రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 26, 2023

1333 : రివ్యూ!

 


రచన- దర్శకత్వం : జూడ్ ఆంథనీ జోసెఫ్
తారాగణం: టోవినో థామ‌స్, వినీత్ శ్రీనివాస‌న్, కుంచ‌కోబోబ‌న్‌, అప‌ర్ణా బాల‌మురళి,  తన్వీ రామ్, ఆసిఫ్ అలీ, అజూ వర్గీస్ తదితరులు
సంగీతం: నోబిన్ పాల్, ఛాయాగ్రహణం : అఖిల్ జార్జ్
బ్యానర్స్: కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్
నిర్మాతలు: వేణు కున్నప్పిల్లి, సీకే పద్మ కుమార్, ఆంటో జోసెఫ్
సమర్పణ : బన్నీ వాస్
విడుదల : మే 26, 2023
***

        లయాళం మూవీ 2018 కేరళలో మే 5న విడుదలైంది. విడుదలైన పది రోజుల్లో వసూళ్ళు వందకోట్లు దాటేశాయి. నేటికి వసూళ్ళు 140 కోట్లకి చేరుకున్నాయి.  దేశవ్యాప్తంగా వసూళ్ళ సంచలనం సృష్టిస్తున్న 2018 ఇతర భాషల్లో నేడు విడుదలయింది. తెలుగులో దీన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు విడుదల చేశారు. మలయాళ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ సినిమాని 2018 లోనే ప్రకటించాడు. అప్పుడు దీని టైటిల్ 2403 ఫీట్ : ది స్టోరీ ఆఫ్ అన్ ఎక్స్ పెక్టెడ్ హీరోస్. నవంబర్ 2022 లో దీని నిర్మాణం పూర్తయింది. 2018 లో కేరళ ని ముంచెత్తిన భీకర వరదల్ని, ఆ వరదల్లో బాధితుల ఆక్రందనల్నీ, ప్రాణాల కోసం వాళ్ళు చేసిన పోరాటాల్నీ ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించాడు. ఇదెలా వుందో తెలుసుకుందాం...  

కథ

న్యూస్ రిపోర్టింగ్ తప్ప ఇంకేదీ పట్టని నూరా (అపర్ణా బాలమురళి) పాండిచ్చేరిలో నీటి ఎద్దడి పై రిపోర్టింగ్ చేస్తూంటే, ఆమె కారుని తమిళనాడుకి చెందిన  డ్రైవర్ సేతుపతి (కళయరాసన్) ట్రక్కు ఢీ కొట్టడంతో గొడవవుతుంది.
        
ఆర్మీలో పనిచేస్తున్న అనూప్ (టోవినో థామస్) యాక్షన్లో కొందరు సైనికుల మరణాలు చూసి భయపడి పారిపోయి వచ్చేసి ఒక షాపులో పనిచేస్తూంటాడు. ఢిల్లీనుంచి మంజూ (తన్వీ రామ్) అనే టీచర్ కొత్తగా వచ్చి స్కూల్లో చేరడంతో ఆమెని ప్రేమిస్తాడు.
       
అబుధాబీలో  
పని చేస్తున్న ఐటీ స్పెషలిస్ట్ రమేష్ (వినీత్ శ్రీనివాసన్) కి భార్యతో సత్సంబంధాల్లేక పనిమీద శ్రద్ధ పెట్టడు. ఇంతలో తల్లి ఆస్పత్రిలో చేరిందని తెలుసుకుని కేరళ వచ్చేస్తాడు.
       
మత్స్యకారుడు
మాథచన్ (లాల్) చిన్న కొడుకు నిక్సన్ (ఆసిఫ్ అలీ)  మోడల్ కావాలని కలలు గంటూ చేపలు పట్టే పనిని చులకనగా చూస్తూంటాడు. సంపన్న వ్యాపార
వేత్త కుమార్తెని పట్టి ప్రేమిస్తూంటాడు.
        
టాక్సీ డ్రైవర్ కోషీ (అజూ వర్గీస్) టాక్సీతిప్పుతూ రోజుల తరబడి కుటుంబానికి దూరంగా వుంటాడు. అతను ఓ విదేశీ జంటకి టూరిస్టు కేంద్రాల్ని తిప్పి చూపించే బేరం కుదుర్చుకుంటాడు.
       
డ్యూటీ పట్ల
నిబద్ధతతో వుంటూ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వాధికారి షాజీ (కుంచాకో బోబన్), పైఅధికారులు తనకు సహకరించకపోయినా పట్టుదలతో విధి నిర్వహణ చేస్తూంటాడు.
       
ఇలా ఎందరో వ్యక్తులు
, ఎన్నో కుటుంబాలు. వాళ్ళ వాళ్ళ జీవన పోరాటాలు చేస్తూంటారు. ఇంతలో ఉన్నట్టుండి వరదలు ముంచుకు రావడంతో అందరూ అపాయంలో పడతారు. కొందరి ప్రాణాలూ, చాలా మంది ఆస్తులూ వరద నీట్లో కొట్టుకుపోతాయి. ఇందులోంచి ఎవరెవరు ఎంతమంది బ్రతికి బయటపడ్డారు? వాళ్ళ కలలూ కోరికలూ ఏమయ్యాయి? ఒకరికొకరు తెలియకపోయినా మానవత్వంతో చేయందించి ఈ ఉపద్రవాన్ని ఎలా దాటారు?...ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ
డిజాస్టర్ జానర్ కి చెందిన కథ. పాత్రలకి ఒక విపత్తు సంభవించడం, అందులోంచి బ్రతికి బయటపడం ప్రధానంగా వుండే కథ. ఈ కథని కల్పిత కథగా గాకుండా యదార్ధ గాథ ఆధారంగా తీశారు. దీన్ని 1924 లో కేరళలో సంభవించిన చారిత్రక భారీ వరదల్ని ప్రస్తావిస్తూ ప్రారంభించారు. ఆనాడు వెయ్యి మంది బలయ్యారు. ఒక పర్వతానికి పర్వతమే కొట్టుకుపోయింది.
       
2018 ఆగస్టులో
అసాధారణంగా అధిక వర్షపాతం కారణంగా కేరళ లోని 14 జిల్లాల్లో తీవ్ర వరదలు సంభవించాయి . ఇంత పెద్ద వరద 1924 తర్వాత ఇదే. ఈ వరదల్లో 483 మందికి పైగా మరణించారు, 15 మంది తప్పిపోయారు.  వరద పోటుకి రాష్ట్రంలోని 54 డ్యాముల్లో 35 డ్యాములకి చరిత్రలో మొదటిసారిగా గేట్లు ఎత్తేశారు.
       
అయితే సినిమా కథలో ముంచెత్తిన వరదలు
, ఆ వరదల్లో మనకి పరిచయం చేసిన పాత్రల పాట్లు, మరణాలు, విజయాలూ ఏకపక్షం చేసి చూపించారు. ఇంత జరుగుతున్నా, ప్రభుత్వమేమైంది, సహాయక చర్యలేమయ్యాయి అన్న ప్రశ్నలు అడ్డు తగిలేలా కథ సాగుతుంది. ప్రభుత్వ సాయాన్ని నామ మాత్రం చేశారు.
       
వాస్తవానికి కేంద్రప్రభుత్వం తన బలగాలతో అతి పెద్ద రెస్క్యూ ఆపరేషనే చేపట్టింది. వాట్సాప్ గ్రూపులు పబ్లిక్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టాయి. మత్శ్య కారులూ వాళ్ళ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సరే. మొత్తం కలిపి భారీ యెత్తున హెలీకాప్టర్లు
, విమానాలు, బోట్లు, సైన్యం, పోలీసులు, వైద్య బృందాలు, అన్నపానీయాలు అందించే ఎన్జీవోలూ - వీటన్నిటితో చాలా యాక్షన్ స్టోరీ జరిగింది.
       
అయితే యాక్షన్ స్టోరీని కూడా జతచేసి థ్రిల్ చేసే బదులు
, పాత్రల మధ్య హ్యూమన్ డ్రామాకే ప్రాధాన్యమిచ్చి ఈ కథ చేసినట్టు కనబడుతోంది. ఈ హ్యూమన్ డ్రామా కోసం సృష్టించిన సన్నివేశాలు భావోద్వేగాలతో బలంగా వుండడం ఈ వరద కథకి కలిసి వచ్చిన అంశం.

నటనలు - సాంకేతికాలు

ప్రధాన పాత్ర పోషించిన టోవినో థామస్ ఫస్టాఫ్ లో ఇతర అనేక పాత్రల కథల మధ్య ప్రధాన పాత్రగా అన్పించడు. సెకండాఫ్ లో పోను పోనూ ప్రాధాన్యం పెరిగి ఒక కదిలించే ముగింపుతో గుర్తుండి పోతాడు. ఈ పాత్ర  కాలా పత్తర్ లో అమితాబ్ బచ్చన్ పాత్రని గుర్తుకు తెస్తుంది. నేవీ కెప్టెన్ అయిన అమితాబ్ బచ్చన్, షిప్ మునిగిపోతూంటే భయపడి దూకెసి- ప్రయాణీకుల్ని వల్ల ఖార్మానికి వదిలేసిపారిపోతాడు. సైనికుడైన టోవినో థామస్ సైనికుల మరణాలు చూసి పారిపోతాడు. అమితాబ్ బొగ్గు గని కార్మికుడుగా చేరతాడు. టోవినో వూళ్ళో షాపులో పనికి కుదురుతాడు. చివరికి ఇద్దరూ వరద ముప్పు నెదుర్కొంటారు.
       
ఇక ఈ సినిమాలో మొత్తం39 పాత్రలున్నాయి టోవినో  థామస్ పాత్ర కాక. వీటిలో టీచర్ పాత్ర వేసిన తన్వీరామ్
, మత్స్య కారుడి కొడుకు పాత్ర వేసిన ఆసిఫ్ అలీ, ప్రభుత్వాధికారి పాత్ర వేసిన కొంచాకో బొబన్ లని గుర్తుపట్టగలం. ఈ నటులు సెకండాఫ్ విపత్తులో భావోద్వేగపూరిత సన్నివేశాలతో కట్టిపడేసినా, పాత్ర చిత్రణలు మాత్రం ఎగుడు దిగుడుగా వుంటాయి. ఫస్టాఫ్ లో ఈ అనేక పాత్రల కథలు ఫాలో కావడం కష్టమైనా, సెకండాఫ్ లో  ఏకత్రాటిపై కొచ్చేసరికి  తమవెంట తీసుకుపోతాయి.
       
సాంకేతికంగా బలంగా వుంది. 15 ఎకరాల్లో గ్రామం సెట్ వేసి సృష్టించిన వరద దృశ్యాలు టెక్నికల్ గా మంచి క్వాలిటీతో వున్నాయి. ప్రకృతి ప్రకోపం
, ప్రజల ఆక్రోశం తాలూకు దృశ్యాల చిత్రీకరణ టాప్ రేంజిలో వుంది. కెమెరా వర్క్, ఎడిటింగ్, మ్యూజిక్, యాక్షన్ కొరియోగ్రఫీ బ్యాలెన్సుడుగా పనిచేసి సెకండాఫ్ ని  పకడ్బందీగా నిలబెట్టాయి. సెకండాఫ్ అంతా బలంగా లేనిది ఫస్టాఫే.

చివరికేమిటి

ఇందులో పాత్రల అనుభవాలు చూస్తే పాలగుమ్మి పద్మరాజు రాసిన గాలివాన ప్రసిద్ధ కథ గుర్తుకొస్తుంది. ఆపత్కాలంలో పాత్రలతో అలాటి నైతిక, మానవత్వ, సామాజిక, ఆశావాహ అనుభవాల్ని కళ్ళముందుంచాడు దర్శకుడు జూడ్ ఆంథనీ జోసఫ్. గుండెల్ని కెలికే, హృదయవిదారక దృశ్యాలు, అంతలోనే ఊరటనిచ్చే విజయాలూ చూపించుకుపోతూ వెలుగు నీడల ఆట ఆడాడు. ఈ అనుభవాల్లో ఎన్ని నిజమో, ఎన్ని కల్పన చేశాడో గానీ- పూర్తిగా హ్యూమన్
డ్రామాకే ప్రాధాన్యమిచ్చి
, వ్యవస్థ సహాయ కార్యక్రమాలతో కూడిన హాలీవుడ్ టైపు యాక్షన్ స్టోరీని దూరంగా వుంచాడు. బాక్సాఫీసుతో ఈ రిస్కు బాగా వర్కౌట్ అయింది.
        
అయితే ఫస్టాఫ్ లో కథ లేకుండా చాలా పాత్రల పరిచయాలూ, వాటి జీవితాలూ, ఆశయాలూ ఎస్టాబ్లిష్ చేయడానికే సమయమంతా తీసుకుని ప్రేక్షకుల్ని ఖాళీగా కూర్చోబెట్టాడు. వరదలు ప్రారంభమయ్యాకే ఇంటర్వెల్ నుంచి ఏకబిగిన సెకండాఫ్ అంతా వూపిరి సలపని ఎమోషనల్ జర్నీకి సమకట్టాడు. ఇది నిజమైన కేరళ స్టోరీ. 2018 కేరళ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నిజమైన నివాళి. టోవినో థామస్ పాత్రకి శ్రద్ధాంజలి!
సికిందర్