రోషన్ - యామీ గౌతమ్ లతో తీసిన ‘కాబిల్’ లో అంధులైన హృతిక్, యా మీలతో వాళ్ళ అందమైన కలల తియ్యటి ప్రపంచాన్ని సృష్టించి భగ్నం చేసేస్తాడు. అప్పుడు అంత డా అందమైన తియ్యటి ప్రపంచం కోసం ప్రేక్షకులు అర్రులు చాచేంత బలమైన ఎమోషన్ తో సోల్ - కథాత్మ - దానికదే సినిమా అంతటా ఏర్పడిపోయింది. దీనికోసం బిగినింగ్ విభాగంలో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనతో కూడిన సీన్లు, నాల్గు గోల్ ఎలిమెంట్స్ ని ఉత్పత్తి చేసే సీన్లూ వేయాల్సిన యాంత్రిక అవసరాలే ఎదురుకాలేదు.  
          కలలు చెదిరి పోవడానికి విధియైనా, విలనైనా కారణం కావచ్చు. జార్జికి తండ్రి మరణంతో విధియే కారణమైంది.
***
     ఇకపోతే స్ట్రక్చర్ తో క్రియేటివిటీ చూస్తే, ఇట్సే వండర్ఫుల్ లైఫ్’  సినిమా ప్రారంభం (కథా ప్రారంభం కాదు, కథా ప్రారంభం బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయింట్ దగ్గర వుంటుంది ఏ సినిమాలోనైనా) క్లయిమాక్స్ తో వుంటుంది. అంటే అంకాల జంబ్లింగ్ అన్న మాట 3 -1- 2 నాన్ లీనియర్ విభాగాలుగా. అంటే ఫ్లాష్ బ్యాక్ లో కథ చెప్పడమన్న మాట. ఏముంది, ముందు ఆత్మ హత్యాయత్నం చేస్తున్న జార్జిని చూపించి అతడి ఫ్లాష్ బ్యాక్ చూపించడమే గా అనుకోవచ్చు. ఇలా అలవాటై ముదిరిన ప్రాణాలు కాబట్టి ఇలాగే అనుకోవచ్చు. అలవాటుని తీసి గిరవాటేస్తే? గిరికీలు కొడుతూ వెళ్లి అది గోదాట్లో పడుతుంది. దరిద్రమంతా వదుల్తుంది. వెండితెర మీద అలవాట్లు కాదు, చేతివాటం చూపించాలి బిజినెస్ కి. 

          ఫ్రాంక్ కాప్రా చేతి వాటం : జార్జి ఆత్మహత్య చేసుకుంటున్న క్లయిమాక్స్ తోనే ప్రారంభిస్తాం. కానీ జార్జిని చూపించం. జార్జిని చూడాలని ప్రేక్షకులు అలమటించి పోవాలి. డిమాండ్ ని సృష్టించి సరఫరాని ఆపెయ్యాలి. అప్పుడు హాహాకారాలు చేస్తారు, చెయ్యనీ-  అదే మన వ్యాపారానికి కావాలి. ఇదీ వ్యాపారానికి ఈ సీనుకి పాటించాల్సిన క్రియేటివిటీ యాస్పెక్ట్. ఇక జార్జి కోసం ప్రార్ధిస్తున్న జార్జి ఆత్మీయుల్ని కూడా చూపించం. ఇది కూడా సస్పెన్స్. టికెట్లు తెగే క్రియేటివ్ యాస్పెక్ట్. కేవలం నగర దృశ్యాల మీద వాళ్ళ వాయిసోవర్స్ వేస్తాం. అలాగే పై లోకాల్లో యముడ్నీ, చిత్రగుప్తుడ్నీ చూపించం. ఇది కూడా వేసివేసి వున్న పాత వాసనే. ఇంకెన్నిసార్లు అవే సెట్స్ వేసి చూపించిందే చూపిస్తాం బడ్జెట్ దుబారా. 1946 లోనే 2018 కి అప్డేట్ ఇచ్చేద్దాం. 72 ఏళ్లకైనా బాగుపడాలనుంటే పడతారు, లేకపోతే లేదు. మనం పైనుంచి చూస్తే చూద్దాం, లేకపోతే లేదు. మినుకు మునుకు మంటున్న నక్షత్రాల మీద దేవదూతల డైలాగ్స్ వేస్తాం. ఒక దేవదూతని జార్జిని ఆపడానికి పంపిస్తున్నట్టు ఆ డైలాగుల్లోనే చెప్పిస్తాం. జార్జి జీవితం గురించి తెలుసుకుని వెళ్ళమని ఆ దేవదూతలే చెప్పడం ద్వారా ఫ్లాష్ బ్యాక్ కి లీడ్ ఇచ్చేద్దాం...

          ఇప్పుడు ఆత్మ హత్య చేసుకుంటున్నక్లయిమాక్స్ దృశ్యంలో గానీ, ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యే లీడ్ లో గానీ జార్జి,  అంటే మన విన్నింగ్ స్టార్ జేమ్స్ స్టీవార్ట్ కనబడనే కనబడడు. అతనెలా ఆత్మహత్య చేసుకుంటున్నాడు, అప్పుడతని ఫీలింగ్సేమిటి చూడాలని చివరివరకూ ఉత్కంఠ అనుభవించాలి ప్రేక్షకులు. కథనంతో డిమాండ్ ని సృష్టించు, సరఫరాని ఆపెయ్యి. 

          ఇక ఫ్లాష్ బ్యాక్ లీడ్ లో కూడా స్టీవార్ట్ కనిపించక - ఓపెనింగ్ సీన్స్ లో బాల్య కథనంతో బాల నటుడ్నే చూస్తున్న ప్రేక్షకులు - ఎప్పుడెప్పుడు ఈ బాలనటుడు పోయి స్టీవార్ట్ దర్శనమిస్తాడా అన్న ఉత్కంఠకి ఇక్కడా లోనవ్వాలి. సినిమా ప్రారంభమే ఆడియెన్స్ కిలా రెండు బ్యాంగులన్న మాట. ఇక స్టడీగా సినిమా చూడకేం చేస్తారు. స్ట్రక్చర్ తో మార్కెట్ యాస్పెక్ట్ ని మేళవిస్తూ క్రియేటివిటీ అన్నమాట. పెద్దలు స్ట్రక్చర్ అనే ఒకే చట్రాన్నిచ్చారు. దాన్ని రంగుల రాట్నం చేసుకోవడానికి మన చేతి వాటమే చూపిస్తూ వుండాలి. ఇది ఫ్రాంక్ గా చెబుతున్న మాట.

సికిందర్