రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, ఏప్రిల్ 2023, శనివారం

1321 : మూవీ నోట్స్

                సినిమా కథైనా మూడు ప్రధాన మలుపుల మీదే (ప్లాట్ పాయింట్ వన్, టూ, త్రీ) ఆధారపడుతుందన్న విషయం తెలిసిందే. సమస్య ఏర్పాటుతో మొదటి ప్రధాన మలుపు, విశ్రాంతి ఘట్టంతో రెండో ప్రధాన మలుపు, సమస్యకి ఇచ్చే పరిష్కారంతో మూడో ప్రధాన మలుపు, ఇంతే- ఇంతకంటే సినిమా కథంటే ఇంకేమీ లేదు తలబద్దలు కొట్టుకోవడానికి. ఈ మాత్రం కూడా చేసుకోక పోతేనే వస్తుంది ఫ్లాప్. కథలో ఈ ప్రధాన మలుపులు లేకపోయినా, లేదా అవి బలహీనంగా వున్నా ఆ కథ మూలన బడుతుంది. దాదాపు అన్ని సినిమాల్లో ఈ ప్రధాన మలుపులు బలంగానే వుంటాయి. వాటి మధ్య వాటి తాలూకు వుండాల్సిన కథనమే పస లేక, లేదా ఏజెంట్ లోలాగా కథని బట్టి ప్రధాన మలుపులు నిర్దేశించే దిశా గమనం లేక (ప్రధాన మలుపుల్ని గైడ్ పోస్టులని కూడా అన్నారు మరి) సినిమాలు ఫ్లాపవుతూంటాయి. కొన్ని సినిమాల్లో మూడో ప్రధాన మలుపు బలహీనంగా వుండి దాంతో క్లయిమాక్స్ తేలిపోతూంటుంది. మూడో ప్రధాన మలుపుతో క్లయిమాక్స్ సరీగ్గా రావడం లేదంటే దాని కారణం మొదటి ప్రధాన మలుపులో వుంటుందనీ - వెళ్ళి అక్కడ చక్కగా రిపేరు చేసుకోండయ్యా - అనీ  ఏనాడో 50-60 ఏళ్ళ క్రితం హాలీవుడ్ దర్శకుడు బిల్లీ వైల్డర్ చరిత్రలో నిలిచిపోయే సులువు చెప్పనే చెప్పాడు. అయినా మన తెలుగుకి ఈయనెవరో హాలీవుడ్డాయన చెప్పేదేంటీ, మన విద్య మనకుందని ఒక మిధ్యని సృష్టిస్తేనే అది శాకుంతలం అయి, షాకివ్వడానికి ఎప్పుడెప్పుడాని ఉవ్వీళ్ళూరుతూంటుంది  రిలీజుకి.

        త వ్యాసంలో శకుంతల సినిమా మూడు వెర్షన్లలో (1943,1966,2023) మొదటి ప్రధాన మలుపులు ఏఏ తీరున వున్నాయో పోల్చి చూశాం. ఏ వెర్షన్లో ఎంత బలంగా వుందో తెలుసుకున్నాం. మొదటి రెండు వెర్షన్ల కంటే (1943 హిందీ,1966 తెలుగు) 2023 తెలుగు వెర్షన్ ఎంత డొల్లగా వుందో చూశాం. ఈ డొల్ల తనమే ఇప్పుడు మూడో ప్రధాన మలుపుని పట్టి పల్లార్చింది. క్షత్రియురాలిగా పుట్టిన శకుంతల తాపస కన్యగా పెరిగింది. మొదటి ప్రధాన మలుపులో తాపస కన్య స్వభావంతోనే దుర్వాసుడి శాపంతో సమస్యలో పడింది. ఆ సమస్యకి పరిష్కారం కోసం మాత్రం మూడో ప్రధాన మలుపులో తన జన్మవృత్తాంతం తెలిసీ కూడా, ఇక తాడో పేడో తేల్చుకునే క్షత్రియ స్వభావంతో తిరగబడ లేదు. మొదటి ప్రధాన మలుపులో దుర్వాసుడంతటి వాడి శాపాన్ని కథకుడే బలంగా ఫీల్ కాలేదని మనం గత వ్యాసంలో తెలుసుకున్నప్పుడు, అక్కడ్నుంచీ కథనేం బలంగా ఫీలై నడప గలుగుతాడని కథకుడు.

1943 - ఏ శాతారాం స్టోరీ

ముందుగా రెండో ప్రధాన మలుపు చూద్దాం : 1943 శాంతారాం హిందీ శకుంతల లో శకుంతలని అత్తారింటికి సాగనంపడానికి ముస్తాబు చేస్తూంటారు. ఆయనకి నువ్వు గుర్తుండకపోతే ఉంగరం చూపించడం మర్చిపోకేం అని జాగ్రత్త చెప్తారు చెలికత్తెలు. కథలో ఈ ప్లాట్ డివైస్ గా ఉపయోగ పడుతున్న ఉంగరం కథేమిటంటే, శకుంతలని పెళ్ళాడేక దుష్యంతుడు ఆమెకి తొడిగిన ఉంగరమది. తర్వాత దుర్వాసుడు శకుంతలకి శాపం పెట్టి వెళ్ళిపోతూంటే చెలికత్తెలు కాళ్ళా వేళ్ళా పడతారు. పిట్టంత కేసుకి రాహుల్ గాంధీకి చట్టసభ, గృహ శోభ రెండూ ఊడిపోయేలా తీర్పిచ్చినట్టు తను పెట్టిన శాపం మరీ ఎక్కువైపోయిందని గ్రహించిన దుర్వాసుడు- శాపాన్ని వెనక్కి తీసుకోలేననీ, ఒక మార్గం చెప్తాడు. అదేమిటంటే, దుష్యంతుడిచ్చిన ఉంగరాన్ని చూపిస్తే అతడికి జ్ఞాపకం తిరిగి వస్తుందని. ఇదే ఇప్పుడు చెలికత్తెలు శకుంతలకి గుర్తు చేస్తున్నారు. 
        
ఇలా చెప్పించడం ముందేదో అనర్ధం జరగబోతోందని కథనంలో డైనమిక్స్ లేదా చైతన్యం కోసమే. ఒక పాటతో చాలా మంది (కణ్వుడు, కణ్వుడి ఇద్దరు శిష్యులు, శకుంతల పెంపుడు తల్లి గౌతమి, శకుంతల చెలికత్తెలిద్దరు, ఇతర ఆశ్రమ వాసులూ) తోడురాగా పయనం కడుతోంటే, కణ్వుడు ప్రకృతిని పిలుస్తాడు ఆశీర్వదించమని. ఒక్కసారిగా గాలి వీస్తుంది. పక్షులన్నీ అరుచుకుంటూ వచ్చేస్తాయి.
        
కణ్వుడంటాడు, ఆశ్రమపు మొక్కా మానూ అందరికీ... ఏ నీరు మీరివ్వకుండా చుక్క కూడా నోట్లో వేసుకునేది కాదో, ఏ పళ్ళూ పూలూ మీరివ్వకుండా పూజ గదిని అలంకరించేది కాదో-  ఆ మీ ముద్దుల శకుంతల ఈ రోజు పతి దగ్గరికి వెళ్తోంది. మీరంతా వీడ్కోలు పలకండి, ఆశీర్వదించండీ...’ అని. ఇది విని జింకలు కూడా వచ్చేస్తాయి.
        
మొక్కలతో, చెలికత్తెలతో శకుంతల ఆత్మీయ సంభాషణ తర్వాత కదులుతూంటే, కొంగు పట్టుకుని జింక లాగుతుంది. శకుంతల దాన్ని ఓదారుస్తుంది. ఇక అందర్నీ ఆలింగనం చేసుకుంటూ, ఎవరూ దుఖపడొద్దని ధైర్యం చెప్తుంది శకుంతల. ఆమె కంట్లో కూడా నీళ్ళు తిరుగుతాయి. ఈ కన్నీళ్లతో క్లోజప్ నీటి అలలతో డిజాల్వ్ అవుతుంది. ఏమిటా అని చూస్తే, నది నీరుతో సీను మారుతుంది (ట్రాన్సిషన్).
        
నదిలో పడవెక్కి ప్రయాణం కడుతుంది పెంపుడు తల్లితో, ఇద్దరు శిష్యులతో. పడవలో బక్క మొగుడు -బండ పెళ్ళాం కామెడీ చూసి బాధంతా మర్చిపోతుంది శకుంతల. పడవ సాగుతూంటే చేయి జారవిడిచి కూర్చున్న శకుంతల వేలి ఉంగరం జారి నీట్లో పడిపోతుంది. ఇది చూసుకోదు. ఆ ఉంగరాన్ని చేప మింగేస్తుంది. బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీకి పగలబడి నవ్వేస్తున్న శకుంతల క్లోజప్ హోమంతో డిజాల్వ్ అవుతుంది తర్వాతి సీనుకి (రెండో ట్రాన్సిషన్).
        
ఈ మొత్తం శకుంతలని సాగనంపే సీను రెండు పాటలతో కరుణ రసంతో నిండి వుండి ఒక మూడ్ లోకి తీసికెళ్తుంది. రెండు విషయాలు బలంగా హత్తుకుంటాయి : పక్షులు అరుచుకుంటూ రావడం, జింక కొంగు లాగడం రెండూ కరుణ రసానికి పరాకాష్టగా వుంటాయి. అల్టిమేట్ క్రియేషన్. డైనమిక్స్ (ద్వంద్వాల పోషణ) విషయానికొస్తే ఆనందంగా బయల్దేరుతున్న వేళ చెలికత్తెలు ఉంగరం గురించి చెప్పి విషాదాన్ని కల్పించడం, భారంగా బయల్దేరిన శకుంతలకి బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీతో ఆనందం కల్గడం వంటివి వున్నాయి.
        
ఇక ప్లాట్ డివైస్ అయిన ఉంగరం పోగొట్టుకునే సన్నివేశం... బక్క మొగుడు- బండ పెళ్ళాం కామెడీకి నవ్వుతున్న శకుంతల చేయి పక్కకి జారవిడిస్తే వేలి ఉంగరం నదిలో పడిపోతుంది క్లోజప్ షాట్ లో రిజిస్టరవుతూ. ఉంగరం వదులుగా వుండి జారిపడి పోయినట్టు స్పష్టంగా చూపించాడు. అంత వదులుగా వుంటే ఇంకెప్పుడో ఇంకెక్కడో పడిపోయే వుండాలి. కాబట్టి కావాలని పడేసినట్టున్న ఈ షాట్ క్రియేషన్ దెబ్బతింది థ్రిల్ లేకుండా. ఇదే 1966 తెలుగు శకుంతల లో అద్భుతంగా వుంది. ఇప్పుడలా జారిపోయిన ఉంగరాన్ని నదిలో చేప మింగేస్తుంది.
        
అంటే ప్రేక్షకులకి తెలిసి, శకుంతలకి తెలియని విషయంతో సస్పెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు శకుంతల కేం జరుగుతుందన్న సస్పెన్స్. ఈ సస్పెన్స్ ఇక్కడ క్రియేటవక పోతే సీనుకి అర్ధం లేదు. సీన్లు వుండేవే పాత్ర గురించి కొత్త విషయం తెలియడానికి లేదా, కథని ముందుకు నడిపించడానికి. ఇక్కడ ఉంగరం పడిపోవడంతో ఈ సీను కథని ముందుకి నడిపిస్తోంది. సంఘటన లేకుండా సీనుంటే అది చీకేసిన మామిడి టెంకతో సరి సమానంగా వుంటుంది. 2023 వెర్షన్ లో ఇదే చూస్తాం.
        
ఇక ట్రాన్సిషన్స్- అంటే ఎడిటింగ్ ని కూడా సీనుని ఆసక్తికరంగా మార్చడానికి ఉపయోగించడం. ఇది కూడా కథనంలో భాగమే. ఇలా కూడా కథనం చేయాలి. మొదటి ట్రాన్సిషన్ ఆమె కన్నీటిని నీటి అలలు కమ్మేయడం- ఇదేమిటా అని చూస్తే ఆ డిజాల్వ్ తో నీటి అలలు నదిగా ఓపెనై సీను మారడంగా చూస్తాం. అంటే ప్రేక్షకులు లేజీగా సినిమా చూసేలా చేయకూడదు మంచి మేకరనేవాడు- అకస్మాత్తుగా ఇదేంట్రా అని లేచి కూర్చుని పరికించేట్టు చేసేదే నిజమైన మేకింగ్. ఇక చివర్లో ఆమె పగలబడి నవ్వుతున్న క్లోజప్ హోమం తో డిజాల్వ్ అయ్యే రెండో ట్రాన్సిషన్ సైతం తర్వాతి సీనుకి ప్రారంభం. ఆమె ఎంతనవ్వుతోందో అంత దుఖం ఎదర పొంచి వున్నట్టు సంకేతం.
    
ఇలా 1943 హిందీ వెర్షన్ శకుంతల లో రెండో ప్రధానమలుపు శకుంతలని చిక్కుల్లో పడేసే ఆందోళనకర సంఘటనతో, బోలెడు నాటకీయతతో బలంగా వుంది.
        
అన్ని వెర్షన్లలో గర్భవతైన శకుంతల అత్తారింటికి వెళ్ళే కథే వుంది. శకుంతల నాటకాన్ని ఒక జాతక కథ నుంచి తీసుకుని రాశాడు కాళిదాసు. బౌద్ధమతంలోని జాతక కథల్లోని  కట్టహరి అనే కథలో, వారణాసి రాజు వన కన్యని మోహించిన వెంటనే గర్భవతవుతుంది. అప్పుడామెకి ఉంగరమిచ్చి, కూతురుపుడితే ఇది పెట్టి పోషించుకో, కొడుకు పుడితే ఈ ఉంగరంతో వాణ్ని తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు (ఆడపిల్ల పట్ల ఫ్యూడలిజం మర్యాద). కొడుకే పుడతాడు. వాణ్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళకుండా తనే పోషిస్తూంటుంది (ఆమె ఆత్మాభిమానం). కానీ ఆ కొడుకు బోధిసత్వుడు తండ్రి ఎవరని అడిగేసరికి తీసికెళ్ళక తప్పలేదు. అప్పుడా ఉంగరాన్నీ, కొడుకునీ చూసిన రాజు కాదనలేక పోతాడు. కానీ ఈ వ్యవహారం తన ప్రతిష్ట పోగొట్టేలా వుందని నువ్వెవరో నాకు తెలీదు పొమ్మంటాడు.
        
అప్పుడామె, నిజం నిరూపించడానికి నా దగ్గర ఇంకో సాక్ష్యం లేదు. కొడుకుని పైకి విసురుతాను. వాడు గాలిలో ఆగిపోతే నీ కొడుకు, కిందపడి చచ్చిపోతే నీ కొడుకు కాదు అని కాళ్ళు పట్టుకుని పైకి విసురుతుంది. బోధిసత్వుడు గాలిలో బాసింపట్టు వేసుక్కూర్చుని, నేనే నీ కొడుకుని  అంటాడు. ఇక రాజు వాడ్ని స్వీకరించి తన వారసుడిగా, ఆమెని రాణిగా ప్రకటిస్తాడు. నిజం నేలమీద నోళ్ళ మధ్య బతకదని, దాని స్థానం పైనెక్కడో అతీతంగా వుంటుందనీ నీతి. అందుకే నేలమీద కుంటిదైన నిజం కాళ్ళు పట్టుకుని పైకి విసిరింది. ఆ నిజం గాలిలో రాజసంగా బాసింపట్టు వేసుక్కూర్చుని అబద్ధాల నోళ్ళు మూయించి పారేసిందన్న మాట.
        
దీన్ని కాళిదాసు హిందూ పురాణ కథగా మార్చేసరికి మహిమలు చోటు చేసుకున్నాయి. కాళిదాసుకి ఇంకో వెర్షన్ కూడా వుందని సమాచారముంది. అందులో శకుంతల పుట్టిన కొడుకుతోనే దుష్యంతుడి దగ్గరికి వెళ్తుంది- పై జాతక కథలో లాగా.

1966 తెలుగు- వెలుగు

ఇప్పుడు ఎన్టీఆర్- బి. సరోజాదేవిల శకుంతల రెండో ప్రధాన మలుపు చూస్తే- అద్భుతంగా ముస్తాబై శకుంతల బయల్దేరుతుంది. కణ్వ మహర్షి, అతడి ఇద్దరు శిష్యులు, శకుంతల పెంపుడు తల్లి గౌతమి, శకుంతల చెలికత్తెలిద్దరు, ఆశ్రమ వాసులూ వెంట వస్తూంటే, ఆనందమౌనమ్మా అపరంజి బొమ్మా, అత్తవారింటికి పోయిరావమ్మా పాట నేపథ్యంలో సన్నివేశాలుంటాయి. కొంగు లాగిన జింకతో, కణ్వుడితో, చెలికత్తెలతో. ఇది ముగిసి కణ్వుడి శిష్యులతో, పెంపుడు తల్లితో పడవెక్కిన తర్వాత- తెడ్డు వేస్తూ పడవ వాడు - శెంగాయి కట్టిన సిన్నదీ చారడేసి కళ్ళు ఉన్నదీ అని శకుంతల నుద్దేశించి పాడ్డం మొదలెడతాడు. (శకుంతల నుద్దేశించిన ఈ పాటలో- ఆపలేని బల్ తాపముతోటీ అంగలారుస్తూ వున్నదీ అని రసికత్వమేంటో?).  
        
పాటని ఆనందిస్తూ శకుంతల నదిలో చేయిపెట్టి తానూ తెడ్డు వేస్తున్నట్టు మైమరపులో వుంటుంది. పాట సాంతం నీట్లో చేయి ఆడిస్తూనే పారవశ్యంతో వుంటుంది. నీట్లో చేపలు వచ్చిపోతూంటాయి. పాట ముగింపులో వేలి కున్న ఉంగరం జారిపోతుంది. నీట్లో మునుగుతున్న ఉంగరాన్ని ఒక చేప నోటితో అందుకుంటుంది. చేయి నీట్లో అలాగే వుంచి పారవశ్యంతో  కళ్ళు మూసుకునే వుంటుంది శకుంతల.
        
ఈ రెండో ప్రధాన మలుపులో నాటకీయత నది మీదే వుంది. అంతకి ముందు సాగనంపుతున్నప్పుడు వుండదు. ముఖ్యంగా ఆమె వీడ్కోలులో ప్రకృతిని భాగం చేయలేదు. చేసి వుంటే కరుణరస పూరిత మనోహర దృశ్యాలుండేవి. మూడు సార్లు కణ్వుడితోనే బాధ పంచుకోవడం వుంటుంది. జింక కొంగు లాగే దృశ్యం పాట మధ్యలో వేయడం వల్ల పాటే డామినేట్ చేసింది. పైగా పాటలో కణ్వుడు జింక పుట్టుపూర్వోత్తరాలు చెప్పడం వల్ల కూడా నాటకీయతకి నష్టం జరిగింది. ఇవన్నీ జరిగి, ఇక శకుంతల జింకతో సంభాషించేటప్పటికి ఆ దృశ్యం ప్రాధాన్యమే తగ్గిపోయింది. పైగా గుండెల్లోంచి పలికే పలుకులతో, వాటి తాలూకు భావోద్వేగాలతో కాకుండా, పాట వేసి దృశ్యాలు చూపించడం వల్ల కరుణ రసమే కాదు, అసలు ఏ రసానికీ స్థానం లేకుండా పోయింది.
        
నాటకీయత అంతా సంఘటన జరిగే పడవ ప్రయాణంతోనే వుంది. ఇదంతా లాజికల్ గా వుంది. పడవ వాడి పాటకి నీట్లో చేయిపెట్టి ఆడిస్తుంది (ఇక్కడొక పొరపాటు- ఆమె నీట్లో కుడి చేయి ఆడిస్తుంది. కానీ ఉంగరం వున్నది ఎడమ చేతికి. ఆ ఉంగరం కుడి చేతి నుంచే జారిపోయినట్టు చూపించారు. షూటింగ్ సౌలభ్యం కోసం తప్పలేదేమో. కెమెరాని అవతలి ఒడ్డు వైపు పెట్టి ప్రయాణాన్ని చూపించలేరుగా. బయల్దేరిన ఇవతలి ఒడ్డు పాయింటాఫ్ వ్యూతోనే వుండాలి).
        
ఇప్పుడామెకి ఇందాకటి బాధంతా తొలగిపోయింది- ఇప్పుడు తను పుట్టింటిది కాదు- మెట్టినింటిది. ఇప్పుడు పుట్టింటి ఎమోషనల్ బ్యాగేజీనంతా మోసుకుంటూ వెళ్ళడం సరికాదు. కాబట్టి మ్లానమైన మనసంతా నదినీటి ప్రవాహంలో కడిగేసుకుంది. ఇదొకటి, దీన్తర్వాత- సంఘటన సీక్వెన్స్- పాట మొదట్నుంచీ నీట్లో చేయి ఆడించడం వల్ల ముందు జరగబోయేది మొదటి సారి సినిమా చూసే వాళ్ళ వూహకి అందదు. There is no terror in the bang, only in the anticipation of it... అని ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ అన్నాడని చాలా సార్లు చెప్పుకున్నాం (అన్నట్టు ఇవ్వాళ  ఏప్రెల్ 29 ఆయన వర్ధంతి). శాంతారాం శకుంతల లో చేయినీ, సడెన్ గా ఉంగరం పడిపోవడాన్నీ ఒకేసారి చూపించడం వల్ల బ్యాంగ్ లేకుండా పోయింది. హిచ్ కాక్ చెప్పేది బ్యాంగ్ కి ముందు దాని తాలూకు కథనం చేసుకురావాలనే.
          
కాబట్టి ఇప్పుడు తెలుగు శకుంతల పాట చివర్లో బ్యాంగ్ కి సంబంధించిన కథనంగా నీట్లో చేయి ఆడిస్తూ వుంది. మధ్య మధ్యలో నీట్లో చేపలు కూడా కన్పిస్తున్నాయి. నీట్లో చేయి, చేపలు- ఈ సీక్వెన్సులో విజువల్ కథనం సాగుతూ- సహజంగానే నీట్లో చేయి అంత సేపూ తడవడం వల్ల ఉంగరం వదులై జారిపోయింది ( మనకి కూడా చిన్నప్పుడు ఇదే జరిగింది. వర్షంలో బాగా తడుస్తూ ఇంటి కొచ్చేటప్పటికి వేలికున్న తులం తూగే ఉంగరం మాయం!). ఆ ఉంగరాన్ని చేపమింగేయడంతో ఎపిసోడ్ పరిసమాప్తం.
        
ఇక్కడ కూడా ప్రేక్షకులకి తెలిసి, శకుంతలకి తెలియని విషయంతో సస్పెన్స్ క్రియేటయ్యింది. ఇక్కడ కూడా సంఘటన కథని ముందుకి నడిపిస్తోంది జటిలం చేస్తూ. . సంఘటనే జరక్కపోతే? అదెలా వుంటుందో శాకుంతలం లో చూద్దాం...
-సికిందర్