రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, మే 2023, సోమవారం

1334 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : విజయ్
తారాగణం : విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్, పృథ్వీ రాజ్ తదితరులు
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : సందీప్ విజయ్
బ్యానర్ : శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీ సాయి బాబా మూవీస్
నిర్మాతలు : రామాంజనేయులు, రాజశేఖర రెడ్డి
విడుదల : మే 27, 2023 (జియో సినిమా)
***

        టీవల విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ పరాజయం తర్వాత, బూ అనే హార్రర్ మూవీ తమిళ- తెలుగు భాషల్లో ఈ రోజు ఓటీటీలో విడుదలయింది. ఓటీటీ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియో సినిమా దీన్ని ఉచితంగా అందిస్తోంది. విజయ్ అనే దర్శకుడు ఒక రాత్రి జరిగే ఈ హార్రర్ కథని గంటన్నర సినిమాగా తీశాడు. ఇందులో విశ్వక్ సేన్ తోబాటు ఐదుగురు హీరోయిన్లు కన్పిస్తారు. కనువిందు చేయడానికి అందాల హీరోయిన్ల శ్రేణి వుంది. థ్రిల్ చేయడానికి విశ్వక్ సేన్ వున్నాడు. ఇంకేం కావాలి? తారాగణంతోనే ఇంత ఊరిస్తున్న ఈ హార్రర్ తెరపైన ఎలా  వుందో చూద్దాం...

కథ

తల్లి వూరికెళ్ళిన అవకాశాన్ని తీసుకుని రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్స్ ని ఆహ్వానిస్తుంది ఆ రాత్రి హలోవీన్ పార్టీకి. ఆ రోజు అక్టోబర్ 31 హలోవీన్ నైట్ జరుపుకునే సందర్భం. రకుల్ ఇంట్లో అస్థిపంజరాలు, దెయ్యపు ఆకారాలూ అలంకరించి, దెయ్యాల్ని ఆహ్వానిద్దామని చెప్పి ఒక హార్రర్ పుస్తకం తీసి కథలు చెప్పడం మొదలెడుతుంది.  ఆ ఒక్కో దెయ్యం కథ నిజ జీవితంలో వాళ్ళ ముందుకొచ్చేసి బెదరగొడతాయి. అప్పుడు ఒక దెయ్యాన్ని వదిలించుకోవాలంటే ఇంకో దెయ్యం కథ చదవాలి. ఇలా చదువుకుంటూ పోతూంటే  పారానార్మల్ సైంటిస్టు విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఇప్పుడు ఈ కథ కీలకమైనది. ఈ కథ ఏమిటి? దెయ్యాల ఉనికి మీద ప్రయోగాలు చేసే విశ్వక్ సేన్, తను ప్రేమించిన ఒక్కో గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కోల్పోతూ వచ్చాడు? చివరికి రకుల్ ప్రీత్ సింగ్ తోనే పెళ్ళి చూపులు జరిగే సరికి, రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసింది? ఈ హార్రర్ ప్రశ్నలకి సమాధానాల కోసం మిగతా సినిమా చూడాలి.

ఎలా వుంది కథ

అమెరికాలో, యూరప్ లో జరుపుకునే హలోవీన్ పండుగ ఇండియాలో అర్ధం లేకుండా కేవలం పిశాచాల మాస్కులేసుకుని భయపెట్టుకునే ఆటగా మార్చేశారు. పాశ్చాత్య దేశాల్లో వేసవి చివర్లో చేతి కందే పంటల్ని దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుకునేందుకు అక్టోబర్ 31న హలోవీన్ పండుగ జరుపుకుంటారు. ఆ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టేందుకే పిశాచాల మాస్కులేసుకుని నృత్యాలు చేస్తారు. దీన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఇంకో అడుగు ముందుకేసి దెయ్యాల్ని ఆహ్వానించే ఆటగా మార్చేసింది.
        
అయితే ఆమె పుస్తకంలో చదివే కథలతో ఎపిసోడ్స్ ఆసక్తికరంగానే వున్నాయి. ఇవి భయపెట్టే విధంగా వుండవుగానీ, ఆసక్తి రేకెత్తిస్తాయి. ఉదాహరణకి నివేదా పేతురాజ్ ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు, నీకు వెక్కిళ్ళు వస్తాయా అనడుగుతుంది హార్రర్ ఫేసు గల ముసలవ్వ. రావని చెప్తుంది నివేద. తీరా ఇంట్లో దాహం వేసి నీళ్ళు లేక వెక్కిళ్ళు వస్తాయి. దాంతో దెయ్యం లేచి ఆమె పనిబడుతుంది.
        
ఇలాటి నాల్గు కథల తర్వాత విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఇతను పారానార్మల్ సైంటిస్టుగా దెయ్యాలున్నాయా లేదా తేల్చడానికి ఒక కళ్ళు జోడు తయారు చేసి దాంతో ప్రయోగాలు చేస్తూంటాడు. ఇతడి ప్రయోగాలకి గర్ల్ ఫ్రెండ్స్ బలౌతూంటారు. ఇక ఇంకో బకరాగా రకుల్ ప్రీత్ సింగ్ తోనే పెళ్ళి చూపులు జరిగే ట్విస్టుతో ముగింపుకొస్తుంది కథ.
        
ఈ మొత్తం కథలో హార్రర్ దృశ్యాలేం భయపెట్టేవిగా వుండవు. కానీ సస్పెన్స్ తో ఆసక్తికరంగా వుంటాయి. విద్యుల్లేఖా రామన్ కామెడీ పాత్ర భయపడే చేష్టలతో ఇది హార్రర్ సినిమా సుమా అని గుర్తు చేస్తూ పోయారు.

నటనలు-సాంకేతికాలు

రకుల్ ప్రీత్ సింగ్ చదివే నాల్గు కథల తర్వాత ఐదో కథలో ఎంట్రీ ఇస్తాడు విశ్వక్ సేన్. అప్పటికి గంట సమయం గడిచిపోతుంది. అతడి ఎంట్రీ తర్వాత అరగంటే సినిమా వుంటుంది. గంటన్నర సినిమా కావడం ఒకటి, విశ్వక్ సేన్ గంటకి కనిపించడం వొకటి- ఇలా థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు హాహాకారాలు చేస్తారని కాబోలు ఓటీటీలో పడేశారు. అయితే విశ్వక్ సేన్ తన మాస్ యాక్షన్ కి దూరంగా సాఫ్ట్ గా, డీసెంట్ గా నటించాడు. కనిపించేది కాసేపే అయినా అర్ధవంతంగా నటించాడు.

        రకుల్ ప్రీత్ సింగ్ ది ఫన్నీ క్యారక్టర్. ఆమె ఫన్ కోసం పాల్పడే చర్యలు ఫ్రెండ్స్ ని భయపెట్టి చంపుతూంటాయి. పుస్తకంలోని ఒక కథతో దెయ్యంతో హార్రర్ లో ఇరుక్కోవడం, దానికి విరుగుడు ఇంకో కథ చదవడమేనని పుస్తకంలో చెప్పడంతో, ఇంకో కథా చదివి మళ్ళీ ఇరుక్కోవడం, అందులోంచి బయటపడేందుకు పుస్తకంలో చెప్పినట్టు ఇంకో కథా చదవడం... ఇలా ఆ పుస్తకం పన్నిన వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకోవడం.
       
కానీ దెయ్యం కథల పుస్తకాలు ఎందుకో తెలుగులో వుండవు
, ఇంగ్లీషులోనే వుంటాయి ఫీల్ కోసం. మిగిలిన పాత్రల్లో నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్ లు కథలకి న్యాయం చేశారు. విద్యుల్లేఖా రామన్ ఇది హర్రర్ సినిమా అని గుర్తు చేస్తూ వుండడానికి ఒకటే భయపడే కామెడీ చేసింది. పోలీస్ ఇన్స్ పక్టర్ గా వచ్చే పృథ్వీరాజ్ కి ముగింపులో చిన్న ట్విస్టు ఇస్తాడు.
       
ఈ గంటన్నర సినిమా ఆద్యంతం విజువల్ అప్పీల్ తో వుంది. వదలకుండా చూసేలా చేస్తుంది. విశ్వక్ సేన్
, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్లు వున్నప్పుడు ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి. ముఖ్యంగా కెమెరా వర్క్, ఎడిటింగ్, కళా దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్స్, సీజీ వర్క్ క్వాలిటీతో వున్నాయి.
       
దర్శకుడు విజయ్ రైటింగ్
, మేకింగ్ పాత విలువలు జొరబడకుండా ఆధునిక దృక్పథంతో నిర్వహించడం ఈ హార్రర్ కి ప్లస్ అయింది. 2005 లో ఇదే టైటిల్ తో హాలీవుడ్ నుంచి హలోవీన్ హార్రర్ వచ్చింది. అది అర్ధం పర్ధం లేకుండా చీప్ హార్రర్ గా వుందని రివ్యూలున్నాయి. తెలుగు- తమిళ బూ మీద ఈ మచ్చ పడదని కి చెప్పొచ్చు.
—సికిందర్