రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

1421 : రివ్యూ

 

దర్శకత్వం : శివ తుర్లపాటి
తారాగణం : శ్రీనివాస రెడ్డి, అంజలి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు
రచన : కోనవెంకట్, భాను; సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, ఛాయాగ్రహణం : సుజాతా సిద్ధార్థ
నిర్మాత : ఎంవీవీ సత్యనారాయణ
విడుదల ; ఏప్రిల్ 11, 2024
***
          2014 లో హిట్టయిన 'గీతాంజలి' కి సీక్వెల్ గా 'గీతాంజలి  మళ్ళీ వచ్చింది' తో తిరిగొచ్చింది అంజలి. ఇది కూడా హార్రర్ కామెడీ. దీనికి కోనవెంకట్ రచయిత. శివ తుర్లపాటి కొత్త దర్శకుడు. మరి ఇది కూడా హర్రర్ తో భయపెట్టిందా, బోలెడు మంది కమెడియన్లతో నవ్వించిందా తెలుసుకుందాం...
కథ
సినిమా దర్శకుడుగా శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాప్స్ తీసి ఇక ఛాన్సులు రాక యాతన పడుతూంటాడు. ఇలాంటప్పుడు హీరో అవ్వాలనుకుంటున్న ఫ్రెండ్ అయాన్ (కమెడియన్ సత్య) ని బుట్టలో వేసుకుంటాడు. హీరో చేస్తానంటూ డబ్బులు గుంజుతూంటాడు. అయాన్ కి ఈ మోసం తెలియడంతో ఇరకాటంలో పడ్డ శ్రీనుకి ఊటీ నుంచి ఆఫర్ వస్తుంది. విష్ణు (రాహుల్ మాధవ్) అనే ప్రొడ్యూసర్ సినిమా తీద్దాం రమ్మని కాల్ చేస్తాడు. ఊటీలో అంజలి (అంజలి) కాఫీ షాప్ నడుపుతూంటుంది. శ్రీనుకి సినిమా ఆఫరిచ్చిన విష్ణు ఇక్కడ సంగీత్ మహల్ లోనే షూటింగ్ చేయాలని, అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలనీ కండిషన్స్ పెడతాడు. ఆ సంగీత్ మహల్ లో ఒక శాస్త్రి (రవిశంకర్), అతడి భార్య(ప్రియా), కూతురూ దెయ్యాలుగా వుంటారు.
        
వీళ్ళు దెయ్యాలెలా అయ్యారు? ఈ దెయ్యాల మహల్లో సినిమా తీయాలన్న విష్ణు ఉద్దేశమేమిటి? అంజలినే హీరోయిన్ గా తీసుకోవాలని ఎందుకు అనుకున్నాడు? ఈ సినిమాలో అయాన్ హీరోగా నటించాడా? పూర్వం అంజలి అక్క గీతాంజలి ఆత్మ ఏమైంది? ఆమె మళ్ళీ తిరిగి వచ్చిందా? అసలీ మొత్తం వ్యవహారమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలావుంది కథ
హార్రర్ కామెడీలని వదిలిపెట్టడం లేదు. మూడు వారాల క్రితమే ఓం భీమ్ బుష్ అనే హార్రర్ కామెడీ విడుదలైంది. ఇప్పుడు ఇది మరో హార్రర్ కామెడీ. ఇది 2014 లో హిట్టయిన హార్రర్ కామెడీ గీతాంజలి కి సీక్వెల్. దీనికి కూడా కోన వెంకట్ రచయిత. అయితే హార్రర్ కామెడీల్లో హార్రర్ కి భయపడ్డం ఎప్పుడో మానేశారు ప్రేక్షకులు. కేవలం అందులో  కామెడీనే పట్టించుకుంటున్నారు. ఇందులో మొదటిది ఎలాగూ వర్కౌట్ కాలేదు, రెండోది సెకండాఫ్ లో కాసేపు వర్కౌట్ అయింది.
       
అంటే నవ్వించడం కూడా కష్టమైపోతోంది. నవ్వించే కళ కనుమరుగైపోతోంది. మహల్లో దెయ్యాలతో కామెడీకి వాటితో నటించాల్సిన సినిమా షూటింగుకి సంబంధించిన సీన్లు అవి వున్నంత వరకే నవ్విస్తాయి. దర్శకుడుగా శ్రీనివాస రెడ్డి దెయ్యాల్ని జూనియర్ ఆర్టిస్టులుగా నమ్మించి సత్యా
, అంజలీలతో నటింపజేయడం, సత్య చాలా ఫన్నీ సిట్యుయేషన్లు క్రియేట్ చేయడం తెగ నవ్వించే అంశాలే. అలాగే కెమెరామాన్ కిల్లర్ నానిగా సీనియర్ కమెడియన్ సునీల్ దెయ్యాలతో హిలేరియస్ కామెడీ క్రియేట్ చేస్తాడు. దీనికి పదే పదే నవ్వుకోవచ్చు. అతడి స్కిల్స్ అలాటివి. ఈ రెండు ఎపిసోడ్స్ తర్వాత క్లయిమాక్స్ లో, మొదటి భాగంలోని గీతాంజలి ఆత్మ రావడం దగ్గర మాత్రం కథ కుదరక అసంతృప్తిగా ముగింపుకి చేరుకుంటుంది.
       
ఇక ఫస్టాఫ్ చూస్తే శ్రీనివాస రెడ్డి సినిమా చాన్సు ప్రయత్నాలు
, సత్యాని బకరా చేసి వాడుకోవడం, అతడి రచయితలుగా సత్యం రాజేష్, షకలక శంకర్ చేసే  కామెడీ వగైరాలతో చాలా బలహీనంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు ఊటీ నుంచి ఆఫర్ వచ్చాకే బోరు తొలగి ఆసక్తి పెరుగుతుంది. ఇక మహల్లో దెయ్యాలతో ఇంటర్వెల్ మలుపు కూడా ఫర్వా లేదు. ఇలా మొత్తంగా చూస్తే, హార్రర్ తో భయపెట్టడం పూర్తిగా విఫలమై, కామెడీతో నవ్వించడం సెకండాఫ్ లో రెండు ఎపిసోడ్లలో మాత్రమే సఫలమైందని చెప్పాలి.

నటనలు –సాంకేతికాలు
అంజలి, గీతాంజలి ఆత్మ పాత్రలు రెండిటినీ అంజలి మామూలుగానే నటించేసింది. షరా మామూలుగా ఈ సినిమాలో కూడా ఎమోషన్లు లేకపోవడం వల్ల నటనలు పైపైనే వుంటాయి. దాదాపు ప్ర్తఈ తెలుగు సినిమాలో ఎమోషన్లనేవి కరువైపోతున్నాయి. ఇక కమెడియన్ల శ్రేణి  బారుగానే వుంది - శ్రీనివాస్ రెడ్డి, సత్య, సత్యం రాజేష్షకలక శంకర్, అలీ, సునీల్ తదితరులు. సునీల్, సత్యలకి మాత్రమే  నవ్వించడానికి బాగా కుదిరింది. మిగిలిన వారి స్కిల్స్ వృధా అయ్యాయి. రవిశంకర్, ప్రియా దెయ్యాలుగా వాళ్ళ కథేమిటో కూడర్లేదు. విలన్ గా రాహుల్ మాధవ్ ఫర్వాలేదు.
       
ఛాయాగ్రహణం
, మహల్ సెట్, గ్రాఫిక్స్,ఇతర సాంకేతికాలు రిచ్ గా వున్నాయి గానీ సంగీతం బలహీనంగా వుంది కథా కథనాల్లాగే. కొత్త దర్శకుడు శివ తనదైన ఒక శైలి అంటూ, ముద్ర అంటూ ఏమీ క్రియేట్ చేసుకోకుండా యావరేజీ దర్శకత్వంతో సరిపెట్టేశాడు.
—సికిందర్