రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఏప్రిల్ 2024, శుక్రవారం


రచన- దర్శకత్వం : అమిత్ శర్మ
తారాగణం : అజయ్ దేవగణ్,  ప్రియమణి, గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ తదితరులు
సంగీతం :  ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం : తుషార్ కాంతి రాయ్, ఫ్యోడర్ లియాస్
నిర్మాతలు: బోనీ కపూర్, జీ స్టూడియోస్, అరుణవ్ రాయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా
విడుదల : ఏప్రిల్ 11, 2024
***

        త రెండు సంవత్సరాల్లో దృశ్యం 2’, షైతాన్ అనే రెండు హిట్స్ తో ముందున్న అజయ్ దేవగణ్ తాజాగా స్పోర్ట్స్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సచిన్’, ఎంఎస్ ధోనీ’, 83 వంటి హిందీలో వచ్చిన స్పోర్ట్స్ బయోపిక్స్ లో చివరిది తప్ప మిగిలిన రెండూ సూపర్ హిట్టయ్యాయి. ఈ క్రమంలో మైదాన్ ని దర్శకుడు అమిత్ శర్మ తాజా స్పోర్ట్స్ బయోపిక్ గా అందిస్తూ పోటీలోకి దిగాడు. ఇతను గతంలో బధాయీ హో అనే మీడియం బడ్జెట్ సూపర్ హిట్ అందించిన దర్శకుడు. మైదాన్ లో ప్రియమణి ఒక ముఖ్యపాత్ర పోషించింది. ఇది వర్తమాన కాలపు కథ గాకుండా, దాదాపు 72 సంవత్సరాల నాటి పీరియడ్ కథ అవడంతో బడ్జెట్ బాగానే రూ. 100 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అయితే దీన్ని హిందీలో మాత్రమే విడుదల చేశారు. ఇంతకీ ఈ స్పోర్ట్స్ బయోపిక్ ప్రత్యేకటేమిటి, ఇది ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందా లేదా, దీనికి హైదరాబాద్ తో వున్న సంబంధమేమిటి మొదలైన ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం...

కథ 
1952లో కోచ్ ఎస్ఏ రహీమ్ (అజయ్ దేవగణ్) నాయకత్వంలోని ఫుట్ బాల్ జట్టు ఆటలో ఓడిపోవడంతో ఈ కథ మొదలవుతుంది. ఆటగాళ్ళు బూట్లు లేకుండా ఆడినందున గాయపడతారు. రహీమ్ తిరిగి స్వస్థలం హైదరాబాద్ వచ్చేస్తాడు. అతడికి బ్రోకెన్ ఇంగ్లీషు మాట్లాడే భార్య సైరా (ప్రియమణి), ఓ కొడుకు (దివ్యాంశ్ త్రిపాఠీ), ఇద్దరు కూతుళ్ళు (నితాంశీ గోయెల్, ఆయేషా వింధర), తల్లీ (మీనల్ పటేల్) వుంటారు. చైన్ స్మోకర్ అయిన అతను  సిగరెట్లు మానెయ్యమనే భార్య మాటల్ని పెడ చెవిని పెడతాడు.
       
అప్పుడప్పుడే
దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో, ఏ గుర్తింపూ లేని దేశం  ఫుట్‌బాల్ ఆడడం వల్లే ప్రపంచ గుర్తింపు పొందుతుందని రహీమ్ నమ్ముతాడు. అయితే బెంగాల్ నేతృత్వంలోని ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో స్వార్ధ రాజకీయాలు ప్రతిబంధకంగా మారతాయి. ఈ ఫెడరేషన్ దేశం కోసం వేరే జట్టుని నిర్మించడం కంటే బెంగాల్ ఆటగాళ్ళు జట్టులో వుండాలని పట్టుబడుతుంది. రహీమ్ దీన్ని వ్యతిరేకించి హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పర్యటించి ఔత్సాహిక ఆటగాళ్ళని పోగేస్తాడు. జట్టులో వివిధ రాష్ట్రాలకి చెందిన పీకే బెనర్జీ (చైతన్య శర్మ), చునీ గోస్వామి (అమర్త్యా రే), జర్నైల్ సింగ్ (దవీందర్ గిల్), తులసీదాస్ బలరామ్ (సుశాంత్ వేదాండే), పీటర్ తంగరాజ్ (తేజస్ రవిశంకర్) సహా చాలా మంది వుంటారు. వీళ్ళందరికీ కోచింగ్ ఇచ్చి, మంచి బూట్లు కొనిచ్చి, గట్టి టీంని ఏర్పాటు చేస్తాడు.
        
'మనది పెద్ద దేశం కాదు, మనం ధనవంతులం కాదు. సగం ప్రపంచానికి మన గురించి తెలియదు. ప్రపంచం మొత్తం ఫుట్‌బాల్ ఆడుతోంది కాబట్టి ఫుట్‌బాల్ మనకో గుర్తింపుని  తెచ్చిపెట్టగలదు. అందువల్ల, వచ్చే 10 సంవత్సరాల పాటు ప్రపంచ స్థాయి జట్టుని నిర్మించాలని భారత్ గుర్తుంచుకోవాలి అని ఉద్బోధించి సమరం ప్రారంభిస్తాడు.
       
ఈ సమరంలో ఒలంపిక్స్ సహా విజయాలు సాధిస్తూ
, అంతిమంగా ఆసియా కప్ లో  గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్టుకుంటే, దురదృష్టం వెంటాడి క్యాన్సర్ బారిన పడతాడు. ఇప్పుడేం చేశాడు? ఎక్కువకాలం బ్రతకడు. మరణించే లోగా దక్షిణ కొరియాతో ఆసియా కప్ గెలిచాడా? క్యాన్సర్ వల్ల ఇప్పుడు తనతో తను కూడా సమరం చేయాల్సి వచ్చిన గడ్డు పరిస్థితి. ఈ పరిస్థితిలో లక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది ఉద్విగ్నతకి లోనుజేసే మిగతా కథ.

ఎలావుంది కథ
స్పోర్ట్స్ బయోపిక్ లెజెండరీ ఫుట్ బాల్ కోచ్, మేనేజర్, హైదరాబాద్ వాసి  సయ్యద్ అబ్దుల్ రహీమ్ కథ. కొన్ని మరుగున పడిన మాణిక్యాలుంటాయి. అలా ఎవరికీ  తెలియని కాల గర్భంలో కలిసిపోయిన మాణిక్యాన్ని వెలికి తీసి సినిమా తీశాడు దర్శకుడు అమిత్ శర్మ. రహీమ్ జట్టు  ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఒలింపిక్స్ నుంఛీ ఆసియా క్రీడల వరకూ బంగారు పతకాల్ని  సాధించి పెట్టింది. అతడి ఏలికలో 1952 నుంచి 1962 మధ్య కాలాన్ని భారత ఫుట్‌బాల్ చరిత్రలో స్వర్ణ యుగం న్నారు.
          
రహీమ్ చివరి విజయం 1962 లో జకార్తాలో జరిగిన ఆసియా కప్ ఫైనల్స్ లో దక్షిణ కొరియాని ఓడించి స్వర్ణం గెలవడం. 1963 లో క్యాన్సర్ తో కన్నుమూయడంతో అతడి శకం ముగిసింది. ఈ కథ ఫస్టాఫ్ లో అప్పటి దేశంలో ఫుట్‌బాల్ స్థితిని, రహీమ్ మెరికల్లాంటి  ఆటగాళ్ళని సృష్టించిన విధానాన్నీ చూపిస్తుంది. మరో పక్క, సోషలిస్టు అయిన రహీమ్ కి అడుగడుగునా మతం పేర, కుదరకపోతే కులాల పేర, ఇంకా కుదరకపోతే ప్రాంతీయతల పేరా ఫెడరేషన్ కమిటీ సృష్టించే ఆటంకాలుంటాయి. వాళ్ళకి బెంగాల్ ఆటగాళ్ళే కావాలి.
        
కమిటీలోని రాజకీయాల్ని అర్థం చేసుకోవడానికి ఫస్టాఫ్ ని ఉద్దేశించాడు దర్శకుడు.  ఇంకో పక్క కుటుంబ జీవితం గురించి క్లుప్తంగా చెప్పాడు. ఇలా నెమ్మదిగా సాగే ప్రథమార్ధం కొన్నిసార్లు కథ పెద్దగా ముందుకు సాగకపోవడంతో అసహనానికి గురిచేసే మాట మాత్రం  నిజం. అయితే ఈ సినిమా 2019 నుంచీ సుదీర్ఘకాలం నిర్మాణంలో వుందన్న విషయం గుర్తుంచుకోవాలి. గంట సెపే సాగే ఫస్టాఫ్ లో మొదటి ప్రధాన ట్విస్ట్ వచ్చే చివరి 15 నిమిషాల వరకూ ఇంతే. భావోద్వేగాలుండవు. అతడికి క్యాన్సర్ అని బయటపడ్డంతో ఒక ఉలికి పాటునిస్తుంది ఫస్టాఫ్ ముగింపు.
       
ఇక గంటా 45 నిమిషాలూ సాగే
సెకండాఫ్ మొత్తం ఒక యాక్షన్ డ్రామా.  ఫుట్ బాల్ ఆటే క్షణం క్షణం పరుగులెత్తే యాక్షన్ లో వుండే క్రీడ. పెద్ద తెర మీద ఈ యాక్షన్ స్టేడియంలో కూర్చుని ప్రత్యక్ష ఆట చూస్తున్నట్టే వుంటుంది. ఇక భావోద్వేగాలు- గోల్ కొడితే హర్షాతి రేకాలు, ఔట్ అయితే దీన విలాపాలు. పైగా క్యాన్సర్ తో కుంగుతున్న రహీమ్. సినిమాలోని ఈ మ్యాచ్ సన్నివేశాల్ని చూస్తున్నప్పుడు కలిగే భావోద్వేగాలు, థ్రిల్స్ పతాక స్థాయిలో వుంటాయి. టీమ్ ఇండియా గోల్ చేసిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి చప్పట్లు. ముగింపు చాలాసెంటిమెంటల్ గా వుంటుంది. బరువెక్కిన హృదయాలతో బయటికొస్తారు.

నటనలు – సాంకేతికాలు
ఫస్టాఫ్ లో అజయ్ దేవగణ్ పాత్ర కథని సెటప్ చేసే వంట తయారీ పనిలో వుంటుంది కాబట్టి మెకానికల్ గా కన్పిస్తుంది. ఒకసారి వంట తయారై ఇంటర్వెల్లో వడ్డించడం మొదలెట్టాక కట్టి పడేస్తుంది. అతను సంకల్పబలంతో స్పోర్ట్స్ ఒకదాన్నే వడ్డించడం లేదు- తనని తినేస్తున్న క్యాన్సర్ నీ వడ్డిస్తున్నాడు. ఈ రోజుల్లో క్యాన్సర్ కథలతో సినిమాలొస్తే నవ్వుతారు. కానీ నిజ కథలో క్యాన్సర్ పాత్ర సానుభూతినంతా ప్రోది చేసుకుంటుంది. ఎస్ ఏ రహీమ్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొని వుంటాడా అన్న నిజ జీవితపు ప్రశ్న ఈ బయోపిక్ కి బలమైన హుక్ ని ఏర్పాటు చేస్తుంది. కల్పిత పాత్రయితే ఇదంతా కేర్ చెయ్యం. క్యాన్సర్ తో ఈ నిజ జీవిత పాత్ర ఇప్పుడెలా టీం ని గెలిపించుకుని వుంటాడా అన్న కృత్రిమత్వం లేని బలమైన డ్రమెటిక్ క్వశ్చన్ ఇక్కడ క్రియేటవుతుంది. ఇక్కడే అజయ్ తన నటనతో మార్కులన్నీ స్కోరు చేశాడు. కమిటీలో ప్రత్యర్ధులు, ఫీల్డులో ప్రత్యర్ధులు, శరీరంలో ప్రత్యర్ధి- ఈ త్రిముఖ పోరాటాన్ని సాగించే పాత్రగా శక్తివంచన లేకుండా నటించాడు. రహీమ్ ని మర్చిపోలేని విధంగా ప్రెజెంట్ చేశాడు.
       
భార్య పాత్రలో ప్రియమణి సంఘర్షణ కూడా కట్టి పడేస్తుంది. ఇంటికొచ్చి క్యాన్సర్ తో కూడా అతను సిగరెట్లు కాల్చేస్తూంటే-
యింటికొచ్చి మృత్యువు కోసం నిరీక్షిస్తున్నావా? ఇది నా ఇల్లు- ఇది జీవించడానికి, మరణించడానికి కాదు... నువ్వు కంటున్న కలలకి నువ్వొక్కడివే మూల్యం చెల్లించుకోవడం లేదని గుర్తు పెట్టుకో అంటుంది. కొడుకుని ఇంజనీరు చేయాలన్న తన కలల సంగతి ఏమిటన్న బాధలోంచి. ఈ ఫ్యామిలీ డ్రామా సబ్ ప్లాట్ గా వుంటుంది.
       
స్పోర్ట్స్ జర్నలిస్టుగా
గజరాజ్‌రావు రహీమ్ కి ఎసరుపెట్టే కన్నింగ్ పాత్ర నటించాడు. అతడి దుష్టత్వం చాలా కరుగ్గా వుంటుంది. ఫుట్‌బాల్ ప్లేయర్‌లుగా నటించిన యువ నటులకి ఎక్కువగా మాటల్లేవు. ఆటలతోనే దృష్టి నాకర్షిస్తారు. ఆ జయాపజయాలతో కూడిన భావావేశాల్ని బలంగా ప్రకటిస్తూ. ఈ మొత్తం డ్రామాలో దేశభక్తి కనిపించదు. దేశభక్తి నినాదాలుండవు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో రాజకీయాలకింకా దేశభక్తి ముడిసరుకు కానందువల్లనేమో. నేషనల్స్-యాంటీ నేషనల్స్ సోది ఆ కాలంలో లేనట్టుంది.  అజయ్ దేవ గణ్ రైట్ వింగ్ మద్దతుదారైనా ఈ సినిమాని వేరుగా వుంచాడు.
       
టెక్నికల్ గా అత్యున్నతంగా వుంది. 1950 ల నాటి హైదరాబాద్ ట్యాంకు బండ్ నీ
, పురానా పుల్ నీ బాగానే రీక్రియేట్ చేశారు. ఇతర సెట్స్ కి కళా దర్శకత్వం, నటుల కాస్ట్యూమ్స్ వగైరా 70 ఏళ్ళ నాటి కాలాన్ని ప్రతిబింబిస్తాయి. ఆరుగురు రచయితలు పని చేశారు. రెహమాన్ సంగీతంలో 5 పాటలున్నాయిగానీ మామూలుగా వున్నాయి. ఎక్కువ పాటలు మనోజ్ ముంతసిర్ రాశాడు. మనోజ్ ముంతసిర్ అంటే ఆదిపురుష్ లో యాక్షన్ సినిమా పంచ్ డైలాగులు రాసి అల్లరైన వాడే. 
       
ఫుట్ బాల్ మ్యాచుల యాక్షన్ కొరియోగ్రఫీకి స్పోర్ట్స్ యాక్షన్ డైరెక్టర్ రాబర్ట్ మిల్లర్
, కో ఆర్డినేటర్ దినేష్ నాయర్, యాక్షన్ డైరెక్టర్ ఆర్పీ యాదవ్ పని చేశారు. వీళ్ళ పనితనం అద్భుతంగా వుంది. ఈ స్పోర్ట్స్ బయోపిక్ విభిన్నమైనది. ఎందుకంటే ఇది క్యాన్సర్ ఎలిమెంట్ తో వుంది. క్యాన్సర్ ఎలిమెంట్ లేకపోతే రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామా అయ్యేది.
—సికిందర్