రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Showing posts with label క్రైం థ్రిల్లర్. Show all posts
Showing posts with label క్రైం థ్రిల్లర్. Show all posts

Sunday, June 29, 2025

1382 : స్క్రీన్ ప్లే సంగతులు

 

రచన - దర్శకత్వం : శేఖర్ కమ్ముల
తారాగణం : నాగార్జున, ధనుష్, రశ్మికా  మందన్న, సునైనా, జిమ్ సెర్బ్, దలీప్ తాహిల్,  సాయాజీ షిండే తదితరులు
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : నికేత్ బొమ్మిరెడ్డి
బ్యానర్స్ : శ్రీ వెంకటేశ్వరా సినిమాస్, అమిగోస్ క్రియెషన్స్
నిర్మాతలు : సునీల్ నారంగ్, పి. రామ్మోహన్ రావు, అజయ్ కైకాల
విడుదల : జూన్ 20, 2025
***
            లైటర్ వీన్ రోమాంటిక్ సినిమాలకి పేరుబడ్డ దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి  ఏకంగా బిగ్ యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగార్జున, ధనుష్, రశ్మికా  మందన్న లాంటి ముగ్గురు అగ్ర హీరో హీరోయిన్లతో, భారీ బడ్జెట్ ని వెచ్చించి కుబేర అనే హై కాన్సెప్ట్ మూవీకి తెరతీశారు. అయితే లైటర్ వీన్ రోమాంటిక్స్ కీ, బిగ్ యాక్షన్ మూవీస్ కీ ఏ విషయంలోనూ పోలిక వుండదు. బిగ్ యాక్షన్స్, రోమాంటిక్స్  చాలా భిన్నమైన సినిమాటిక్ అనుభవాల్ని అందిస్తాయి. బిగ్ యాక్షన్స్ ఉత్కంఠరేపే కథలతో, పాత్రలమధ్య వూపిరి సలపని  సంఘర్షణలతో, యాక్షన్ దృశ్యాలతో విజువల్ కథనాలుగా వుంటే, రోమాంటిక్స్ భావోద్వేగ సంబంధాలతో, పాత్రల డెవలప్ మెంట్ తో, వర్బల్ కథనాలతో భావుకతతో వుంటాయి. రోమాంటిక్స్ సంభాషణలతో నడిచే వెర్బల్ కథనాలుగానే  గాకుండా, విజువల్ రైటింగ్స్ తో కూడా వుండొచ్చు గానీ, బిగ్ యాక్షన్స్ డైలాగులతో నడిచే వెర్బల్ కథనాలుగా వుంటే మాత్రం తప్పకుండా కుప్ప కూలిపోతాయి. మరొకటేమిటంటే, రోమాంటిక్స్ కి స్టోరీ రైటింగ్ పని చేస్తే, ఇప్పటి కాలంలో బిగ్ యాక్షన్స్ కి స్టోరీ రైటింగ్ ఏమాత్రం పని చేయని పరిస్థితి వుంది. కనుక బిగ్ యాక్షన్స్ కి స్టోరీ మేకింగే చేయాలి, స్టోరీ రైటింగ్ కాదు. ఈ తేడా గుర్తించక పోతే ఏళ్ళ తరబడీ  రోమాంటిక్స్ తీస్తూ, ఇక పానిండియా బిగ్ యాక్షన్ కి  అప్ గ్రేడ్ అవ్వాలనుకున్న దర్శకుడు -కేవలం తనకున్న బ్రాండ్ నేమ్ తో కొంత వరకూ బాక్సాఫీసుని నెట్టుకు రావచ్చేమో గానీ, ఒక మంచి  బ్లాక్ బస్టర్ ని అందించే అవకాశాన్ని మాత్రం కచ్చితంగా కోల్పోతాడు. కుబేర అనే యాక్షన్ కథతో జరగాల్సింది విజువల్ గా వుండే స్టోరీ మేకింగ్ అయితే, రోమాంటిక్స్ కి పనికొచ్చే అదే వెర్బల్ స్టోరీ రైటింగ్ చేశారు. ఇలా రోమాంటిక్స్ కీ, బిగ్ యాక్షన్స్ కీ కలిపి ఒకే జానర్ మర్యాదలుంటాయనుకున్నట్టుంది.
        
    రెండోది, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ అనేది మానవ మెదడు లోపలి ప్రపంచాల నమూనాకి లోబడి వుంటుంది. అంటే మానవ మెదడులో బలంగా వైరింగ్ అయి వున్న బ్లూ ప్రింట్ తో త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ సరిపోలుతుంది మెదడులో ఈ బ్లూ ప్రింట్ ప్రపంచాన్ని నమూనాగా తీసుకుని హేతుబద్ధీకరించడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల ఇది కథకులకి తెలిసో తెలియకో దాదాపు అన్ని  స్క్రీన్ ప్లేలలో తప్పనిసరి మోడల్ గా వచ్చి చేరిపోతుంది. కనుక బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే  మూడు అంకాల నిర్మాణం (త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్) లేకుండా స్క్రీన్‌ప్లే రాసినట్టయితే, ప్రేక్షకులు దాన్ని అర్ధం పర్ధం లేనిదిగా, నాన్సెన్సికల్ గా ఫీలయ్యే అవకాశముంటుంది. సినిమాల దాకా ఎందుకు- మనం చెప్పుకునే జోకులు కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లోనే వుంటాయి.
       
దీన్ని తృణీకరించడంవల్ల స్క్రీన్ ప్లేల్లో పాసివ్ హీరో సిండ్రోమే గాకుండా
, అసలు స్క్రీన్ ప్లేనే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేగా మారిపోయే ప్రమాదం పొంచి వుంటుంది. ఇలా పైన చెప్పుకున్నట్టు క్రియేటివిటీ పరంగా జానర్ మర్యాదల పాలన లేకపోవడంతో బాటు,  స్ట్రక్చర్ పరంగా నియమాల పాలనా లేకపోవడంతో కుబేర మేకింగ్ ప్రాసెస్ కుదేలైంది.
       
దీని స్క్రీన్ ప్లే సంగతుల్లోకి వెళ్ళేముందు రెండు మాటలు- ఈ సినిమా చూసొచ్చిన ఒక అసిస్టెంట్ ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్నాడు. కానీ కథ వింటే పాసివ్ హీరో సిండ్రోమ్ లా వుంది. సినిమా చూస్తే మిడిల్ మాటషే అని తేలింది. కథ వింటే పాసివ్ హీరో సిండ్రోమ్ లా అన్పించే స్క్రీన్ ప్లే
,  సినిమా చూస్తే మిడిల్ మటాష్ గా తేలడం కొత్త మోడల్. అంటే మిడిల్ మటాషుల్లో కూడా కొత్త కొత్త మోడల్స్ ప్రారంభమయ్యాయన్న మాట.
       
ఈ స్క్రీన్ ప్లేలో కథ తాలూకు
, కథనం తాలూకు లాజిక్ లేని, కన్విన్స్ కాలేని, కంటిన్యూటీ లేని చాలా చిత్రణ లున్నాయి. వాటన్నిటి జోలికెళ్ళకుండా, ప్రధానంగా మిడిల్ మటాష్ ని దృష్టిలో పెట్టుకుని, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ గురించి- అదీ సంక్షిప్తంగా తెలుసుకుని వదిలేద్దాం. ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేదే  స్ట్రక్చర్ లో లేనప్పుడు మిగతా  కథా కథనాలు పరిశుభ్రంగా వున్నాయా లేదా లెక్కలోకి రావు. ముందుగా కథలో కెళ్దాం...

కథ

ముంబాయిలో బడా బిలియనీర్ నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్). ఇతను బంగాళాఖాతంలో 15 ఏళ్ళకి సరిపడా కొన్ని ట్రిలియన్ల మెట్రిక్ టన్నుల చమురు నిక్షేపాల్ని కనుగొంటాడు. ఇది రట్టుకాకుండా, టెండర్ల తతంగం లేకుండా, తనొక్కడు కొట్టేయాలన్న దురాశతో కేంద్రమంత్రితో భేటీ అవుతాడు. ఈ రహస్య పథకంలో సహకరించే భాగస్థులకి పంచేందుకు లక్షకోట్ల రూపాయలు ఆఫర్ చేస్తాడు. ఈ మొత్తాన్ని డెలివరీ చేసేందుకు బినామీ ఎక్కౌంట్లు, విదేశాల్లో షెల్ కంపెనీలూ సృష్టించాలంటాడు.  అయితే దీన్ని ఎవరు హేండిల్ చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు దీపక్ పేరు చెప్తాడు. దీపక్ (నాగార్జున) సీబీఐ అధికారిగా తన కంపెనీలోనే 100 కోట్లు పట్టుకుంటే అతడ్ని కేసులో ఇరికించి జైలుకి పంపాడు నీరజ్. అతడ్ని బయటికి తీసి ఈ పని అప్పజెప్తానంటాడు. కానీ కేసు మాఫీకి దీపక్ ఒప్పుకోడు. తనే కేసు గెలుస్తానంటాడు. అయితే ఏడేళ్ళు శిక్ష పడేసరికి నీరజ్ తో చేతులు కలిపి బయటికొస్తాడు. కుటుంబం కోసం రాజీ పడ్డానంటాడు. నీరజ్ పథకం విని, బినామీల కోసం చూస్తూంటే ఒక బిచ్చగాడు ఎదురవుతాడు. దాంతో నల్గురు బెగ్గర్స్ ని బినామీలుగా పట్టుకొస్తాడు. ఆ నల్గుర్లో దేవా (ధనుష్) ఒక బెగ్గర్.
       
వాళ్ళ పేర్ల మీద బ్యాంకు ఖాతాలు తెరిచి డబ్బు ట్రాన్స్ ఫర్ చేశాక
, ఒక్కొక్కర్నీ చంపడం మొదలెడతాడు నీరజ్. దీంతో ఎదురు తిరుగుతాడు దీపక్. అటు దేవా తప్పించుకుని పారిపోతాడు. అతడి కోసం దీపక్, నీరజ్ గ్యాంగ్ వెంటపడతారు. ఒక రైల్వే స్టేషన్లో బాయ్ ఫ్రెండ్  చేతిలో మోసపోయి ఏడుస్తున్న సమీరా (రశ్మికా మందన్న) కనిపిస్తుంది దేవాకి. పరారీలో వున్న దేవా వల్ల ఆమెకూడా ప్రమాదంలో పడుతుంది. ఇద్దరూ పారిపోవడం మొదలెడతారు. ఈ క్రమంలో దేవా ఏం తెలుసుకున్నాడు, తెలుసుకుని ఏం చేశాడు, సమీరా అతడికెలా తోడ్పడింది, అతన్ని చంపకుండా దీపక్ కాపాడేడా అన్నది మిగతా కథ.

2. స్క్రీన్ ప్లే సంగతులు

ఓ మూడు గంటల నిడివి గల ఈ స్క్రీన్ ప్లేలో మొదటి అరగంట బిగినింగ్ సెటప్ అంతా వుంది. నీరజ్ చమురు కుట్ర పథకం దగ్గర్నుంచీ అందుకు బినామీలుగా నల్గురు బెగ్గర్స్ ని దీపక్ తీసుకురావడం వరకూ. అయితే ఈ బిగినింగ్ బిజినెస్ అంతా వర్బల్ సీన్లతో నిండి వుంది. ముఖ్యంగా దీపక్ కథ. అతను జైలు కెందుకెళ్ళాడో, ఎలా విడుదలయ్యాడో సంఘటనలతో విజువల్ ఇంపాక్ట్ తో  చూపకుండా, సీను తర్వాత సీను డైలాగులతో వర్బల్ గా పేలవంగా కానిచ్చేశారు. శ్రమ లేని దర్శకత్వమన్న మాట. అదే కేసరి 2  లో అక్షయ్ కుమార్ ని ఇంటి దగ్గర అరెస్ట్ చేసి తీసికెళ్ళే  సీను అతడి కుటుంబం ఆందోళనతో ఒక సంఘటనగా మంచి విజువల్ ఇంపాక్ట్ తో కనిపిస్తుంది. విజువల్ ఇంపాక్ట్ కి సంఘటనలు కావాలి. సంఘటనలే యాక్షన్ మూవీ  జానర్ మర్యాద.
       
అసలు దీపక్ ని ఇరికించిన కేసేమిటో కూడా చూపించక పోతే అతడికి జరిగిన అన్యాయం పట్ల ఎలా రియాక్ట్ అవగలరు ప్రేక్షకులు. కాబట్టి సెటప్ లోనే దీపక్ పాత్ర ఎలాటి ఎమోషనల్ డెప్త్ ని ఫీల్ కానివ్వక డొల్లగా తయారయ్యింది. ఈ డొల్లతనం స్క్రీన్ ప్లే  సాంతం కొనసాగింది. బిగినింగ్ లో స్టోరీ సెటప్పే సరిగా జరక్కపోతే ఆ తర్వాత మిడిల్
, ఎండ్ విభాగాలు స్క్రీన్ ప్లేలో దారీ తెన్నూ లేకుండా పోతాయి.
       
దీనికి తోడు జైల్లో వున్నప్పుడు నీరజ్ ప్రపోజల్ ని కాదన్న తను తర్వాత శిక్షపడగానే కాళ్ళ బేరానికి వచ్చేసినట్టు
, నీరజ్ కి లొంగిపోయి విడుదలై పోవడం పాత్ర చిత్రణకి చావు దెబ్బ కొట్టింది. అసలీ కేసులో బెయిలు మీద బయట వుండక శిక్ష పడే వరకూ జైల్లో ఎందుకున్నాడు. శిక్ష పడిందే అనుకుందాం, అప్పుడు పై కోర్టులో  అప్పీల్ చేసుకుంటూ బెయిల్ మీద బయటికి వచ్చేయ వచ్చు. నీరజ్ కి లొంగనవసరం లేదు. కానీ నీరజ్ సాయంతో విడుదలై బుద్ధిపూర్వకంగా దేశ సంపదతో అతడి భారీ కుట్రలో భాగస్తుడవడమంటే ఎంత దేశ ద్రోహనికి పాల్పడుతున్నట్టు! ఇదా నాగార్జున పాత్రకుండాల్సింది.
       
ఇక కుట్ర కోసం బినామీలని వెతికే ప్రక్రియ. నీరజ్ లాంటి బిలియనీర్స్ కి బినామీలుగా సొంత మనుషులే చాలా మంది దొరుకుతారు. పైగా వేలకోట్ల రూపాయలతో ఈ స్కామ్ చేయడానికి బ్యాంకు అధికారుల్ని కొనేస్తే సరిపోతుందా
? ఇన్ కమ్ టాక్స్, ఈడీ ల దగ్గర్నుంచీ రిజర్వ్ బ్యాంకు వరకూ సంగతి? వీళ్ళకి సమాచారం వెళ్ళకుండా అపగలరా బ్యాంకు అధికారులు?
       
దీపక్ కి బినామీలు దొరకడం కూడా విజువల్ ఇంపాక్ట్ లేకుండా పేలవంగా  కనిపిస్తుంది. ఈ బిగినింగ్ సెటప్ లో ఇంతవరకూ దీపక్ పాత్రే తప్ప దేవా పాత్ర కనిపించదు.  బిగినింగ్ ని సెటప్ చేస్తూ దీపక్కే కనిపిస్తూ వుండడంతో ఇతనే ఈ కథకి హీరో అన్పించేలా వుంటాడు. బినామీలు కావాలని నీరజ్ తో అన్నాక
, దీపక్ కారులో పోతూంటే ఒక బెగ్గర్ కారు దగ్గరికి వచ్చి అడుక్కుంటాడు- అంతే, దీపక్ కి ఐడియా వచ్చేసి వెంటనే వెళ్ళి నీరజ్ కి చెప్పేస్తాడు -బినామీలుగా బెగ్గర్స్ ని పెట్టుకోవాలని!
       
ఇక్కడ కథనంలో రూల్ ఆఫ్ త్రీస్ ని పాటించకుండా స్టోరీ బీట్స్ కి ఇంత తొందర పడ్డంతో జరిగిందేమిటంటే
, విషయం లేకుండా చప్పగా రెండు సీన్లు, అవీ వర్బల్ సీన్లు, రిపి టీషన్. నీరజ్ కి చెప్పి దీపక్ ఇలా వచ్చాడో లేదో, ఎవరో బెగ్గర్ దీపక్ ని అడుక్కోవడంతో థ్రిల్ మిస్సయి చప్పగా తయారైన సీన్లు, ఈ బెగ్గర్ తో వచ్చిన అయిడియాని అక్కడే ఫోన్లో చెప్పేస్తే పోయేదానికి మళ్ళీ నీరజ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం వల్ల రిపిటీషన్. దీని చిత్రీకరణకి అయిన ఖర్చు.
       
దీపక్ బెగ్గర్స్ ని డిసైడ్ చేసుకోవడానికి తగిన స్పేస్ ఇస్తూ రూల్ ఆఫ్ త్రీస్ ని పాటిస్తే- స్టోరీ బీట్ 1- బినామీల కోసం ఆలోచనలో దీపక్ తిరుగుతున్నప్పుడు తెలిసిన క్రిమినల్స్ ని కలవడం
, ఇది కాదనుకుని, స్టోరీ బీట్ 2 -కొందరు నిరుద్యోగుల్ని కలవడం, ఇది కూడా కాదనుకున్నప్పుడు, స్టోరీ బీట్ 3 -బెగ్గర్ తారసపడ్డంగా, రూల్ ఆఫ్ త్రీస్ గా  కథనం విస్తరించి ఒప్పిస్తుంది.
       
ఇప్పుడు ఇక్కడ ఏ బెగ్గర్ అన్న ప్రశ్న వస్తుంది. దీపక్ ని ఏ బెగ్గర్ అడుక్కోవాలి
? ఎవరో తర్వాత కథలో కనిపించని అనామక బెగ్గర్ తో ఈ సీనుకి ప్రయోజనమేమిటి? కథనమంటే సీనుని ఉత్తేజపర్చే సంఘటనలు కదా? ఏ సంఘటన జరగాలి? దీపక్ కారులో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, ఇప్పుడు తన కథ మొదలెట్టుకుంటూ  సాక్షాత్తూ బెగ్గర్ దేవా వచ్చేసి- అద్ధంలో మొహం పెట్టి చూస్తూంటే అదీ సంఘటన! స్టోరీ మేకింగ్. వైబ్రేషన్ ని పెంచే విజువల్ ఇంపాక్ట్. కథని ముందుకు పరుగెత్తిస్తూ రెండు ముఖ్య పాత్రల ఎన్ కౌంటర్ (ముఖాముఖీ). ఇప్పుడు ఎవరి గోల్ ఏంటి, గేమ్ ఏంటి, గెలుపు ఏంటి- అని కాన్ఫ్లిక్ట్ కి ముఖ్యమైన డ్రమెటిక్ క్వశ్చన్  ఏర్పాటైతే, పాసివ్ పాత్రలుండవు, కథ చుక్కాని లేని నావ అవదు, స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ అవదు...

3. ఒక్క సీనుతో
స్టోరీ మేకింగ్

  పై బిగినింగ్ సెటప్ ని తమ పద్ధతిలో ఇంకా ఇలా కొనసాగించారు... దీపక్ కి ఒక బెగ్గర్ తారసపడ్డంతో వచ్చిన ఐడియాతో నీరజ్ ని ఒప్పించి బెగ్గర్స్ వేటలో పడ్డప్పుడు, తిరుపతిలో బెగ్గర్ దేవా ఓపెన్ అవుతాడు. ఇతడి తోటి బెగ్గర్ ని ఒక కారు తొక్కేసి వెళ్ళి పోవడంతో దాని వెంటపడతాడు. ఆ తోటి బెగ్గర్ చచ్చి పోతాడు. ఇక్కడ రెండు ప్రధానంగా దృష్టి నాకర్షిస్తాయి- ఒకటి, ఈ స్క్రీన్ ప్లే కాన్సెప్ట్ వచ్చేసి బిలియనీర్ వర్సెస్ బెగ్గర్స్ కథ. అయినప్పుడు బాగా ఖరీదైన కారులో బాగా బలిసిన బాబు తొక్కేసి వెళ్ళిపోవాలి. పాత సినిమాల్లో ఇలాగే చూపిస్తారు. ఇలా జరగలేదు. మామూలు కారుతో నేలబారుగా జరిగింది. ఈ కారు తప్పించుకోవడంతో దేవా ఆగిపోయి దానికేసి రాయి విసిరినప్పుడు బలహీనంగా విసురుతాడు!

రెండు, ఎవరో అనామక బెగ్గర్ పాత్రని కారు తొక్కేసింది. దీంతో కథ తాలూకు కాన్సెప్చ్యువల్ పోరాటానికి బీజం పడలేదు సింబాలిక్ గా. ఓ రిచ్ కారు బిచ్చమెత్తుకుంటున్న దేవానే తొక్కేసి పోతే  కాన్సెప్ట్ సింబలైజ్ అవుతుంది. అంటే ఏర్పాటు చేసిన కాన్సెప్టుకి, బ్యాక్ డ్రాప్ కీ అనుగుణంగా కథనం సాగుతున్నట్టు ఉత్సాహం కలుగుతుంది. ఇలాకాక  ఇక్కడ కూడా ముఖ్య పాత్ర దేవా ఎంట్రీతో బలమైన సంఘటన, విజువల్ రైటింగ్, ఇంపాక్టూ లేకపోతే ఎలా? నాలుగు సీన్ల స్టోరీ రైటింగ్ ని ఒక్క సీనుతో స్టోరీమేకింగ్ చేయొచ్చు. సినిమా మూడుగంటలు అనవసరంగా సాగకుండా బడ్జెట్ ని కంట్రోలు చేయొచ్చు.

4. ఎంతసేపు పాసివ్?

చెప్పుకుంటే  లూజ్ రైటింగ్ చాలా వుంది. పైన చెప్పుకున్నట్టు ప్రధానంగా మిడిల్ మటాష్ ని దృష్టిలో పెట్టుకుని సంక్షిప్తంగా స్ట్రక్చర్ చూద్దాం...పైన బిగినింగ్ సెటప్ లో వివరించుకున్న ప్రకారం దీపక్ నల్గురు బెగ్గర్స్ ని తీసుకురావడంతో, 30 వ నిమిషంలో బిగినింగ్ ముగిసి ప్లాట్ పాయిట్ వన్ వస్తుంది. ఈ టైమింగ్ పర్ఫెక్టుగా వుంది. కానీ ఇది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇంటర్వెల్లో బయటపడుతుంది. అప్పుడింకేం జరుగుతుందో చూద్దాం. అప్పటి వరకూ ఇదే ప్లాట్ పాయింట్ వన్ అనుకుంటూ సినిమా చూస్తూంటాం. మిడిల్ మటాష్ తో జరిగే మాయ ఇదే!
       
ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యలో ఎవరు పడ్డారు
? తను బినామీ అవుతున్నాడని తెలీక దేవా పడ్డాడు. అంటే ఈ కథకి ఇప్పుడు హీరో పాత్ర దీపక్ కాక దేవా అయ్యాడు. అయితే దేవాకీ హీరో పాత్ర కేర్పడాల్సిన - సమస్యని ఎదుర్కొనే గోల్ ఏర్పడలేదు. ఎందుకంటే దీపక్ -నీరజ్ లు కలిసి తమ నల్గురు బెగ్గర్స్ పైన చేస్తున్న కుట్రేమిటో దేవాకి తెలీదు. బలి మేకలా వున్నాడు. కనుక ఈ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర్నుంఛీ ఈ కథేమిటో, ఇందులో తను ఇరుక్కుంటున్న సమస్యేమిటో ప్రేక్షకులకి తెలిసి  దేవాకి తెలీక పూర్తి స్థాయి పాసివ్ క్యారక్టర్ అయిపోయాడు! ప్లాట్ పాయింట్ వన్ లో కాన్ఫ్లిక్ట్ ఇలా ఏర్పాటవుతుందా? పోనీ తర్వాత ఇంటర్వెల్లో నైనా తెలుసుకున్నాడా అంటే అదీ లేదు. ప్రేక్షకులకి తెలిసి, పాత్రకి తెలీని విషయం ఏదైనా వుంటే ఇంటర్వెల్ కైనా పాత్ర తెలుసుకోవాలి. పాసివ్ తనాన్ని భరించడానికి ఇంతకి మించి అనుమతి లేదు.
       
సరే
, దేవా పాత్రని చదువురాని, లోక జ్ఞానంలేని, అడుక్కునే అమాయక బిచ్చగాడి పాత్రగానే రూపకల్పన చేశామని కథకుడు చెప్పొచ్చు. దీన్నొప్పుకోవచ్చు. అయితే ఈ అమాయక హీరో పాసివ్ పాత్ర ని ఎంతసేపు తట్టుకుంటుంది కథ? మహా అయితే ఇంటర్వెల్ వరకూ. ఆ పైన తట్టుకోలేదు గాక తట్టుకోలేదు. కుప్పకూలుతుంది. ఇది ఆర్ట్ సినిమానో, వరల్డ్ సినిమానో అయితే పాసివ్ పాత్రే వుంటుంది. తెలుగులో ఆర్ట్ సినిమాలూ వరల్డ్ సినిమాలూ ఆడతాయా? ఇంత బడ్జెట్ వెచ్చించి తీస్తారా? ప్రేమ సినిమాల్లో పాసివ్ హీరో చెల్లిపోవచ్చు. యాక్షన్ సినిమాల్లో జాడించి యాక్టివ్ హీరో పాత్ర వుండాల్సిందే!
       
దీపక్ బెగ్గర్స్ ని పట్టుకొచ్చే ఈ ప్లాట్ పాయింట్ వన్ లో ఎందుకు ఎక్కడ సంతకాలు పెడుతున్నాడో తెలియని దేవా పాత్రతో ఉస్సూరనిపించే పాసివ్ కథనం మొదలైపోతుంది. కాస్సేపటికే నీరజ్ గ్యాంగ్ బెగ్గర్స్ లో ఒకడ్ని చంపేస్తారు. ఇది తెలుసుకున్న దేవా తనకూ చావుతప్పదని పారిపోవడం మొదలెడతాడు. బెగ్గర్ ని చంపిన నీరజ్ నిజరూపం ఇప్పుడు తెలుసుకుని దీపక్ నిలదీసి ఫలితముండదు. నోరెత్తితే ఇరుక్కుంటావని నీరజ్ బెదిరిస్తాడు. దీపక్ మోసపోయానని గ్రహిస్తాడు. ఒకసారి కేసులో ఇరికించిన శత్రువు శత్రువే
, నమ్మి అతడితో చేతులు కలిపితే పరిణామాలెలా వుంటాయో మాజీ సీబీఐ అధికారి దీపక్ కి తెలీనట్టుంది. ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఇలా దీపక్ పాత్రచిత్రణ దెబ్బతిని పోతూ వుంటుంది.
       
ఇప్పుడు దీపక్ బాధ్యతేమిటంటే
, ఎక్కౌంట్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన పని మిగిలి వుండగా, పారిపోయిన దేవాని పట్టుకోవడమే. దేవాకి  తను ఏ స్కామ్ లో పనిముట్టుగా ఉపయోగపడ్డాడో తెలియదు, తెలుసుకోవాలన్న ఆలోచన కూడా రాదు. ఎన్టీఆర్ అశోక్ లో ఎన్టీఆర్ పాత్రకి  విలన్ తన మీద ఎందుకు దాడులు చేస్తున్నాడో తెలియదు, తెలుసుకోదు. పారిపోతూ ఆ దాడుల్ని తిప్పికొట్టే యాక్షన్ సీన్సు ని క్రియేట్ చేస్తూ పోవడమే. ఇది పూర్తిగా పాసివ్ క్యారక్టర్ కాదు, ధైర్యంగా దాడుల్ని తిప్పి కొడుతున్నాడు కాబట్టి పాసివ్ -రియాక్టివ్ క్యారక్టర్. ఇది ఫ్లాపయ్యింది.

5. ఫ్లాష్ బ్యాక్స్ సంగతులు
   
దేవా దాడుల్ని తిప్పికొట్టే పని కూడా చేయడు. భయంతో పారిపోతూ వుంటాడు. ఇప్పుడు మధ్యమధ్యలో చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ వుంటాయి. ఇవి సెకండాఫ్ లో కూడా కంటిన్యూ అవుతూంటాయి- అనాధగా చిన్నప్పటి కథ పూర్తి చేయడానికి. కానీ చిన్నప్పటి కథలు ఈ రోజుల్లో ఎవరికవసరం. పాపులర్ హీరోని చూద్దామని వచ్చిన ప్రేక్షకులు ఎవరో చైల్డ్ ఆర్టిస్టుని నిమిషాల తరబడీ చూస్తూ కూర్చోవాలనుకుంటారా? ఇక్కడ మనం తెలుసుకోవాలని ఆశించేది బెగ్గర్ అయిన దేవా ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడన్న క్యారక్టర్ డీటైల్స్ గురించి. పాత్ర సమగ్ర పరిచయం గురించి. డబ్బున్న ప్రపంచాన్ని ఏ దృష్టితో చూస్తున్నాడు? బిలియనీర్ నీరజ్ ని చూశాక ఏర్పడిన అభిప్రాయమేమిటి? ఇలా ఒక దృక్పథం (పాయింటాఫ్ వ్యూ) అంటూ కూడా లేకపోవడంతో పాత్ర అర్ధం కాదు. దీని గురించి రెండు ఫ్లాష్ బ్యాకులేసి వుంటే గ్యాప్ వుండేది కాదు.
        
షోలే తీసిన రమేష్ సిప్పీ 1980 లో అమితాబ్ బచ్చన్- శశి కపూర్- శత్రుఘ్న సిన్హా లతో షాన్ తీశాడు. ఇందులో అవిటి బెగ్గర్ పాత్ర కీలకంగా వుంటుంది. నగరంలో దొర ఎవరో, దొంగ ఎవరో, వాళ్ళ గుట్టు మట్లేమిటో డేటా అంతా తన దగ్గర వుంటుందన్న అర్ధంలో పాట ఎత్తుకుని ఎంట్రీ ఇస్తాడు. ఇది యాక్టివ్ బెగ్గర్ పాత్ర. దేవా పాత్రేనా?

6. ఇంటర్వెల్లో బయటపడే నిజం
పారిపోతున్న దేవా నైతికంగా కూడా విఫలుడు. తనకి తన ప్రాణాలే తప్ప ఇంకా తోటి బెగ్గర్స్ ప్రాణాలూ ముఖ్యమని ఫీలవ్వడు. దీనికి కారణం ఈ నల్గురు బెగ్గర్స్ మధ్య బాంధవ్యాన్ని చూపకపోవడం. ఈ బాంధవ్యంతో దేవాని మిగిలిన ముగ్గురి నాయకుడుగా ఎస్టాబ్లిష్ చేసి హైలైట్ చేయకపోవడం. ఎక్కడ ఏ స్టోరీ బీట్ పడితే కథాకథనాలు, పాత్రలూ ప్రకాశిస్తాయో తెలుసుకోక పోవడం.
        
అలా పారిపోతున్న దేవా దీపక్ ని కాంటాక్టు చేయడానికి ప్రయత్నిస్తూంటాడు. తనని దీపక్కే కాపాడాలి. అప్పుడు రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకోబోతూ సమీరా కనిపిస్తుంది. ఈమెదో కథ. ఇక ఈమెతో ట్రావెల్ అవుతాడు. ఇప్పటికీ అరగంట బిగినింగ్ సెటప్ తర్వాత, ఈ పారిపోవడాలతో మిడిల్ -1 ఇంకో గంట గడిస్తే గానీ గంటన్నరకి ఇంటర్వెల్ రాదు! అంటే ఈ గంట సేపూ దేవా పారిపోతూ వుండడమే, అతడ్ని దీపక్ వెతకడమే కథ. మధ్యలో దేవాని చంపేందుకు నీరజ్ గ్యాంగ్. ఇంటర్వెల్లో ఈ గ్యాంగ్ కి చిక్కుతాడు. ఎలాగో ప్రాణాలతో బయటపడి సమీరా ఇంటికి చేరుకోవడంతో ఇంటర్వెల్.
        
ఇప్పుడు గానీ ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కాబోతోందని మనకి తెలీదు. ఎందుకంటే దేవాకీ ఇంటర్వెల్లో కూడా కథ ఏమిటో తెలీదు, తన సమస్యకి మూలమేంటో తెలీదు, చేయాల్సిన అసలు పోరాటమేంటో తెలీదు, గోల్ తెలీదు!
        
కాబట్టి వెనుక చూపించిన బిగినింగ్ సెటప్ లో అది ప్లాట్ పాయింట్ వన్ కాదని ఇప్పుడు తెలుస్తుంది. అంటే మొదట్నుంచీ ఇంటర్వెల్ దాకా సాగింది బిగినింగ్ సెటప్పే. మిడిల్ 1 లో ఇంకా పడలేదు కథ. అంతేగాక, ఇప్పుడు ఇంటర్వెల్లోనైనా గోల్ ఏర్పడలేదంటే ఇంటర్వెల్లో కూడా ప్లాట్ పాయింట్ వన్ రాలేదు! అంటే ఇంకా బిగినింగ్ సెటప్పే సెకండాఫ్ లో కూడా సాగుతుంది! అంటే ఈ స్క్రీన్ ప్లే మిడిల్ మటాష్ కింద జమ అవబోతోంది! మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు ఇంటర్వెల్ వరకూ ఇలా మనల్ని మభ్యపెడతాయి!

7. సెకండాఫ్ సంగతులు

    సెకండాఫ్ ప్రారంభిస్తే దేవాకోసం అదే వెతుకులాట, దేవా పారిపోవడం, మధ్యమధ్య చిన్నప్పటి ఫ్లాష్ బ్యాకులు. ఇలా 20 నిమిషాలు సాగిసాగి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పు కుంటే, ఆ ఎస్సై వివరాలు అడిగి తెలుసుకుని దేవా బినామీ అని చెప్తాడు. ఇలా ఎస్సై చెప్తే తప్ప నీరజ్ చేస్తున్న స్కామ్ గురించి, అందులో తన పాత్ర గురించీ దేవాకీ తెలియలేదంటే ఇంకా పక్కా ఏమీ చేతకాని పాసివ్ క్యారెక్టరే నన్న మాట. ఇప్పుడైనా స్వయంగా కూపీ లాగి తెలుసుకుని వుంటే యాక్టివ్  క్యారక్టర్  అయ్యేవాడు.
        
ఇక మళ్ళీ ఛేజ్, పారిపోవడాలూ. పారిపోయి పారిపోయి మొత్తానికి దీపక్ ని కాంటాక్టు చేయగల్గుతాడు. ఇప్పటికీ ఇంకో 25 నిమిషాలు వృధాగా గడిచిపోతాయి. తాను బినామీ అని ఎస్సై ద్వారా తెలుసుకున్నాక ఇప్పుడు యాక్షన్ లోకి దిగి దీపక్ ని కాంటాక్టు చేస్తాడు.
        
ఫోనులో దీపక్ కి డిమాండ్ పెడుతూంటే, అది నీరజ్ కూడా విని ఫైర్ అవడంతో దేవాకి- నీరజ్ తో కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మొదలవుతుంది!  అంటే ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ అన్న మాట! ప్లాట్ పాయింట్ వన్ ఇప్పుడొచ్చిందన్న మాట! సినిమా ప్రారంభమయ్యాక ఫస్టాఫ్ గంటన్నరా గడిచిపోయి- సెకండాఫ్ లో ఇంకో 50 నిమిషాలూ గడిస్తే గానీ ప్లాట్ పాయింట్ వన్ రాలేదన్న మాట. ఈ మొత్తం రెండు గంటల 20 నిమిషాల వరకూ మనం చూసిందంతా బిగినింగ్ సెటప్పే నన్న మాట! ఎప్పుడో ఫస్టాఫ్ లోనే అరగంట లోపు ముగిసి ప్లాట్ పాయింట్ వన్ ని ఏర్పాటు చేయాల్సిన బిగినింగ్ సెటప్ ఇంటర్వెల్ కూడా దాటుకుని రెండు గంటల 20 నిమిషాల వరకూ అన్యాయంగా, అక్రమంగా  సాగిందన్నమాట!
        
అంటే ఈ రెండు గంటల 20 నిమిషాలూ కథ ప్రారంభంగాక, కేవలం ఉపోద్ఘాతమే సాగిందన్న మాట. ఇప్పుడు ఇక్కడ్నుంచీ దేవా గోల్ తో కథ ప్రారంభమై మిడిల్ 1 మొదలవుతుందన్న మాట! సినిమా మొదటి అరగంటలో దేవా గోల్ తో మొదలవ్వాల్సిన మిడిల్ 1,  చివరి అరగంటలో మొదలైందన్న మాట! మరి మిడిల్ 2, ఎండ్ విభాగాల పరిస్థితేంటి?

8. తెలుగులోనే ఈ చరిత్ర

కిక్ 2, సాహో, ఊపిరి, భాగమతి, డియర్ కామ్రేడ్, బుల్లెట్, కవచం,, లవర్, రంగులరాట్నం, ముఖచిత్రం...ఇవీ మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలతో వచ్చి ఫ్లాపయిన ఎన్నో సినిమాల్లో కొన్ని. కుబేరా 100 కోట్లు గ్రాస్ దాటినట్టు తెలుస్తోంది. మంచిదే. ముందుగా చెప్పుకున్నట్టు ఇది శేఖర్ కమ్ముల బ్రాండ్ నేమ్ ప్రభావం. శేఖర్ కమ్ముల సినిమా అంటే క్లాస్ కూడా బాగా వెళ్ళి చూస్తారు. ఇది ప్లస్ అయివుంటుంది. అయినంత మాత్రాన లోపాలు చెల్లిపోయినట్టా? చెల్లిపోయాయి  కాబట్టి ఇవి లోపాలే కావని ఇలాగే మళ్ళీ సినిమాలు తీయవచ్చా? తీయవచ్చు, ఎవరు కాదంటారు? శుభ్రంగా ఇలాగే మిడిల్ మటాషులు తీసుకోవచ్చు.
       
విషయానికొస్తే
, త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ నమూనా పై  పటంలో లా వుంటుంది. 25 శాతం బిగినింగ్, 50 శాతం మిడిల్ 1, మిడిల్ 2, ఇంకో 25 శాతం ఎండ్. అంటే 1:2:1 అన్నమాట. బిగినింగ్ 25శాతం దగ్గర ప్లాట్ పాయింట్ వన్, మిడిల్ 1, మిడిల్ 2 మధ్య ఇంటర్వెల్, సెకండాఫ్ లో మిడిల్ 2 పూర్తయిన 50 శాతం దగ్గర ప్లాట్ పాయింట్ టూ, తర్వాత ఎండ్.

మిడిల్ మటాష్ లో ఏం జరుగుతుందో పక్క పటం చూడండి. 25 శాతం వుండాల్సిన బిగినింగ్, ఫస్టాఫ్ ఇంటర్వెల్ మీదుగా సెకండాఫ్ ని దురాక్రమించి, మిడిల్ 1, మిడిల్ 2 లని మింగేస్తూ సాగుతుంది. అంటే సుమారు 75 శాతం బిగినింగే వుంటుంది. ఈ సినిమా 180 నిమిషాల్లో (3 గంటలు) 140 నిమిషాలూ బిగినింగే సాగింది! ఈ 75 శాతం పోగా మిగిలిన 25 శాతంలో మిడిల్ 1, మిడిల్ 2, ఎండ్ ఇరుకిరుకుగా సర్దుకుంటాయి! అంటే ఈ 25 శాతంలోనే ప్లాట్ పాయింట్ వన్ తో మిడిల్ 1, మిడిల్ 2 ఏర్పడి, తర్వాత ఇందులోనే ప్లాట్ పాయింట్ 2 వచ్చి, ఎండ్ కెళ్తుందన్న మాట! ఈ 25 శాతంలోనే కాన్ఫ్లిక్టు కథ క్లైమాక్స్ అన్నీ మనం చూసుకోవాలన్న మాట. పూర్తి టికెట్ డబ్బులు తీసుకుని 25 శాతం మాత్రమే సినిమా చూపిస్తున్నారన్న మాట! బడ్జెట్ అంతా 75 శాతం డొల్ల మీదే వెచ్చిస్తున్నారన్న మాట!
        
ఇలా స్క్రీన్ ప్లేల్లో  మొత్తం మిడిల్ అంతా మటాష్ అవుతోంది కాబట్టి మిడిల్ మటాష్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. దీనికి ఇంగ్లీషులో పేరు లేదు. ఎందుకంటే హాలీవుడ్ లో సినిమాలు ఇలా తీయరు. తెలుగులోనే ఈ తెగులు. ప్రతీ మిడిల్ మటాష్ సినిమాతో ఇదే జరుగుతోంది. అయినా తెలుసుకోవడం లేదు. బిగినింగ్ సెటప్పే కథ అనుకుంటూ 75 శాతం అశ్వమేధ యాగం చేస్తున్నారు.

9. మరేం చేయాలి ?

సెకండాఫ్ లో రెండు గంటల 20 నిమిషాలకొచ్చిన ప్లాట్ పాయింట్ వన్ ని వెనక్కి తెచ్చి ఇంటర్వెల్లో ఏర్పాటు చేయాలి. అప్పుడు కనీసం ఇంటర్వెల్లో నైనా కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెకండాఫ్ ప్రారంభిస్తే  మిడిల్ 1, మిడిల్ 2, ఎండ్ లకి కాస్త ఊపిరి పీల్చుకోదగ్గ స్పేస్ ఏర్పడి కథ బ్రతికే అవకాశముంటుంది. సినిమాలో రెండు గంటల 20 నిమిషాల కొచ్చిన ప్లాట్ పాయింట్ వన్ తో దేవా ఫోన్ చేసి డిమాండ్ చేస్తాడు. బెగ్గర్స్ కి పంచడానికి 10 వేల కోట్లు కావాలని అలజడి సృష్టిస్తాడు. దీన్నే ఇంటర్వెల్ కి జరిపి ఎస్టాబ్లిష్ చేస్తే 1. ఇంటర్వెల్లో దేవా యాక్టివ్ క్యారక్టర్ అవుతాడు, 2. విలన్ నీరజ్ తో ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది, 3. దేవాకీ 10 వేల కోట్లు వసూలు చేయాలన్న గోల్ ఏర్పడుతుంది, 4. ఇంటర్వెల్లో కథేమిటో ప్రేక్షకులకి అర్ధమవుతుంది.
        
కానీ యాక్షన్ మూవీకి ఇంత లైటర్ వీన్ కాన్ఫ్లిక్ట్ పని చేయదు. 10 వేల కోట్లు డిమాండ్ చేయడం  స్ట్రాంగ్ పాయింటు కాదు. ఈ పాయింటుకి క్యారక్టర్ లోంచి ఎదురు చూడని పర్సనల్ సీక్రేట్ ఏదో రివీలైతే ఇంటర్వెల్ కి కాన్ఫ్లిక్ట్ తో వచ్చే బ్యాంగ్ వేరే వుంటుంది.
       
ముంబాయిలో ఓ బెగ్గర్ విషయం బయట పడింది. అతను ప్రపంచంలోనే రిచెస్ట్ బెగ్గర్! అతడికి ముంబాయిలో రెండు ఫ్లాట్లున్నాయి. అతడి నెట్ వర్త్ 7. 5 కోట్లు. బెగ్గింగ్ ద్వారా నెలకి 75 వేలు సంపాదిస్తాడు. ఇప్పటికీ బెగ్గింగ్ చేస్తున్నాడు. ప్రపంచం మారిపోయింది... ఫిలిం రీళ్ళ కాలం  నాటి కథలు
, పాత్రలు ఈ డిజిటల్ యుగంలో అంతగా రాణించవు.

10. జానర్ మర్యాదలు

త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో అంకాల నిష్పత్తుల వారీ స్పష్టమైన విభజన కథని ప్రేక్షకులు సులభంగా జీర్ణించుకోవడానికి, అర్థం చేసుకోవడానికీ వీలు కల్పిస్తుంది. పాత్రల్ని ఫాలో అయ్యేలా చేస్తూ, ప్రేక్షకుల్ని ఒక భావోద్వేగ ప్రయాణంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కథలు ప్రేక్షకుల్లో ఆక్సీటోసిన్, డోపమైన్, ఎండార్ఫిన్లు వంటి హార్మోన్ల విడుదలని ప్రేరేపిస్తాయి. ఈ హార్మోన్ల విడుదల ప్రేక్షకుల్ని ఉత్తేజపర్చడానికీ, సానుభూతిని రేకెత్తించదానికీ, బలమైన భావోద్వేగాల్ని సృష్టించడానికీ తోడ్పడతాయి.

యాక్షన్ మూవీ జానర్ మర్యాదల విషయానికొస్తే, హీరోయిజం, దాంతో ధైర్యసాహసాలు, దాంతో హై-ఆక్టేన్ ఉర్రూతలూగించే బలమైన సంఘటనలు, పోరాటాలు, పేలుళ్ళు, హింస, పాత్రల్లో కథలో అడుగడుగునా సస్పెన్స్, థ్రిల్స్, మలుపులు, ఉత్కంఠ, కథనంలో వేగం, సంభ్రమపర్చే సన్నివేశాలు, పాత్రలు కలర్ఫుల్ గా వుండడానికి హాస్యం మొదలైన ఎలిమెంట్స్ తో కూడి వుంటాయి.
—సికిందర్


Thursday, March 26, 2020

923 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -4




       క్రైం థ్రిల్లర్ రాయడం కష్టమేం కాదు, అదెలా రాయాలో ఇలా రాసి తెలియ
జేయాలంటేనే రొంబ కష్టం. క్రియేటివిటీ గాల్లోంచి వస్తుందనుకుంటే గాలి కబుర్లు పోగేసు
కోవడమే. మెదడులోంచి వస్తుందనుకుంటే ముష్టి ఆలోచనలు జమ చేసుకోవడమే. మెదడుకి ఎన్నోషరతులుంటాయి. అవిదాటి బయటికి రాదు, బయటికి చూడదు గాక చూడదు.  క్రియేటివిటీకి నాల్గు మెట్లుంటాయి : 1. తయారీ, 2. నాన బెట్టడం, 3. బల్బు వెలగడం, 4. రాసెయ్యడం. తయారీ అంటే సమాచార సేకరణ, నాన బెట్టడమంటే సేకరించిన సమాచారం మైండ్ లో సింక్ అవడానికి కొన్నాళ్ళు అలా వదిలెయ్యడం, బల్బు వెలగడమంటే సింక్ అయిన విషయం లోంచి ఒక ఐడియా బల్బులా వెలగడం, రాసెయ్యడమంటే, ఆ వెలిగిన ఐడియా పెట్టుకుని కథ డెవలప్ చేసుకోవడం...ఈ ప్రాసెస్ లో వెళ్తేగానీ క్రైం థ్రిల్లర్ కుదరదు. ఒక హత్య కేసుతో క్రైం థ్రిల్లర్ (పోలీస్ డిటెక్టివ్) కథ రాయాలనుకున్నారనుకుందాం (హత్య కేసుతోనే రాస్తారు), ముందుగా ఏ రకం హత్యో నిర్ణయించుకుంటే ఆ రకమైన సమాచారం సేకరించుకోవచ్చు. గన్ తోనా, బాంబు తోనా, కత్తితోనా, ఉరితాడుతోనా, విషంతోనా ...ఏదైతే ఆ మేరకు సమాచారం. 

       
సమాచారంలోంచి ఒక పాయింటు పట్టుకోవడానికి కొన్నాళ్ళలా మనసులో వదిలెయ్యాలి. స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ మనసులో నలుగుతూన్న సమస్యకి కలల రూపంలో వచ్చే క్రియేటివ్ పరిష్కారాల గురించి చెప్తాడు. అలా స్ఫురించిన ఐడియాని మించింది వుండదు. లేదా మనమేదో పనిచేసుకుంటు        న్నప్పుడు చటుక్కున ఐడియా మెరుస్తుంది నలుగుతూన్న విషయం లోంచి. అప్పుడా ఐడియా పట్టుకుని కథ అల్లుకోవాలి. ఐతే మూసఫార్ములా కథ అల్లుకోవాలనుకుంటే ఈ వ్యాసం పనికిరాదు. జానర్ మర్యాదలతో రియలిస్టిక్ కథ అవసరమనుకుంటేనే ఈ వ్యాసం తగిన సమాచారమందిస్తుంది. 


     ఈ వ్యాసాలకి సంబంధించి ఇంకో సందేహం ఇలా అందింది - నేనొక క్రైం కథ రాస్తున్నాను. అందులో హీరోయిన్ ఒక హత్య చేయాలి. ఈ హత్య దొరక్కుండా చేయాలని రీసెర్చి చేస్తుంది. అలాటి పాయిజన్ కోసం ఇంటర్నెట్ లో సెర్చి చేస్తుంది. నా సందేహం ఏమిటంటే, అలాటి పాయిజన్ నిజంగా వుందా అనేది. నెట్ లో ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు, ఏం చేయాలంటారు?- అని. ఇటీవల కేరళలో ఓ కేసు పట్టుకున్నారు. ఆ కామర్స్ గ్రాడ్యుయేట్ గత 14 ఏళ్లుగా కుటుంబంలో ఆరు హత్యలు చేసింది. ఆరో హత్యతోనే అన్ని హత్యలూ బయట పడ్డాయి. ఎలా చేసింది? సహజ మరణాలన్పించేలా స్లో పాయిజన్ తో. ఆ పాయిజన్ సయనైడ్. ఏ పాయిజన్ తో హత్య చేసినా కొంత కాలమే తప్పించుకోగలరు. ఇవాళ్టి  ఫోరెన్సిక్ టాక్సికాలజీతో తెలిసిపోతుంది. కనుక ఏ పాయిజన్ అనేది ముఖ్యం కాకూడదేమో కథకి, చంపి దొరక్కుండా తప్పించుకునే డ్రామా ఏదైనా వుంటే అది ముఖ్యమవాలేమో స్క్రీన్ ప్లేకి ఆలోచించాలి. గేరీ రాడ్జర్స్ అని మాజీ పోలీస్ డిటెక్టివ్, ఫోరెన్సిక్ కరోనర్ (శవ పంచాయితీ జరిపే అధికారి) వున్నాడు. ఈయన రచయితలకి రాసుకోవడానికి పనికొచ్చే క్రైం ఇన్వెస్టిగేషన్ సలహా సంప్రదింపుల కేంద్రంగా వున్నాడు. ఈయనేమంటాడంటే,  రచయితలు క్రైం ఇన్వెస్టిగేషన్లో ముఖ్యమైన నాల్గు విషయాలు గుర్తుంచుకోవాలంటాడు. అవి హంతకుడు దొరికిపోవడానికి వుండే కారణాలు : 1. తనకి సంబంధించిన ఏదో ఆధారం వదిలేసి పోవడం, 2. ఏదో వస్తువు అక్కడ్నించి తీసికెళ్ళడం, 3. ఎవరో అతణ్ణి చూసిన సాక్షిగా వుండడం, 4. చేసింది తనే ఎవరికో చెప్పేసుకోవడం. పోలీస్ డిటెక్టివులు ఈ నాల్గు కోణాల్లోనే దర్యాప్తు చేస్తారని అంటాడు. 

       
కాబట్టి చంపి దొరక్కుండా తప్పించుకునే పాత్ర, పై నాల్గు పనులూ చేయకూడదంటాడు. 1. తనకి చెందిన ఆధారాలకి సంబంధించి ఇవి వదలకూడదు : వేలిముద్రలు, పాదరక్షలు, టైరు గుర్తులు, గన్ తో కాలిస్తే గన్ పౌడర్ అవశేషాలు, పంటి గాట్లు, గోళ్ళ రక్కుళ్ళు, చేత్తో రాసిన, లేదా ముద్రిత పత్రాలు, శిరోజాలు, సిగరెట్ పీకలు, చూయింగ్ గమ్, పళ్ళ పుల్లలు, గ్లవ్స్, పర్సు, ఐడీ కార్డులూ వగైరా. 2. హత్యా స్థలం నుంచి తీసికెళ్ళ కూడనివి : హతుడి డీఎన్ ఏ, వాహనం, ఆభరణాలు, డబ్బు, బ్యాంక్ కార్డులు, సెల్ ఫోన్, కంప్యూటర్ రికార్డులు, హత్యాయుధం కత్తి అయితే ఆ కత్తి, తాడు అయితే ఆ తాడు, గన్ అయితే ఆ గన్... 3. ఎవరూ చూడకుండా వుండాలంటే జాగ్రత్తలు : ఎవర్నీ వెంట తీసికెళ్ళ కూడదు, చుట్టు పక్కల ఎవరి కంటా పడకూడదు, సీసీ కెమెరాల పరిధిలోకి వెళ్ళకూడదు, హత్యా స్థలంలోంచి వెళ్ళిపోయాక కూడా ఎక్కడా రోడ్ల మీద సీసీ కెమెరాలకి చిక్కకూడదు. వైన్ షాపుకి వెళ్ళకూడదు. 4. చేసింది తాగి వాగకూడదు. మందు ఫ్రెండుకి, గర్ల్ ఫ్రెండుకే కాదు, దొరికిపోతే పోలీసులకి కూడా చెప్పకూడదు. తెలియకుండా పోలీసు ఇన్ఫార్మర్లు వుంటారు. జాగ్రత్త పడాలి...

ఎలా రాయాలి?
       పోలీస్ డిటెక్టివ్ స్క్రీన్ ప్లే ఎలా రాయాలనేది చూద్దాం : దీనికి హత్యే కేంద్రబిందువు కావాలి. ఈ హత్య చుట్టే కథ నడవాలి. ఈ ప్రధాన హత్యకి అనుబంధంగా మరికొన్ని హత్యలు జరగవచ్చు. అర్జున్ -విజయ్ ఆంటోనీలు నటించిన ‘కిల్లర్’ (2019) లో లాగా. అయితే జరిగిన మొదటి హత్యే కథకి ప్రధాన హత్యగా తీసుకోవాలి. అనుబంధ హత్యలు కొత్త క్లూస్ కి దారితీసే ఉద్దేశంతో కథకి ఉపయోగపడాలి. ప్రధాన హత్య ప్లాట్ పాయింట్ వన్ దగ్గర జరిగిందనుకుందాం, అప్పుడా క్రైం సీన్ సృష్టి నిర్దుష్టంగా వుండేట్టు చూసుకోవాలి. హత్యాస్థలంలోకి పోలీసులు, క్లూస్ టీం పాత్రలు ఎంటరైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సినిమాల్లో (కిల్లర్, ధృవ) క్లూస్ టీం రావడం రావడం వొట్టి చేతులతో అక్కడి వస్తువులు ఎడాపెడా ముట్టేసుకుంటూ వుంటారు, లైట్ స్విచ్చులేసేస్తూ వుంటారు. ఇది చాలా సిల్లీగా వుంటుంది. చేతులకి గ్లవ్స్ గానీ, అవిలేనప్పుడు కనీసం కర్చీఫ్ గానీ లేకుండా చేతులేస్తే, వేలిముద్రలు వంటి సాక్ష్యాధారాలు గల్లంతై పోతాయి. ఆనాడెప్పుడో   కొమ్మూరి సాంబశివరావు రాసిన డిటెక్టివ్ నవలల్లో చూడండి- పాత్రలు ఎంత జాగ్రత్త తీసుకుంటాయో. సిగరెట్ పీకని సైతం కర్చీఫ్ తో ఎత్తి పట్టుకుంటాయి. ప్రసిద్ధ క్రిమినల్ లాయర్ పాత్ర పెర్రీ మేసన్ నవలల్లో కొన్నిట్లో, అతను క్లయంట్ తో వెళ్తే అనుకోకుండా హత్యా దృశ్యం ఎదురయ్యే సన్నివేశం వుంటుంది. అప్పుడా క్లయంట్ తెలియక ఏదైనా ముట్టుకోబోతే, తన ఊతపదం టట్ టట్ - అంటూ తిట్టేవాడు. ఏ నేరస్థలమైనా నేరస్థుడు వదిలే సాక్ష్యాధారాలతో కూడి వుంటుంది. వాటిని కలుషితం చేస్తే కేసే గల్లంతై పోవచ్చు. ఆరుషీ జంట హత్యల కేసులో జరిగిందిదే. 

        నేరస్థల పరిశీలనా ప్రక్రియకి ఇండియాలో ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటూ వుంది. పోలీస్ స్టేషన్లో సమాచారం అందిందగ్గర్నుంచీ ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాల వరకూ. ఎవరైనా తీసేది ఒకే పోలీస్ డిటెక్టివ్ క్రైం థ్రిల్లరైనా, ఈ నాలెడ్జిని సముపార్జించుకుంటే ఏం తీస్తున్నారో గైడెన్స్ వుంటుంది, ఒక స్పష్టత వుంటుంది. 15 పేజీల ఈ పీడీఎఫ్ కాపీని ఈ వ్యాసం చివర ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పొందవచ్చు. దీన్ని సమగ్రంగా అవగాహన చేసుకుంటే కథని బట్టి ఏం కావాలో, ఎంత కావాలో అంతే తీసుకుని సీనాఫ్ క్రైంని పకడ్బందీగా రాసుకోవచ్చు. 

మరణ సమయ నిర్ధారణ 
       పాత డిటెక్టివ్ నవలల్లో హత్యాస్థలంలోకి ఫోరెన్సిక్ డాక్టర్ వచ్చి ప్రాథమిక శవ పరీక్ష చేసే వాడు. మరణ సమయాన్ని అక్కడే చెప్పేవాడు. విదేశీ డిటెక్టివ్ నవలల ప్రభావంతో కావచ్చు అలా రాశారు. ఫోరెన్సిక్ డాక్టర్ నే పోలీస్ డాక్టర్ అనేవారు. ఆయన వచ్చేవరకూ అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించే వారు కాదు. ఆయన శవాన్ని పరీక్షించాకే మొదలెట్టే వారు. మరణ సమయాన్ని ఒక కాల వ్యవధితో చెప్పేవాడు. 2 -4 గంటల మధ్య అనో, 12 - 5 గంటల మధ్య అనో. ‘కిల్లర్’ లో ఇలా కాల వ్యవధితోనే వుంటుంది. మన సినిమాల్లో ఈ విషయంలో జాగ్రత్తే పాటిస్తున్నారు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనే ఇన్ని గంటలకని తప్పుగా చెప్తున్నారని గేరీ రాడ్జర్స్ రాశాడు. అలా చెప్పడానికి చనిపోయే     సమయంలో స్టాప్ వాచీ పెట్టుకుని డాక్టర్ అక్కడున్నాడా అని హాస్య మాడేడు. ఇదలా వుంచితే, హత్యాస్థలానికి పోలీస్ డాక్టర్ వచ్చే విషయంలో అమెరికాలో ప్రతిపాదనలు చేస్తున్నారు. డాక్టర్ వచ్చి దృశ్యపరంగా చూస్తే మరణం గురించి ఎక్కువ విషయాలు తెలుస్తాయని అంటున్నారు. శవస్థితి, శవం పడున్నతీరు మొదలైన ఆధారాలతో హత్య ఎలా జరింగిందో కూడా డాక్టర్ చెప్పగలడంటున్నారు, కేవలం తన దగ్గర కొచ్చిన శవానికి పోస్ట్ మార్టం చేయకుండా. 

        సాధారణంగా సినిమాల్లో హత్యాస్థలంలో హంతకుడికి సంబంధించి వస్తు రూపంలో ఏదో క్లూ దొరికినట్టు చూపించి, దాన్నాధారంగా పట్టుకునే ప్రయత్నాలు చూపిస్తూంటారు. మంచిదే, అయితే ఈ టెంప్లెట్ కాకుండా, మెడికల్ ఆధారాలతో కూడా పట్టుకునే ప్రయత్నాలు చూపిస్తే కొత్తదనం వస్తుంది. పెర్రీమేసన్ నవలల్లో ఇవే ఎక్కువ వుంటాయి. కత్తిగాయం ఎంత లోతుకి దిగింది, గాయం ఒకే కత్తితో అయిందా, లేక ఆ గాయంతో కొనప్రాణంతో వున్న బాధితుడ్ని ఇంకెవరో వచ్చి, ఇంకో కత్తిని అదే గాయంలోకి దింపి పూర్తిగా చంపారా లాంటి సస్పెన్సుని క్రియేట్ చేస్తాడు - పెర్రీ పెసన్ ని సృష్టించిన సుప్రసిద్ధ క్రిమినల్ లాయర్ ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్. పెర్రీ మేసన్ బుక్స్ బెంగుళూరు పబ్లిషర్ మాస్టర్ మైండ్ బుక్స్ నుంచి పొందవచ్చు. వెల వంద రూపాయలుంటుంది. 

     పోస్ట్ మార్టం లివిడిటీ అనే మరో మెడికల్ ఎవిడెన్స్ వుంటుంది. శవం ఏ శరీర భాగాలు నేలకి తాకుతూ వుంటాయో గురుత్వాకర్షణ వల్ల రక్తం అక్కడికి లాగేసుకుని, ఆ భాగాల మీద మచ్చలేర్పడతాయి. ప్రాణం పోయిన అరగంటకి ఈ ప్రక్రియ మొదలవచ్చు. శవాన్ని కనుగొన్నప్పుడు ఈ మచ్చలు పైన కనబడితే, శవాన్ని ఎవరో తిరగేసినట్టు అర్ధం. అంటే హత్య జరిగిన అరగంట తర్వాత ఇంకెవరో ఇక్కడికి వచ్చినట్టు. శవ భంగిమ చాలా ఇంపార్టెంట్ ఈ కేసుల్లో. ఇలాటి పాయింట్లు లాగి కథ చేసినప్పుడు ఇంకింత ఉన్నతంగా వుంటుంది. పోస్ట్ మార్టం లివిడిటీ గురించి యూట్యూబ్ లో వీడియోలుంటాయి. 

        రిగర్ మార్టిస్ అని ఇంకో మెడికల్ ఎవిడెన్స్. అంటే శవం కొయ్యబారడం. చనిపోయిన నాల్గు గంటలకి ఇది జరుగుతుంది. ఈ స్థితి 18 గంటలు వుండి ఆతర్వాత సడలుతుంది. అక్కడ్నించీ కుళ్లే దశ ప్రారంభమవుతుంది. మరణ సమయాన్ని రిగర్ మార్టిస్ ద్వారా నిర్ధారిస్తారు. రిగర్ మార్టిస్ లో అసాధారణ శవ భంగిమ వుంటే, ఇంకో చోట చంపి ఇక్కడ పడేసినట్టు అనుమానిస్తారు.

        పోస్ట్ మార్టం (శవ పరీక్ష) లో మరణ కారణాన్ని తెలుసుకుంటారు. హత్యాయు
ధాలకి సంబంధించి గన్స్ గురించి బాలస్టిక్స్ సైన్స్ వుంది. ఏ బులెట్ ఏ గన్ నుంచి వచ్చింది, ఎంత దూరంనుంచి ఏ కోణంలో పేలింది, నేరుగా తగిలిందా, లేక ఇంకేదేనా వస్తువుకి తగిలి పరావర్తనం చెంది తగిలిందా వంటి నిర్ధారణలు చేస్తారు. కత్తి గాయాలు, ఫలానా కత్తి హత్యాయుధమని నిర్ధారణ, దహనం కేసుల్లో, ఉరితీత కేసుల్లో, నీట మునక కేసుల్లో, విషప్రయోగం కేసుల్లో ఇలా దేనికా సైన్స్ విభాగముంది. డాక్టర్ కె. సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ ఓపీ మూర్తిలు రాసిన ‘ది ఎసెన్షియల్స్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ’ అన్న ప్రసిద్ధ గ్రంథం అన్ని రకాల మరణాలకి సంబంధించి విజ్ఞాన సర్వస్వంలా వుంటుంది రైటర్స్ కి. 


      ఇక వేలిముద్రల ఎవిడెన్స్ సరే. హత్యా స్థలంలో సాక్ష్యాలేవైనా వాటి పరిరక్షణకి అమెరికాలో ఒక విధానాన్ని అమలు చేయాలనీ ఆలోచిస్తున్నారు. హత్యాస్థలం లోకి వివిధ అధికారులు వచ్చి పోతూంటారు. దీన్ని నియంత్రించేందుకు ఒక రికార్డు నిర్వహించాలని, వచ్చిన అధికారులు క్రైమ్ సీన్ని కలుషితం చేయకుండా అరికట్టాలనీ యోచిస్తున్నారు. ఇలాటిది కథలో కల్పిస్తే స్పూర్తిదాయకంగా వుంటుంది. 

        కథ దేశవాళీగా వుండాలనుకుంటే, దేశంలో నిత్యం ఎన్నో హత్యలు జరుగుతూంటాయి. ఆ క్రైం న్యూస్ ని ఫాలో అయితే చాలా కొత్త సమాచారం, కొత్త కథలు, కొత్త కోణాలు దొరుకుతాయి. ఉదాహరణకి ఇలాటి వాటి ఆధారంగా రాసిన రెండు నిజ కేసులు ఈ వ్యాసం కింద ఇచ్చిన పీడీఎఫ్ లింకులు క్లిక్ చేసి చూడవచ్చు. ఇవి ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం అనుబంధంలో ‘క్రైం స్టోరీ’ శీర్షికకి రాసినవి. కాకపోతే నిజ కేసుల ఆధారంగా సినిమా తీసి, ఇది నిజంగా జరిగిన కథ అంటూ పోస్టర్ల మీద వేస్తే ఆ సినిమా ఫ్లాపవుతుంది. ఇలా వేసుకున్న ఎలాటి సినిమా అయినా ఫ్లాపే అయింది. టీవీ లోనే నిజ కథలు వస్తున్నప్పుడు, థియేటర్లో వంద రూపాయలు వదిలించుకుని మరీ చూడాలనుకోరు ప్రేక్షకులు. 

        ఇలా పై విధంగా హీరో కోసం (పోలీస్ డిటెక్టివ్) ఒ క్రైం సీన్ ని స్థాపించాక, ఇన్వెస్టిగేషన్ తాలూకు కథనం తీరుతెన్నుల గురించి వచ్చే వ్యాసంలో చూద్దాం...