రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మే 2023, మంగళవారం

1322 : స్పెషల్ ఆర్టికల్

            

బౌండెడ్ స్క్రిప్టు లేకుండా సినిమా తీసి దెబ్బతిన్నామని 80 కోట్ల  ఏజెంట్నిర్మాత అనిల్ సుంకర చేసిన ప్రకటన వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. బౌండెడ్ స్క్రిప్టు లేకపోవడం, కరోనా కాలంలో అవాంతరాలూ కలిసి ఫ్లాప్ సినిమా తీయడానికి కారణమయ్యాయని చెప్పారు. కరోనా కాలంలో అవాంతరాలొస్తే ఆ గ్యాప్ లో స్క్రిప్టులు శుద్ధి చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాం. మరి ఏజెంట్ కి సంబంధించి ఏం చేస్తున్నట్టు? స్క్రిప్టు రఫ్ ప్రతి కూడా రాసుకునే తీరిక దొరకలేదా? లేదా ఆన్ లైన్లో, జూమ్ లో సరిపోక ఇంకేదైనా కొత్త టెక్నాలజీ కోసం వేచి చూశారా? లేక టెక్నాలజీ అంతా ఏజెంట్ లో అత్యాధునిక ఆయుధాలకి సంబంధించి అన్వేషించడంలో లేక టెక్నాలజీ అంతా ఏజెంట్ లో అత్యాధునిక ఆయుధాలకి సంబంధించి అన్వేషించడంలో  పడిపోయారా? 

        బౌండెడ్ స్క్రిప్టు లేకపోవడం సమస్య కాదు, బౌండెడ్ స్క్రిప్టు వున్నా షూటింగులో అదే బౌండెడ్ రూపంలో వుండదు. మార్పు చేర్పులు జరుగుతూంటాయి. అసలు పూర్తి కథేమిటో పేపరు మీద లేక వివిధ కారణాల వల్ల షూటింగు మొదలెడితే ఇలా జరుగుతుంది. ఏజెంట్ చూస్తే ఫస్టాఫ్ వరకే పేపరు మీద స్క్రిప్టు సిద్ధంగా వుందని, సెకండాఫ్ ని అప్పటికప్పుడు కథ అల్లుకుంటూ పోయారని అర్ధమవుతుంది. మరి కొబ్బరి కాయ కొట్టినప్పుడు స్క్రిప్టులో ఎన్ని పేజీలు అక్కడ పెట్టి పూజ చేశారో, అదెలాటి పూజ అన్పించుకుందో వాళ్ళకే తెలియాలి. గుమ్మడి కాయ మాత్రం స్క్రిప్టు లేని సెకండాఫ్ షూటింగుకే ఖాయంగా కొట్టారని మాత్రం భావించుకోవచ్చు.
        
తీసిన ఫస్టాఫ్ కథెలా వున్నా, దానికి తగ్గ కథనం ఎంతో కొంతైనా ఆర్డర్లో వుంది. అంటే అక్కడి వరకూ స్క్రిప్టు సిద్ధంగా వుందన్న మాట. కానీ  సెకండాఫే  అసలు కథేమిటో, దాని తాలూకు కథనమేమిటో అర్ధం పర్ధం లేకుండా పోయింది. అంటే సెకండాఫ్ స్క్రిప్టు రెడీ చేసుకో లేదన్న మాట. ఇంత రిస్కు మన దేశంలో ఏ భాషా సినిమాతోనూ తీసుకోలేదు బహుశా. కానీ హాలీవుడ్ లో చాలా వున్నాయి. ఆశ్చర్యమేమిటంటే అవన్నీ హిట్టయ్యాయి. స్క్రిప్టు  కాదుకదా చేతిలో నాల్గు పేజీల ఔట్ లైన్ పెట్టుకుని ప్రారంభించిన మార్వెల్ స్టూడియోస్ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ ఐరన్ మాన్(2008) సహా. స్టీవెన్ స్పీల్ బెర్గ్ కూడా తక్కువ తినలేదు. స్క్రిప్టు లేకుండా తను తీసిన మొదటి మూవీ సూపర్ హిట్ జాస్(1975) కూడా. సినిమా నిర్మాణంలో 90 శాతం పని ముందుగా స్క్రిప్టు పూర్తి చేసుకోవడమేనని చెప్పే ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన టోపాజ్ మాత్రం? స్క్రిప్టే లేకుండా ఉత్తమ కథ, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ దర్శకుడు ఆస్కార్ అవార్డులు తన ఖాతాలో వేసుకున్న బిల్లీ వైల్డర్ తీసిన సన్సెట్ బోలెవర్డ్(1950) మాత్రం? చెప్పుకుంటూ పోతే డజను వున్నాయి.
        
స్క్రిప్టే లేకుండా ఆస్కార్ అవార్డులే తీసుకున్నాడంటే ఎంత పని రాక్షసుడై వుండాలి. మహాద్భుత క్లాసిక్ కాసాబ్లాంకా (1942) స్క్రిప్టే లేకుండా తీసిన మైకేల్ కర్టిజ్ కూడా ఉత్తమ చలన చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డులు తీసుకున్నవాడే. ఇక భారీ చారిత్రక క్లాసిక్ లారెన్స్ ఆఫ్ అరేబియా (1962) తీసిన డేవిడ్ లీన్ సైతం ఉత్తమ చలన చిత్రం, దర్శకత్వం ఆస్కార్ అవార్డులు తీసుకున్నాడు.
        
ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర బౌండెడ్ స్క్రిప్టు లేకుండా తీశామని చెప్పుకుని బాధపడ్డారు. కానీ స్పీల్ బెర్గ్ తో జాస్ తీసిన నిర్మాత - స్క్రిప్టే కాదు, తారాగణం కూడా లేకుండా, సినిమాలో ప్రధానంగా కనిపించే సొరచేప డిజైన్ కూడా లేకుండా గందరగోళంగా సినిమా ప్రారంభించామని చెప్పుకున్నాడు. అయితే స్క్రిప్టు లేకుండా ఎలా ప్రారంభించినా అక్కడ యుద్ధ ప్రాతిపదికన షిఫ్టుల్లో చాలా మంది ప్రొఫెషనల్ రచయితలు పనిచేస్తారు. అంత హడావిడిలో కథలో కంటిన్యూటీ ని మాత్రం బాగా కాపాడతారు.
        
కొన్నిసార్లు దర్శకులే నిర్లక్ష్యంగా వుంటారు. రెడీ స్క్రిప్ట్ లేకుండా బిల్లీవైల్డర్ సన్సెట్ బోలెవర్డ్ తీసింది గాక, తర్వాతి సినిమా సబ్రినా (1954) కూడా స్క్రిప్టే లేకుండా ప్రారంభించి, ఏ రోజు సీన్లు ఆ రోజే కథ ఆలోచించి రాస్తూంటే, అసలు తను ఏం నటిస్తున్నాడో అర్ధం గాక, స్టార్ హీరో హంప్రీ బోగార్ట్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో బిల్లీ వైల్డర్ స్టార్ హీరోయిన్ ఆడ్రీ హెప్ బర్న్ ని బతిమాలుకున్నాడు- నువ్వు జబ్బున పడ్డట్టు చెప్పి కొన్నాళ్లు రాకు, ఈలోగా మేం స్క్రిప్టు పూర్తి చేసుకుంటామని. ఈ సినిమా కూడా పెద్ద హిట్టవడమేగాక, విమర్శకులు ఆకాశాని కేత్తేశారు. దీన్ని 1995 లో రెడీ స్క్రిప్టుతో సిడ్నీ పొలాక్ రీమేక్ చేస్తే ఫ్లాపయ్యింది.  
        
బౌండెడ్ స్క్రిప్టు వున్నంత మాత్రాన హిట్టవ్వాలని లేదు. తెలుగులో హిట్టయ్యేవి 8-10 శాతమే. ఉండాల్సింది ఎలాటి పరిస్థితుల్లోనైనా కంటెంట్ ని సృష్టించ గలిగే సామర్ధ్యమే. గత దశాబ్దపు దర్శకులు చాలా మంది తెరమగురై పోయారు. వాళ్ళ షెల్ఫ్ లైఫ్ పదేళ్ళకి మించి లేదు. ఆ పదేళ్ళలో అప్డేట్ అవడానికి ప్రయత్నించలేదు. ఇప్పుడు ఐదేళ్ళకే అవుట్ డేటెడ్ అయ్యే పరిస్థితు లున్నాయి. ప్రేక్షకుల అభిరుచులు శరవేగంగా మారిపోవడమే కారణం. కనుక కనీసం ప్రతీ మూడో సినిమాకైనా అప్ డేట్ అయి సినిమాలు తీయకపోతే దర్శకులు  రెండేళ్ళకే కనుమరుగైనా ఆశ్చర్యం లేదు.
        
ఏజెంట్ ఫస్టాఫ్ చూస్తే అప్డేట్ అవని కథాకథనాలతో, కాలం చెల్లిన టెంప్లెట్ లో హీరో అఖిల్ అక్కినేనిని మాత్రం - నువ్వే నీ క్యారక్టర్ తో కష్టపడి నిలబెట్టు- మేం కష్టపడం- అన్నట్టు- అతడికి వైల్డ్ క్యారక్టర్ అంటూ క్యారక్టర్ ఒకటి క్రియేట్ చేసి, కంటెంట్ ని వదిలేస్తే అఖిల్ మాత్రమేం చేస్తాడు. సమస్య బౌండెడ్ స్క్రిప్టు లేకపోవడం కాదు, వున్నా ఇదే పరిస్థితి. దర్శకుడు సురేందర్ రెడ్డి, ఆయన రచయిత వక్కంతం వంశీ పదేళ్ళుగా అప్డేట్ అవని అదే పరిస్థితి.

‘జురాసిక్ పార్క్ 3’  (2001)పూర్తి స్క్రిప్ట్ లేకుండానే నిర్మాణంలోకి దిగారు. ప్రీ-ప్రొడక్షన్ సమయంలో ఒక డ్రాఫ్ట్ సిద్ధంగా వున్నప్పటికీ, అనేక సెట్లు, లొకేషన్లు సిద్ధం చేసినప్పటికీ, కొత్త దర్శకుడు జో జాన్ స్టన్  స్టూడియో ఇచ్చిన స్క్రిప్టు ని షూటింగ్‌ కి ఐదు వారాల ముందు తిరస్కరించాడు. బదులుగా పూర్తిగా భిన్నమైన కథని ఆలోచించాడు. ఆ కథతో ఎప్పుడూ ఫైనల్ స్క్రిప్ట్ లేకుండానే సినిమా పూర్తి చేశాడు. ఏ రోజూకారోజు రాసి  షూట్ చేస్తున్న పేజీలే ఫైనల్ స్క్రిప్టు  ఫైల్లోకి వెళ్ళాయి. దీని బడ్జెట్ 93 మిలియన్ డాలర్లు. బాక్సాఫీసు 369 మిలియన్ డాలర్లు. దీన్నిబట్టి అర్ధమయ్యేదేంటంటే, ఇంకా స్టోరీ రైటింగ్ చేస్తూ కూర్చోవడం వృధా. స్టోరీ మేకింగ్ చేసుకోవాలి.

—సికిందర్