రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, March 19, 2020

921 : క్రైం థ్రిల్లర్ జానర్ మర్యాద -2


         త వ్యాసంలో మిస్టరీలకీ, క్రైం థ్రిల్లర్స్ కీ వుండే తేడాల గురించి తెలుసుకున్నాం. మిస్టరీల కింద వచ్చే డిటెక్టివ్ కథలు పడక్కుర్చీ మేధావి కథలనీ, క్రైం థ్రిల్లర్స్ కింద వచ్చే పోలీస్ డిటెక్టివ్ కథలు చక్కగా మూవీ ప్రేక్షకుల కథలనీ గమనించాం. మూవీ ప్రేక్షకుల పోలీస్ డిటెక్టివ్ కథల గురించి ఇప్పుడు చూద్దాం. దీన్నేపోలీస్ ప్రొసీజురల్ మూవీస్ అని కూడా అంటారు. అందుకని ఇవి ప్రొఫెషనల్ గా రాసి, ప్రొఫెషనల్ గా తీస్తారు. ఇలా తీసినప్పుడు నేరపరిశోధనల్లో పోలీస్ శాఖ వాస్తవికంగా ఎలా పనిచేస్తుందో ప్రేక్షకులు తెలుసుకుని, వెండితెర మీద కొత్తానుభూతిని పొందడానికి వీలవుతుంది. ఒక రకంగా ఇవి ఎడ్యుకేట్ చేస్తాయి. అయితే ఈ ఎడ్యుకేషన్ కి పరిమితులుంటాయి. ఈ ప్రక్రియని కథకెంత అవసరమో అంతే  తీసుకోవాలి తప్ప, కథని మింగేసేలా పాండిత్య ప్రకర్షతో  పోలీస్ మాన్యువల్ లా తయారు చేయకూడదు. ప్రేక్షకుల ఆసక్తి పోలీసుకీ క్రిమినల్ కీ మధ్య నడిచే డ్రామాతోనే వుంటుంది తప్ప, మధ్య మధ్యలో వచ్చే ఇన్వెస్టిగేషన్ మీద అంతగా వుండదు. కాబట్టి ఇన్వేస్టిగేషన్ ని - పోలీస్ ప్రొసీజర్ని ఏ బలమైన సన్నివేశంలో భాగంగా చేసి చూపిస్తే థ్రిల్లింగ్ గా వుంటుందో, ఆ బలమైన సన్నివేశాలకే ప్లాట్ డివైస్ లా వాడుకుంటే మంచిది. 

        పోలీస్ ప్రొసీజర్ని తెలుసుకోవడానికి మార్గాలున్నాయి. ఈ మార్గాల్లో సినిమాలు, టీవీ సిరీస్ లు, యూట్యూబ్, వెబ్సైట్స్, పుస్తకాలు వగైరా వున్నాయి. తెలిసివుంటే పోలీసు అధికారులూ వుంటారు. అమెరికాలో సార్జంట్ పాట్రిక్ ఓ డానెల్ రచయితలకీ, హాలీవుడ్ స్క్రీన్ రైటర్లకీ టెక్నికల్ అడ్వైజర్ గా వుంటున్నాడు. ఈయన పక్కాగా పోలీసు కథలు రాసుకోవడానికి పనికొచ్చే ‘కాప్స్ అండ్ రైటర్స్’ అని పుస్తకం కూడా రాశాడు. నెట్ లో వ్యాసాలూ రాస్తున్నాడు. పోలీస్ డిటెక్టివ్ తో క్రైం థ్రిల్లర్ రాయాలనుకున్నప్పుడు తగు సమాచారం కోసం రీసెర్చి చేసుకోక తప్పదు. మేకర్లకి తెలుగుతో బాటు హిందీ ఇంగ్లీషు కూడా వచ్చి వుండాలి. తెలుగుతప్ప ఇంకేమీ రాదంటే జ్ఞాన ద్వారాలు మూసుకుపోతాయి. మిడి మిడి జ్ఞానంతో రాసుకుని, తడిపొడి సినిమాలు తీసుకోవాల్సివుంటుంది.  

        హిందీ తెలిస్తే ఇంకెందుకు మంచిదంటే, తెలుగులో ఈ సంబంధమైన టీవీ సిరీస్ లేవు కాబట్టి. సినిమాలెలాగూ లేవు. ‘నేరాలు ఘోరాలు’ లాంటి జనరల్ మాస్ సిరీస్ తప్ప పోలీస్ ప్రొసీజురల్స్ లేవు. హిందీలో సోనీ టీవీలో ‘సీఐడీ’ అని మెగా సిరీస్ వస్తోంది. యూట్యూబ్ లో పాత ఎపిసోడ్లు కూడా వుంటాయి. ఇవి చూస్తే ప్రొఫెషనల్ గా మన నేటివిటీకి ఎలా చేసుకోవచ్చో అవగాహన కలుగుతుంది. ‘సురాగ్ -ది క్లూ’ అని చాలా పూర్వం అధికారి బ్రదర్స్ దూరదర్శన్ కి అందించిన సిరీస్ కూడా యూట్యూబ్ లో లభిస్తాయి. యూట్యూబ్ లోనే క్రైం సీన్ రీ కన్ స్ట్రక్షన్, పోస్ట్ మార్టం సహా ఫోరెన్సిక్ పద్ధతులు విజువల్ గా చూసుకోవచ్చు. ఇంకా ‘జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్’, ‘ఈ - పాఠశాల’ వంటి వెబ్సైట్స్ లో మన దేశంలో నిజ కేసుల క్రైం సీన్ రీ కన్ స్ట్రక్షన్, పోస్ట్ మార్టం విశ్లేషణ లెలా చేస్తారో రియల్ కేసు రిపోర్టులు లభిస్తాయి. ఇక హాలీవుడ్ లో వచ్చిన సినిమాలూ చూడొచ్చు. పోతే పోలీస్ నవలలు, కథలు చదవాలి. తెలుగులో వీలయితే కొమ్మూరి సాంబశివరావు డిటెక్టివ్ నవలలు చదివితే బేసిగ్గా ఈ జానర్ కథాకథనాల ప్రక్రియ, క్లూస్ ప్లే చేసే విధానం, సస్పెన్సు పోషణా పద్ధతులు వగైరా ప్రాథమిక జ్ఞానం పొందే  అవకాశముంది. క్రైం సాహిత్యంవల్ల లాజికల్ మైండ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ (సమయస్ఫూర్తి) బాగా పెరుగుతాయి. కొమ్మూరి నవలల్ని విజయవాడ ‘సాహితీ ప్రచురణలు’ లో, లేదా అమెజాన్ లో పొందవచ్చు. వెల నలభై రూపాయలు.

జానర్ తో జాగ్రత్త
        ఫోరెన్సిక్, అటోప్సీ ఆధారాలు, ఇతర సాక్ష్యాధారాల సేకరణా, సెర్చి వారెంట్లూ ఇంటరాగేషన్, లీగల్ విషయాలూ వగైరా పోలీస్ డిటెక్టివ్ -క్రైం థ్రిల్లర్ సబ్ జానర్ కథల్లో భాగంగా వుంటాయి. లాజిక్ అనేది, అంటే కామన్ సెన్స్ అనేది, ఈ కథల్లో విడదీయలేని స్క్రిప్టింగ్ టూల్. జానర్ మర్యాద. సాక్ష్యాధారాలంటూ చూపించాక లాజికల్ వివరణా, ఆ సంబంధమైన కథనమూ తప్పనిసరై పోతాయి. కామన్ సెన్స్ లేకుండా సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో విహరిస్తామంటే కుదరదు. జానర్ మర్యాద ఒప్పుకోదు. హీరోతో హీరోయిన్ ఈ సీనులో ఏం మాట్లాడాలా లాజికల్ గా తేలక రోజుల తరబడి తర్జనభర్జనలు పడే తలకాయలే, కేసులో సాక్ష్యాధారాల దగ్గరకొచ్చేసరికి నిమిషంలో లాజిక్ ని, కామన్ సెన్స్ నీ తీసి అవతల పడేసి సీను చేసి పడేసేస్తారు. ఆపరేటింగ్ పార్టుతో స్వేచ్ఛ తీసుకోవచ్చు. ఒక కేసులో పోలీసు, క్రిమినల్ ని ఛేజ్ చేసి కాల్చి చంపాడనునుకుందాం. వెంటనే ఆ కేసులో  అలాగే కంటిన్యూ అయిపోతూ శుభం పడేదాకా సంగతి చూసుకుంటూనే వుంటాడు. నిజజీవితంలో వెంటనే సస్పెండ్ అయి ఇంట్లో కూర్చుంటాడు. లేదా డెస్క్ జాబ్ కి పరిమితమవుతాడు. విచారణ ముగిసేదాకా ఎన్నిరోజులో, ఎన్ని నెలలో తెలియదు. భార్యా పిల్లలేమవుతారో, పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడో తెలీదు. జీవితం అస్తవ్యస్తమైపోతుంది. సినిమాల్లో చంపి ఇంకా కథని కంటిన్యూ చేస్తున్నాడని చూపించే లిబర్టీ తీసుకోక తప్పదు. చంపి సస్పెండ్ అయినట్టు చూపించే తాలూకు కథైతే వాస్తవికత ఎలాగూ వుంటుంది. 


     పోలీసు తన పై అధికారిని ధిక్కరించి కేసులో ముందుకు పోతాడు. చివరికి కేసుని పరిష్కరించాడు కాబట్టి ఆ ధిక్కారం మాఫీ అయిపోతుంది. నిజజీవితంలో క్రమశిక్షణా చర్యలకి గురవుతాడు. పరిస్థితిని బట్టి డిస్మిస్ కూడా అవచ్చు, ప్రాసిక్యూట్ అవొచ్చు. 

    ఇంటరాగేషన్ సీన్లో పోలీసు అధికారి నిందితుణ్ణి తిడతాడు, హింసిస్తాడు. గన్ తీసి నోట్లో పెట్టి, నిజం చెప్పమంటాడు. నిజ జీవితంలో ఇలా చేస్తే సస్పెండ్ అవుతాడు. ఇంటరాగేషన్ గదిలోకి గన్ తో వెళ్ళకూడదు. నిందితుడి చేత స్టేట్ మెంట్ ఇప్పించే ప్రయత్నాలు చేయకూడదు. అమెరికాలో లాగా మనకి ‘మిరాండా వార్నింగ్’ అనేది లేకపోయినా, నిందితుడి చేత పోలీసులు ఇప్పించుకునే ఒప్పుకోలు వాంగ్మూలం కోర్టులో చెల్లదు. మేజిస్ట్రేట్ ముందు నిందితుడు చెప్తేనే చెల్లుతుంది. ఇంటరాగేషన్ లో నిందితుడికి హక్కులున్నాయి. అతడేదీ చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో పోలీసులు నిందితుడికి ‘మిరాండా వార్నింగ్’ గుర్తు చేస్తారు. నిందితుడి హక్కులు తెలియజేసి, నువ్వేం చెప్పినా నీకు వ్యతిరేకంగా వాడుకుంటామని హెచ్చరిస్తారు. కొన్ని ఇంటరాగేషన్ టెక్నిక్స్  తెలుసుకోవడం అవసరం. ఇంటరాగేషన్ చాలా వరకూ సైకలాజికల్ గా వుంటుంది. అడిగిందానికి నిందితుడి కనుగుడ్లు ఎడమవైపు తిరుగుతూంటే, చేసింది గుర్తు చేసుకుంటున్నాడనీ; కుడి వైపు తిరుగుతూంటే అడిగిందానికి ఏం చెప్పాలా ఆలోచిస్తున్నా డనీ అర్ధం. ఇలాటి సైకలాజికల్ అంశాలతోనూ, క్లూస్ తోనూ లిబర్టీ తీసుకోలేరు. ఆపరేటింగ్ పార్టుతోనే తీసుకోవాలి అవసరాన్ని బట్టి. 


         శాఖలో ర్యాంకులు నిర్దుష్టంగా చిత్రించాలి. డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ డిసిపి ర్యాంకు అధికారి అధ్వర్యంలో వుంటుంది. ఈయన కింద ఏడిసిపి, ఎసిపిలు, ఇన్స్ పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ వుంటారు. క్షేత్రస్థాయిలో కేసుల్ని పరిశోధించేది ఇన్స్ పెక్టర్లే. వీళ్ళని డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్లంటారు. ఎస్సైని డిటెక్టివ్ ఎస్సై అంటారు. పోలీస్ డిటెక్టివ్ క్రైం సినిమాలకి డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్, డిటెక్టివ్ ఎస్సై పాత్రలుండాలి. వాళ్ళనలా  పిలవాలి. 

        డిటెక్టివ్ డిపార్ట్ మెంట్ తోనే క్లూస్ టీం వుంటుంది. ఫింగర్ ప్రింట్ / ఫుట్ ప్రింట్స్ బ్యూరో, మిస్సింగ్ పర్సన్స్ బ్యూరో, డాగ్ స్క్వాడ్ వుంటాయి. నేరస్థలంలో క్లూస్  టీం సేకరించిన సాక్ష్యాధారాలని ఫోరెన్సిక్ లాబ్ కి పంపిస్తారు. ఈ లాబ్ డైరెక్టర్ అధ్వర్యంలో వుంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, డాక్యుమెంట్స్ విభాగాల్లో వివిధ టెక్నీషియన్లు, అసిస్టెంట్లు వుంటారు. 

        ఇకపోతే జాతీయంగా సీబీఐ వేరు, రాష్ట్రీయంగా పోలీస్ శాఖ వేరు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో వుండే సీబీఐకి దేశవ్యాప్తంగా ఒకే ప్రొసీజర్ వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల అధ్వర్యంలో వుండే పోలీస్ శాఖలకి వేర్వేరు ప్రొసీజర్స్ వుండొచ్చు. హైదరాబాద్ లో వున్నట్టుగా విజయవాడలో వుండక పోవచ్చు. అలాగే జాతీయ సంస్థ ఎన్ఐఏ ప్రొసీజర్స్ వేరే వుంటాయి.  

     పోలీస్ డిటెక్టివ్ అవాలంటే సీఐడీ పరీక్షలు రాస్తారు. ఇంటర్మీడియేట్ పాసయితే అసిస్టెంట్ సబిన్స్ పెక్టర్ గా చేరతారు. డెస్క్ జాబ్ లోనైనా, ఫీల్డ్ వర్క్ లో నైనా మంచి స్కిల్స్ తో వుంటారు. వేగవంతమైన ఆలోచన, నిర్ణయాలు తీసుకోగల శక్తీ వుంటుంది. సబిన్స్ పెక్టర్ స్థాయిలో చేరేందుకు గ్రాడ్యుయేషన్ చేసి, వివిధ యూనివర్సిటీలు ఆఫర్ చేసే క్రిమినాలజీ కోర్సు చేస్తారు. ఉద్యోగ నిర్వహణలో సూక్ష్మగ్రాహీ, కుశాగ్రబుద్దీ అయివుంటారు. మంచి జ్ఞాపక శక్తీ, వూహాశక్తీ, మనోనేత్రంతో చూడగల దార్శనికతా కలిగి వుంటారు. కాబట్టి పోలీస్ డిటెక్టివులని మామూలు పోలీసులుగా చూపిస్తే జానర్ మాన మర్యాదలు పోతాయి. 

        ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిటెక్టివ్ స్క్రిప్టు తయారు చేసుకుంటే ప్రొఫెషనల్ గా వుంటుంది. ఇక క్రైం థ్రిల్లర్ సబ్ జానర్ కథాకథనాల గురించి వచ్చే వ్యాసంలో తెలుసుకుందాం. ఏవైనా సందేహాలుంటే ఈమెయిల్ లేదా వాట్సాప్ చేయవచ్చు.


సికిందర్