రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, మే 2023, సోమవారం

1332 : స్పెషల్ ఆర్టికల్


 

        (డియర్ రీడర్స్, నేటి నుంచి తిరిగి అన్ని శీర్షికలూ మీ అందుబాటులో కొస్తాయి. రివ్యూలతో బాటు స్క్రీన్ ప్లే సంగతులు, స్క్రీన్ ప్లే టిప్స్, స్ట్రక్చర్ అప్డేట్స్, సందేహాలు- సమాధానాలు, రైటర్స్ కార్నర్, స్పెషల్ ఆర్టికల్స్ మొదలైన శీర్షికలు తిరిగి ఎప్పట్లాగా అందుకోగలరు. కొందరు పాఠకులు (కొత్త రచయితలు, దర్శకులు) పేరు లేకుండా వాట్సాప్ మెసేజీలు చేస్తున్నారు. పేరు, వివరాలు తెలిపితే బావుంటుంది. అయితే వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం సాధ్యం కాదు. అర్హమైన వాటికి సందేహాలు -సమాధానాలు శీర్షిక ద్వారా మాత్రమే సమాధానాలివ్వగలమని గమనించగలరు)

        ప్పుడు పరిస్థితి ఎక్కడికి దారితీసిందంటే, చూసి చూసి సినిమా ప్రదర్శనా రంగం బాలీవుడ్ నిర్మాణ రంగాన్ని బ్లేమ్ చేయడం మొదలెట్టింది. త్వరలో 50 మల్టీప్లెక్సుల్ని మూసి వేయాలన్న నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసిన కారణం, బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకర్షించక పోవడమేనంటూ ప్రకటన కూడా విడుదల చేసింది ఆ సంస్థ. అటు అమెరికాలో కూడా దివాలా తీసిన రీగల్ సంస్థ 500 థియేటర్లని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. మనదేశంలో ప్రముఖ పీవీఆర్- ఐనాక్స్ లీజర్ సంస్థ గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 333 నికర నష్టాన్ని చవిచూడడంతో, 50 మల్టీ ప్లెక్సుల్ని మూసి వేయబోతున్నట్టు ప్రకటించింది.

        త ఏడాది మార్చిలో, పీవీఆర్ -ఐనాక్స్ లీజర్ సంస్థలు మూడవ, నాల్గవ, ఐదవ శ్రేణి సెంటర్లలో మల్టీప్లెక్సులు ప్రారంభించి,1500 కంటే ఎక్కువ స్క్రీన్‌ల నెట్వర్క్ తో  దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ చైన్‌ ని  రూపొందించడానికి విలీనాన్ని ప్రకటించాయి. అయితే 2023 జనవరి నుంచి మార్చి వరకు తొలి త్రైమాసికంలో పీవీఆర్ - ఐనాక్స్ గ్రూపుకి దాదాపు రూ. 333 కోట్ల నష్టాలు వాటిల్లాయి. గతేడాది ఇదే సమయంలో రూ. 100 కోట్లకి పైగా నష్టాల్ని చవిచూసింది ఈ గ్రూపు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడం, అందుకు తగ్గట్టు రెవెన్యూ లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు.
        
రెవెన్యూ లేకపోవడానికి బాలీవుడ్ సినిమాలు ఒక దాని తర్వాత మరొకటి బాక్సాఫీసు దగ్గర చతికిల బడడం కారణం. ఈ యేడాది బాలీవుడ్‌లో ఇప్పటి వరకు హిట్ అనిపించుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి షారుఖ్ పఠాన్’. రెండోది అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ’. మూడు నెలల కాలంలో విడుదలైన 24 సినిమాల్లో ఈ రెండు సినిమాలు తప్పించి ఇంకేదీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోయాయి.
       
అసలు ఆకర్షించడానికి స్టార్ సినిమాలు పెద్దగా విడుదల కూడా కాలేదు. విడుదలైన స్టార్ సినిమాల్లో షారూఖ్
పఠాన్ తప్ప ఇంకేదీ ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించలేదు. సల్మాన్ ఖాన్ -వెంకటేష్ కిసీకా భాయ్ -కిసీకీ జాన్’, రణబీర్ కపూర్ తూ ఝూటీ -మై మక్కార్’, అజయ్ దేవగణ్ భోలా’, కార్తీక్ ఆర్యన్ షెహజాదా’, అక్షయ్ కుమార్ సెల్ఫీ - ఈ ఐదు స్టార్ సినిమాలకి ప్రేక్షక దర్శన భాగ్యం లభించలేదు.
       
ఇక చిన్న తారాగణం
, కొత్త తారాగణంతో విడుదలైన 18 లోబడ్జెట్ సినిమాల్లో ది కేరళ స్టోరీ తప్ప మిగిలినవి పీవీఆర్- ఐనాక్స్ గ్రూపుకి చుక్కలు చూపించాయి. దీంతో బాలీవుడ్ పనితీరు మీద ధ్వజమెత్తింది. బాలీవుడ్ క్రాష్ అయిందని కొందరు పరిశీలకులు కూడా గొంతు కలుపుతున్నారు.
       
ఇక మిగిలిన త్రైమాసికాల్లో
బాహుబలి’ ఫేమ్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’,  రణవీర్ సింగ్ -లియా భట్ నటించిన ‘రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీ , రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’, షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’, డుంకీ’, సల్మాన్ ఖాన్ నటించిన  ‘టైగర్ 3’ వంటి బిగ్ స్టార్ భారీ సినిమాల మీదే ఆశలు పెట్టుకున్నారు.
       
ఇక
సగటు ప్రేక్షకుడు మల్టీప్లెక్స్ టికెట్ రేట్లు రూ. 250, రూ. 350 చూసి పారిపోతున్నాడు. తినుబండారాల ధరలు చూసి సొమ్మసిల్లి పడిపోతున్నాడు. ఈ మల్టీ బాదుడు చూసి కూడా జనం మల్టీప్లెక్సులకి రావడం తగ్గిపోయింది. చిన్న పెద్ద సినిమాలన్నిటికీ ఒకే టికెట్ రేటు పడితే చిన్న సినిమాలకి ప్రేక్షకులు తగ్గి పోతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా నష్టాలు వస్తున్న 50 స్క్రీన్స్ ని వచ్చే ఆరు నెలల కాలంలో మూసివేయాలని పీవీఆర్- ఐనాక్స్ గ్రూపు ప్రకటించింది.
        
తెలంగాణలో టికెట్టు ధర రూ. 295 వుంది. అదే ఆన్‌లైన్ బుకింగ్ అయితే రూ. 329 రూపాయలు. మొన్నటి వరకు రూ. 200 గరిష్టంగా వున్న టికెట్ ధర రూ. 250 కి చేరుకుంది. పెద్ద సినిమాలకి మరో రూ. 50 రూపాయలు పెంచుకునే సదుపాయం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దాని ఫలితమే ఇప్పుడు పెద్ద సినిమాలకి రూ. 295, ఆన్‌లైన్ లో అయితే రూ. 329. హైదరాబాద్ లో ప్రైవేట్ యాజమాన్యాలు నడుపుతున్న ఒకటి రెండు మల్టీప్లెక్సుల్లో ముందు వరస రెండు లైన్లలో సీట్లకి ధర తగ్గించి రూ. 150 వసూలు చేస్తున్నారు. సగటు ప్రేక్షకుడికి కాస్త ఊరట.
        
అమెరికాలో రీగల్ సంస్థ దివాలా తీయడానికి హాలీవుడ్ సినిమాలు కారణం కాదు. మహమ్మారిలో లాక్ డౌన్ల కాలం నుంచి వాయిదా వేసిన చెల్లింపుల ద్వారా పెరిగిన అద్దె వంటి పాండమిక్ అనంతర ఖర్చులు మూసివేతలకి  ప్రధాన కారణంగా పేర్కొంది సంస్థ. 2019 నుంచి  2022 వరకు ఒక్కో థియేటర్‌కి సగటు నెలవారీ అద్దె 30 శాతం పెరిగిందని పేర్కొంది. మహమ్మారి థియేటర్ వ్యాపారంపై చాలా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఈ సంస్థ మీద 4.8 బిలియన్ డాలర్ల ఋణ భారముంది. మహమ్మారి కాలంలో 3 బిలియన్ డాలర్లు నష్టపోయింది. గత సంవత్సరంలో బాక్స్ ఆఫీసు మెరుగుపడింది. మార్వెల్ స్టూడియోస్ స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’, ‘షాంగ్-చీ’, టెన్ రింగ్స్’,  సోనీస్ వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్ మొదలైన హిట్స్  అనేక ఇతర వాటిలో ప్రేక్షకుల్ని తిరిగి సినిమా వైపుకు లాగాయి. అయినా పేరుకుపోయిన చెల్లింపులు దివాలా తీయించాయి.
       
ఇప్పటికే న్యూయార్క్
, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ మొదలైన నగరాల్లో 29 మల్టీప్లెక్సులు మూతబడ్డాయి.  దివాలా తీసిన సమయంలో రీగల్ దేశవ్యాప్తంగా సుమారు 500 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది. 
        
మనదేశంలో మల్టీప్లెక్సులు మహమ్మారి దెబ్బని తట్టుకున్నాయి. కానీ బాలీవుడ్ దెబ్బని తట్టుకోలేకపోతున్నాయి. అందుకే అన్నారు- ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలని. బాలీవుడ్ స్థానభ్రంశం చెంది సౌత్ సినిమాలు దేశాన్ని ఆక్రమిస్తాయని. ఇకనైనా బాలీవుడ్ కళ్ళు తెరవక పోతే అంతర్జాతీయ బ్రాండింగ్ ని కూడా కోల్పోయే పరిస్థితి ఎదురుకావొచ్చు.

—సికిందర్